ఇ-స్పోర్ట్స్: ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడి కోటీశ్వరులు కావొచ్చు

భారతదేశంలో 43 లక్షల మంది ఆన్‌లైన్ గేమర్‌లు ఉన్నారని అంచనా
ఫొటో క్యాప్షన్, భారతదేశంలో 43 లక్షల మంది ఆన్‌లైన్ గేమర్‌లు ఉన్నారని అంచనా

మహేశ్‌కుమార్ బ్రహ్మదత్త పదిహేనేళ్ల వయసులో ఆన్‌లైన్ గేమింగ్ ప్రారంభించారు. భవిష్యత్తులో తాను భారతదేశంలోని అగ్రశ్రేణి ఇ-స్పోర్ట్స్ ప్లేయర్‌లలో ఒకడిగా నిలుస్తానని ఆరోజు బ్రహ్మదత్త ఊహించలేదు.

ఆన్‌లైన్ గేమింగ్‌లో బ్రహ్మదత్తకు అభిరుచి, ప్రతిభ ఉన్నాయిగానీ వాటి కంటే ముఖ్యంగా ఆయనకు ఒక మంచి మొబైల్ ఫోన్ కావాల్సి వచ్చింది.

గుజరాత్‌లోని చిన్న ఊరు హిమత్‌నగర్‌లో ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేకపోవడం, తరచూ కరెంట్ పోతుండడంతో తన వద్ద ఉన్న చౌక మొబైల్ ఫోను తరచూ మొరాయించేది.

మరోవైపు, తమ ఒక్కగానొక్క కొడుకు ఈ ఆన్‌లైన్ గేమింగ్ అభిరుచిని పెంపొందించుకోవడం బ్రహ్మదత్త తల్లిదండ్రులకు నచ్చలేదు.

బ్రహ్మదత్తకు ఇప్పుడు 23 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన్ను అందరూ ప్రిన్స్ అని పిలుస్తున్నారు.

"నేనెప్పుడు ఆన్‌లైన్‌లో గేమ్ ఆడినా దెబ్బలాడేవారు. అది ఆపి, చదువుకోమని చెప్పేవారు. ఒక పోటీలో బహుమతి రూపంలో నేను డబ్బు గెలుచుకునేవరకూ వాళ్లకు నా అభిరుచి అర్థం కాలేదు. ఆ సొమ్ము మా నాన్న అప్పులు తీర్చడానికి సహాయపడింది. ఆ తరువాత, వాళ్లు ఒప్పుకున్నారు. సరే, నువ్వు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకో అని చెప్పారు" అంటూ ప్రిన్స్ వివరించారు.

వీడియో క్యాప్షన్, వీడియో గేమ్స్ వ్యసనం.. ఇవే లక్షణాలు

పబ్‌జీలో అడుగుపెట్టి..

2019లో PUBG (ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్) గేమ్‌లో మొబైల్ క్లబ్ ఓపెన్ (PMCO) పోటీలో పాల్గొన్నారు ప్రిన్స్.

ఈ పోటీలో ప్రిన్స్ తన బృందంతో మూడవ స్థానంలో నిలిచారు. బహుమతిగా 20 వేల డాలర్లు అంటే ఇవాల్టి రేటులో సుమారు రూ.14,88,000 గెలుచుకున్నారు.

పబ్‌జీలో గెలుచుకున్న దాన్లో కొంత మొత్తాన్ని ప్రిన్స్ తన తండ్రికి అందించారు. తమ ఊర్లో చిన్న నెయ్యి దుకాణం నడుపుతూ అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఆయనకు, కొడుకు అందించిన డబ్బులు చేయూతనిచ్చాయి. అప్పులు తీర్చగలిగారు. మిగిలిన సొమ్మును ప్రిన్స్ స్టాక్ మార్కెట్‌లో పెట్టారు.

కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందిన ప్రిన్స్ చదువు మధ్యలో సమయం దొరికినప్పుడల్లా ఇ-స్పోర్ట్స్ టోర్నమెంటుల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయన ఒక టీమ్‌ను తయారుచేసుకున్నారు. అందులో స్ప్రెగోడ్, అల్లాదీన్, సారంగ్ వంటి పేర్లతో ఆటగాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ ప్రిన్స్ ఆన్‌లైన్‌లోనే కలిశారు.

2020 ప్రారంభంలో ఈ బృందాన్ని గ్రాపెల్ క్రియేషన్ ఎక్స్ (జీసీఎక్స్) కంపెనీ కొనుగోలు చేసింది. కంపెనీ యజమాని సంతోష్ పచేటి ఈ బృందానికి "7సీ" అని పేరు పెట్టారు. భారతదేశంలో ఉన్న ఏడు పెద్ద నదులకు గుర్తుగా ఆ పేరు పెట్టారు. 7ను అదృష్ట సంఖ్యగా పరిగణించడం కూడా పరిపాటి.

ఏదైనా కంపెనీ ఇలా ఒక ఇ-స్పోర్ట్స్ బృందాన్ని కొనుగోలు చేసినప్పుడు, వారికి ఆర్థికంగా మద్దతునందించడమే కాకుండా, గేమింగ్ పరికరాలు, కంప్యూటర్‌లు, కోచ్‌లను కూడా ఏర్పాటుచేస్తుంది.

బదులుగా, ఈ బృందం గెలిచిన బహుమతి సొమ్ములో కొంత వాటా తీసుకుంటుంది.

కాగా, 2020 సెప్టెంబర్‌లో భారత్, చైనా సరిహద్దులో లద్దాఖ్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తడంతో పబ్‌జీని భారత ప్రభుత్వం నిషేధించింది. దానితో పాటు 117 చైనీస్ అప్లికేషన్‌లను నిషేధించింది.

దీంతో 2020 డిసెంబర్‌లో చైనీస్ పబ్లిషర్ 'క్రాఫ్టన్' బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో పబ్‌జీ భారతీయ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

భారతదేశంలో వారానికి సగటున 3.6 గంటల పాటు ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్‌లను వీక్షిస్తుంటారని అంచనా.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో వారానికి సగటున 3.6 గంటల పాటు ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్‌లను వీక్షిస్తుంటారని అంచనా.

విలాసవంతమైన గేమింగ్ హౌస్‌లోకి అడుగుపెట్టారు

ఈ సంవత్సరం ప్రిన్స్ గేమింగ్ కెరీర్‌లో అతిపెద్ద సంఘటన చోటుచేసుకుంది. జీసీఎక్స్‌ను సింగపూర్‌కు చెందిన ఇ-స్పోర్ట్స్ కంపెనీ ఎంపవర్స్ (Ampverse) కొనుగోలు చేసింది.

ఈ డీల్ ఖరీదెంతో ఇప్పటి వరకు బయటకు రాలేదుగానీ, ఆ కంపెనీ ఈ భారతీయ బృందానికి అత్యుత్తమ సౌకర్యాలు అందించగలదని సమాచారం.

డీల్ ప్రకారం, 7సీ జట్టులోని నలుగురు భారతీయ ఆటగాళ్లు 2021 ఆగస్టులో విలాసవంతమైన గేమింగ్ హౌస్‌కి మారారు.

పూణెలో ఉన్న ఈ ఖరీదైన ఆరు గదుల విల్లాలో లేటెస్ట్ గేమింగ్ టెక్నాలజీ, హై-స్పీడ్ ఇంటర్నెట్‌లతో పాటు ఆటగాళ్ల కోసం షెఫ్, ఇతర సహాయకులు కూడా ఉంటారు.

ఈ ఆటగాళ్లకు కోచ్, పెర్ఫార్మన్స్ అనలిస్ట్, పర్సనల్ ట్రైనర్, 'సోషల్ అంబాసిడర్‌'లను కూడా ఏర్పాటుచేశారు. వీరు ఆన్‌లైన్ కంటెంట్‌ని సృష్టించి, 7సీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తారు.

"వారికి చాలా సామర్థ్యం ఉంది. సరైన వనరులు, మద్దతు అందిస్తే 7సీ అత్యంత విజయవంతమైన గేమింగ్ టీమ్‌గా తయారవుతుందన్న నమ్మకం మాకుంది. ఈ బృందం భారతదేశ యువతను ప్రతిబింబించే లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా మారే అవకాశం ఉంది" అని ఎంపవర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ చార్లీ బెయిలీ అన్నారు.

7C జట్టు సభ్యులు. మధ్యలో బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ప్రిన్స్.

ఫొటో సోర్స్, CREDIT: 7SEA

ఫొటో క్యాప్షన్, 7C జట్టు సభ్యులు. మధ్యలో బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ప్రిన్స్.

జీవితాన్ని మార్చే అవకాశాలు

ఈమధ్య కాలంలో, 7సీ బృందం ఇండియా టుడే దంగల్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి స్థానాన్ని, స్కైస్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 3.0లో రెండవ స్థానాన్ని గెలుచుకుంది.

"నా లక్ష్యం నంబర్ వన్, నంబర్ టు లేదా నంబర్ త్రీ స్థానం పొందడం కాదు. ఆటలో గెలవడమే నాకు ముఖ్యం. అదే నాకు ఊపిరి" అని ప్రిన్స్ అంటారు.

ప్రిన్స్ విశ్వాసం, ఆశయం కొత్త తరం భారతీయ గేమర్‌ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. వీరికి ఇ-స్పోర్ట్స్ అనేది జీవితాన్నే మార్చే అవకాశాల పుట్ట.

వీడియో క్యాప్షన్, వీడియో గేమ్స్ ఆడే వయసులో బైక్ రేసింగ్... పోటీల్లో దూసుకుపోతున్న కోయంబత్తూరు కుర్రాడు

కంపెనీలు ప్రతిభావంతులను ఎలా వెతికి పట్టుకుంటాయి?

ఎంపవర్స్ లాంటి కంపెనీలు ప్రతిభావంతులను ఎలా వెతికి పట్టుకుంటాయి, వారి ప్రతిభను ఎలా విజయవంతం చేస్తాయన్నది ఆసక్తికరమైన అంశం.

ఎంపవర్స్ కంపెనీని 2019 సంవత్సరంలో స్థాపించారు. ఈ రోజు ఈ కంపెనీ భారతదేశం, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలలో 11 ప్రొఫెషనల్ ఇ-స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకుంది.

2020లో ఈ కంపెనీ థాయ్‌లాండ్ నుంచి బేకన్ టైమ్ అనే జట్టును కొనుగోలు చేసింది. ఒక ఏడాది తరువాత, ఈ జట్టు ప్రో లీగ్‌ను గెలుచుకుంది. దాని అభిమానుల సంఖ్య పది లక్షల నుంచి ఒక కోటికి పెరిగింది.

ఆన్‌లైన్ గేమింగ్‌లో ఈ బృందం 15 లక్షల డాలర్లకు పైగా సంపాదించింది. అంటే దాదాపు రూ. 11 కోట్ల 16 లక్షలు.

18 నెలల్లో 7సీని భారతదేశంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా మార్చాలని ఎంపవర్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

"ఇది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీ" లాంటిదేనని బెయిలీ అంటారు. గతంలో ఆయనకు యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ డిజిటల్‌కి హెడ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

"సంగీత పరిశ్రమలో వస్తున్న కొత్త కొత్త బ్యాండ్‌లను వింటూ, వాటిని విశ్లేషిస్తూ మరో జస్టిన్ బీబర్ లేదా రిహానాలను కనుగొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చేయడానికి ఈ పరిశ్రమలో ఉన్న ప్రతిభ గురించి అన్ని విషయాలూ తెలియాలి. అలాంటి వ్యక్తులను ఈ పనికోసం నియమించుకుంటాం. అలాగే, గేమింగ్‌లో కూడా కంపెనీలు టాలెంట్ హంట్ చేస్తాయి" అని ఆయన వివరించారు.

ఎంపవర్స్ టాలెంట్ హంట్ టీమ్ ప్రతిభావంతులైన గేమర్లను కనుగొనడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తుంది. అనేక అంతర్గత సాధనాలను ఉపయోగించి ఆటగాళ్ల పనితీరును కొలుస్తారు.

ప్లేయర్ల గేమింగ్ సామర్థ్యాలతో పాటు వారికున్న అభిమానులపై కూడా ఎంపవర్స్ దృష్టి పెడుతుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి డేటాను సేకరించడం ద్వారా సబ్‌స్క్రైబర్ గ్రోత్, ఎంగేజ్‌మెంట్ రేటును పోల్చి చూస్తుంది.

సంప్రదాయ క్రీడల్లో ప్రతిభను వెలికితీయడానికీ, దీనికీ పెద్ద తేడా లేదని బెయిలీ అంటారు.

ఇతర క్రీడల్లాగే, ఇ-స్పోర్ట్స్ జట్టు విజయం కూడా జట్టు సభ్యులందరిపై ఆధారపడి ఉంటుంది.

7సీ బృందం "స్క్రమ్" పద్ధతిని ఉపయోగిస్తుంది. ఇది సాధారణంగా ఐటీ కంపెనీలు ఉపయోగించే టీమ్ బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్.

"ఏకాగ్రతతో ఆడగల సామర్థ్యం కోసం మేం అన్వేషిస్తుంటాం. ఈ గేమ్‌లు చాలా వేగవంతమైనవి. ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది సాంప్రదాయ స్పోర్ట్స్ టోర్నమెంట్ లాగా ఉండదు. ఇక్కడ రోజంతా ఒకే గేమ్ ఆడాల్సిన అవసరం ఉండదు. అయితే, ఒక్కోసారి ఇ-స్పోర్ట్స్ ప్లేయర్‌లు కూడా రోజుకు 9 గంటలు ఆడాల్సి ఉంటుంది" అంటూ బెయిలీ చెప్పుకొచ్చారు.

గేమ్ ఆడుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో ఇ-స్పోర్ట్స్ ప్లేయర్లకు అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి

ఇ-స్పోర్ట్స్‌లో భారతదేశం ఉత్సాహవంతమైన, అధిక వృద్ధి రేటు కలిగిన మార్కెట్ అని బెయిలీ అన్నారు.

మొబైల్ గేమింగ్‌లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అయిదు దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ గేమింగ్‌లో భారతదేశం 13% వాటాను కలిగి ఉంది.

భారతదేశంలో 43 లక్షల మంది ఆన్‌లైన్ గేమర్‌లు ఉన్నారని అంచనా. వీరిలో చాలామంది సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నావారు. వారానికి సగటున 3.6 గంటల పాటు ఆన్‌లైన్ గేమింగ్ టోర్నమెంట్‌లను వీక్షిస్తుంటారని అంచనా.

రాబోయే మూడేళ్లలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇతర వినోదాలపై నిషేధం ఉండడంతో, భారతదేశంలో మొబైల్ ఫోన్‌లలో డిజిటల్ గేమ్ యాప్‌ల డౌన్‌లోడింగ్ 50 శాతం వరకు పెరిగిందని, యూజర్ ఎంగేజ్‌మెంట్ కూడా 20 శాతం పెరిగిందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) గత ఏడాది అక్టోబర్‌లో ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది.

"ఆగ్నేయాసియా దేశాలలోని అత్యంత సంపన్నమైన మార్కెట్‌లతో పోలిస్తే భారతదేశంలో గేమింగ్ మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

ప్రొఫెషనల్ మ్యాచ్‌ల సంగతి సరేసరి, ట్రైనింగ్ మ్యాచ్‌లను కూడా లక్షల మంది ప్రజలు వీక్షిస్తున్నారు. మరో ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరగబోతోంది. ఇ-స్పోర్ట్స్ ఒక కొత్త క్రీడ. మీడియాకు ఇదొక కొత్త సాధనం. వినోదానికి ఇదే భవిష్యత్తు అవుతుంది" అని బెయిలీ అన్నారు.

వీడియో క్యాప్షన్, PUBG… ఈ ఆటకు ఎందుకంత క్రేజ్?

భవిష్యత్తులో భారత్‌లో ఇ-స్పోర్ట్ కెరీర్ ఆప్షన్‌గా మారనుందా?

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు లక్షన్నర మంది ప్రొఫెషనల్, సెమీ-ప్రొఫెషనల్ ఇ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఉన్నారు. అయితే, చాలా మందికి ఇది రెండవ ఉపాధి లాంటిది.

కాగా, ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌ల సంఖ్య రాను రాను పెరుగుతోంది. 2025 నాటికి ప్రొఫెషనల్ ప్లేయర్‌ల సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుందని అంచనా.

భారతదేశంలో భవిష్యత్తు తరాలకు ఇదొక కెరీర్ ఆప్షన్‌గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

భారతదేశంలోని యువత విజయవంతమైన ఇ-స్పోర్ట్స్ ప్లేయర్‌లుగా మారడం ఇప్పుడు సులభతరమైందని డెలాయిట్ ఇండియా భాగస్వామి ప్రశాంత్ రావు అభిప్రాయపడ్డారు.

"2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కావడానికి ముందు జాతీయ క్రికెట్ జట్టులో చేరడమే ఆటగాళ్లకు లక్ష్యంగా ఉండేది. కానీ ఐపీఎల్‌తో ఎంతోమంది ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయి.

అలాగే, ఇప్పుడు ఇ-స్పోర్ట్స్ కూడా లీగ్ ఫార్మాట్‌కి మారడంతో అవకాశాలు పెరిగాయి. అయితే, ఇ-స్పోర్ట్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రొఫెషనల్ ఇ-స్పోర్ట్స్ ప్లేయర్‌లకు శాశ్వత జీతాలు చెల్లిస్తున్న సంస్థలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి" అని రావు చెప్పారు .

అయితే, ప్రిన్స్ ఎదుర్కొన్న ఎన్నో అడ్డంకులు ఇప్పటి వర్థమాన ఆటగాళ్లకు లేవు. కష్టమైన గేమ్‌లను కూడా యువత మొబైల్ ఫోన్‌లలో సులువుగా ఆడగలుగుతున్నారని రావు అన్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)