భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?

ఫొటో సోర్స్, MINISTRY OF FOREIGN AFFAIRS
భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. దౌత్యపరంగా రెండు దేశాల మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. కానీ, చైనాలో 2022 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించడానికి ఇండియా మద్దతు ఇచ్చింది.
మరోవైపు, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ను దౌత్యపరంగా బహిష్కరించే ప్రయత్నాల్లో ఉంది అమెరికా.
భారత్-చైనా సరిహద్దుల్లో గత 19 నెలలుగా ఉద్రిక్తత నెలకొంది. ఇండియాతో సరిహద్దుల్లో చైనా సైనిక స్థావరాలను మరింత పటిష్టం చేస్తోందని పలు మీడియా కథనాలు కూడా పేర్కొన్నాయి.
అయితే, గత శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్-యి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లు ఒక వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించే విషయంలో చైనా కు భారత్ మద్దతు ఇచ్చింది.
రష్యా, చైనా, ఇండియా విదేశాంగ మంత్రులు ఈ సమావేశం తర్వాత ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 2022లో చైనాలో వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల నిర్వహణకు మంత్రులు ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియాకు 'గ్లోబల్ టైమ్స్' ప్రశంసలు
వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 13 వరకు జరిగే వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు చైనా ఆతిథ్యం ఇవ్వనుంది.
చైనాలో ఈ క్రీడా కార్యక్రమాలను దౌత్యపరంగా బహిష్కరించే విషయాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చెప్పారు.
బైడెన్ ప్రభుత్వం తన ఆటగాళ్లను చైనాకు పంపుతుంది కానీ, అధికారుల బృందాన్ని మాత్రం పంపకూడదన్న ఆలోచనలో ఉంది.ఈ విషయంలో ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ కూడా అమెరికాతో చేతులు కలపవచ్చని అంటున్నారు.
వింటర్ ఒలింపిక్స్ కు భారతదేశపు మద్దతు పై చైనా ప్రభుత్వ అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ఒక కథనం రాసింది. ‘‘భారత్ అమెరికాకు సహజ మిత్రపక్షం కాదన్న విషయాన్ని ఈ ఘటన రుజువు చేసింది’’ అని ఆ కథనం పేర్కొంది.
చైనాకు మద్ధతు విషయంలో భారతదేశపు చొరవను 'గ్లోబల్ టైమ్స్' కొనియాడింది.
''చైనాతో ఉద్రిక్తతల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం అమెరికాకు దగ్గరైంది. ఈ సమయంలోనే చైనాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశం సోషల్ మీడియా యూజర్లనే కాదు, అనేక దేశాలను కూడా ఆశ్చర్యపరిచింది'' అని 'గ్లోబల్ టైమ్స్' రాసింది.
"రెండు దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత ఉన్నా, మొత్తం ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినలేదని ఇది నిరూపిస్తోంది. రెండు దేశాలకు అనేక విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP CONTRIBUTOR
షాకింగ్ ఎత్తుగడ
"వింటర్ ఒలింపిక్స్‌లో చైనాకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశం దౌత్యపరంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ని ప్రదర్శించింది. గతంలో అమెరికావైపు మొగ్గు చూపినప్పటికీ, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలన్నింటిలోనూ అమెరికాతో కలిసి ఉండలేమని భారత్ నిరూపించింది. వాషింగ్టన్‌కు న్యూదిల్లీ సహజ మిత్రురాలు కాదని చాలా స్పష్టంగా కనిపిస్తోంది'' అని 'గ్లోబల్ టైమ్స్' రాసుకొచ్చింది.
"చైనాతో ఉద్రిక్తతలను పరిశీలిస్తామని, ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరత్వాన్ని తీసుకువస్తామని భారతదేశం సానుకూల సందేశాన్ని పంపింది" అని సింఘువా యూనివర్శిటీలో నేషనల్ స్ట్రాటజిక్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ 'గ్లోబల్ టైమ్స్' తో అన్నారు.
సమస్యలను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
''వింటర్ ఒలింపిక్స్ విషయంలో భారతదేశపు వైఖరి జపాన్, ఆస్ట్రేలియా లాగా అమెరికాకు తమ్ముడిలా వ్యవహరించే ఉద్దేశంతో లేదని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా సహకారంతో కాకుండా, భారతదేశం తనంతట తాను శక్తిగా ఎదగాలని కోరుకుంటోంది'' అని 'గ్లోబల్ టైమ్స్' రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు మద్దతు?
"చైనాలో వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తామని ప్రజాస్వామ్య దేశాలలో చర్చ ఊపందుకుంటున్నప్పుడు, చైనా ప్రభుత్వ పత్రిక మోదీ ప్రభుత్వ వైఖరిని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ ఎందుకు కథనాలు రాస్తోంది? అని భారత్‌కు చెందిన వ్యూహ నిపుణుడు బ్రహ్మ చెలాని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ క్రీడల్లో అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు అసలు ఆహ్వానమే లేకపోతే ఇక బహిష్కరణ చర్చ ఎక్కడిదని ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రశ్నించింది.
"ఒలింపిక్ నిబంధనల ప్రకారం, క్రీడలలో పాల్గొనడానికి నాయకులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) నుంచి ఆహ్వానం తప్పనిసరి. ఈ గేమ్‌కు అమెరికా లేదా పశ్చిమ దేశాల నేతలను ఆహ్వానించే ఆలోచన చైనాకు లేదు'' అని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.
డిసెంబర్ 9, 10 తేదీల్లో జరగబోయే డెమొక్రసీ కాన్ఫరెన్స్‌కు చైనా, రష్యాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పంపలేదు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 110 దేశాలకు ఆహ్వానం అందింది. భారత్, పాకిస్తాన్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
కానీ, రష్యా, చైనా, టర్కీ, బంగ్లాదేశ్‌తో సహా అనేక దేశాలకు పిలుపు వెళ్లలేదు.
ఇవి కూడా చదవండి:
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- యూరోపియన్ దేశాల్లో కోవిడ్ ఆంక్షలపై తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను వ్యాక్సీన్లు ఎదుర్కోగలవా? మళ్లీ లాక్డౌన్ తప్పదా?
- కరోనావైరస్: జపాన్‌లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- కోవిడ్ వ్యాక్సీన్: రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తోందా?
- కరోనావైరస్ను నిరోధించే శక్తి కొందరిలో సహజంగా ఉంటుందా... ఈ శక్తి మరింత మెరుగైన వ్యాక్సీన్‌కు దారి చూపిస్తుందా?
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
- ‘మా నాన్నను ఐసీయూలో పెట్టారు.. ఉదయం దానికి మంటలంటుకున్నాయి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









