కశ్మీరీ పండిట్లు: 'అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. మా గోడు ఎవరూ పట్టించుకోవట్లేదు'

- రచయిత, సల్మాన్ రవి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూ నగరం వెలుపల పుర్ఖూలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉన్న వీళ్లంతా కశ్మీరీ పండితులు. తమ కష్టాలు తీరాలని ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో వారు దైవాన్ని ప్రార్థిస్తున్నారు.
అయితే, వీళ్లు పాడుతున్న ప్రార్థనా గీతాలు వారి మాతృభాష అయిన కశ్మీరీలో లేవు. వీళ్లంతా జమ్మూలోని స్థానిక భాషైన డోగ్రీలో ప్రార్థనలు చేస్తున్నారు.
మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో తలెత్తిన హింస వాళ్లను జమ్మూకు వలస వచ్చేలా చేసింది.
తమ ఊళ్లను, నివాసాలను, పొలాలను, చివరకు తమ సంస్కృతిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు. చివరకు, నేటి తరానికి వారి మాతృభాష కూడా రాకుండా పోయింది.
జమ్మూలో నివసిస్తున్న సుమారు 20 వేల మంది పండిట్లకు ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా తిరిగి తమ స్వస్థలానికి ఎలా వెళ్లాలో తెలియడం లేదు.
"ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీరీ పండిట్లకు ఏం మేలు జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పటి వరకు కశ్మీరీ పండితులు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే విషయంలో ఎలాంటి విధి విధానాలూ లేవు. ఆ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. మా వరకు చెప్పాలంటే ఆర్టికల్ 370 పెద్ద విషయమేం కాదు" అని ఆల్ కశ్మీరీ పండిట్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రానా అన్నారు.
అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న ఈ పుర్ఖూ క్యాంపులోనే కశ్మీరీ పండితులు గడపాల్సి వస్తోంది. మహిళలు మరింత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

"ఎలాంటి పరిస్థితుల్లో మేం ఉంటున్నామో మీరే చూడండి. ఇక్కడ పాములు, తేళ్లు తిరుగుతుంటాయి. మాకు చిన్న పిల్లలున్నారు. ఇక్కడ మరుగుదొడ్డి సదుపాయం లేదు. మాకు సాయం చేయమని కనిపించిన ప్రతి మంత్రినీ అడిగాం. అయినా, ఎలాంటి ప్రయోజనం లేదు" అని పుర్ఖూ శిబిరంలో తలదాచుకుంటున్న నీరూ చెప్పారు.
"20 ఏళ్లుగా జమ్మూలోనే ఉంటున్నాను. మొదట్లో ఓ కశ్మీరీ పండిట్ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. కానీ, నేను గర్భవతిగా ఉన్న సమయంలో ఆ ఇంటి యజమాని భార్య నన్ను బయటకు గెంటేసింది. దాంతో ఇక్కడికి వచ్చాం. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు" అని శారదా దేవి ఆవేదన వ్యక్తం చేశారు.

నాటి హింస తర్వాత మొత్తం 40 వేల మంది కశ్మీరీ పండితులు లోయ నుంచి జమ్మూకి వచ్చారు. అయితే, వారిలో 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన వసతి కల్పించింది. మిగిలిన 20 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.
అయితే, వారిలో కేవలం 5,428 కుటుంబాలకు మాత్రమే పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం. మిగిలిన వారిలో కొంతమంది ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లోనే ఉంటుండగా, మరికొంత మంది అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు.
గడచిన మూడు దశాబ్దాల్లో ఎంతో మంది కశ్మీరీ పండితులు తిరిగి లోయ ప్రాంతంలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. చాలా మంది కశ్మీర్ లోయలోని ప్రజలతో మళ్లీ సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నించారు.

"మేము ఈ 30 ఏళ్లలో కశ్మీర్‌లోని ముస్లిం సోదరులతో తెగిపోయిన సంబంధాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేశాం. ఎప్పటికైనా అక్కడికి తిరిగివెళ్లాలని ఆశించాం. 370 అధికరణాన్ని రద్దు చేయడంతో ఈ 30 ఏళ్ల ప్రయత్నాలపై నీళ్లు కుమ్మరించినట్టయ్యింది. వాళ్లతో సంబంధాలు తెగిపోయాయి. మరోసారి వాళ్లూ, మేం శత్రువులమయ్యాం" అని కశ్మీరీ పండిట్ కొలిన్ చంద్రపురి అన్నారు.

శిథిలావస్థకు చేరిన పుర్ఖూ క్యాంప్‌లో ఎవరిని పలకరించినా విషాద గాథలే వినిపిస్తున్నాయి.
"మాకంటూ ఏమీ లేదు. ఇల్లు కూడా లేదు. రేపు ఎవరికైనా మా గురించి చెప్పాలంటే ఏం చెప్పగలం? ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరు పిల్లనిస్తారు? బయట 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుంటే... ఈ షెడ్డు లోపల 50 డిగ్రీలుంటోంది. ఒక్కసారి ఎవరైనా మంత్రి గారు ఇక్కడకి వచ్చి ఒక్క రాత్రి గడపి చూడమనండి, వారికి తెలుస్తుంది" అని కశ్మీరీ పండిట్ యువకుడు విమల్ కుమార్ దర్బు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జమ్మూ అభివృద్ధి ప్రాధికార సంస్థ మాత్రం దీన్ని అనధికార శిబిరంగా ప్రకటించింది. గతంలో ఇక్కడున్న నిర్వాసితులకు ఇప్పటికే వసతి సదుపాయాన్ని కల్పించామని అధికారులు అంటున్నారు. అందుకే, ఇక్కడున్న వారిని సర్కారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
"ప్రస్తుతం అక్కడున్న వారి గుర్తింపు పత్రాలను మేం పరిశీలించాల్సి ఉంది. మా దగ్గర సరైన గణాంకాలు లేవు. మా వద్ద ఉన్న సమాచారం మేరకు 20 వేల మందిలో ఇప్పటికే 5428 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. మిగిలిన వారు ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు" అని రిలీఫ్ కమిషనర్ తేజ్ ప్రకాష్ భట్ తెలిపారు.

లోయ నుంచి నిర్వాసితులై ఇక్కడికి వచ్చిన 40 వేల మంది కశ్మీరీ పండితుల భవిష్యత్తు సంగతేంటి, వారిని తమ స్వస్థలాలకు చేర్చే ప్రణాళిక ఏంటి అనే విషయాల గురించి ఎవరూ మాట్లడడం లేదు.
దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద గానీ, కేంద్రం వద్ద గానీ లేదు. అందుకే, కశ్మీరీ పండితుల సముదాయం అనేక పరిమితుల మధ్య, పేదరికంలో జీవించాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘జీవితంలో మొదటిసారి నేను ముస్లిం అని నాకు అనిపించింది‘
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









