ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని సూచించిన అమెరికన్ కమిషన్ రిపోర్ట్‌లో ఇంకా ఏముంది? భారత్ స్పందనేంటి?

భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్ఎస్ఎస్‌‌
    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌, భారత నిఘా సంస్థ 'రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్' (రా)ను నిషేధించాలని సూచిస్తూ అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్ఎఫ్) ఇచ్చిన నివేదికను భారత ప్రభుత్వం తీవ్ర విమర్శలతో తిరస్కరించింది.

ఈ నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని, దురుద్దేశపూర్వకమైనదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు, ఈ నివేదికపై తాము ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని దిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం 'కేశవ్ కుంజ్' మీడియా విభాగం బీబీసీ న్యూస్ హిందీకి తెలిపింది.

ఆర్ఎస్ఎస్ భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ ఆంబేకర్‌ను దీనిపై బీబీసీ సంప్రదించగా ఆయన సమాధానం ఇవ్వలేదు.

గతంలోనూ యూఎస్‌సీఐఆర్ఎఫ్ మత స్వేచ్ఛ నివేదికలను భారత్ తిరస్కరించింది.

తాజా నివేదిక కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న పక్షపాత ధోరణిలో భాగమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ సిఫార్సులను అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. చిత్రంలో ఉన్నది అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (ఫైల్ ఫోటో).

ఆంక్షలకు సిఫారసు

భారత్‌ను 'ప్రత్యేక ఆందోళనకరమైన దేశం' (సీపీసీ)గా గుర్తించాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ తన తాజా నివేదికలో అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. భారత్‌లో మత స్వేచ్ఛ నిరంతరం క్షీణిస్తోందని ఆ సంస్థ అభిప్రాయపడింది.

భారత నిఘా సంస్థ 'రా' , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లపై మత స్వేచ్ఛ ఉల్లంఘనకు సంబంధించి యూఎస్‌సీఐఆర్ఎఫ్ తీవ్ర ఆరోపణలు చేసింది.

'రా', ఆర్ఎస్ఎస్‌లపై లక్షిత ఆంక్షలు విధించాలని, వాటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులను ఫ్రీజ్ చేయాలని, వారి అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలని కోరింది.

భారత్‌కు అమెరికా అందించే భద్రత సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అక్కడి మత స్వేచ్ఛ పరిస్థితుల అనుగుణంగా ఉండాలని, అలాగే 'ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్' కింద భారత్‌కు ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని కూడా ఈ నివేదికలో సూచించింది.

అయితే, ఇవి కేవలం సిఫారసులు మాత్రమే, వాటిని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు.

భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఏమిటీ యూఎస్‌సీఐఆర్ఎఫ్?

యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్ఎఫ్ ) అనేది అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన కొందరు సభ్యులతో కూడిన ఒక స్వతంత్ర కమిషన్, ప్రభుత్వ సంస్థ.

అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం కింద 1998లో ఈ కమిషన్‌ను స్థాపించారు. ఈ ఫెడరల్ ప్రభుత్వ సంస్థ అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది.

యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఏటా అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను పెంపొందించేందుకు అమెరికా అధ్యక్షుడు, ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్‌లకు విధానపరమైన సిఫారసులు చేస్తుంది.

మత స్వేచ్ఛకు సంబంధించి నిరంతర, తీవ్రమైన, వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరుగుతున్న దేశాలను ఈ కమిషన్ గుర్తిస్తుంది.

ఈ కమిషన్ సిఫారసుల మేరకు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలాంటి దేశాలను 'ప్రత్యేక ఆందోళనకరమైన దేశాలు' (సీపీసీ), 'ప్రత్యేక పర్యవేక్షణ జాబితా' (ఎస్‌డబ్ల్యూఎల్)లో చేరుస్తుంది.

ఈ నివేదికలో భారత్ కాకుండా మియన్మార్, క్యూబా, చైనా, ఎరిత్రియా, ఇరాన్, నికరాగ్వా, నైజీరియా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లను మళ్లీ సీపీసీలో చేర్చాలని సిఫార్సు చేశారు.

అయితే, ఈ దేశాలు ఇప్పటికే 2023 డిసెంబర్ 29న ప్రచురించిన సీపీసీ జాబితాలో ఉన్నాయి.

అక్టోబర్ 2025లో నైజీరియాను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తిరిగి సీపీసీలో చేర్చారు.

ఈసారి భారత్, అఫ్గానిస్తాన్, లిబియా, సిరియా, వియత్నాంలను కూడా ఈ జాబితాలో చేర్చాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ సూచించింది. 2026 సంవత్సరానికి గాను ఈ సిఫారసులపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలేమీ తీసుకోలేదు.

భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

నివేదికలో ఏముంది?

2025లో భారత్‌లో మత స్వేచ్ఛా స్థితిగతులు క్షీణించాయని యూఎస్‌సీఐఆర్ఎఫ్ తాజా నివేదిక ఆరోపించింది. ఈ ఆరోపణలతో భారత్‌ను సీపీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది.

భారత్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మైనారిటీల మత స్వేచ్ఛను లక్ష్యంగా చేసుకునేలా చట్టాలు ఆమోదం పొందాయని అభిప్రాయపడింది. ప్రభుత్వం శరణార్థులను దేశం నుంచి వెళ్లగొడుతోందని, హిందూత్వ, జాతీయవాద సమూహాలు మైనారిటీలపై దాడులను పెంచాయని ఆరోపించింది.

చట్టమంటే ఎలాంటి భయం లేకుండా క్రైస్తవులు, ముస్లింలపై హిందూత్వ సమూహాలు దాడులు చేస్తున్నాయని నివేదిక ఆరోపించింది.

"శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా ఏడాది పొడవునా, పలు రాష్ట్రాల్లో హిందూ జాతీయవాద గ్రూపులు ముస్లింలను, క్రైస్తవులను వేధించాయి, రెచ్చగొట్టాయి, వారిపై హింసను ప్రేరేపించాయి" అని నివేదిక ఆరోపించింది.

"2025 మార్చిలో మహారాష్ట్రలో ఒక హిందూ జాతీయవాద సమూహం (విశ్వ హిందూ పరిషత్) 17వ శతాబ్దపు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేసింది, దీనివల్ల హింస చెలరేగింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది" అని యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదిక పేర్కొంది.

ఒడిశాలో క్రైస్తవులపై హింస జరిగిందంటూ నివేదికలో ప్రస్తావించారు. ‘2025 జూన్‌లో హిందూ మతంలోకి మారడానికి నిరాకరించినందుకు 20 క్రైస్తవ కుటుంబాలపై హిందూ జాతీయవాద మూక దాడి చేసింది. ఈ దాడుల సమయంలో పోలీసులు జోక్యం చేసుకోలేదు, ఎనిమిది మంది గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్చారు" అని తెలిపింది.

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన దాడి తర్వాతి పరిణామాలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది.

"కశ్మీర్‌లో మత గుర్తింపు ఆధారంగా హిందూ పర్యటకులపై జరిగిన దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత్‌లో ముస్లిం వ్యతిరేక భావజాలం పెరిగింది" అని నివేదిక పేర్కొంది.

"కశ్మీర్ దాడిలో మరణించిన వారి కోసం పగ తీర్చుకుంటామని ఒక హిందూ జాతీయవాద సమూహానికి చెందిన సభ్యులు ప్రతిజ్ఞ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం రెస్టారెంట్ ఉద్యోగిని కాల్చి చంపారు. 2025 మేలో 15 మంది క్రైస్తవులతో సహా 40 మంది రోహింగ్యా శరణార్థులను భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అంతర్జాతీయ జలాల్లోకి తీసుకెళ్లి, లైఫ్ జాకెట్లు తప్ప మరేమీ ఇవ్వకుండా బర్మా తీరం వరకు ఈదుకుంటూ వెళ్లేలా ఒత్తిడి చేశారు" అని నివేదిక పేర్కొంది.

"2025 జులైలో, అస్సాంకు చెందిన వందలాది మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలను భారతీయ పౌరులైనప్పటికీ అధికారులు బంగ్లాదేశ్‌కు పంపారు. వీరిని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం 'చొరబాటుదారులు'గా అధికార బీజేపీ అభివర్ణించింది" అని నివేదికలో రాశారు.

కొత్త వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చారని నివేదిక తెలిపింది.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ముందు రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేశారని తెలిపింది. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రంలోని ముస్లింల మదర్సాలతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారశీకుల విద్యా సంస్థలు నేరుగా ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయని నివేదిక పేర్కొంది.

భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రణధీర్ జైస్వాల్

భారత ప్రభుత్వ స్పందనేమిటి?

యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదిక పూర్తిగా ప్రేరేపితమైనదిగా, పక్షపాతపూరితమైనదిగా పేర్కొంటూ భారత ప్రభుత్వం తిరస్కరించింది.

ఈ నివేదిక వాస్తవాల కంటే భావజాలపరమైన కథనాలపై ఆధారపడి ఉందని విమర్శించింది.

గత కొన్నేళ్లుగా భారత్‌పై వక్రీకరించిన, ఉద్దేశపూర్వక అంశాలను ప్రదర్శించడానికే యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్రయత్నిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నివేదిక వాస్తవ ఆధారాలకు బదులుగా సందేహాస్పదమైన, భావజాలపరమైన కథనాల ఆధారంగా రూపొందిందని చెప్పారు. ఇటువంటి తప్పులు పదేపదే చేయడం వల్ల కమిషన్ విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతుదని జైస్వాల్ అన్నారు.

"భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానేసి, అమెరికాలో జరుగుతున్న అల్లర్లు, హిందూ దేవాలయాలపై దాడులు, భారతీయ సమాజంపై పెరుగుతున్న అసహనం వంటి ఘటనలపై యూఎస్‌సీఐఆర్ఎఫ్ దృష్టి సారించాలి" అన్నారు.

భారత్, ఆర్ఎస్ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యూఎస్సీఐఆర్ఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ విమర్శలు

యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదిక వెలువడిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

"ప్రజల మత స్వేచ్ఛకు ఆర్ఎస్ఎస్ ప్రమాదకరమని యూఎస్‌సీఐఆర్ఎఫ్ చెబుతోంది. మతం ఆధారంగా వివక్షను పెంచడానికి ఇది కారణమవుతోంది" అని కాంగ్రెస్ తన 'ఎక్స్' పోస్ట్‌లో రాసింది.

"ఆర్ఎస్ఎస్‌పై తక్షణమే నిషేధం విధించాలని, దాని ఆస్తులను జప్తు చేయాలని, అమెరికాలోకి ఆర్ఎస్ఎస్‌ సభ్యుల ప్రవేశాన్ని నిషేధించాలని" కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

మహాత్మా గాంధీ హత్య తర్వాత సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించారని కాంగ్రెస్ తన పోస్ట్‌లో గుర్తు చేసింది.

"మనుస్మృతితో దేశాన్ని నడపాలని వాదించే రాజ్యాంగ వ్యతిరేక ఆర్ఎస్ఎస్‌, దేశ ఐక్యతకు, సోదరభావానికి విషం వంటిది" అని కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ విషయంపై కేంద్ర మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందిస్తూ, "వారు ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలోనైనా, ఆ తర్వాతనైనా ఆర్ఎస్ఎస్‌ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది, సానుకూల పనులు చేస్తోంది. సంస్థలు చెడ్డవి కావు, కొందరు వ్యక్తులు చెడ్డవారు కావచ్చు. అటువంటి వ్యక్తులపై నిషేధం విధించాలి" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)