బీజేపీ పట్టు సడలుతోందా... ఏడాదిలో 21 నుంచి 17 రాష్ట్రాలకు పడిపోయిన అధికారం

అమిత్ షా, నరేంద్రమోదీ

భారతీయ జనతా పార్టీ 2018 మార్చి వరకూ.. స్వయంగా కానీ, మిత్రపక్షాలతో భాగస్వామిగా కానీ భారతదేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. జమ్మూకశ్మీర్‌ను 2019లో రెండు రాష్ట్రాలుగా విభజించటానికి ముందు 2018లో దేశంలో 28 రాష్ట్రాలు ఉండేవి.

మహారాష్ట్రలో తాజా రాజకీయ సంక్షోభం.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏకమవటం.. ఈ పరిణామాలతో బీజేపీ మరొక రాష్ట్రాన్ని కోల్పోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను కోల్పోయిన బీజేపీకి ఇది మరో ఎదురు దెబ్బ.

ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీ లేదా కూటమికి రాష్ట్రాలపై ఇంతటి స్థాయిలో పట్టు ఉన్నది దాదాపు పాతికేళ్ల కిందట. 1993 ముగిసే నాటికి దేశంలోని 26 రాష్ట్రాలకు గాను 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన ఉంది. అందులో 15 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటే.. ఒక రాష్ట్రంలో మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంది.

శరద్ పవార్, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచి కేంద్రంలో మోదీ అధికారంలోకి రావటానికి ముందు.. ఆ పార్టీ కేవలం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అయితే.. 2018 మార్చి నాటికి బీజేపీ 21 రాష్ట్రాలకు తన అధికారాన్ని విస్తరించింది. అంతకుముందు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పరంపరకు ముందు.. 2015లో జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. ఆ ఎన్నికల్లో మొత్తం 87 సీట్లున్న అసెంబ్లీలో పీడీపీ 28 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఎన్‌సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు గెలిచిన క్రమంలో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అప్పుడు.. ఒక్క పంజాబ్ మినహా మొత్తం ఉత్తర భారతదేశమంతా మొదటిసారిగా బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలోకి వచ్చింది.

నరేంద్రమోదీ, యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. 2018లో కర్ణాటకలో అప్పటికి కొంత కాలం కిందటే ఏర్పాటైన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారటం మొదలైంది. బీజేపీ మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

మహారాష్ట్రలో తాజా ఎన్నికల ఫలితాలను చూస్తే.. బీజేపీ, దాని మిత్రపక్షాలు రాష్ట్రాల మీద తమ పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ అధికారం.. ఇప్పుడు కేవలం 17 రాష్ట్రాలకే పరిమితమైంది. ఆ రాష్ట్రాల్లో హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, గుజరాత్ ఉన్నాయి.

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది?
ఫొటో క్యాప్షన్, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది?

అయితే.. ఒక సంవత్సరంలో కోల్పోయిన రాష్ట్రాల సంఖ్య పెద్దదిగా అనిపించకపోయినప్పటికీ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలను బీజేపీ కోల్పోయిందనే విషయం కాదనలేనిది. దీనిని అర్థం చేసుకోవటానికి ఉత్తమ మార్గం.. ఈ రాష్ట్రాల జనాభా మీద దృష్టి కేంద్రీకరించటం.

2011 జనాభా లెక్కలను బట్టి చూస్తే.. 2018 మార్చి నాటికి బీజేపీ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల మొత్తం జనాభా 84,98,25,030 మంది. ఇది మొత్తం దేశ జనాభాలో దాదాపు 70 శాతం. మహారాష్ట్ర (11.2 కోట్లు), మధ్యప్రదేశ్ (7.2 కోట్లు), రాజస్థాన్ (6.8 కోట్లు), ఛత్తీస్‌గఢ్ (2.5 కోట్లు) వంటి రాష్ట్రాలు బీజేపీ చేజారిపోవటంతో.. బీజేపీ కూటమి పాలనలో ఉన్న రాష్ట్రాల జనాభా దాదాపు 47 శాతానికి పడిపోయింది. అంటే 2018 మార్చి నుంచి దాదాపు 23 శాతం దిగజారింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)