రష్యా చమురు కొనుగోళ్ల గురించి ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన భారత్.. ఏమందంటే..

రష్యా, భారత్, చమురు, వాణిజ్యం, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Contributor/Getty Images

చదివే సమయం: 7 నిమిషాలు

'రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, "దేశ ఇంధన సరఫరా విషయానికొస్తే, 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించింది. అందుకోసం మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా మా ఇంధన వనరుల్లో వైవిధ్యం తీసుకురావడం మా వ్యూహంలో ప్రధానం. దీనిని దృష్టిలో ఉంచుకునే భారత్ అన్ని చర్యలూ చేపట్టింది. అలానే కొనసాగిస్తుంది" అని అన్నారు.

దీనికి ముందు, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా బుధవారం మాట్లాడుతూ రష్యాతో ఇంధన సహకారంపై భారత్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.

వాణిజ్య వ్యవహారాల్లో స్వతంత్ర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం అమెరికాకు కొత్తేమీ కాదని మారియా అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"భారత్ అనేక సందర్భాల్లో తన వైఖరిని స్పష్టం చేసింది. మేం భారత్‌‌తో సహకారం కొనసాగిస్తూనే ఉంటాం. రష్యన్ హైడ్రోకార్బన్ల కొనుగోలు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ రంగంలో మా భారతీయ భాగస్వాములతో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం" అని మారియా అన్నారు.

రష్యా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, మారియా జఖరోవా, భారత్, చమురు, వాణిజ్యం, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌‌తో సహకారం కొనసాగుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా తెలిపారు.

జనవరి 3న, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ, ఎవరి నుంచి కావాలంటే వారి నుంచి చమురు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందన్నారు.

భారత్ చమురు సరఫరాదారులను మార్చాలని ఆలోచిస్తుండడంపై రష్యా స్పందన ఏంటి?

పెస్కోవ్ స్పందిస్తూ, "ఇతర అంతర్జాతీయ ఇంధన నిపుణులకు తెలిసినట్లుగానే, భారత్‌ కేవలం రష్యా నుంచి మాత్రమే చమురు, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదని మాకు కూడా తెలుసు. భారత్ ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తోంది. అందువల్ల, ఇందులో కొత్తగా ఏమీ లేదు" అని సమాధానమిచ్చారు.

అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసేందుకు నరేంద్ర మోదీ అంగీకరించినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలనే ఉద్దేశాన్ని భారత్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ట్రంప్ వాదనలనూ తిరస్కరించలేదు.

వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ట్రంప్ వాదనలను ఆయన తిరస్కరించలేదు.

"మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా మా ఇంధన వనరుల్లో వైవిధ్యం తీసుకురావడం మా వ్యూహంలో ప్రధానమైంది" అని పీయూష్ గోయల్ అన్నారు.

రష్యా, భారత్, చమురు, వాణిజ్యం, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

రష్యా, భారత్ మధ్య సంబంధాల కొనసాగింపు చమురు కొనుగోళ్లపై ఆధారపడి ఉండదని ఇంధన నిపుణులు నరేంద్ర తనేజా అంటున్నారు.

"యుక్రెయిన్‌ యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి భారత్ ఎంత చమురు కొనుగోలు చేసేదో గుర్తుందా? చాలా తక్కువ. దేశ అవసరాల్లో కేవలం ఒక శాతం కంటే కూడా తక్కువ. అంతర్జాతీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రోత్సహించింది అధ్యక్షుడు బైడెన్" అని నరేంద్ర తనేజా అన్నారు.

"చమురు దిగుమతులను నిలిపేయడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయని భావించేవారు 2022 నాటి పరిస్థితులను గమనించాలి. అప్పట్లో భారత్ దాదాపు చమురు కొనుగోలు చేయలేదు. భారత్ - రష్యా సంబంధాల విషయంలో వ్యూహాత్మక దృక్పథానికే ప్రాధాన్యమివ్వాలి. రష్యా మాత్రమే భారత్‌కు ముఖ్యం కాదు, భారత్ అవసరం కూడా రష్యాకు ఉంది" అని ఆయన అన్నారు.

భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల కంటే తక్కువే.

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు తగ్గుతూనే ఉంటాయని భారత పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి గత నెలలో అన్నారు. ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశం భారత్. తన చమురు సరఫరా దేశాల్లో వైవిధ్యం తీసుకొస్తోందని పూరి అన్నారు.

జనవరి 27న బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రష్యన్ ఆయిల్ దిగుమతులు గతేడాది సగటున రోజుకు 18 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే, ఇప్పుడు రోజుకు 13 లక్షల బ్యారెళ్లకు తగ్గాయని, ఈ తగ్గుదల మార్కెట్ పరిస్థితుల వల్ల జరిగిందని పూరి పేర్కొన్నారు.

వ్యాపారం అనేది సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జరుగుతుందని థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో అయిన తన్వీ మదన్ అంటున్నారు.

"రష్యా రాయితీలు అమెరికా మార్కెట్‌ను లేదా భారత్‌లో ఉద్యోగాల కొరతను భర్తీ చేయవని భారత్ కూడా గుర్తుంచుకోవాలి" అని తన్వి మదన్ ఎక్స్‌లో రాశారు.

"వాస్తవం ఏంటంటే.. రష్యా ఆయిల్ దిగుమతులతో వచ్చే రాయితీతో పోలిస్తే అమెరికా మార్కెట్, పెట్టుబడులు, సాంకేతికత భారత ఆర్ధిక వ్యవస్థకు చాలా కీలకం. భారత్ - అమెరికా సంబంధాల్లో ఇతర అంశాలను పక్కనపెట్టినప్పటికీ ఇదే నిజం."

రష్యా, భారత్, చమురు, వాణిజ్యం, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రారంభంలో భారత్ అలీన విధానాన్ని అనుసరించినప్పటికీ, 1971 అంతర్యుద్ధంలో పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు తెలపడంతో భారత్‌ను సోవియట్ యూనియన్‌కు దగ్గర చేసింది.

భారత్‌కు రష్యా ఎందుకు కీలకం?

భారత్, రష్యా మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవి. అర్ధ శతాబ్దంగా ప్రపంచ రాజకీయాల్లో ఇది ఏకైక స్థిరమైన అంశంగా ఈ సంబంధాలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు.

ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్‌తో మంచి సంబంధాలను కొనసాగించింది భారత్. భారత ప్రధాన ప్రత్యర్థి పాకిస్తాన్‌కు దగ్గరగా ఉంది అమెరికా. ప్రారంభంలో భారత్ అలీన విధానాన్ని అనుసరించినప్పటికీ, 1971 అంతర్యుద్ధంలో పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు లభించడం భారత్‌ను సోవియట్ యూనియన్‌కు దగ్గర చేసింది.

అంతరిక్షం, అణుశక్తి, రక్షణ వంటి కీలక రంగాల్లో రెండు దేశాల పరస్పర సహకారంతో, ఆ తర్వాతి దశాబ్దాల్లో భారత్ - రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి.

ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తూనే, అమెరికాతో కూడా మంచి సంబంధాలను పెంపొందించుకున్నారు. చైనాను ఎదుర్కోవడంలో అమెరికా, భారత్ సంబంధాలను భాగస్వామ్యంగా చూస్తున్నారు.

యుక్రెయిన్ యుద్ధంపై భారత్ జాగ్రత్తగా వ్యవహరించింది. యుద్ధాన్ని నిలిపివేయాలని భారత్ పిలుపునిచ్చినా, రష్యా దాడిని నేరుగా విమర్శించకుండా దూరంగా ఉంది. అలాగే, యుద్ధాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన తీర్మానాలపై జరిగిన ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంది.

అయినప్పటికీ, భారత్‌కు అమెరికా కూడా కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇది భారత్‌కు అతిపెద్ద మార్కెట్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు 86.5 బిలియన్ డాలర్ల(రూ.7.18 లక్షల కోట్లు) విలువైన వస్తువులను విక్రయించింది, ఇది భారత్ వార్షిక ఎగుమతుల్లో దాదాపు ఐదవ వంతు. అమెరికా నుంచి భారత్ చేసుకున్న దిగుమతులు మొత్తం 45.3 బిలియన్ డాలర్లు(రూ.3.76 లక్షల కోట్లు).

రష్యా, భారత్, చమురు, వాణిజ్యం, నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యాతో భారత్ వాణిజ్యం తగ్గితే, చైనాపై ఆధారపడటం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

భారత్ రష్యా వాణిజ్యం

2022 నుంచి భారత్, రష్యా పరస్పరం మొదటి 5 వాణిజ్య భాగస్వాముల్లో కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రష్యా చమురు కొనుగోళ్లు పెరగడమే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు(రూ. 5.7 లక్షల కోట్లు) చేరుకుంది. 2030 నాటికి దీన్ని100 బిలియన్ డాలర్లకు(రూ. 8.3 లక్షల కోట్లు) పెంచాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రష్యాకు భారత్ ఎగుమతులు 4.9 బిలియన్ డాలర్లుగా(రూ .40,700 కోట్లు) ఉన్నాయి. ఇందులో ఔషధాలు, బియ్యం, టీ వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.

దీంతో పోల్చితే, రష్యా నుంచి భారత్ దిగుమతులు చాలా ఎక్కువ. మొత్తం 63.8 బిలియన్ డాలర్లు(రూ. 5.29 లక్షల కోట్లు). వీటిలో ప్రధానంగా చమురు, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. దీనర్థం భారత్ రష్యాతో 60 బిలియన్ డాలర్లకు(రూ. 4.98 లక్షల కోట్లు) పైగా వాణిజ్య లోటు ఉంది. ఇది చైనాతో 100 బిలియన్ డాలర్ల (రూ. 8.3 లక్షల కోట్లు) వాణిజ్య లోటు తర్వాత రెండవ అతిపెద్దది.

రక్షణ భాగస్వామ్యం కారణంగానూ రష్యా భారత్‌కు ఎంతో కీలకం. దశాబ్దాలుగా భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది రష్యా. భారత సైన్యం 200కి పైగా రష్యన్ యుద్ధ విమానాలను, అలాగే S-400 వంటి భూమి నుంచి గాల్లోకి దాడి చేసే అనేక క్షిపణి రక్షణ వ్యవస్థలు కలిగివుందని రక్షణ రంగ నిపుణులు రాహుల్ బేడీ పేర్కొన్నారు.

2025 మే లో పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో వీటిని ఉపయోగించారు. ప్రపంచ ఆయుధ విక్రయాలను అధ్యయనం చేసే థింక్ ట్యాంక్ అయిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. భారత్ ఇటీవలి సంవత్సరాలలో అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి ఆయుధ కొనుగోళ్లను పెంచింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)