బ్లాగ్: 'పద్మావత్' పద్మావతికే ఎలా వ్యతిరేకం?

ఫొటో సోర్స్, Viacom18MotionPictures
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
'పద్మావత్' సినిమా చూసి బయటికి వస్తుంటే మంటల్లోంచి బయటకు వస్తున్నట్టుగా అనిపించింది నాకు.
లోలోపల ఇంకా మండుతున్నట్టుగానే అనిపించసాగింది. కొంత కోపం వల్లా, గందరగోళం వల్లా, మరి కొంత హింసాత్మక దృశ్యాల వల్లా మనసంతా గాయపడ్డట్టుగా అనిపించసాగింది.
సినిమా ఆఖరు పదిహేను నిమిషాల సమయమంతా రాణి పద్మావతి వందలాది రాజపుత్ మహిళలను 'జౌహర్' (రాణివాసపు మహిళలంతా సామూహికంగా అగ్నిలో ఆత్మాహుతి చేసుకోవడం) కోసం ప్రేరేపించడమే ఉంటుంది.
ఎరుపు రంగు చీరలు, ఒంటి నిండా మెరిసిపోయే నగలు ధరించిన మహిళలు మంటల వైపు నడుస్తుండటం.. వారిలో ఒకరు గర్భవతి కూడా.. వారి వెనుక ఆకలిగొన్న, అరాచక, కోపపు చూపులతో అలావుద్దీన్ ఖిల్జీ.
నలుపు దుస్తులతో, విరబోసుకున్న జుట్టుతో పరుగెత్తుతూ, ఆయాసపడుతూ... పిచ్చివాడిలా కోట మెట్లు ఎక్కుతూ ఉండగా ఆ చివరి జౌహర్ దృశ్యాన్ని చిత్రించారు.
చరిత్రలో ఏముంది?
తమ కుల గౌరవం కోసం, భర్త పరువు-ప్రతిష్ఠల కోసం నిప్పుల గుండంలోకి నడుస్తున్న రాణి పద్మావతిని చూడడం, రేప్ వంటి లైంగిక హింసను చూడడంకన్నా తక్కువ ఇబ్బందికరమేం కాదు.
ఈ హింసను ఈ సినిమాలో ఏ రకంగానూ తప్పుగానో లేదా ప్రాచీన భావజాలపు ప్రతీకగానో చూపించరు. పైగా దీనిని ఆరాధ్యనీయమైందిగా చూపిస్తారు. ఇదో గొప్ప త్యాగమన్నట్టుగా చూపిస్తారు.
యుద్ధంలో ఓడిపోయిన పురుషులకు సంబంధించిన మహిళలు తమను తాము విజేతల నుంచి రక్షించుకోవడం కోసం అగ్నికి ఆహుతయ్యే వారని చరిత్రలో ఉన్న మాట నిజమే.
అయితే సతీ సహగమనం లాగానే ఇది కూడా వారు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయమేమీ కాదు. సామాజిక ఒత్తిడి ఫలితమే ఈ కట్టుబాటు.
దీన్ని ఉన్నతంగా చిత్రీకరించడం అంటే సతీ సహగమనాన్ని ప్రశంసించడంతో సమానమే.

ఫొటో సోర్స్, Padmavat/Facebook
ఆమెకు ఉనికే లేదు...
ఈ సినిమాలో కూడా కుల 'గౌరవాన్ని' నిలబెట్టే భారం మహిళలపైనే మోపుతూ, మీ ప్రాణాలర్పించి దీనిని కాపాడాలని చెబుతుంటే, దీనిపై ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం నన్ను ఇబ్బందికి గురి చేస్తోంది.
గౌరవానికి ఇస్తున్న ఈ 'తప్పుడు' నిర్వచనంలో మహిళ ప్రాణానికి ఏ మాత్రం విలువ లేకపోవడమే కాదు, రాణి పద్మావతి 'జౌహర్' చేసుకొని ప్రాణాలిచ్చేందుకు కూడా తన భర్త అనుమతి తీసుకుంటుంది.
ఈ సినిమాలో రాణి పాత్ర చిత్రణపై తప్పక చర్చ జరగాల్సిందే, కానీ నేను చెబుతున్న కారణాలు కర్ణీ సేన చెబుతున్న వాటికి పూర్తిగా భిన్నమైనవి.
ఎందుకంటే, ఇందులో ఆమెను కేవలం ఒక అందమైన వస్తువుగానే చూపించారు. ఆమెను పొందటం ద్వారానే ఆమెను రక్షించాలని ఒక రాజు అనుకుంటే, మరో రాజు ఆమెను బలవంతంగా తన దాన్ని చేసుకోవాలనుకుంటాడు.
వివాహం తర్వాత ఆమెకు విడిగా అస్తిత్వమే లేదు. ఆమె జీవితం పూర్తిగా తన భర్త చుట్టూ, కుల గౌరవం చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Padmavat/Facebook
రాజ్‌పుత్ గౌరవానికి లోటేమీ జరగలేదు...
ఒక చారిత్రక కావ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమా అడుగడుగునా మూఢత్వంతో నిండి ఉంది. యుద్ధానికి కారణం, యుద్ధంలో బహుమానం, యుద్ధంలో చెల్లించాల్సిన మూల్యం... అన్నీ మహిళే అన్నట్టుగా చూపిస్తారు.
రాణి రూపమే ఆమె అస్తిత్వం. మహిళను ఇంత చిన్న కళ్లజోడుతో చూడొద్దనే చర్చ కూడా పాతదే. నిజానికి కర్ణీ సేన సమర్థకుల ఆందోళన అకారణమైందే. ఎందుకంటే ఈ సినిమాలో రాజ్‌పుత్‌ల గౌరవానికి ఎక్కడా భంగం కలుగలేదు.
'పద్మావత్' సినిమాలో హిందూ రాణికి, ముస్లిం రాజుకు మధ్య ప్రేమ సన్నివేశాలు లేవు. కలల్లో కూడా రొమాంటిక్ దృశ్యాల వంటివేమీ లేవు.
అలావుద్దీన్ ఖిల్జీ ముందు గానీ లేదా మరే అపరిచిత పురుషుడి ముందు గానీ పద్మావతి రాణి నాట్యం చేసే దృశ్యాలూ లేవు, శరీర భాగాలు కనిపించే విధంగా దుస్తుల్నీ ఆమె ధరించదు.

ఫొటో సోర్స్, Padmavat/Facebook
మహిళ గౌరవం
నిజానికి, కర్ణీ సేన భయం లేదా కోపానికి కారణాలుగా చెబుతున్న వాటి నిర్వచనమే గందరగోళంగా ఉంది. ఇవి అందం అనే అద్దాన్ని దాటి ముందుకు వెళ్లి మహిళను చూడలేని కారణంగా తలెత్తినవే.
ఒంటిని పూర్తిగా కప్పేసే దుస్తులు, ఘూంఘట్ (పరదా), నాలుగు గోడల మధ్య ఉండే రాణి పాత్రను చూసినపుడు నాకు ఊపిరాడనట్టుగా అనిపించింది. అన్ని రకాల సినిమాలు తయారు కావాల్సిందే కానీ వాటిపై సరైన చర్చకు అవకాశం కూడా ఉండాలి.
మహిళల పేరిట తయారయ్యే సినిమాల్లో నిజంగానే మహిళల గౌరవం అంటే ఏంటో, వారి హోదాకు నిజమైన అర్థం ఏంటో తెరపై చూపించగలిగితే ఎంత బాగుండు!
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










