ఇజ్రాయెల్: ముస్లిం ఆధిక్య భూభాగంలో ఈ యూదుల దేశం ఎలా ఏర్పడింది? దానికి ముందు తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 16 నిమిషాలు
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో అప్పటినుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం ఇజ్రాయెల్ చరిత్రను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
అసలు ముస్లిం భూభాగంలో ఈ యూదు దేశం ఎలా ఏర్పడింది?
సరిహద్దులు లేని చోట, బయటి ప్రపంచం నుంచి ప్రజలు నిరంతరంగా వచ్చి, చివరికి ఒకే మతానికి చెందిన ప్రజలతో ఒక దేశాన్ని ఎలా సృష్టించగలిగారు?
ఇజ్రాయెల్ ఆవిర్భావ కథ సంక్లిష్టమైనది.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, దాని మిత్రదేశాలు విజయం సాధించినప్పటికీ, బ్రిటన్ భారీగా నష్టపోయింది. వలస రాజ్యాల పాలన దానికి కష్టంగా మారింది. వలస రాజ్యాల నుంచి క్రమంగా వైదొలగడం ప్రారంభించింది.

2వేల ఏళ్ల తర్వాత ఉనికిలో యూదు దేశం
1948 మే నెలలో పాలస్తీనా భూభాగాల నుంచి బ్రిటన్ వైదొలగడంతో తమకంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏళ్లగా పోరాడుతున్న అరబ్బులకు, యూదులకు మధ్య అంతర్యుద్ధం చెలరేగింది.
ఆ భూమి ఎవరికి దక్కుతుంది అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఆ యుద్ధంలో ఇరుపక్షాలూ సమంగా లేరు. అరబ్బుల జనాభాతో పోలిస్తే యూదుల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ ఇజ్రాయెల్ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నోఏళ్లగా పోరాడిన ప్రతి యూదుడు ఆ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమవుతూనే ఉన్నాడు.
1948 మే 14న, ఇజ్రాయెల్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. 2,000 సంవత్సరాలలో మొదటిసారిగా ఒక యూదు దేశం ఉనికిలోకి వచ్చింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం మధ్యలో ఒక యూదు దేశం ఏర్పాటయింది.

యూరప్ రూపురేఖల్ని మార్చిన పోప్ ప్రసంగం
ఇజ్రాయెల్ కథ జెరూసలేంలో మొదలవుతుంది. అది క్రీస్తు శకం 1095 సంవత్సరం. నవంబర్‌లో ఒక రోజు ఉదయం ఫ్రాన్స్‌లోని క్లారెమాంట్ నగరంలో పోప్ అర్బన్ -2 ఇచ్చిన ఒక ఉపన్యాసం యూరప్ రూపురేఖలను మార్చివేసింది.
ఆ ఉపన్యాసంలో ఏముంది? ఆ ఉపన్యాసమే క్రైస్తవులకు, ముస్లింలకు మధ్య 200 ఏళ్ల యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధాలను క్రైస్తవులు క్రూసేడ్లు అని, ముస్లింలు జీహాద్ అని పిలిచారు.
ముస్లింల పాలన నుంచి పవిత్ర భూమి, పవిత్ర నగరం అని తాము భావించే ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించడానికి లాటిన్ చర్చి 1095 నుంచి1271 వరకు యుద్ధం చేసింది. చర్చి దృష్టిలో పవిత్ర భూమి అంటే ప్రస్తుత ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లోని కొన్ని భాగాలు. పవిత్ర నగరం అంటే జెరూసలేం.
చర్చికి, రాచరికానికి మధ్య ఉన్న సంఘర్షణల కారణంగా, అలాగే చర్చిలో ఏర్పడిన విభజన వల్ల మతపరమైన అధికార పీఠం డోలాయమానంగా మారడం ప్రారంభమైన కాలం ఇది.
పోప్ అర్బన్ 2 దీనికి ఒక మార్గాన్ని చూశారు. ''విదేశీ, పాపపూరితమైన, మతవిశ్వాసం లేని శత్రువుపై యుద్ధం చేయడం ద్వారా క్రైస్తవులను ఏకం చేయడం ఆ మార్గం''గా పోప్ భావించారు. లక్షమంది క్రైస్తవ పురుషులు, స్త్రీలు, పిల్లలు సైనికులుగా మారి, నాలుగున్నర వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జెరూసలేం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు. వారందరూ ఒకేసారి కాకుండా, చిన్న చిన్న బృందాలుగా వెళ్లారు.
"వారు ఐరోపాను దాటుతున్నప్పుడు, ఈ సమూహాలు వివిధ ప్రాంతాలలో యూదు జనాభాపై దాడి చేసి ఊచకోత కోశాయి" అని 'ద ల్యాండ్ ఆఫ్ ద హోలీ' అనే బీబీసీ డాక్యుమెంటరీలో మధ్యయుగ చరిత్రకారుడు డాక్టర్ థామస్ ఆస్‌బ్రిడ్జ్ చెప్పారు.
అప్పటికి జెరూసలేం ముస్లిం పాలకుల చేతుల్లోకి వెళ్లి 400 సంవత్సరాలు గడిచాయి. ఈ ప్రాంతంలో యూదుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ వారి ఉనికి కొనసాగింది.
మొదటి క్రూసేడర్లు బయలుదేరిన సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత వారు జెరూసలేంను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 సంవత్సరాల పాటు (1099 నుంచి 1187 వరకు) జెరూసలేం, దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని పాలించారు.
ఆ తర్వాత సలాదిన్ అనే ముస్లిం క్రూసేడర్ నాయకత్వంలోని సైన్యాలు క్రైస్తవులను ఓడించాయి. పవిత్ర భూమిగా చెప్పుకునే ప్రాంతం మరోసారి ముస్లింల చేతుల్లోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Google
యూదు రాజ్యం గురించి బైబిల్‌లో ఏముంది?
జెరూసలేం ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి. మనం చరిత్ర పుటలను పరిశీలిస్తే జెరూసలేంను ఎందరో పాలకులు పరిపాలించారని తెలుస్తుంది.
క్రీస్తు పూర్వం 1700లలో దీన్ని కనానీయులు పాలించారు. ఆ తర్వాత ఈజిప్టు ఫారోలు, వారి తర్వాత ఇజ్రాయేలీయులు పాలించారు. నేటి యూదులు వారి నుంచే వచ్చారని అంటారు.
క్రీస్తు పూర్వం 1000 మొదటి భాగంలో ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, లెబనాన్, సిరియాలు ఉన్న భూభాగం రెండు ఇజ్రాయెల్ రాజ్యాలుగా విడిపోయింది. వాటిపేర్లు ప్రాచీన ఇజ్రాయెల్, యూదా. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న జెరూసలేం నగరం అప్పట్లో యూదా రాజ్యానికి రాజధానిగా ఉండేది.
ప్రాచీన ఇజ్రాయేలు రాజ్యం గురించి హీబ్రూ బైబిల్‌లో, కొన్ని మత గ్రంథాలలో ప్రస్తావించారు. కానీ దానికి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి.
కాలక్రమేణా ఈ ప్రాంతం బాబిలోనియన్, పర్షియన్, గ్రీకు (అలెగ్జాండర్ దండెత్తినప్పుడు), రోమన్, బైజాంటైన్, చివరకు ముస్లిం పాలకుల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా అధికారం నిరంతరం మారుతూనే ఉంది. ఇక్కడ చివరిగా పాలించిన పాలకులు ఒట్టోమన్లు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ సామ్రాజ్యం కూలిపోయింది.
అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ భూమి లేదా పవిత్ర భూమి అని కూడా పిలిచేవారు. దీని ప్రస్తావన హీబ్రూ బైబిల్, బైబిల్‌లో ఉంది. ఇక్కడే జుడాయిజం పుట్టిందని, ఆ మత చట్టాలు రూపొందాయని, ఈ భూమిని దేవుడు యూదులకు వారసత్వంగా ఇచ్చాడని యూదులు నమ్ముతారు.
వారి మత విశ్వాసం హీబ్రూ బైబిల్‌లోని ఆదికాండము, నిర్గమకాండము అధ్యాయాలపై ఆధారపడి ఉంది.
యూదు ప్రజలు ఒకనాడు తమ భూమికి (ఇజ్రాయెల్) తిరిగి వస్తారని బైబిల్‌లో ఉంది. యూదు రాజ్యమనే రాజకీయ భావన కూడా ఈ ప్రవచనంపైనే ఆధారపడింది.
ఈ కథలన్నింటినీ చెప్పడానికి కారణం, యూదులు తమ సొంత దేశాన్ని నిర్మించుకోవడానికి ఈ భూమినే ఎందుకు కోరుకున్నారో గుర్తుచేయడమే.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న అరబ్ ముస్లింలు నేడు ప్రపంచానికి పాలస్తీనియన్లుగా తెలుసు. ఈ భూమిని మొదట ప్రాచీన గ్రీకు రచయితలు, ఆ తర్వాత రోమన్ పాలకులు పాలస్తీనాగా సంబోధించారు. ఈ పేరు ఒట్టోమన్ సామ్రాజ్యం వరకు కొనసాగింది.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ప్రపంచ యుద్ధంలో మారిన ప్రపంచ పటం
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఆధునిక ప్రపంచ సంబంధాల చరిత్రలో అత్యంత నాటకీయమైన మార్పు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగింది. ఇక్కడ ఒట్టోమన్ సామ్రాజ్యం అధికారంలో ఉండేది. పొరుగున ఉన్న ఈజిప్ట్ లేదా సిరియా నుంచి తరచుగా దాడులు జరుగుతుండేవి. ఈ దాడులను ఆపడానికి మధ్యవర్తిత్వం వహించమని ఒట్టోమన్ చక్రవర్తులు 1840లో బ్రిటిష్ వారిని కోరారు. కొన్ని ఒప్పందాలు, ప్రయోజనాలకు బదులుగా బ్రిటిష్ వారు అందుకు అంగీకరించారు.
ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొంత శాంతి నెలకొంది. పాలస్తీనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడం మొదలయింది. ఒట్టోమన్ సామ్రాజ్యం అప్పటికే ఐరోపాతో వాణిజ్యం చేస్తోంది. ఐరోపావాసులతో సంబంధాలు పెరిగేకొద్దీ ఇక్కడ కూడా మార్పులు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు ఇక్కడ యూదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది.
ఈ కాలంలో యూరప్‌లో జియోనిస్ట్ ఉద్యమం ఉద్భవించింది. ఇది ఒక యూదు రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ ఉద్యమం. హీబ్రూ బైబిల్‌లో జెరూసలేం కోసం 'జియోన్' అనే పదాన్ని ఉపయోగించారు.
మొదటి ప్రపంచ యుద్ధం ఆ ప్రాంతంలో ప్రధాన మార్పులను తీసుకువచ్చింది. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం సామ్రాజ్యమైన ఒట్టోమన్లు యుద్ధంలోకి ప్రవేశించి రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌లపై 'సైనిక జీహాద్' ప్రకటించారు. జర్మన్లతో పొత్తు పెట్టుకుని సూయజ్ కాలువను స్వాధీనం చేసుకోవడానికి ఒట్టోమన్లు బ్రిటిష్ పాలనలోని ఈజిప్ట్‌పై దాడి చేశారు.
యుద్ధం వల్ల అనేకం జరిగాయి. ముఖ్యమైనది ఒట్టోమన్లు ఓడిపోయారు. జర్మనీ ఓడిపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని విభజించారు. పాలస్తీనా బ్రిటిష్ కాలనీగా మారగా సిరియా, లెబనాన్ ఫ్రెంచ్ వలసరాజ్యాలుగా మారాయి.
పాలస్తీనా ప్రాంతం నేరుగా బ్రిటిష్ పాలనలోకి రావడంతో, ఆ ప్రాంతంలో ఒక స్వతంత్ర యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరే గళాలు యూరప్‌లో మరింత బిగ్గరగా వినిపించడం ప్రారంభమయింది.

ఫొటో సోర్స్, Getty Images
బాల్ఫోర్ డిక్లరేషన్‌లో ఏముంది?
మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తరువాత, యూరప్‌లోని జియోనిస్ట్ ఉద్యమం ఫలితంగా బాల్ఫోర్ డిక్లరేషన్‌ను బ్రిటన్ జారీ చేసింది. ఇది యూదు రాజ్యం కావాలనే డిమాండ్‌కు మొట్టమొదటి అధికారిక గుర్తింపు.
దీని ప్రకారం, పాలస్తీనాలో యూదు ప్రజలకు ఒక మాతృభూమిని స్థాపించడానికి బ్రిటిష్ రాచరికం మద్దతు ఇస్తుంది. యూదు ప్రజలు తమ కోసం ఒక మాతృభూమిని పొందడంలో సహాయపడటానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే ఇది పాలస్తీనాలో నివసిస్తున్న యూదులు కాని ప్రజల పౌర, మతపరమైన హక్కులకు అలాగే ఇతర దేశాలలో నివసిస్తున్న యూదుల హక్కులకు, రాజకీయ హోదాకు భంగం కలిగించకూడదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
ఈ ప్రకటన తరువాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఈ ప్రాంతంలో యూదు ప్రజల కోసం ఒక మాతృభూమిని ఏర్పాటుచేసే బాధ్యతను, తద్వారా ఆ ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యతను బ్రిటన్‌కు అప్పగించింది.
ఇక్కడికి వచ్చే యూదుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1920ల నుంచి 1940ల మధ్య యూదులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం ప్రారంభించారు.
ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ లక్షలాది యూదులను ఊచకోత కోయడం ప్రారంభించిన తర్వాత వేలమంది యూదులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యూరప్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వచ్చారు.
బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం ఇక్కడి యూదుల కోసం ఒక ప్రత్యేక 'మాతృభూమి' ఏర్పాటవుతుంది. ఈ ప్రాంతం అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉండటంతో ఇక్కడికి వచ్చిన యూదులు ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ ఏర్పడుతుందని భావించారు. సరిగ్గా అదే జరిగింది.
బ్రిటిష్ వారు బాల్ఫోర్ డిక్లరేషన్ పెట్టి, యూదు ప్రజల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తామని ఎందుకు వాగ్దానం చేశారు? అని అడిగినప్పుడు
‘‘ఎవరు మాత్రం చెప్పరు? వారిపై చాలా ఒత్తిడి ఉండేది" అని రచయిత్రి, జర్నలిస్ట్ నీలు దామ్లే బదులిచ్చారు. ఆమె ఇజ్రాయెల్-అరబ్ సంఘర్షణను నిశితంగా అధ్యయనం చేసి దానిపై 'జెరూసలేం' అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.
"1890 ప్రాంతంలో బ్రిటన్‌లో జియోనిస్ట్ ఉద్యమం ఉద్భవించింది. యూదులే బ్రిటీష్ వడ్డీ వ్యాపారులుగా ఉండేవారు. ఆ ఉద్యమ నాయకుడైన రోత్‌చైల్డ్ అత్యంత ధనవంతుడు. యూరప్‌లోని అనేక సంపన్న కుటుంబాలు ఇందులో పాలుపంచుకున్నాయి. కాబట్టి యుద్ధ సమయంలో ముఖ్యంగా ప్రభుత్వానికి డబ్బు అవసరమైనప్పుడు బ్రిటీష్ వారు వారిని నిరాశపరిచే స్థితిలో లేరు" అని ఆయన అంటారు.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్ స్థాపన, అరబ్ దేశాల దాడి
నాజీల హింస పెరగడంతో యూరప్‌లోని యూదులు పారిపోవడం మొదలుపెట్టారు. కానీ చాలా దేశాలు వారికి తలుపులు మూసివేస్తున్నాయి. పెరుగుతున్న యూదుల వలసలు పాలస్తీనా భూభాగాల్లో అసంతృప్తికి కారణమవుతుండటంతో, బ్రిటీష్ వారు కూడా యూదుల రాకను ఆపాలని నిర్ణయించుకున్నారు. దీంతో యూదులు ఆ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించడం ప్రారంభించారు.
1920 నుంచి 1940 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో యూదులకు, అరబ్బులకు మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతూ ఉండేవి.
రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు పాలస్తీనా ఒంటరిగా ఉండలేకపోయింది. బ్రిటిష్ వారి తరఫున పోరాడటానికి యూదులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ ప్రతిపాదించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం, సైన్యం దానిని తిరస్కరించాయి. సైన్యంలో యూదులు, అరబ్బుల సంఖ్య సమానంగా ఉండాలని వారు అన్నారు. కానీ అరబ్బులకు బ్రిటిష్ వారి కోసం పోరాడటంలో ఆసక్తి లేదు. వారి నాయకుడైన జెరూసలేం ముఫ్తీ, నాజీ జర్మనీ పక్షం వహించారు.
ఈ సమయంలో హగానా (రక్షణ దళం) అనే పేరుతో ఒక స్థానిక యూదు సైన్యం ఏర్పడింది.
అరబ్బులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. జాఫాలో దాడులు మొదలయ్యాయి. బ్రిటిష్ వారు సైన్యాన్ని పిలిపించారు. ఈ యుద్ధంలో 5,000 మందికి పైగా అరబ్బులు మరణించారు. జెరూసలేం ముఫ్తీ, అల్-హుస్సేనీ ఫ్రెంచ్ పరిపాలనలోని సిరియాకు పారిపోయారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1947లో బ్రిటన్ పాలస్తీనా సమస్యను ఐక్యరాజ్యసమితి ముందు ఉంచింది.
ఐక్యరాజ్యసమితి ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించింది. ఒక స్వతంత్ర యూదు దేశం, ఒక స్వతంత్ర అరబ్ దేశం, జెరూసలేంపై అంతర్జాతీయ నియంత్రణ అన్నవి ఆ ప్రతిపాదనలోని అంశాలు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌ను గుర్తించిన సోవియట్ యూనియన్, అమెరికా
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 1948లో పాలస్తీనాలోని యూదు ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. ఇజ్రాయెల్ ఏర్పడింది. రెండు వేల సంవత్సరాల తర్వాత యూదు ప్రజలకు వారి సొంత దేశం లభించింది. శక్తివంతమైన దేశాలైన అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ ఇజ్రాయెల్‌ను గుర్తించాయి.
పాలస్తీనా నుంచి బ్రిటన్ వైదొలగడంతో దేశంలో యూదు, అరబ్ సైన్యాలు ఘర్షణ పడ్డాయి. జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, ఈజిప్ట్ దేశాల సైన్యాలు పాలస్తీనా అరబ్బులకు సహాయం చేశాయి. ఈ ఐదు దేశాలు కలిసి ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి.
ఇజ్రాయెల్ ఏర్పాటై ఒక్కరోజు కూడా కాలేదు. ఆ దేశ జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఆ దేశం అప్పటికి ఇంకా ఉనికిలో లేదు. కాబట్టి ఇతర దేశాలతో ఆయుధ ఒప్పందాలు చేసుకునే ప్రసక్తే లేదు. అరబ్ దేశాల సైన్యాలు ఇజ్రాయెల్ సైన్యం కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉండేవి.
కానీ రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల పక్షాన పోరాడి, కొన్ని కీలకమైన యుద్ధాలలో వ్యూహాత్మక పాత్ర పోషించిన సైనిక అధికారులు యూదులు. వారు ఇజ్రాయెల్ కోసం పోరాడుతున్నారు.
ఐక్యరాజ్యసమితి సమక్షంలో జూన్‌లో ఇజ్రాయెల్, అరబ్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇజ్రాయెల్‌కు తన సరఫరాలను తిరిగి సమకూర్చుకోవడానికి ఒక అవకాశం లభించింది. సోవియట్ యూనియన్ వంటి ఒక పెద్ద దేశం వారికి పరోక్షంగా సహాయం చేస్తూ వచ్చింది.
అరబ్ సైన్యాల మధ్య సమన్వయం సరిగా లేదు. ఐదు దేశాల సంయుక్త బలగాలు కూడా ఇజ్రాయెల్‌ను ప్రపంచపటం నుంచి తుడిచివేయలేకపోయాయి. కానీ అవి ఇజ్రాయెల్ భూభాగంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాయి. వెస్ట్ బ్యాంక్‌ను జోర్డాన్, గాజా స్ట్రిప్‌ను ఈజిప్ట్ తీసుకున్నాయి. తూర్పు జెరూసలేం కూడా వారి చేతుల నుంచి జారిపోయింది.
ఇజ్రాయెల్ పశ్చిమ జెరూసలేం, మిగిలిన పాలస్తీనాను తన ఆధీనంలో ఉంచుకుంది. ఇది మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం.
1949లో జోర్డాన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియాలతో యుద్ధ విరమణ ఒప్పందాలపై ఇజ్రాయెల్ సంతకాలు చేసింది. ఈ ఒప్పందాల అర్థం ఏమిటంటే ఎవరు బలంగా ఉంటే వారికి ఆ భూభాగం దక్కుతుంది. కానీ ఈ యుద్ధానికి వారు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అపారమైన ప్రాణనష్టం జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
‘పాలస్తీనా చరిత్రలో అత్యంత చీకటి రోజు’
గాజా స్ట్రిప్‌లో ఏ ప్రాంతంలో ఉన్నారనే దానిపై ఆధారపడి 1948 మే 14 సంతోషకరమైన రోజా, చీకటి రోజా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాల్సి వచ్చింది. పాలస్తీనియన్లు ఈ రోజును నక్బా అని పిలుస్తారు. దీనిని పాలస్తీనా చరిత్రలో అత్యంత చీకటి రోజుగా పరిగణిస్తారు.
చరిత్రకారుడు బెన్నీ మోరిస్ తన 'ది బర్త్ ఆఫ్ ది రివైజ్డ్ పాలస్తీనా రెఫ్యూజీ ప్రాబ్లమ్' అనే పుస్తకంలో ఇలా రాశారు.
"1948 మే 14వ తేదీ తర్వాత ఇజ్రాయెల్ సైన్యానికి భయపడి డెబ్బై లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లను విడిచి పారిపోయారు. వారిలో చాలామంది అపహరణకు గురయ్యారు.
చాలామంది తాము ధరించిన దుస్తులతోనే ఇళ్లను విడిచిపెట్టారు. కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. ఆ ఇళ్ల తాళాలు తెరవడానికి వారు ఎన్నడూ తిరిగి రాలేకపోయారు. ఆ రోజుకు గుర్తుగా వారు తాళం చెవులను భద్రపరుచుకున్నారు"
అయితే, ఇజ్రాయెల్ దానిని అంగీకరించదు. పాలస్తీనియన్లు పారిపోయింది ఇజ్రాయెల్ సైన్యం వల్ల కాదని, అరబ్ దేశాల దండయాత్ర కారణంగానే పారిపోయారని వారు అంటారు.
కానీ కాల్పుల విరమణ తర్వాత ఈ ప్రజలు తిరిగి రావడానికి ఇజ్రాయెల్ అనుమతించలేదు. వారి ఇళ్లను స్వాధీనం చేసుకుంది. ఈ పాలస్తీనా శరణార్థుల కోసం పొరుగు దేశాలలో శిబిరాలను ఏర్పాటు చేశారు.
అరబ్బులపై ఇజ్రాయెల్ సాధించిన విజయం రాజకీయ రంగంలో ఒక సునామీలాంటిది. నేటికీ ఈ ప్రాంతం ఆ సునామీ ప్రకంపనలతో బాధపడుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఓటమి నుంచి కోలుకోలేకపోయిన అరబ్ దేశాలు’
అరబ్ దేశాలు ఈ ఓటమి నుంచి ఎన్నడూ పూర్తిగా కోలుకోలేదు. తమ పొరుగు దేశాలే తమను ప్రపంచపటం నుంచి తుడిచివేయడానికి ప్రయత్నించాయన్న విషయాన్ని ఇజ్రాయెల్ ఎన్నటికీ మరచిపోలేదు. మరో యుద్ధం తప్పదని ఇరుపక్షాలకూ తెలుసు.
ఇజ్రాయెల్ ఏ దేశాల సైన్యాలను ఓడించిందో, ఆ దేశాల సైన్యాలు తమ సొంత ప్రభుత్వాలను కూలదోయడం ప్రారంభించాయి. సిరియాలో ప్రభుత్వాలు నిరంతరం మారడం మొదలైంది.
ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో పోరాడిన ఒక అధికారి, ఇతర యువ అధికారులతో కలిసి ఈజిప్టులో తిరుగుబాటుకు నాయకత్వం వహించి సుల్తాన్‌ను పడగొట్టారు. ఆ అధికారి పేరు గమల్ అబ్దుల్ నాసర్. 1956లో ఈజిప్టు అధ్యక్షుడయ్యారు నాసర్.
అదే సంవత్సరంలో ఆయన బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వ్యతిరేకతను పట్టించుకోకుండా సూయజ్ కాలువను జాతీయం చేశారు. ఈ చర్య ఆయన్ను అరబ్ ప్రపంచానికి హీరోగా నిలబెట్టింది.
సూయజ్ కాలువ జాతీయీకరణ అనంతరం ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఈజిప్టుపై చర్యలు తీసుకున్నాయి. కానీ అవే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈజిప్టు దౌత్యపరమైన విజయాన్ని సాధించింది.

ఫొటో సోర్స్, Alamy
‘అరబ్ దేశాల మధ్య ఐక్యత లేకపోవడంతో’
1948 యుద్ధంలో ఎలాంటి ప్రధాన ఆయుధాలు లేకుండా పోరాడిన ఇజ్రాయెల్, తన సైన్యాన్ని బలోపేతం చేయడం ప్రారంభించింది. 1965 నాటికి, దాని సైన్యం అత్యంత శక్తివంతంగా మారింది. ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేసింది.
పది లక్షలకు పైగా యూదు వలసదారులకు వసతి కల్పించడం వల్ల మానవ వనరులు పెరిగాయి. ఇజ్రాయెల్‌కు వచ్చే వలసదారులకు సైన్యంలో సేవ చేయడం తప్పనిసరి చేసింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధం వస్తే ఎవరు సురక్షితంగా ఉంటారో పాశ్చాత్య దేశాలు గ్రహించాయి. వచ్చే ఐదు సంవత్సరాల పాటు అరబ్ దేశాల సంయుక్త బలగాలతో ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడగలదని అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
టెల్ అవీవ్‌లో పనిచేస్తున్న ఒక బ్రిటిష్ అధికారి 1967లో ఇజ్రాయెల్ సైన్యంపై ఇచ్చిన ఒక నివేదికలో నాయకత్వం, శిక్షణ, రక్షణ పరికరాలు. లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలలో ఇజ్రాయెల్ సైన్యం మునుపెన్నడూ లేనంత సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
బీబీసీ మధ్యప్రాచ్య సంపాదకుడు జెరెమీ బోవెన్ ఇలా రాశారు.
"ఈజిప్టులో, నాసర్ ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. కానీ ఆయన సైన్యానికి, మిత్రదేశమైన సిరియా సైన్యాలకు అంతగా శిక్షణ లేదు. వారు కేవలం గొప్ప గొప్ప వాగ్దానాలు మాత్రమే చేస్తున్నారు.
నాసర్ అరబ్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకున్నారు. కానీ ఈ దేశాల మధ్య ఐక్యత లేదు. అరబ్బులు జాతీయవాదం, ఐక్యత గురించి మాట్లాడారు. కానీ వాస్తవానికి వారు విడిపోయి ఉన్నారు. జోర్డాన్, సౌదీ అరేబియా తమకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని సిరియా, ఈజిప్టు నాయకత్వాలు ఫిర్యాదు చేశాయి" అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరు రోజుల్లో మధ్యప్రాచ్య రాజకీయాలు ఎలా మారిపోయాయంటే...
ఇజ్రాయెల్, సిరియాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఉద్రిక్తతలకు కారణమైంది.
" పాలస్తీనా తిరుగుబాటుదారులకు సిరియా ఆశ్రయం కల్పిస్తూ వచ్చింది. ఈ తిరుగుబాటుదారులు నిరంతరం ఇజ్రాయెల్‌పై దాడి చేసేవారు. ఈ దాడుల్లో వందలమంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ వారిని శాశ్వతంగా అడ్డుకోవాలని కోరుకుంది. ఈ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్ దీనిని 'ఉగ్రవాద దాడి'గా పేర్కొని, బలప్రయోగంతో ప్రతిస్పందించింది" అని బీబీసీ మధ్యప్రాచ్య సంపాదకుడు జెరెమీ బోవెన్ పేర్కొన్నారు.
జోర్డాన్ నాయకుడు షా హుస్సేన్ ఇజ్రాయెల్‌తో రహస్య చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇజ్రాయెల్ తనపై ఎలాంటి చర్య తీసుకోదని ఆయన దీమాగా ఉండేవారు. కానీ 1966 నవంబర్‌లో జోర్డాన్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సమువా గ్రామంలోకి ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించారు.
షా హుస్సేన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను మూడేళ్లుగా ఇజ్రాయెల్‌తో రహస్య చర్చలు జరుపుతున్నానని ఆయన అమెరికా గూఢచార సంస్థకు చెప్పారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఆపరేషన్ జరిగిన ఉదయం, వెస్ట్ బ్యాంక్‌లో ఎలాంటి ప్రతీకార చర్య ఉండదని ఇజ్రాయెల్ పక్షం తనకు చెప్పిందని కూడా తెలిపారు.
వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా ప్రజలు బాధతో, కోపంతో తనను కూలదోస్తారని భావించిన షా హుస్సేన్, సైనిక పాలన విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇజ్రాయెల్ మొదట భయపడినట్టు కనిపించినా’
మరోవైపు, సిరియా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల మధ్య 1967 ఏప్రిల్ 7న యుద్ధం ప్రారంభమైంది.
జెరెమీ బోవెన్ ఇలా రాశారు, "ఇజ్రాయెల్ సైన్యం ముందు అరబ్ సైన్యాలు కుప్పకూలుతున్నాయని ఒక బ్రిటిష్ దౌత్యవేత్త అన్నారు. ఈ దుస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందిన పాలస్తీనా యువత, 'ఈజిప్టు సైనికులు ఎక్కడ ఉన్నారు?' అని అడుగుతున్నారు"
నాసర్ చర్య తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది.
ఈజిప్టు సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అమీర్ తన దళాలను సిద్ధంగా ఉండమని ఆదేశించారు. కానీ ఈజిప్టు సైన్యంలో సగానికి పైగా అప్పటికే యెమెన్‌లో పోరాడుతోంది. ఈ విషయాన్ని సైన్యం ఆపరేషన్స్ చీఫ్ అన్వర్ అల్-ఖాదీ అమీర్‌కు తెలియజేశారు.
దీనికి జనరల్ అన్వర్ స్పందిస్తూ తాను యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదని, ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమేనని అన్నారు.
ఈజిప్టు అధ్యక్షుడు నాసర్, యూదు రాజ్యానికి ఎదురు నిలిచే ధైర్యం ఉన్న అరబ్ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని కోరుకున్నారు. ఆయన సినాయ్ సరిహద్దుకు సైన్యాన్ని పంపి, టిరాన్ జలసంధి గుండా ఇజ్రాయెల్ రాకపోకలను అడ్డుకున్నారు.
ఆధునిక యుద్ధ విమానాలను నడుపుతున్న పైలట్ల మధ్య నాసిర్ నిలబడి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. తాను ఎంత ధైర్యవంతుడో చూపించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నమిది.
జోర్డాన్ షా మతపరమైన సంక్షోభంలో ఉన్నారు. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన మనసులో ఒకే ఒక లక్ష్యం ఉండేది. తన అధికారాన్ని కాపాడుకోవడం. అందువల్ల ఆయన అయిష్టంగానే నాసర్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఇరుపక్షాలు బలప్రయోగంతో బెదిరించుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. అరబ్ రేడియో స్టేషన్లు, ఇజ్రాయెల్ వార్తాపత్రికలు ప్రతిరోజూ ఒకదాన్నొకటి బెదిరించుకుంటున్నాయి. ఇజ్రాయెల్ నిరాశలో కూరుకుపోతోంది.
పరిస్థితి ఎంత తీవ్రమైందంటే, ప్రభుత్వం శవపేటికలను నిల్వ చేయడం ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిని గ్రహించిన మత నాయకులు పబ్లిక్ పార్కులను స్మశానవాటికలుగా మార్చడం మొదలుపెట్టారు.
ప్రధానమంత్రి లెవీ ఎష్కోల్ కూడా ఆందోళన చెందారు. మే 28న ఆయన చేసిన ప్రసంగంతో ప్రజలు మరింత భయపడ్డారు. ఆయన తన ప్రసంగంలో తడబడ్డారు. సరిగ్గా మాట్లాడలేకపోయారు.
ప్రసంగం అనంతరం జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శించారు. "మీరు ఈ రోజు మీ అతిపెద్ద ఆయుధాన్ని కోల్పోయారు. ఆ ఆయుధం ఇతరులు మిమ్మల్నిచూసి భయపడడం" అని బ్రిగేడియర్ జనరల్ ఏరియల్ షరోన్ గట్టిగా అరిచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ నియంత్రణలోకి జెరూసలేం
యుద్ధానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. అరబ్ సైన్యానికి సహాయంగా వచ్చిన ఇరాకీ సైన్యం జోర్డాన్ లోయ, ఇజ్రాయెల్ వైపు ముందుకు సాగింది. జూన్ 4 లేదా 5 తేదీలలో ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాసర్ అంచనా వేశారు. యుద్ధం ప్రారంభమైంది.
టెల్ అవీవ్‌లోని నాయకులు ఊపిరి బిగపట్టుకుని చూస్తుండగా జూన్ 5వ తేదీ ఉదయం 7:45 గంటలకు, ఈజిప్ట్, జోర్డాన్ సిరియా అంతటా విమానాశ్రయాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకువచ్చాయి.
ఇజ్రాయెల్ వైమానిక దళం దీని కోసం చాలా సంవత్సరాలుగా సన్నాహాలు చేస్తూ వచ్చింది. వారి పరిశోధన ఎంత విస్తృతంగా ఉందంటే, వారు అరబ్ సైనిక అధికారుల స్వరాలను గుర్తించగల ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా అభివృద్ధి చేశారు.
అరబ్ దేశాల సైనిక సమావేశం జరుగుతుండగా పైనుంచి బాంబులు పడటం మొదలైంది.
కేవలం ఐదు రోజుల్లోనే , ఈజిప్ట్, జోర్డాన్, సిరియా సైన్యాలను ఇజ్రాయెల్ కూకటివేళ్లతో పెకలించింది. అది ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్, సినాయ్‌ను, సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను స్వాధీనం చేసుకుంది.
యూదు ప్రజలకు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావించే జెరూసలేం రెండు వేల సంవత్సరాలలో మొదటిసారి వారి నియంత్రణలోకి వచ్చింది. ఈసారి కూడా పాలస్తీనియన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. వారిని ఊచకోత కోశారు. కానీ పరిస్థితి 1948నాటిలా అంత దారుణంగా లేదు.
నాసర్ రాజీనామా చేసినప్పటికీ ప్రజలు ఒప్పుకోకపోవడంతో దానిని ఉపసంహరించుకున్నారు. ఆయన మరణించే వరకు పదవిలోనే కొనసాగారు. తదుపరి అధ్యక్షుడు అన్వర్ సదాత్, ఇజ్రాయెల్‌తో ఒక చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఫలితంగా సొంత అంగరక్షకులే ఆయనను కాల్చి చంపారు.
ఈజిప్టు సైన్యాధిపతి అమీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
జోర్డాన్ రాజు హుస్సేన్ తూర్పు జెరూసలేంను కోల్పోయినప్పటికీ ఆయన పాలనకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు. 1994లో ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
సిరియన్ వైమానిక దళ కమాండర్ హఫీజ్ అసద్ 1970లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2000లో ఆయన మరణానంతరం, ఆయన కుమారుడు బషర్ అల్-అసద్ ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా తర్వాత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























