చైనా పెట్టుబడులకు భారత్ అనుమతి, 6 ఏళ్ల తరువాత ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, సందీప్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఎంపిక చేసిన రంగాల్లో చైనా పెట్టుబడులపై ఆంక్షలు సడలింపునకు మంగళవారం భారత్ పచ్చజెండా ఊపింది.

ఇరు దేశాల మధ్య ఆరేళ్ల ఉద్రిక్తతల తర్వాత మూలధన కొరత తగ్గింపు, ఆర్థిక సంబంధాల పున:ప్రారంభమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, మధ్య ప్రాచ్యంలో యుద్ధం వల్ల పెరిగిన అనిశ్చితి, పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని అంతర్జాతీయ, ఆర్థిక సంబంధాల నిపుణులు చెబుతున్నారు.

బహుశా అందుకే ఆరేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న భారత్, చైనా సంబంధాలు మళ్లీ క్రియాశీలకంగా మారాయంటున్నారు. దేశంలో చైనా కంపెనీల పెట్టుబడి నిబంధనలను 2020లో భారత్ కఠినతరం చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద 2020 జూన్‌లో భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అనంతరం చైనా పెట్టుబడిదారులు భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, దేశ హోమ్, విదేశాంగ మంత్రిత్వ అధికారులతో కూడిన ప్యానల్ నుంచి భద్రతా అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది.

ఈ ఆంక్షల వల్ల అనేక ఒప్పందాలు నిలిచిపోయాయని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. వాటిలో 2023లో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల జాయింట్ వెంచర్‌లో బీవైడీ కంపెనీ పెట్టాలనుకున్న 1 బిలియన్ డాలర్ల (రూ.9,240 కోట్లు) పెట్టుబడి కూడా ఉంది.

ఎఫ్‌డీఐ కొత్త నిబంధనలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రభుత్వ నిర్ణయంలో ఏముంది?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల్లో మార్పులను కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

ఈ నిబంధనలు అంతకుముందు చైనాతో భూసరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కఠినతరం చేశాయి. ఇప్పుడు నిబంధనల సడలింపుతో ఎలక్ట్రానిక్స్, సోలార్, సెల్ రంగాలలో అనుమతులు ఇవ్వనున్నారు.

వ్యూహాత్మక తయారీ రంగంలో పెట్టుబడులకు కాల పరిమితిని 60 రోజులుగా నిర్ణయించారు. ఈ రంగాల్లో చైనా పెట్టుబడులను 60 రోజుల్లోగా ప్రాసెస్ చేస్తామని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

అయితే, కంపెనీలో మెజార్టీ వాటా ఎల్లప్పుడూ భారతీయ పౌరుని వద్దనే ఉండాలని తెలిపింది.

ఆటోమెటిక్

చైనా వాటా 10 శాతం వరకు ఉన్న పెట్టుబడిదారులు ఆటోమేటిక్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టేందుకు అనుమతించింది. అయితే, ఇది ఆయా రంగాల పరిమితులకు లోబడి ఉండాలని పేర్కొంది.

ఎఫ్‌డీఐల రాకను పెంచేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు సాయపడతాయని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

'' కొత్త మార్గదర్శకాలు భారత్‌లో సులభతరమైన వ్యాపారాన్ని ప్రోత్సహించనున్నాయని భావిస్తున్నాం. అత్యధికంగా ఎఫ్‌డీఐల రాకకు, సరికొత్త సాంకేతికతలను పొందడానికి, భారత కంపెనీల విస్తరణకు, ప్రపంచ సరఫరా చెయిన్ల సమగ్రతకు దోహదపడే పెట్టుబడులను ఇవి ప్రోత్సహిస్తాయని భావిస్తున్నాం'' అని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

చైనాతో భారత వాణిజ్య లోటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్లు, మెషినరీ దిగుమతుల వల్ల 99 బిలియన్ డాలర్లకు (రూ.9,14,804 కోట్లకు) పెరిగిందని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

చైనా సాంకేతికత, మూలధనంపై ఆధారపడ్డ తయారీదారులను 2020 నాటి ఆంక్షలు ఎక్కువగా ప్రభావితం చేయడంతో, ప్రస్తుత ఆంక్షల సడలింపు ఈ పరిశ్రమల డిమాండ్‌ను పెంచుతాయి.

భారత్-చైనా సంబంధాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-చైనా సంబంధాలు

సంబంధాల పునరద్ధరణ ప్రయత్నాలు ముమ్మరం

''అమెరికా సుంకాలు సృష్టించిన సరికొత్త గ్లోబల్ ఆర్డర్, చైనాతో సంబంధాలు సమతుల్యమైన విధానంలో ఉండేలా.. భారత్‌ను పునరాలోచించుకునేలా చేసింది. దీంతో సరఫరా చెయిన్లు స్థిరంగా ఉండి, పెట్టుబడులను ఆకర్షించవచ్చు'' అని దిల్లీకి చెందిన ఫోర్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనా సంబంధాల నిపుణుడు, ప్రొఫెసర్ ఫైసల్ అహ్మద్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

''ఈ నిర్ణయం కోసం ఎంతో కాలంగా వేచిచూశారు. ఇరు దేశాలకు ఇది ప్రయోజనాన్ని చేకూర్చతుంది'' అని తెలిపారు.

ఏడేళ్ల తర్వాత తొలిసారి ఈ ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరిచే విధానాల గురించి ఇరువురు నేతలు చర్చించారు.

ఆ తర్వాత భారత్, చైనాల మధ్య నేరుగా విమాన ప్రయాణాలను పునరుద్ధరించారు. లద్దాఖ్‌లో జరిగిన సైనిక ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ ప్యాసెంజర్ విమానాలను తిరిగి ప్రారంభించారు.

చైనా పౌరులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను భారత్ సులభతరం చేయడం కూడా మొదలుపెట్టింది.

అదేవిధంగా, భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు చైనా కంపెనీలు బిడ్డింగ్ వేయకుండా నిరోధించేలా 2020లో తీసుకొచ్చిన నిబంధనలను ఎత్తివేయడాన్ని కూడా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

ప్రభుత్వ రంగానికి చెందిన విద్యుత్, బొగ్గు కంపెనీలు చైనా పరికరాలు కొనేందుకు ఉన్న ఆంక్షలను కూడా గత నెలలో భారత్ సడలించిందని రాయిటర్స్ నివేదించింది.

''ఈ మార్పు సరిహద్దు దేశాల మధ్య విలీనాలను, కొనుగోళ్లను, మైనార్టీ పెట్టుబడులను, నిలిచిపోయిన నిధుల చర్చలను ప్రోత్సహించనుంది. ఇది ముఖ్యంగా తయారీ, స్టార్టప్ వంటి మూలధనం ఎక్కువగా అవసరమయ్యే రంగాలను ప్రభావితం చేస్తుంది'' అని లా సంస్థ సరాఫ్ అండ్ పార్టనర్స్ సీనియర్ పార్టనర్ వైభవ్ కక్కర్ రాయిటర్స్‌కు తెలిపారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఈ నిర్ణయం భారత్ ఎందుకు తీసుకుంది?

అమెరికా సుంకాల యుద్ధంతో గత ఏడాది కాలంగా భారత్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అమెరికా సుంకాలను తగ్గించినప్పటికీ, అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే, భారత్‌కు బలమైన ఆర్థిక భాగస్వామి కావాల్సి ఉంది.

''భారత్‌లో మూలధన పెట్టుబడిపై ఆసక్తి ఉంది. చైనాలో అత్యధిక సామర్థ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహిస్తే, ఇది రెండు దేశాలకు ప్రయోజనకరం'' అని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చెప్పారని ఆంగ్ల వార్తాపత్రిక ది హిందూ తెలిపింది.

అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టడం కంటే భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రిటర్నులను చైనా పొందవచ్చని అధికారులు చెప్పారు.

''మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులతో ప్రపంచంలో అనిశ్చితి వాతావరణం పెరగడంతో, భారత్, చైనాలు దగ్గరవ్వాల్సిన అవసరం ఉంది. చైనా పెట్టుబడులు భారత్‌కు వస్తే, భారత్‌లో గ్లోబల్ వాల్యూ చెయిన్ బలోపేతమవుతుంది'' అని ప్రొఫెసర్ ఫైసల్ అహ్మద్ తెలిపారు.

''దేశంలో సెమీకండక్టర్ మిషన్‌ గురించి చర్చలు జరుగుతున్నందున, మేకిన్ ఇండియాకు ఇది ప్రయోజనకరం. పెట్టుబడులు లేకపోతే, ఇలాంటి ప్రణాళికలు ఒక రూపు దిద్దుకోలేవు. ఇక రెండోది, చైనా తన వద్దనున్న అత్యధిక సామర్థ్యాన్ని వివిధ ప్రాంతాలకు అందించాలని చూస్తోంది. అందుకే, బెల్ట్ అండ్ రోడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించింది. వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టింది'' అని చెప్పారు.

గత ఏడాది కాలంగా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశీయ ప్రైవేట్ పెట్టుబడులు అనుకున్న స్థాయిలో పెరగడం లేదు. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు దేశాన్ని విడిచి వెళ్తున్నాయి.

ఆర్‌బీఐ 2025 డిసెంబర్‌లో విడుదల చేసిన రిపోర్టులో.. గతేడాది సెప్టెంబర్‌లో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అవుట్‌ఫ్లోలు 1.66 బిలియన్ డాలర్లుగా, అక్టోబర్‌లో 1.55 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

''ఎఫ్‌డీఐల రాక పెరిగితే దేశీయంగా పెట్టుబడులకు ఊతమిస్తుంది. తయారీ రంగం పెరిగితే, దాని సంబంధిత పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి'' అని ఫైసల్ అహ్మద్ చెప్పారు.

''ఈ విషయంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి క్రిటికల్ రంగాలు చాలా ముఖ్యమైనవి. ఈ రంగాల విషయంలో ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా.. ఆశించిన రీతిలో పురోగతి కనిపించడం లేదు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది'' అని పేర్కొన్నారు.

''వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను పెంచుకోవాలని రెండూ దేశాలు ఆశిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019లో ప్రాంతీయ సమగ్ర భాగస్వామ్యం (ఆర్‌సీపీ) నుంచి మనం వైదొలిగాం. కానీ, ఇదే సమయంలో చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాం. అయితే, చైనాతో ఎఫ్‌టీఏ లేదు. ఆర్థిక సహకారానికి ఇదొక్కటే కీలకం కాదు. కానీ, పెట్టుబడుల ద్వారా దీన్ని కూడా సాధించవచ్చు'' అని చెప్పారు.

''అయితే, భారత్‌లో చైనా కంపెనీలు కార్యకలాపాలు సాగించడం లేదని కాదు. ఎలక్ట్రానిక్స్ రూపంలోనైనా, మొబైల్ ఫోన్ల ద్వారా.. చైనా కంపెనీలు ఇప్పటికే భారత్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులను, మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. కానీ, భారత ఈవీ మార్కెట్‌ను చైనా కంపెనీలు ఇంకా చేరుకోలేకపోతున్నాయి'' అన్నారు.

ఈవీల్లో చైనా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంది. ఒకవేళ భారత్‌లో ఇది పెట్టుబడి పెడితే.. అనుబంధ పరిశ్రమ వృద్ధి చెందనుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. చైనా కార్ల కంపెనీ బీవైడీ చైనాలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మరింత ప్రయోజనకరంగా మారవచ్చు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాలకు ప్రయోజనకరం కానుందని ఫైసల్ అహ్మద్ అన్నారు.

చైనా విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంలో దీన్నొక యూటర్న్‌గా నిపుణులు చూస్తున్నారు.

''చైనాను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, భారత్ తనతో సరిహద్దును పంచుకున్న దేశాలన్నింటితో ఉన్న ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది'' అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ చెప్పారు.

చైనాతో సంబంధాలను సాధారణంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న చాలా కార్యక్రమాల్లో ఇదొకటి అన్నారు.

''2020 చొరబాటు తర్వాత చైనాతో సంబంధాలు తెంచుకోవడానికి భారత్ గట్టిగా ప్రయత్నించింది. కానీ ఇప్పుడు చైనా సప్లై చెయిన్‌పై మరింతగా ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఫలితంగా భారత్‌తో చైనా ద్వైపాక్షిక వాణిజ్య మిగులు పెరుగుతూ ఉంది. అది ఇప్పటికే ఇండియా వార్షిక రక్షణ బడ్జెట్‌ను మించిపోయింది'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)