‘యువతిని హత్య చేసి, ఫ్రిజ్‌లో శరీర భాగాలు దాచి..’

విశాఖలో యువతి హత్య, ఫ్రిజ్‌లో శరీర భాగాలు

ఫొటో సోర్స్, Venugopala rao/UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన మౌనిక, నిందితుడు రవీంద్ర
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

(గమనిక: కలవరపరిచే అంశాలు ఉన్నాయి)

డేటింగ్ యాప్‌లో పరిచయమైన 29 ఏళ్ల మౌనిక అనే యువతిని హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో వెలుగులోకి వచ్చింది.

తూర్పు నౌకాదళంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల రవీంద్రను ఈ కేసులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు బీబీసీకి తెలిపారు.

హత్య తర్వాత కొన్ని శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచి, మరికొన్ని భాగాలను సంచిలో కట్టి అడవివరం సమీపంలోని ధారపాలెంలో కాల్చేశాడని గాజువాక పోలీస్ స్టేషన్ సీఐ పార్థసారథి బీబీసీతో చెప్పారు.

‘‘భార్య ప్రసవం కోసం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లి ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్న సమయంలో, ప్రియురాలిని ఇంటికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారు’’ అని పోలీసులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖలో యువతి హత్య

ఫొటో సోర్స్, Venugopala rao

ఫొటో క్యాప్షన్, మౌనిక (ఫైల్ ఫోటో)

డేటింగ్ యాప్‌లో పరిచయం...

నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణలో నిందితుడు చెప్పిన వివరాలను సీఐ పార్థసారథి బీబీసీకి తెలిపారు.

‘‘మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడిందని రవీంద్ర విచారణలో తెలిపాడని’’ పోలీసులు చెప్పారు. విశాఖలోని ఒక ప్రైవేటు బ్యాంకులో మౌనిక పనిచేస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రవీంద్రకు రెండేళ్ల కిందటే వివాహమైంది. అతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లారు.

‘‘ఈ సమయంలో తన ఇంట్లోనే రవీంద్ర, మౌనిక తరచూ కలుస్తుండేవారు. ఆదివారం ఉదయం (29.03.26) మౌనికని తన ఫ్లాట్‌కు పిలిచారు రవీంద్ర. ఇంటికి వచ్చిన మౌనికతో రోజంతా వాగ్వాదం జరిగిందని నిందితుడు చెప్పాడు’’ అని పోలీసులు తెలిపారు.

‘‘డబ్బుల కోసం వేధిస్తోందని, తన భార్యకు చెబుతానంటూ బెదిరించిందని రవీంద్ర వెల్లడించారు’’ అని సీఐ పార్థసారథి తెలిపారు.

ఘటన జరిగిన అపార్ట్‌మెంట్

ఫొటో సోర్స్, UGC

క్లీన్‌గా ఇల్లు

''ఆదివారం సాయంత్రం మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎల్వీ నగర్‌లో రవీంద్ర అనే నేవీ ఉద్యోగి హత్య చేశాడని, అతను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే వారు చెప్పిన అడ్రస్‌కు వెళ్లేసరికి ఇంటికి గడియపెట్టి ఉంది. కిటికీలు, వెంటిలేటర్ల నుంచి లోపలకు చూసే ప్రయత్నం చేశాం ఏం కనిపించలేదు. దీంతో పొరుగింటి వాళ్లని పిలిచాం’’ అని సీఐ పార్థసారథి తెలిపారు.

‘‘వారు ఇంటి యాజమానికి ఫోన్ చేసి రప్పించారు. అలాగే రవీంద్ర సోదరుడిని కూడా పిలిపించాం. ఆయన సహాయంతో ఇంటిలోపలికి ప్రవేశించాం. ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంది. స్ప్రే చల్లిన వాసన వస్తోంది. అనుమానించదగిన విషయాలేవీ కనిపించలేదు. ఫ్రిజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో తల లేని మొండెం కనిపించింది. ఇంకా సెర్చ్ చేస్తే ఒక సూట్ కేసు కనిపించింది. అందులో కొన్ని శరీర భాగాలున్నాయి’’ అని చెప్పారు.

‘‘వెంటనే రవీంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించాం. అదే సమయంలో అతని తల్లిదండ్రుల నుంచి మాకు ఫోన్ వచ్చింది. వారి సహాయంతో రవీంద్రను పోలీసు స్టేషన్‌ను పిలిపించి, అదుపులోకి తీసుకున్నాం. హత్య చేసిన తర్వాత తలని అడవివరంలోని ధారపాలెం తీసుకుని వెళ్లి కాల్చేసినట్లు విచారణలో నిందితుడు తెలిపాడు. అక్కడకి మా బృందాలు వెళ్లి పరిశీలిస్తున్నాయి'' అని పార్థసారథి బీబీసీకి వివరించారు.

హత్యకు ముందు రోజు కత్తి, సర్ప్ కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితుడు రవీంద్ర చెప్పారని పోలీసులు తెలిపారు.

‘‘భయంతో పరుగులు తీశాం’’

పోలీసులు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి రవీంద్ర నివాసం ఉంటున్న అంతస్థులోనే ఉన్న మరో ఫ్లాట్‌ యజమాని రామకృష్ణ బీబీసీకి వివరించారు.

"ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు మా పక్క ఫ్లాట్ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తున్నారు. ఏంటా అని మేం ప్రశ్నిస్తే...క్రైం జరిగినట్లు సమాచారం వచ్చిందని...తాము పోలీసులమని చెప్పారు. రవీంద్రకు సంబంధించిన కొన్ని వివరాలు అడిగారు. ఆయన మంచిగానే ఉండేవాడని పోలీసులకు చెప్పాం. పోలీసులు లోపలికి వెళ్లిన తర్వాత అంతా శుభ్రంగా ఉండటం, ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు లేకపోవడంతో మేం ఊపిరి పీల్చుకున్నాం. అయితే కొద్ది సేపటికే ఫ్రిజ్‌లో మొండెం, సూట్ కేసులో కొన్ని శరీర భాగాలు బయటపడ్డాయి. అవి చూసిన వెంటనే మేం భయంతో పరుగులు తీశాం. ఇప్పటికీ ఆ భయం పోలేదు'' అని రామకృష్ణ చెప్పారు.

విశాఖలో హత్య జరిగిన అపార్ట్‌మెంట్ దగ్గర గుమిగూడిన ప్రజలు

ఫొటో సోర్స్, UGC

'వాళ్లు అద్దెకు వచ్చి సరిగ్గా ఏడాదైంది'

సరిగ్గా ఏడాది క్రితం అంటే మార్చి 29, 2025న రవీంద్రకు ఇల్లు అద్దెకు ఇచ్చానని, మళ్లీ హత్య వార్తతో ఈ ఇంటికి రావాల్సి వచ్చిందని ఫ్లాట్ యజమాని శ్రీరామమూర్తి చెప్పారు.

"ఇల్లు అద్దెకోసం ఆయన వచ్చాడు. ఐడీ కార్డు చూపించాడు. నేవీలో పని చేస్తున్నాడని తెలిసింది. సొంతూరు రాజాం అని చెప్పాడు. నేను కూడా బీఎస్ఎఫ్ రిటైర్డ్ ఉద్యోగిని. వెంటనే అతనికి ఇల్లు అద్దెకు ఇచ్చాను. ప్రతినెలా అద్దె ఇచ్చేవాడు. అతని భార్య కూడా పుట్టింటికి వెళ్లిందని చెప్పాడు. ఇప్పుడు ఇలా జరిగింది" అని శ్రీరామమూర్తి తెలిపారు.

రవీంద్ర కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడేందుకు ప్రయత్నించింది. వారు అందుబాటులోకి రాలేదు. వారి నుంచి స్పందన వస్తే దానిని అప్ డేట్ చేస్తాం.

‘‘అతన్ని శిక్షించండి’’

మౌనిక తండ్రి వేణుగోపాలరావుతో బీబీసీ మాట్లాడింది.

"మా అమ్మాయిని చంపాలనే ఉద్దేశంతోనే అతడు ఇంటికి పిలిచాడు. అందుకే ముందుగానే కత్తి, స్ప్రే వంటివి కొన్నాడు. నా కూతురు ఎలాగు తిరిగి రాదు. కనీసం అతడు చేసిన పాపానికి కఠినంగా శిక్షించండి. నా కూతురుకి మనశ్శాంతైనా దక్కుతుంది." అని వేణుగోపాలరావు అన్నారు

మౌనిక కుటుంబ సభ్యుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)