వెక్కి వెక్కి ఏడ్చిన నారా చంద్రబాబు నాయుడు.. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’

ఫొటో సోర్స్, Youtube/Telugu Desam Party Official
అసెంబ్లీలో ప్రతిపక్షాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, ఇలాంటి అసెంబ్లీలోకి మళ్లీ అధికారంలోకి వచ్చాకే అడుగుపెడతాననిఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతటి ఘోరమైన సభను తాను ఇంత వరకు చూడలేదని, అధికార పార్టీ దీనిని కౌరవ సభలా నిర్వహిస్తోందని, ఆఖరికి ప్రతిపక్ష నేత కుటుంబంలోని మహిళలను కూడా సభలో ప్రస్తావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతా’ అంటూ వాకౌట్ చేశారు.
''నా భార్య రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న రాజకీయాల్లో ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రొటొకాల్ సమయంలో తప్ప ఆమె ఏ కార్యక్రమంలోనూ కనపబడేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు ఆమెకు తెలియదు. ఆవిడ పని ఆమె చూసుకుంటారు. నలుగురికి సాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఆమెకు మరొకటి తెలియదు. అలాంటి వ్యక్తిని కూడా డర్టీ పాలిటిక్స్‌కి లాగే పరిస్థితికి వచ్చారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం'' అని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్నారు.

మన ఇంటి ఆడవాళ్లని ఏదైనా అంటే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. సభను, సభ్యులను అదుపులో పెట్టాల్సిన స్పీకర్ తమ్మినేని తన గతాన్ని మర్చిపోయి వ్యవహరించారని, ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇది ధర్మానికి , అధర్మానికి జరుగుతున్న యుద్ధమని, ప్రజాక్షేత్రంలోనే దీన్ని తేల్చుకుంటామని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా తన మీదా, తన కుటుంబంపైనా ప్రభుత్వం దాడి చేస్తుందని ఆయన అన్నారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించడం తనకు కొత్త కాదని చంద్రబాబు అన్నారు.
''40 ఏళ్లు రాజకీయాల్లో ఉంది ఇలాంటి పరిస్థితులను చూడటానికా'' అని చంద్రబాబు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బూతులు మాట్లాడటం తమకు చేతకాక కాదని, విలువలు కట్టుబడి ఉన్నాం కాబట్టే క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.
''ఈ ధర్మపోరాటంలో ప్రజలు నాతో సహకరించాలి. ధర్మక్షేత్రంలో అధికార పార్టీతో తేల్చుకున్నాకే అసెంబ్లీలో అడుగు పెడతా'' అని చంద్రబాబు నాయుడు ప్రతిజ్జ చేశారు.

‘బండ బూతులు తిట్టారు’
గత రెండున్నరేళ్ల కాలంగా తనను బండ బూతులు తిట్టారని, తన జీవితంలో ఎన్నడూ ఇలాంటివి ఊహించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
తాను దేశం కోసమే పనిచేశాను తప్ప ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోలేదని అన్నారు.
నిండు కౌరవ సభలో ద్రౌపదికి పాండవుల సమక్షంలోనే అవమానం జరిగిందని, శ్రీకృష్ణుడు ఆదుకున్నప్పటికీ.. అది భరించరాని అవమానం అని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసునన్నారు. భస్మాసురుడు శివుడి వద్ద వరం తీసుకుని వరం ఇచ్చిన ఆయన తలపైనే చెయ్యిపెట్టాలని చూశాడని అన్నారు.
ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు గౌరవం లేని కౌరవ సభను తలపిస్తోందన్నారు.
ఒకసారి వైఎస్ రాజశేఖరరెడ్డి తన తల్లిని దూషించారని, అప్పుడు తాను గట్టిగా ప్రశ్నించానని, దీంతో తప్పు జరిగింది, క్షమించండి అని వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగారన్నారు.
ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నా భార్య విషయం తీసుకువచ్చారు, నా ప్రకటన చెప్పేందుకు సమయం ఇవ్వండి అని అడిగితే స్పీకర్ తనకు మైకు ఇవ్వలేదన్నారు.
తనకు జరిగిన అవమానాన్ని నివారించని స్పీకర్.. తనకు మైక్ ఇవ్వకుండా, తర్వాత ఇచ్చి కట్ చేసి అవమానించారని అన్నారు.
తన రికార్డులు బద్దలు కొట్టాలంటే సమయం పడుతుందని, ఇప్పుడు తనకు పదవి వచ్చి రికార్డులు సృష్టించాలని లేదన్నారు.
తనకు పదవులు అవసర్లేదని, ధర్మానికి అధర్మానికి ఇప్పుడు పోరాటం జరుగుతోందన్నారు. ఇది కలికాలమని, దుర్మార్గులు తాము చేసే తప్పుల్ని వేరేవాళ్లపై రుద్ది మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు.
ధర్మాన్ని కాపాడగలిగితే తాను ముందుకు వెళతానని, ధర్మం గెలుస్తుందో అధర్మం గెలుస్తుందో ప్రజా క్షేత్రంలోనే తెలుస్తుందన్నారు. తన కోసం ఎవరూ పనిచేయాల్సిన పనిలేదని, కొత్త రికార్డు క్రియేట్ చేయాలనో, మరో ఐదేళ్లు సీఎంగా ఉండాలనో తనకు లేదన్నారు.
‘మీరు నీతి నిజాయితీతో ఉంటే.. మీ భార్యల గురించి మాట్లాడితే ఎంత ఫీలవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి. అందరం మనుషులమే. అదే నా బాధ. అదే నా ఆవేదన. ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. ఏ సంక్షోభం అయినా సునాయాసంగా హ్యాండిల్ చేశాను’ అని చంద్రబాబు తన ప్రెస్ మీట్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- ఆంధ్రప్రదేశ్: దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్ష బీభత్సం, మనుషులు గల్లంతు... కొట్టుకుపోతున్న మూగజీవాలు
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- దుస్తులు తొలగించకుండా తాకినా లైంగికంగా వేధించినట్లే: సుప్రీంకోర్టు
- ఎవరు మీలో కోటీశ్వరులు: రూ. కోటి గెల్చుకున్న రాజా రవీంద్ర బీబీసీ అడిగిన 5 ప్రశ్నలకు ఏమని బదులిచ్చారు?
- తైవాన్ ‘పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- కేసీఆర్ ధర్నా చౌక్ బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది?
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















