అమిత్ షా: ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి

చదివే సమయం: 2 నిమిషాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కోవిడ్ అనంతర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

అమిత్ షా గత నాలుగైదు రోజులుగా నిస్సత్తువ, ఒళ్లు నొప్పులు ఉన్నట్లు చెప్తున్నారని ఎయిమ్స్ (ఆల్ ఇండియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఎయిమ్స్) పేర్కొంది.

అయితే.. కోవిడ్-19 పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చిందని వెల్లడించింది.

ప్రస్తుతం ఆయన సౌకర్యవంతంగానే ఉన్నారని.. ఆస్పత్రి నుంచే తన విధులు కొనసాగిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ ఒక ప్రకటనలో వివరించారు.

అమిత్ షా వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. ఆయనకు ఆగస్టు 2వ తేదీన కరోనావైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలటంతో ఆస్పత్రిలో చేరారు.

గురుగ్రామ్‌లో మేదాంత హాస్పిటల్‌లో చికిత్స పొందిన ఆయన ఆగస్టు 14న కరోనా పరీక్ష నెగెటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు.

వైద్యుల సలహా మేరకు ఒక వారం పాటు ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటానని అమిత్ షా ట్వీట్ చేశారు.

ఆ మరుసటి రోజు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ పతాకాన్ని కూడా ఎగురవేశారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

మరో 55,000 కొత్త కేసులు నమోదు...

ఇదిలావుంటే.. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ దేశంలో కొత్తగా 55,079 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,02,743కు పెరిగింది. ప్రస్తుతం 6,73,166 కేసులు కొనసాగుతుండగా.. 19,77,780 కేసులను డిశ్చార్జ్ చేశారు.

ఇప్పటి వరకూ కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 51,797 మందికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)