అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం: 'అయ్యా, మమ్మల్నందరినీ ఇక్కడే పాతిపెట్టి, మా భూమిని తీసుకోండి'

మాంఝా బర్హతా నేల సారవంతమైనది. అక్కడ నీటి కొరత లేదు.

ఫొటో సోర్స్, ROHIT UPADHYAY

ఫొటో క్యాప్షన్, మాంఝా బర్హతా నేల సారవంతమైనది. అక్కడ నీటి కొరత లేదు.
    • రచయిత, రోహిత్ ఉపాధ్యాయ
    • హోదా, బీబీసీ కోసం

అయోధ్య నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ మాంఝా బర్హతాలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని నిర్మిస్తామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

విగ్రహ నిర్మాణానికి భూసేకరణ కూడా జరుగుతోంది. అయితే ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని గ్రామస్థులు వాపోతున్నారు.

2021 డిసెంబర్ 1న అయోధ్యలోని మహర్షి వేద విజ్ఞాన విద్యాపీఠం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

ఆ రోజు మాంఝా బర్హతా గ్రామ పంచాయతీకి చెందిన అరవింద్ కుమార్ యాదవ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు. అరవింద్ కుమార్ ఒక రైతు.

కేసు వివరాలు

ఫొటో సోర్స్, Rohit Upadhyay

ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని అరవింద్ కుమార్ వివరించారు. ఇంటికి సమీపంలో ఉన్న పొలాలను దున్నుకోవాలని అరవింద్ కుమార్ పోలీసులను అడిగారు. అందుకు వాళ్లు అనుమతించారు. అరవింద్ ట్రాక్టర్‌తో పొలాలను దున్నుతున్న సమయంలో ఇద్దరు పోలీసులు గట్టు మీదే కుర్చుని ఆయనపై నిఘా పెట్టారు.

నాలుగు వైపులా పంట ఏపుగా పెరిగింది. మధ్యలో ఉన్న కొన్ని పొలాల్లో ఇప్పటికే వరి అధిక దిగుబడినిచ్చింది. తదుపరి పంటకు భూములను సిద్ధం చేయాల్సి ఉంది.

మాంఝా బర్హతా నేల సారవంతమైనది. నీటి కొరత లేదు. అందుకే అక్కడి రైతులు ఒకే సీజన్‌లో అనేక రకాల పంటలను సాగు చేస్తారు.

ఆరోజు సాయంత్రం నాలుగు అవుతుండగా, పోలీసులిద్దరూ అక్కడి నుంచి కదిలారని అరవింద్ చెప్పారు.

"చూడండి, వ్యవసాయానికి ఇది ఎంతో సారవంతమైన భూమి. మా తాతలు, తండ్రులు ఇక్కడే ఉంటూ, వ్యవసాయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని నాశనం చేయాడానికి పూనుకుంది. ప్రభుత్వంతో మాట్లాడకుండా మమ్మల్ని అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) జీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా నన్ను గృహనిర్బంధంలో ఉంచుతున్నారు" అని అరవింద్ వాపోయారు.

"ప్రపంచంలోనే అతి పెద్ద రాముడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది యోగి జీ ఆలోచన. ఆ విగ్రహం ఎత్తు 251 మీటర్ల ఉంటుంది అంటున్నారు. అందుకే మా భూములు లాక్కుంటున్నారు" అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, అయోధ్య రామ మందిరం అడుగున 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్

రాముడి విగ్రహానికి ఏర్పాట్లు

2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తరువాత రెండు నెలలకు, 2020 జనవరి 14న అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

"రాముడి విగ్రహం తయారుచేయడానికి మాంఝా బర్హతా గ్రామ పంచాయతీ పరిధిలోని నేవుర్ కా పూర్వా, బన్వారీ పూర్వా, ఛోటీ ముజహానియా, బడీ ముజహానియా, ధర్మూ కా పూర్వా, ఖాలే కా పూర్వా, మదర్హియా గ్రామాలకు చెందిన 85.977 హెక్టార్ల భూమిని ప్రభుత్వం సేకరించాలనుకుంటోంది" అని ఆ ప్రకటనలో తెలిపారు.

"ఈ నోటిఫికేషన్ చూసి గ్రామస్థులందరూ కలవరపడ్డారు. మేమంతా రైతులం. వ్యవసాయం, పశుపోషణ ఆధారంగా జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం మా భూమిని లాక్కుంటే, మేమెక్కడికి వెళ్తాం? దీని గురించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, మాకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు. పైగా, భూసేకరణకు సమ్మతి ఇవ్వాలని ప్రభుత్వం మాపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీని తరువాత, 2020 ఫిబ్రవరి 28న మేం హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం" అని అరవింద్ కుమార్ తెలిపారు.

"తరతరాలుగా మేం మాంఝా బర్హతాలోనే నివసిస్తున్నామని, స్వతంత్రానికి ముందే మేమిక్కడ జమీందార్ల భూముల్లో జనాభాగా స్థిరపడ్డామని హైకోర్టుకు తెలిపాం. కానీ సర్వే జరగకపోవడంతో గ్రామస్థుల జనాభా నమోదు కాలేదు. 1992లో మహర్షి రామాయణ విద్యాపీఠ్ ట్రస్ట్ వారు రామాయణ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మాంఝా బర్హతాలో చాలా భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. విశ్వవిద్యాలయం కోసం మా పెద్దలు సంతోషంగా భూమిని అమ్మేశారు. కానీ ట్రస్ట్ విశ్వవిద్యాలయాన్ని నిర్మించలేదు. భూమినీ స్వాధీనం చేసుకోలేదు. అయితే, 1984 నుంచి భూ సర్వే గానీ, కన్సాలిడేషన్ గానీ జరగకపోవడంతో మాది ఎంత భూమి ట్రస్టు దగ్గర ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, రోడ్డు ఎక్కడివరకు ఉంది, డ్రైనేజ్ ఎక్కడ ఉంది లాంటి వివరాలు తెలియడం లేదు. సంవత్సరాలుగా, ఈ గ్రామంలో జనాభా కూడా పెరిగింది. ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం సర్వే జరిపి, 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి భూమిని సేకరించాలని కోరాం" అని అరవింద్ వివరించారు.

రైతుల వాదనలు విన్న తరువాత, 2020 జూన్ 16న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ చట్టం (2013) ప్రకారం రైతుల భూములను సర్వే చేసి, ఆ తరువాత భూసేకరణ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఇది జరిగి ఏడాది గడిచినా ప్రభుత్వం రైతుల సమ్మతి తీసుకోలేదని, పరిహారంపై ఎలాంటి చర్చ జరగలేదని, సర్వే చేయలేదని అరవింద్ అంటున్నారు.

పైగా, ప్రభుత్వం గ్రామస్థులను విధవిధాలుగా హింసించడం ప్రారంభించిందని, ఐపీసీ సెక్షన్ 188 కింద పేర్లు తెలిసిన 15 మందిపై, 200 మంది అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారని చెప్పారు.

తనపై కూడా గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేశారని అరవింద్ కుమార్ యాదవ్ చెబుతున్నారు.

ఇష్టారాజ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర వేదనకు గురైన గ్రామస్థులు మళ్లీ హైకోర్టు తలుపు తట్టారు.

అరవింద్ కుమార్ యాదవ్‌

ఫొటో సోర్స్, ROHIT UPADHYAY

ఫొటో క్యాప్షన్, అరవింద్ కుమార్ యాదవ్‌

హైకోర్టు షోకాజ్ నోటీసులు ఇచ్చినాగానీ...

కోర్టు ధిక్కారానికి కారణాలు తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2021 జూలై 5న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, 2022 ఫిబ్రవరి నాటికి భూసేకరణ సర్వే పూర్తి చేయాలని గడువు విధించింది.

"కోర్టు ఫిబ్రవరి వరకు గడువు ఇస్తే మాత్రం ఏం చేయగలం? మరో సంవత్సరం గడువు కావాలని కోర్టును అడుగుతాం. ఈ పనులన్నీ చేయడానికి సమయం పడుతుంది" అని అసిస్టెంట్ రికార్డ్స్ ఆఫీసర్ (ఏఆర్ఓ) భాన్ సింగ్ అన్నారు.

కాగా, 1984 నుంచి సర్వే జరుగుతోంది. గత 35 ఏళ్లల్లో ఒక గ్రామపంచాయితీ సర్వే పూర్తి కాలేదా? అని ఆయన్ను ప్రశ్నించాం.

"దీనికి ఎంత సమయం పడుతుందో జనాలకి తెలీదు. వాస్తవానికి, హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు భూమి ఇవ్వడానికి మహర్షి మహేశ్ యోగి ట్రస్ట్ అంగీకరించింది. ఇప్పుడు హౌసింగ్ డెవలపర్లు భూమిని స్వాధీనం చేసుకుంటుంటే, దాన్ని వదిలిపెట్టడానికి ప్రజలు ఇష్టపడట్లేదు" అని భాన్ సింగ్ చెప్పారు.

అయితే, సర్వే సెటిల్‌మెంట్ లేకుండా హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటుందని అడుగగా, "అది హౌసింగ్ డెవలప్‌మెంట్‌కే తెలియాలి. అది వారి పని" అని ఆయన అన్నారు.

ప్రభుత్వం భూసేకరణ బాధ్యతను అయోధ్య హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు అప్పగించింది.

మాంఝా బర్హతాలో విగ్రహా ప్రతిష్ట కోసం సేకరించిన భూమిలో 70 శాతం మహర్షి రామాయణ విద్యాపీఠ్ ట్రస్ట్ పేరిట ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 56.82 హెక్టార్ల భూమిని ఇవ్వడానికి హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎంఓయుపై ట్రస్ట్ సంతకం చేసింది.

"మాంఝా బర్హతాలో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. గ్రామస్థులు స్వచ్ఛందంగా తమ భూములను ఇస్తున్నారు. ఎవరూ నిరసనలు వ్యక్తం చేయడం లేదు" అని హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓం ప్రకాష్ పాండే చెప్పారు.

రైతులందరూ స్వచ్ఛందంగా భూమి ఇస్తున్నారని, ఎవరూ నిరసన చేయడం లేదని హౌసింగ్ డెవలప్‌మెంట్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కూడా వెల్లడించారు.

సర్వే జరగకుండా భూమిని ఎలా సేకరిస్తారని ప్రవీణ్ కుమార్‌ను అడిగాం.

"సర్వే జరగకపోతే, మ్యాప్ ఏ రూపంలో ఉందో దాని ఆధారంగానే స్వాధీనం చేసుకుంటాం" అని ఆయన చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్

'కొత్త అయోధ్య నిర్మాణానికి ప్రణాళిక'

మహర్షి రామాయణ విద్యాపీఠ్‌ ట్రస్ట్‌కు చెందిన ఒక ట్రస్టీ సాలిక్ రామ్‌ మిశ్రా ఈ అంశంపై మాట్లాడుతూ, "ఒక కొత్త అయోధ్యను ఏర్పాటు చేయాలన్నది మహర్షి జీ ఆలోచన. పెద్ద ప్లాటులపై మాకు హక్కు ఉంది కానీ కొన్ని చిన్న చిన్న ప్లాటుల మీద లేదు. మేం చాలాసార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం. పోలీసులు మాతో వచ్చి కొన్నిసార్లు మాకు అనుకూలంగా మాట్లాడేవారు. కొన్నిసార్లు మా భూములు కబ్జా చేసినవారికి అనుకూలంగా మాట్లాడేవారు. మంచి ధర చెల్లించి భూమిని కొనుగోలు చేశాం. చెక్కుల ద్వారా బకాయిలు చెల్లించాం. భూమి విలువ పెరగడంతో గ్రామస్థుల ఉద్దేశాలు మారిపోయాయి" అని అన్నారు.

"స్కూలు నిర్మిస్తారన్న ఆశతో గ్రామస్థులు మహర్షి మహేశ్‌ యోగి ట్రస్టుకు భూములను విక్రయించారు. ఊరి చుట్టుపక్కల బడి లేకపోవడంతో, తమ పిల్లలు బడికెళ్లి చదువుకోవాలని వారు ఆశపడ్డారు. కానీ, 30 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ స్కూలు నిర్మాణం జరగలేదు" అని మాంఝా బర్హతా గ్రామానికి చెందిన 70 ఏళ్ల రామ్ అవధ్ యాదవ్ చెప్పారు.

"ప్రభుత్వం మమ్మల్ని అన్ని వైపుల నుంచీ వేధిస్తోంది. నా భార్య ఇక్కడ గ్రామపెద్దగా వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు నన్ను బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) ద్వారా, కొన్నిసార్లు సెక్రటరీ ద్వారా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి పిలిపిస్తుంటారు. గ్రామస్థుల నుంచి భూసేకరణకు సమ్మతిని తీసుకురమ్మని పురమాయిస్తుంటారు. సమ్మతి తెలుపమని నాపై ఒత్తిడి తెచ్చారు. నేను బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది" అని 37 ఏళ్ల రామచంద్ర యాదవ్ వాపోయారు.

ప్రభుత్వం గ్రామస్థుల పట్ల నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని హైకోర్టులో రైతుల తరపు న్యాయవాది ఓంకార్ నాథ్ తివారీ అన్నారు.

అరవింద్ కుమార్ ఇల్లు

ఫొటో సోర్స్, Rohit Upadhyay

హింసించి సమ్మతి తీసుకుంటున్నారా?

ప్రభుత్వం, రైతులపై విధవిధాలుగా ఒత్తిడి తెచ్చి భూసేకరణకు సమ్మతి తీసుకుంటోందని ఓంకార్ నాథ్ తివారీ అంటున్నారు.

"రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వం చెబుతోందిగానీ, వాస్తవానికి వారిని అనేక రకాలుగా హింసించి బలవంతంగా ఒప్పిస్తోంది. హొమ్‌గార్డ్‌గా పనిచేస్తున్నవారికి ఉద్యోగం తొలగించినట్లు కమాండెంట్ నుంచి ఆదేశాలు తీసుకువచ్చి చూపిస్తున్నారు. భార్యాబిడ్డలను పోషించుకోవాలంటే ఉద్యోగం కావాలి. గత్యంతరం లేక వెంటనే మా భూములు తీసుకోండి అని ఇచ్చేస్తున్నారు. ప్యూన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. అకౌంటెంట్‌గా పనిచేస్తున్నవారికి అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఉద్యోగం లేకుండా బతకడం కష్టం. కుటుంబాన్ని పోషించాలి. అందుకే బలవంతంగా భూసేకరణకు అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం భూమిలో ఒక్క అంగుళం వాడుకున్నా, మొత్తం భవనాన్ని కూల్చివేస్తామని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు లాఠీలు పట్టుకుని మరీ ఒప్పిస్తున్నారు" అని ఆయన అన్నారు.

భూమిపై నాలుగు రెట్లు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాంటప్పుడు ఎందుకు ఏకాభిప్రాయం కుదరడం లేదని తివారీని అడిగాం.

"నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. కానీ, 2017 నుంచి ఇప్పటి వరకు భూమి సర్కిల్‌ రేటు పెరగలేదు. ప్రతి సంవత్సరం కనీసం 10 శాతం పెరగాలి. ద్రవ్యోల్బణం దృష్ట్యా అలా పెరగడం అవసరం కూడా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది. ఎందుకంటే, ఆ చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించడం ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని నమ్మజూపుతోంది. కానీ, ఎలా సమ్మతి తీసుకుంటున్నారో నేను ముందే వివరించాను" అని ఆయన అన్నారు.

రామ్ యాదవ్

ఫొటో సోర్స్, Rohit Upadhyay

ఫొటో క్యాప్షన్, రామ్ యాదవ్

'ఈ ప్రక్రియ అంత సులభం కాదు'

"2013 భూసేకరణ చట్టం ప్రకారం యజమానుల సమ్మతిని పొందడం, సామాజిక ప్రభావాన్ని అంచనా వేయడం, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం అంత తేలికైన ప్రక్రియ కాదు. చట్ట ప్రకారం భూమిపై నష్టపరిహారం కూడా చెల్లించాలి. కానీ ప్రభుత్వం చట్టాలను పాటించట్లేదు" అని డేటా రీసెర్చ్ ఏజెన్సీ అయిన ల్యాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్ యొక్క లీగల్ అసోసియేట్ ముక్తా జోషి అభిప్రాయపడ్డారు.

'ల్యాండ్ కాన్‌ఫ్లిక్ట్ వాచ్' డేటా ప్రకారం 35 శాతం కంటే ఎక్కువ భూసేకరణ కేసులు వివాదాస్పదంగా ఉన్నాయి. సరైన నష్టపరిహారం చెల్లించకపోవడం, బలవంతంగా ఖాళీ చేయించడం, పునరావాస ఏర్పాట్లు చేయకపోవడం సర్వసాధారణంగా మారింది.

వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడిన వారి నుంచి భూమిని లాక్కుంటే జీవనం ఎలా సాగుతుందనే ఆందోళన గ్రామస్థులకు ఉంది. బదులుగా మరొకచోట భూమిని ఇస్తారా? లేక కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తారా అనే విషయాలు స్పష్టంగా తెలీవు.

దీనిపై ప్రభుత్వం నుంచిగానీ యంత్రాంగం నుంచిగానీ ఎలాంటి లిఖితపూర్వక హామీ రాకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

"మా భూములు పోతే ఏం చేస్తాం, ఎక్కడ ఉంటాం! ప్రభుత్వంతో పోరాడలేం. కేసులు పెట్టలేం. అయ్యా, మమ్మలందరినీ ఇక్కడే పాతిపెట్టి, అప్పుడు మా భూమిని తీసుకోండి" అని 60 ఏళ్ల రామ్ బహదూర్ వాపోయారు.

వీడియో క్యాప్షన్, అయోధ్య భూమి పూజ: ఇన్నాళ్లకు రామ జన్మభూమికి విముక్తి కలిగింది - నరేంద్ర మోదీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)