ఈశా సింగ్ - తెలంగాణ షూటర్: ‘తుపాకీ పేలుతున్న శబ్దం నా చెవులకు సంగీతంలా వినిపిస్తుంది’.. 13 ఏళ్లకే నేషనల్ చాంపియన్ - BBC ISWOTY

ఈశా సింగ్

ఫొటో సోర్స్, Getty Images

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారత్‌లో జాతీయ షూటింగ్ చాంపియన్‌గా నిలిచిన షూటర్లలో అత్యంత పిన్న వయస్కురాలు ఈశా సింగ్.

ఆమెకు క్రీడలపై మక్కువ వారసత్వంగా వచ్చింది. ఆమె తండ్రి సచిన్ సింగ్ మోటార్ స్పోర్ట్స్‌లో జాతీయ ర్యాలీ చాంపియన్.

ఈశాకు మాత్రం స్టీరింగ్ కన్నా తుపాకీ పట్టుకోవడమే నచ్చింది. తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె షూటింగ్‌లో శిక్షణ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమెకు 16 ఏళ్లు.

తుపాకీ పేలుతున్న శబ్దం తన చెవులకు సంగీతంలా వినిపిస్తుందని, ఈ క్రీడలోకి అడుగుపెట్టాలంటే ధైర్యం అవసరమని ఈశా చెబుతున్నారు. ఈ కారణాలే ఈ క్రీడ వైపు తనను ఆకర్షించాయని ఆమె అన్నారు.

2014లో షూటింగ్ మొదలుపెట్టిన ఈశా... 2018లో జాతీయ షూటింగ్ చాంపియన్‌గా నిలిచారు. 13 ఏళ్ల వయసులో ఆమె మను భాకర్, హీనా సిధు లాంటి అంతర్జాతీయ షూటర్లను ఓడించారు. యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో మూడు బంగారు పతకాలు గెలిచారు.

అంతర్జాతీయ స్థాయిలోనూ ఈశా సత్తా చాటుకున్నారు. జూనియర్ వరల్డ్ కప్‌లో రజతం, ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గారు.

క్రీడల్లో రాణించాలంటే దానిపై మక్కువ ఒక్కటే సరిపోదని, అవరోధాలన్నీ దాటేందుకు కృషి చేయాల్సి ఉంటుందని ఈశా అన్నారు. ఈశా తెలంగాణ అమ్మాయి.

అప్పట్లో ఆమెకు సాధన చేసేందుకు దగ్గర్లో షూటింగ్ రేంజీలు ఉండేవి కావు. దీంతో పోటీలు సమీపించినప్పుడు ఆమె గచ్చిబౌలీ స్టేడియానికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇది వారి ఇంటి నుంచి గంట ప్రయాణం చేస్తే వస్తుంది. మాన్యువల్ రేంజీల్లోనే ఆమె ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది.

చదువు, షూటింగ్ సాధనను సమన్వయం చేసుకోవడానికి ఆమె చాలా శ్రమించారు.

తొమ్మిదేళ్ల వయసులో మిగతా పిల్లలు అనుభవించే ఆనందాలన్నీ వదులుకుని క్రీడపై దృష్టి పెట్టారామె.

ఈశా సింగ్

ఫొటో సోర్స్, Esha Singh

త్యాగాల పునాదుల మీద ఈశా తన కెరీర్ నిర్మించుకున్నారు. ఈశా కెరీర్ కోసం ఆమె తండ్రి మోటార్ స్పోర్ట్స్‌లో తన కెరీర్‌ను వదులుకున్నారు. కూతురిని ప్రోత్సహించడం మీదే ఆయన దృష్టి పెట్టారు. ఈశా తల్లి కూడా ఆమె కెరీర్ కోసం శ్రమించారు.

నాలుగేళ్లు తిరగకుండానే ఈశా జాతీయ చాంపియన్‌గా నిలిచి, వారి కష్టానికి ఫలితం దక్కేలా చేశారు.

అంత చిన్న వయసులో జాతీయ చాంపియన్‌గా నిలవడం ఈశాలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసింది. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిచేందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది.

మరుసటి ఏడాది, అంటే 2019లో జర్మనీలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో ఈశా రజతం గెలిచి, తన సత్తా చాటుకున్నారు.

అదే ఏడాది సీనియర్ వరల్డ్ కప్‌లో పతకం ఏదీ రాకపోయినా, ఆ అనుభవం తనకు ఎంతో నేర్పిందని ఆమె చెప్పారు. చిన్న వయసులో ఆ స్థాయి పోటీల్లో పాల్గొనడం తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందని అన్నారు.

ఆ ఏడాది దోహాలో జరిగిన ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఈశా స్వర్ణం గెలిచారు.

తన తదుపరి లక్ష్యం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలవడమని ఈశా చెబుతున్నారు. యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, 2022 ఏసియన్ గేమ్స్ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఈశా ప్రతిభకు గుర్తింపుగా 2020లో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రదానం చేసింది.

వ్యక్తిగతంగా తనకు అది చాలా గర్వపడ్డ సందర్భమని ఈశా అన్నారు.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... వారికి తగిన గుర్తింపు, రివార్డులు వచ్చేలా చూడాలని ఆమె కోరుతున్నారు.

(ఈశా సింగ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)