పదవి నుంచి తప్పుకున్న అమెరికా నేవీ చీఫ్

ఫొటో సోర్స్, Reuters
అమెరికా నేవీ సెక్రటరీ జాన్ ఫెలోన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ బుధవారం ప్రకటించింది.
ఆయన నిష్క్రమణ ‘తక్షణమే అమలులోకి వస్తుంది’ అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పర్నెల్ 'ఎక్స్' పోస్ట్‌లో తెలిపారు.
నేవీ అండర్ సెక్రటరీ హంగ్ కావో తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, హార్ముజ్ జలసంధిని అమెరికా నిరంతరం దిగ్బంధిస్తున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఫెలోన్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
"రక్షణ శాఖకు, అమెరికా నేవీకి సెక్రటరీ ఫెలోన్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం" అని పర్నెల్ రాశారు.
అయితే ఫెలోన్ నిష్క్రమణకు గల కారణాలను నేవీ వెల్లడించలేదు.
ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కోరిన కొద్ది వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు ఆర్మీ అధికారులు జనరల్ డేవిడ్ హాడ్నే, మేజర్ జనరల్ విలియం గ్రీన్‌లను కూడా ఇటీవల తమ బాధ్యతల నుంచి తప్పించారు.




