తమిళనాడు ఎన్నికలు: ద్రావిడ రాజకీయ పార్టీల రంగులు మారుతున్నాయా...

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
- రచయిత, పసునూరు శ్రీధర్‌బాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
"తమిళ సంస్కృతి, తమిళ సాహిత్య వికాసం కోసం కృషి చేస్తున్న వారందరికీ నా అభినందనలు. ఘనమైన తమిళ సంస్కృతికి ప్రధాన కేంద్రం ఈ మదురై నగరం. ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాష అయిన తమిళంతో ఈ నేలకు ఎంతో అనుబంధం ఉంది." అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
మీనాక్షి ఆలయంలోకి దళితుల ప్రవేశం కోసం పోరాడిన ముత్తురామలింగ తేవర్, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన తెలుగువాడు వీరపాండ్య కట్టబ్రహ్మన... వంటి కొందరు చరిత్ర ప్రముఖులను మోదీ గుర్తు చేసుకున్నారు. తన రాష్ట్రం నుంచి వందల ఏళ్ల కింద సౌరాష్ట్రీయులు ఎందరో మదురైకి వచ్చారని చెప్పారు.
ఎంతో మంది తెలుగువారు దక్షిణ తమిళనాడులో ఉన్నారని గుర్తు చేశారు. అలా భిన్న ప్రాంతాల ప్రజలను ఒడిలో చేర్చుకున్న మదురై 'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' అన్న నినాదానికి ఒక నిదర్శనంగా నిలిచిందని మోదీ అన్నారు.
ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళనాడులోని భిన్న రాజకీయ సమీకరణలకు మోదీ ప్రసంగంలోని ఈ వాక్యాలు అద్దం పడుతున్నాయి. బీజేపీ వ్యూహమేంటో చెప్పకనే చెబుతున్నాయి.
ఉత్తరాదిన తనకు విజయాలు కట్టబెట్టిన జాతీయవాదాన్ని, హిందుత్వ విధానాల్ని తమిళనాడులోనూ యధాతథంగా అమలు చేసే విషయంలో కొన్ని మార్పు చేర్పులు చేసుకున్నట్లు మోదీ ప్రసంగం స్పష్టం చేస్తోంది.
"మాకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. మురుగనే (దేవుడే) మాకు అనుమతి ఇచ్చాడు" అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు గత ఏడాది నవంబర్ నెలలో 'వెట్రివేల్ యాత్ర'ను ప్రారంభించినప్పుడు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Khushboo/FB
తమిళనాడులో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉన్న ఆరు ప్రధాన కుమారస్వామి ఆలయాల మీదుగా తలపెట్టిన ఈ యాత్రను ప్రభుత్వం అడ్డుకుని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. మురుగన్‌ను అరెస్ట్ కూడా చేసింది. కానీ, పార్టీ శ్రేణులు యాత్రను కొనసాగించాయి.
ఆ సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఒక మతపరమైన పునరేకీకరణ కార్యక్రమం నుంచి ఇప్పుడు తమిళనాడు చరిత్ర, సంస్కృతి, భాష వంటి 'అస్తిత్వ పోరాటాల' ప్రాతిపదికన తన వ్యూహాల్ని నిర్మించి ఈ ఎన్నికల్లో పోటీ పడుతోంది బీజేపీ.
"ఈ పరిస్థితి తమిళనాడులోని ద్రావిడ పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. హిందుత్వ అనే పదం వాడకుండా బీజేపీ మతపరమైన పునరేకీకరణకు ప్రయత్నిస్తుంటే, తాము మతం పేరుతో ప్రజలకు దూరం కాకూడదని ద్రావిడ పార్టీలు ఆలోచిస్తున్నాయి. అదే తరహా వ్యూహాలను అనుసరిస్తున్నాయి" అని చెన్నైలోని సీనియర్ తెలుగు జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు ఎస్.వి. సూర్యప్రకాశరావు అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER
కాషాయ పార్టీ రాకతో ద్రావిడ పార్టీల రంగులు మారాయా?
బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవంతో కూడిన కులరహిత నాస్తిక - హేతువాద సమాజమే లక్ష్యంగా తమిళనాట వందేళ్ల కిందట మొదలైన ద్రావిడ ఉద్యమం కాలక్రమంలో అనేకానేక మార్పులకు లోనైంది.
మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న రోజుల్లోనే రాష్ట్రంలో 3.2 శాతం మాత్రమే ఉన్న తమిళ, తెలుగు బ్రాహ్మణులు కలెక్టర్లుగా, జడ్జిలుగా 90 శాతానికి పైగా ఉంటే, 96 శాతం ఉన్న బ్రాహ్మణేతర హిందువులు, ఇతర మతాల వారికి అధికారంలో ప్రాతినిధ్యం దాదాపు శూన్యమంటూ, బ్రాహ్మణాధిపత్యంపై పోరాటమే లక్ష్యంగా జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది.
అదే ఆ తరువాత పెరియార్ రామస్వామి నాయకత్వంలో 'ద్రావిడ కళగం'గా మారింది.
ద్రావిడ కళగం నుంచి అన్నాదురై బయటకు వచ్చి ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) స్థాపించడం, ఆయన మరణం తరువాత 1969లో కరుణానిధి మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి కావడం వరకు పార్టీ ప్రాథమిక పునాదులు కొంతవరకు బలంగానే కొనసాగాయి.
ఆ తరువాత మూడేళ్లకు సినీ నటుడు ఎం.జి. రామచంద్రన్ తన వర్గంతో డీఎంకేను చీల్చి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) స్థాపించారు. మలయాళం మాట్లాడే నాయర్ అయిన ఎంజీఆర్ హయాంలో ద్రావిడ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు మొదలయ్యాయి.
"స్థానికత, నాస్తికవాదం అనే అంశాల నుంచి పార్టీ ప్రాధాన్యాలను ఎంజీఆర్ సంక్షేమ పాలన వైపు మళ్లించారు. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన అయ్యంగార్ అయిన జయలలిత కూడా ఎంజీఆర్ మార్గాన్నే అనుసరించారు" అని సూర్యప్రకాశ్ అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
1962లో రాజగోపాలాచారి, ఆ తరువాత వరసగా మూడుసార్లు కె. కామరాజ్ ముఖ్యమంత్రి అయిన తరువాత 1967 నుంచి తమిళ రాజకీయాలను ఈ రెండు ద్రావిడ పార్టీలే శాసిస్తూ వచ్చాయి. 1984 నుంచి ఒకసారి అన్నాడీఎంకే వస్తే, మరోసారి డీఎంకే పవర్ లోకి రావడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
కానీ, 2011 ఎన్నికల తరువాత మళ్లీ 2016లోనూ జయలలిత వరసగా రెండోసారి ముఖ్యమంత్రిని పదవి చేపట్టి రికార్డ్ సృష్టించారు. అదే ఏడాది డిసెంబర్లో జయలలిత, 2018లో కరుణానిధి చనిపోవడంతో తమిళ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయినట్లయింది.
బ్రాహ్మణాధిపత్యంపై పోరాటం, నాస్తిక-హేతువాద వైఖరులను గాలికొదిలేసిన అన్నాడీఎంకే ద్రావిడ పార్టీయే కాదని కరుణానిధి విమర్శించేవారు. డీఎంకేకు తెలిసిన ద్రావిడ తత్వం అంతా 'యాంటీ బ్రాహ్మిణ్, యాంటీ హిందూ, యాంటీ హిందీ' మాత్రమేనని జయలలిత ఆరోపించేవారు.
"నిజానికి ఈ రెండు ద్రావిడ పార్టీలూ నాస్తికవాదాన్ని ఎప్పుడో పక్కన పెట్టాయి. ఎన్నికల రాజకీయాల్లో కుల సమీకరణలే ప్రాతిపదికగా పని చేస్తున్నాయి. కరుణానిధి కూడా ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయించారు. తిరువాయూర్ రథయాత్రలో పాల్గొన్నారు. ఇక, జయలలిత గురించి చెప్పేదేముంది? విభూది బొట్టు లేకుండా ఏ నాయకుడూ ఆమెకు ఎదురపడే సాహసం చేసే వారు కాదు" అని సీనియర్ జర్నలిస్ట్, చెన్నైలో ప్రైమ్ పాయింట్ అనే మీడియా సంస్థను నడుపుతున్న శ్రీనివాసన్ అన్నారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
అన్నాడీఎంకే నేతలు నుదుట బొట్టు లేకుండా అమ్మకు ఎదురుపడడానికి భయపడితే, డీఎంకేలో పరిస్థితి దానికి భిన్నంగా ఉండేది. కరుణానిధి హయాంలో ఎవరూ కూడా బొట్టు పెట్టుకుని ఆయన ముందుకు వెళ్లేవారు కాదని 'ద్రావిడ దేశం' అధ్యక్షుడు కృష్ణారావు గుర్తు చేశారు.
"కరుణానిధి భార్య, స్టాలిన్ భార్య కూడా గుడికి వెళ్లి పూజలు చేసేవారు. కానీ, అదంతా వ్యక్తిగత విషయంగా ఉండేది. బయటకు వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు స్టాలిన్ భార్య గుడికి వెళ్లిన ఫోటోలను ఆ పార్టీవారే లీక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది" అని తమిళనాడులో తెలుగువారి హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణారావు అన్నారు.
"నేను దేవుడ్ని ద్వేషించను, ప్రేమించను. దేవుడిని పూజించే వారి పట్ల నాకే అభ్యంతరం లేదు. నా భార్య కూడా గుడికి వెళ్లి పూజ చేస్తుంది" అని స్టాలిన్ ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
తిరుత్తణి జిల్లాలో ఆయన ఒక పూజారి ఇచ్చిన మురుగన్ శూలాన్ని పట్టుకుని ప్రదర్శించడం కూడా ఒక సంచలన వార్తగా మారింది.
"మా వెట్రివేల్ యాత్రను చూసిన తరువాత పాపం స్టాలిన్‌కు కుమార స్వామి శూలాన్ని పట్టుకోక తప్పలేదు. కానీ, హిందువులను చులకనగా చూసే ఆ డీఎంకే నేత ఏం చేసినా ప్రజలు నమ్మరు" అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీ, ప్రతి ఏటా మురుగన్ పండుగ తాయిపుసం జరిగే రోజును సెలవుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరి సాధించుకుంది.
మొత్తానికి, బీజేపీ రాకతో తమిళనాడు ద్రావిడ పార్టీలకు బహిరంగంగా దైవ భక్తి చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిందూమతం పేరుతో ఓట్ల పునరేకీకరణ పోరులో వెనుకబడిపోతామేమోననే ఆందోళన స్పష్టంగానే కనిపిస్తోంది.
"ద్రావిడ రాజకీయాల్లో హేతువాదం ఎప్పుడో పలచబడిపోయింది. కులాల ప్రాతిపదికన సాగే రాజకీయాల్లో సామాజిక ప్రాతినిధ్యం కోసం జరిగే పోరాటం ఉంటుంది. మతం ఇక్కడ ఇన్నాళ్లూ వ్యక్తిగత అంశంగానే ఉంది. అలాంటి సెక్యులర్ స్టేట్ అయిన తమిళనాడులో ఇప్పుడు మత ప్రాతిపదికన పునరేకీకరణలు మొదలయ్యాయి" అని ఒక విశ్లేషకుడు చెప్పారు.

ఉత్తరాది ఆధిపత్యంపై పోరు కొనసాగుతుందా...
దక్షిణ భారతదేశంలోని స్థానికులైన ద్రావిడులపై ఉత్తర భారతదేశ నాయకుల పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్రావిడ రాజకీయ ఉద్యమాల్లోని మరో కీలకాంశం. హిందీని బలవంతంగా రుద్దాలని దిల్లీ పెద్దలు ప్రయత్నించినప్పుడు ఈ ద్రావిడ రాష్ట్రం భగ్గుమన్న సంగతి తెలిసిందే. స్వతంత్రం వచ్చిన తరువాత దేశంలో జరిగిన బలమైన అస్తిత్వ పోరాటాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఒకటిగా నిలిచిపోయింది.
అయితే, ఎల్‌కే అడ్వాణీ నాయకత్వంలో కరసేవకులు 1992లో రథయాత్ర చేసినప్పుడు తమిళనాట అధికారంలో ఉన్న జయలలిత రామమందిర నిర్మాణాన్ని సమర్థించారు. మందిరం కావలంటే కట్టుకోండి, కానీ ఇస్లాం చరిత్రను కూల్చే హక్కు మీకెవరిచ్చారంటూ కరుణానిధి ప్రశ్నించారు.
కానీ, అదే కరుణానిధి 1999లో వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు.
"అయితే, ఆ పొత్తు పట్ల ఆయన ఆ తరువాత విచారం వ్యక్తం చేశారు. గోధ్రా హింస, గుజరాత్ అల్లర్ల తరువాత అయినా ఆ కూటమి నుంచి బయటకు రావల్సింది. కానీ, అయిదేళ్లు మద్దతు ఇస్తామని మాట ఇచ్చాం కాబట్టి కట్టుబడి ఉండాల్సిందేనని కరుణానిధి అన్నారని రాజా చెప్పారు" అని కరుణానిధి రాజకీయ జీవితంపై రాసిన 'ఎ లైఫ్ ఇన్ పాలిటిక్స్' పుస్తకంలో సంధ్యా రవిశంకర్ వివరించారు.
2016 ఎన్నికల్లో గెలిచిన అదే ఏడాది డిసెంబర్లో జయలలిత, 2018 ఆగస్టులో కరుణానిధి చనిపోవడంతో తమిళనాడులో ఒక తరహా రాజకీయ శూన్యం ఏర్పడింది. అప్పటి నుంచి బీజేపీ ఈ రాష్ట్రంలో దూకుడుగా తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
2019 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అయిదు స్థానాల్లో పోటీ చేసి అన్నింట్లో ఓడిపోయింది. మొత్తం 39 స్థానాల్లో 38 స్థానాలను స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి గెలుచుకుంది.
అయితే, ద్రావిడ పార్టీల ఓట్ల శాతం 2004 నుంచీ తగ్గుతూ వస్తుండడంతో, ద్రావిడేతర జాతీయ పార్టీకి అవకాశాలు మెరుగవుతాయని బీజేపీ భావిస్తోంది. "కరుణానిధి, జయలలిత లేకపోవడంతో ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవచ్చనే నమ్మకం కలుగుతోంది. మోదీని ఇక్కడి ప్రజలు కూడా ఒక ఐకాన్‌గానే చూస్తున్నారు. కానీ, జాతీయ పార్టీ ఆధిపత్యం ఏంటనే ప్రశ్న వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది" అని చెన్నైలో స్థిరపడిన తెలుగు జర్నలిస్ట్ వెంకటరాజు అన్నారు.

ఫొటో సోర్స్, MODI/TWITTER
కుల రాజకీయాల నుంచి మత రాజకీయాల దాకా...
మొదటి నుంచీ తమిళనాడు రాజకీయాల్లో కులాలు బలమైన పాత్ర పోషిస్తున్నాయి. కులాల ప్రాతిపదికనే రాజకీయ సమీకరణలు జరగడం ఇక్కడ ఆనవాయితీ.
"కులమే ఇక్కడ ప్రధాన అంశం. వెనుకబడిన వర్గాలు, ఎస్సీల సంఘాలు ఇక్కడ బలంగా ఉన్నాయి. రెండు ద్రావిడ పార్టీలు ఎక్కడ ఏ కులస్థుల జనాభా అధికంగా ఉందో, ఆ ప్రాంతంలో వారికి చెందిన రాజకీయ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి" అని శ్రీనివాసన్ అన్నారు.
ఉత్తర తమిళనాడులో బలంగా ఉన్న వన్నియార్లను ఆకట్టుకోవడానికి అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్దిగా ముందు హడావిడిగా వారికి 10.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చింది. ఆ తరువాత తన మిత్రపక్షమైన పీఎంకేకు 23 సీట్లు కేటాయిస్తూ పంపకాలు ఖరారు చేసుకుంది.
ఇక దక్షిణ తమిళనాడులో ఎక్కువగా ఉన్న పల్లార్ కులస్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 'పుదియ తమిళగం' అనే పార్టీ డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. పల్లార్లతో పాటు మరో ఆరు దళిత ఉప-కులాలను, దేవేంద్రకుల వెళ్లలార్ అనే షెడ్యూల్ కులం జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించింది. పల్లార్లు అది తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నారు.
అయితే, పల్లార్లకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మార్చి 14న అన్నా డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టోలో 'మదురై విమానాశ్రయానికి 'పసుంపన్ ముత్తురామలింగ తేవర్' పేరు పెడుతున్నట్లు ఒక హామీ ఉంది. దాంతో, పల్లార్లకు కోపం వచ్చింది. 'ఆ విమానాశ్రయానికి స్థలం ఇచ్చింది మా కులం వాళ్లే కదా? స్థలం ఏమో మాది, పేరు మాత్రం వేరే కులానిదా?' అంటూ అగ్రహించిన పల్లార్లు ఏఐఏడీఎంకేకు గుడ్‌బై చెప్పారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES
మతం... మ్యానిఫెస్టో
పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు చేసేందుకు ఏడాదికి లక్ష మందికి 25,000 రూపాయల చొప్పున ఇస్తామని డీఎంకే తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే, పల్లెలు పట్టణాల్లోని ఆలయాల పునరుద్ధరణకు రూ. 1,000 కోట్ల నిధిని కేటాయిస్తామని చెప్పింది. మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ. 200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
అన్నాడీఎంకే కూడా హిందువుల తీర్థయాత్రలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, హజ్ సబ్సిడి ఆరు కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతామని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది.
మతపరమైన వాగ్దానాల విషయంలో బీజేపీ మరో అడుగు ముందుకేసింది. హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎండోమెంట్ శాఖ నుంచి తప్పించి, హిందూ మత పెద్దలు, విద్యావంతుల మండలికి అప్పగిస్తామని హామీ ఇచ్చింది.
బలవంతపు మత మార్పిడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టాలు తెస్తామని తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images
మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమలహాసన్, గృహిణులకు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తామని అందరికన్నా ముందుగా ప్రకటించారు. అయితే, రాష్ట్రంలో ద్విభాషా బోధన విధానం కొనసాగుతుందని, తమిళంలో చదువుకున్న వారికి ఉద్యోగాలలో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలకు అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు స్కూల్‌కు అనుమతించేది లేదన్నది ఆయన మ్యానిఫెస్టోలోని మరో అంశం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
తెలుగువారి సంగతేంటి...
రాష్ట్రవ్యాప్తంగా కనీసం 27 శాతం, చెన్నైలో దాదాపు 40 శాతం వరకూ తెలుగు వారి జనాభా ఉందని తమిళనాడులోని తెలుగు సంఘాల నాయకులు చెబుతున్నారు. పీఎంకే రామదాస్ తెలుగువారే, హోసూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ మనవాడే... ఇంకా ఇలా చాలా మందే ఉన్నారని వారు గుర్తు చేస్తుంటారు.
కానీ, తమిళ రాజకీయాల్లో తెలుగు భాషలో తమ గొంతును వినిపించే స్థితిలో వాళ్లు లేరని అఖిల భారత తెలుగు సమాఖ్య చైర్మన్, డాక్టర్ సీఎంకే రెడ్డి అన్నారు.
"తెలుగు ప్రజల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు నాయకులను నిలబెడుతున్నారు. కానీ, వారిని తెలుగువారి ప్రతినిధులుగా గుర్తించడం లేదు. నాయకులు కూడా ద్రావిడ రాజకీయాల్లో భాగమవుతున్నారు. కానీ, తమ అస్తిత్వాన్ని చాటుకునే స్థితిలో లేరు. ఆ పరిస్థితి రావాలంటే తెలుగువారు భాషాపరంగా ఆర్గనైజ్ కావాలి" అని సీఎంకే రెడ్డి చెప్పారు.
దాదాపు 90 నియోజకవర్గాల్లో తెలుగువారు ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర పోషించగల స్థితిలో ఉన్నారని, వారిలో అధికులు ద్రావిడ రాజకీయాల నీడల్లోనే తల దాచుకుంటున్నారని తెలుగు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి. అనంతరామన్ చెప్పారు.
"ఇక్కడి రాజకీయాల్లో తెలుగువారి ప్రాతినిధ్యం పెరగాలంటే, వారంతా కులాలకు అతీతంగా సంఘటితం కావాలి. ఇక, ఇక్కడి తెలుగువారి సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలవడానికి ముందుకు రావాలి" అని అనంతరామన్ అన్నారు.
అంతేకాదు, "తెలుగు జాతీయ పార్టీలు తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యక్షంగా దిగితే ఇక్కడ తెలుగువారి ప్రాబల్యం ఏమిటో తెలుస్తుంది. కానీ, ఎందుకో మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఇతర రాష్ట్రాలలోని తెలుగు సమాజాలను పట్టించుకోవడం మానేశాయి. ఇదే సంఖ్యలో తమిళులు ఇతర రాష్ట్రాల్లో ఉంటే తమిళ పార్టీలు ఊరుకుంటాయా" అని ద్రావిడదేశం కృష్ణారావు ప్రశ్నించారు.
తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల లిస్టును తెలుగులో ఇవ్వాలని ఆయన చేసిన పోరాటం ఫలితంగా, ఈ ఎన్నికల్లో హోసూరు, తిరుత్తణిలలో ఓటర్ల లిస్టును ఎన్నికల కమిషన్ తెలుగులో ముద్రించి ఇచ్చింది.

ద్రావిడ రాజకీయాలకు ఇది కీలక మలుపా?
పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ అన్నాడీఎంకే పట్ల 'ప్రభుత్వ వ్యతిరేకత' మరీ బాహాటంగా ఏమి లేదు. విభిన్న వర్గాల ప్రజలతో బీబీసీ మాట్లాడినప్పుడు చాలా మంది ప్రజలు తమకు తాగునీరు, డ్రైనేజి వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కరవయ్యాయని అన్నారు.
ప్రభుత్వ అవినీతి గురించి డీఎంకే అధినేత స్టాలిన్ తన ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ, అవినీతి ఆరోపణలను ప్రజలు మరీ తీవ్రంగా పరిగణించడం లేదు. చెన్నైలోని విల్లివాక్కంలోని ఒక గృహిణి, 'ఉచిత కానుకలు, నగదు అందుతున్నాయి. కానీ, మా పిల్లలకు స్థిరమైన ఉద్యోగం లేదు" అని చెప్పారు.
కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని, తమిళనాడు తలసరి ఆదాయం కూడా గతంతో పోల్చితే గణనీయంగా పెరిగిందని, అమ్మ బాటలో మేం స్థిరమైన పాలన అందించినందుకు ప్రజలు మా వైపే ఉన్నారని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి అన్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం బీజేపీకి బానిసగా మారిందని.. అస్తిత్వం కోసం పోరాడే తమిళనాడు ప్రజలు తమ పార్టీని 200 స్థానాల్లో గెలిపిస్తారని డీఎంకే అధినేత స్టాలిన్ చెబుతున్నారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటుందని అమిత్ షా చెబుతున్నారు. పార్లమెంటులో ఒక్క ఎంపీ ఉన్న పార్టీ మాట చెల్లుతుందా, 39 మంది గొంతెత్తితే మన సమస్యలు పరిష్కారమవుతాయా అని డీఎంకే నేతలు ప్రజలను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పోరు హోరాహోరీగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, KAMALHASSAN TWITTER
ఇక, కమలహాసన్ నాయకత్వంలోని ఎంఎన్ఎం, టీటీవీ దినకర్ నాయకత్వంలోని 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం', సీమాన్ నాయకత్వంలోని 'నామ్ తమిళర్ కాట్చి' కూటములు కూడా రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఈ రాజకీయ కూటములు రెండు ప్రధాన ద్రావిడ పార్టీలలో ఎవరి ఓట్లు ఎక్కువగా చీలుస్తారన్న దానిపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.
2016 ఎన్నికల్లో డీఎంకే 9 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికలను స్వీప్ చేసిన డీఎంకే-కాంగ్రెస్ కూటమి 187 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సంపాదించింది.
పెరియార్, అన్నాదురైల ద్రావిడ సిద్ధాంతాల భారాన్ని దింపుకుంటూ ప్రజాకర్షక మార్గంలోకి మళ్లిన ద్రావిడ పార్టీలు ఇప్పుడు బీజేపీ రాకతో మత రాజకీయాల గోదాలోకి దిగాయి. ద్రావిడ సిద్ధాంతాల నుంచి ఆ పార్టీలు ఇప్పటికే చాలా దూరం వచ్చేశాయి. వర్తమాన రాజకీయ సమీకరణల సమరంలో తమకే మినహాయింపులూ లేవని పొత్తులతో, మ్యానిఫెస్టోలతో, ప్రచార నినాదాలతో ఆ పార్టీలే చెప్పుకుంటున్నాయి.
అలాగే, 'ఒకే భారత్, శ్రేష్ఠ భారత్' అనే నినాదాన్ని కొద్దిగా కిందకు దింపి, తమిళ సంస్కృతి-భాష ఔన్నత్యాలతో ప్రసంగాలు ప్రారంభిస్తున్న బీజేపీ నేతలు తమిళనాడు స్వభావాన్ని, ప్రత్యేకతను గుర్తించారని అనుకోవాల్సిన పని లేదు. ఈ ఎన్నికల జల్లికట్టులో బీజేపీ కొమ్ములు విదిల్చి దూసుకొస్తూ ఒక తరహా 'లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్'ను తయారు చేస్తోంది.
ఏమైనా, '2026 నాటికల్లా తమిళనాడును సొంతం చేసుకోవాలి' అంటూ తన పార్టీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చిన నేపథ్యంలో, తమిళనాడు రాజకీయాలనే కాదు, దక్షిణ బారత రాజకీయాలనూ ఈ ద్రావిడ కురుక్షేత్రం ఏ మలుపు తిప్పుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- ఏప్రిల్ 1 ఫూల్స్ డే: ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- మనుషులు అసలు ఈ భూమిపై ఎలా ఆధిపత్యం సాధించగలిగారు?
- మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- పిచ్చుకకూ ఓ స్మారక స్థూపం ఉంది.. ఎక్కడో తెలుసా?
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరు మార్చడానికి, హైదరాబాద్‌కు సంబంధం ఏమిటి
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










