‘కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన కుమార్తె’- గూఢచార నివేదికలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేక్ క్వోన్
- హోదా, సోల్ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను వారసురాలిగా ఎంపిక చేసినట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ గురువారం చట్టసభ సభ్యులకు నివేదించింది.
కిమ్ కుమార్తె కిమ్ జు యే గురించి చాలా తక్కువ వివరాలు మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇటీవలి నెలల్లో, బీజింగ్ పర్యటన వంటి ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో ఆమె తన తండ్రితో పాటు ఫోటోల్లో కనిపించారు. ఇది ఆమె తొలి విదేశీ పర్యటన.
ఇటీవలి కాలంలో ఆమె తరచూ అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తుండడం వంటి "వరుస పరిణామాలను" పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎన్‌ఎస్‌ఐ) తెలిపింది.
ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకొకసారి జరిగే అతిపెద్ద రాజకీయ కార్యక్రమమైన పార్టీ కాంగ్రెస్‌కు ఆమె హాజరవుతారా? లేదా? అనే అంశాన్ని కూడా నిశితంగా గమనించనున్నట్లు ఎన్‌ఐఎస్ పేర్కొంది.

ప్యాంగ్యాంగ్‌లో జరగబోయే పార్టీ కాంగ్రెస్‌లో రాబోయే ఐదేళ్లకు సంబంధించి విదేశాంగ విధానం, యుద్ధ ప్రణాళికలు, అణు కార్యక్రమాల వంటి ప్రాధాన్యతాంశాలపై చర్చించనున్నట్లు భావిస్తున్నారు.
చట్ట సభ సభ్యుడు లీ సియోంగ్ క్వెన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, గతంలో వారసురాలు అయ్యేందుకు "శిక్షణ పొందిన" వ్యక్తిగా ఎన్ఐఎస్ అభివర్ణించిన జు యే.. ఇప్పుడు "వారసురాలి హోదాలో నియమితులు కాబోయే" దశలో ఉన్నారని అన్నారు.
"కొరియన్ పీపుల్స్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవంతో పాటు కుమ్సుసన్ ప్యాలెస్ సందర్శన సహా పలు అధికారిక కార్యక్రమాల్లో కిమ్ జు యే కనిపించారు. అలాగే, కొన్ని విధానపరమైన అంశాల్లోనూ తన అభిప్రాయం వ్యక్తం చేశారన్న సంకేతాలున్నాయి. ఆమె ఇప్పుడు వారసురాలిగా నియమితులయ్యే దశలో ఉన్నట్లు ఎన్ఐఎస్ విశ్వసిస్తోంది" అని లీ అన్నారు.
కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రి సోల్ జు దంపతుల బిడ్డగా.. జు యే మాత్రమే అందరికీ తెలుసు. కిమ్‌కు ఆమె కంటే ముందు ఒక కుమారుడు ఉన్నట్టు ఎన్ఐఎస్ విశ్వసిస్తోంది. అయితే కుమారుడు ఎప్పుడూ ఉత్తర కొరియా మీడియాలో కనిపించలేదు, లేదా బాహ్య ప్రపంచానికి ఇప్పటివరకూ చూపించలేదని ఆ సంస్థ భావిస్తోంది.
జు యే గురించి మొదటగా ఒక అనూహ్యమైన వ్యక్తి ద్వారా బయటకు తెలిసింది. 2013లో ది గార్డియన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, రహస్య దేశానికి వెళ్లినప్పుడు "చిన్నారి జు యే"ను ఎత్తుకున్నట్లు అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్‌మన్ వెల్లడించారు.
పదమూడేళ్ల వయసు ఉంటుందని భావిస్తున్న కిమ్ జు యే, 2022లో మొదటిసారి ప్రభుత్వ అధికారిక టెలివిజన్‌లో కనిపించారు. ఉత్తర కొరియా తాజా ఖండాంతర క్షిపణిని పరిశీలిస్తున్న సమయంలో తన తండ్రి చేయి పట్టుకుని పక్కనే కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాతి నుంచి అధికారిక మీడియాలో ఆమె తరచూ కనిపించడం ద్వారా తన తండ్రిపై ఉన్న క్రూరమైన నియంత అనే ఇమేజ్‌ను తగ్గించారు. చైనాలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన భారీ సైనిక కవాతుకు తన తండ్రితో పాటు బీజింగ్ వెళ్లిన జు యే.. బీజింగ్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతూ కనిపించారు.
ఆమె జుట్టు పొడవుగా ఉంటుంది, అలా ఉండడం ఇతరులకు నిషేధం. అలాగే, దేశంలో చాలామందికి అందుబాటులో లేని డిజైనర్ దుస్తులను ధరించి కనిపిస్తారు.
అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం ద్వారా విధానపరమైన నిర్ణయాల్లో సూచనలు ఇవ్వడంతో పాటు ఆమెను వాస్తవ రెండో అత్యున్నత నాయకురాలిగా పరిగణిస్తున్నట్లు సూచిస్తోందని మరో చట్టసభ సభ్యుడు పార్క్ సున్ వోన్ అన్నారు.
మూడు తరాలుగా కిమ్ కుటుంబమే ఉత్తర కొరియా అధికార పగ్గాలు చేపడుతూ వస్తోంది, కిమ్ జోంగ్ ఉన్ కూడా తన వారసత్వాన్ని జు యేకు అప్పగిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు.
ఇటీవలి కొన్ని నెలల్లో, ఆమె తన తండ్రిని అనుసరిస్తున్నట్లు కాకుండా, తండ్రి పక్కనే ఆయన కంటే ఎత్తుగా, ఆయనతో పాటు కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఉత్తర కొరియా అధికారిక మీడియాలో ప్రచురితమయ్యే ఫోటోలకు ప్రాధాన్యతాపరమైన ప్రాముఖ్యత ఉంటుందని చెబుతారు. ఇతరులు కిమ్ జోంగ్ ఉన్ కంటే ప్రముఖంగా కనిపించేలా ఒకే ఫ్రేమ్‌లో చూపించడం చాలా అరుదు.

ఫొటో సోర్స్, EPA
జు యేని కాబోయే వారసురాలిగా దక్షిణ కొరియా గూఢచార సంస్థ భావిస్తున్నప్పటికీ, ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
పితృస్వామ్య వ్యవస్థ బలంగా కనిపించే ఉత్తర కొరియాలో పెద్ద కొడుకును కాదని, కుమార్తె జు యేను వారసురాలిగా ఎందుకు ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
దేశంలో పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థను ఉదహరిస్తూ.. కొరియాకు మహిళా పాలకురాలనే ఆలోచనే అసాధ్యమని దేశం నుంచి వెళ్లిపోయిన చాలామంది వ్యక్తులు , విశ్లేషకులు గతంలో వ్యాఖ్యానించారు. అయితే, కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పాలనలో మహిళా అధికారానికి నిదర్శనంగా నిలుస్తున్నారు.
కిమ్ యో జోంగ్ ప్రస్తుతం వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా సెంట్రల్ కమిటీలో సీనియర్ హోదాలో ఉన్నారు. సోదరుడు కిమ్‌పై ఆమె ప్రభావం ఉంటుందని కూడా చెబుతున్నారు.
అయితే.. ఇప్పటికీ వయసు తక్కువగానే, ఆరోగ్యంగానే కనిపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ అప్పుడే తన 13 ఏళ్ల కూతురిని వారసురాలిగా ఎందుకు నియమిస్తున్నారనేది కూడా పెద్ద రహస్యంగా ఉంది.
జు యే వారసత్వం ఉత్తర కొరియాలో ఎలాంటి మార్పులు తీసుకురావొచ్చనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే.
విదేశాల్లో చదువుకుని వచ్చిన యువకుడైన కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో, ఇతర దేశాలతో సంబంధాలు మెరుగవుతాయని చాలామంది ఉత్తర కొరియన్లు ఆశించారు.
కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఈ టీనేజర్‌కు కూడా దేశం గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నా, వాటిని తనకు నచ్చిన విధంగా మలచుకునే ప్రత్యేక అధికారం ఆమెకు ఉండే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













