మ్యాక్స్‌వెల్: ‘నేను జవాబు చెప్పను' అని పార్లమెంట్ కమిటీ విచారణలో కూడా ఈమె ఎలా చెప్పగలిగారు? ఆమెకున్న ప్రత్యేక హక్కు ఏంటి?

ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్, యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, ఎప్‌స్టీన్, ఫిఫ్త్ అమెండ్‌మెంట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కైట్లిన్ విల్సోనంద్, కై పిగ్లియూక్కి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికన్ హౌస్ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ సహచరురాలు, జైలుశిక్ష అనుభవిస్తున్న ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్ నిరాకరించారు.

ప్రస్తుతం టెక్సస్ జైలులో ఉన్న మ్యాక్స్ వెల్ వర్చువల్‌గా కమిటీ ముందు హాజరయ్యారు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఆమె 20ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

విచారణ సమయంలో సమాధానమివ్వకుండా ‘మౌనం’గా ఉండేందుకు ఫిఫ్త్ అమెండ్‌మెంట్ ద్వారా ఆమెకు సంక్రమించిన హక్కును ఉపయోగించుకున్నారు. ఇది తాము ఊహించామని రిపబ్లికన్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ చైర్మన్ జేమ్స్ కమర్ అన్నారు.

"ఇది సహజంగానే నిరాశను కలిగించింది. ఎప్‌స్టీన్‌తో కలిసి ఆమె చేసిన నేరాలు, వారికి సహకరించిన ఇతర వ్యక్తుల గురించి మాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అమెరికన్ ప్రజలకు వాస్తవాలు తెలియాని మేము కోరుకుంటున్నాం. అలాగే బాధితులకు న్యాయం జరగాలి. అందుకే ఈ విచారణ" అని కమర్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్, యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, ఎప్‌స్టీన్, ఫిఫ్త్ అమెండ్‌మెంట్

ఫొటో సోర్స్, House ovesight Committee screengrab

ఫొటో క్యాప్షన్, యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విచారణకు మ్యాక్స్‌వెల్ వర్చువల్‌గా హాజరయ్యారు.

కమిటీ ముందు నోరు విప్పని మ్యాక్స్‌వెల్

అమెరికన్ రాజ్యాంగంలోని ఐదో సవరణ ప్రకారం కేసుల విచారణలో భాగంగా నేరంలో తన ప్రమేయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం నిరాకరించే హక్కు లభిస్తుంది.

ఈ సవరణ ప్రకారం, ప్రమాణం చేసినప్పటికీ వారు ఏ సమాధానమివ్వకుండా మౌనంగా ఉండవచ్చు.

తన ‘క్షమాభిక్ష క్యాంపెయిన్’ కోసం మ్యాక్స్‌వెల్ ఈ అవకాశాన్ని వాడుకున్నారని డెమొక్రటిక్ ప్రతినిధి మెలైన్ స్టాన్స్ బరీ రిపోర్టర్లతో చెప్పారు.

ఎప్‌స్టీన్ బాధితులతో మాట్లాడిన తర్వాత "మ్యాక్స్‌వెల్ చాలా చెడ్డ వ్యక్తి" అని స్పష్టమైందని కమర్ చెప్పారు. చట్టపరంగా ఆమెకు ఎలాంటి రక్షణ కల్పించకూడదని అన్నారు.

"ట్రంప్ కనుక క్షమాభిక్ష పెడితే, పూర్తి నిజాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు" అని మ్యాక్స్‌వెల్ న్యాయవాది డేవిడ్ ఆస్కార్ మార్కస్ గతంలో సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.

"కేవలం ఆమె మాత్రమే పూర్తి వివరాలు చెప్పగలరు. ఆమె చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నిజాలు ఎప్పుడూ నిజాలే" అని ఆయన ఆ పోస్టులో రాశారు.

మ్యాక్స్‌వెల్‌ను విచారించేందుకు బయల్దేరడానికి ముందు హౌస్ ఓవర్‌సైట్ కమిటీకి ఎప్‌స్టీన్ బాధితుల బృందం లేఖ రాసింది.

విచారణలో మ్యాక్స్‌వెల్ చెప్పే సమాధానాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆ లేఖలో కోరింది.

ఎప్‌స్టీన్ నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యవహారంలో అనేకమంది "పవర్‌ఫుల్ వ్యక్తులను" గుర్తించేందుకు ఆమె నిరాకరించారని వాళ్లు విమర్శించారు.

న్యాయవర్గాలకు సహకరించేందుకు కూడా ఆమె నిరాకరించిందని వారు ఆరోపించారు. ఆమె విషయంలో "స్పెషల్ ట్రీట్‌మెంట్" లేదా ఆమె చెప్పే "వాంగ్మూలాన్ని విశ్వసించడం" లాంటివి బాధితుల పట్ల ఉపద్రవంలా మారతాయని వారు అన్నారు.

మ్యాక్స్‌వెల్‌కు క్షమాభిక్ష పెట్టే అంశం గురించి ఎలాంటి చర్చ జరగలేదని వైట్‌హౌస్ గతంలో తెలిపింది.

ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్, యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, ఎప్‌స్టీన్, ఫిఫ్త్ అమెండ్‌మెంట్

ఫొటో సోర్స్, The US Justice Department

ఫొటో క్యాప్షన్, ఎప్‌స్టీన్‌తో మ్యాక్స్‌వెల్ ఉన్న ఫోటోలను అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది.

ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌లో ఏముంది?

అమెరికన్ రాజ్యాంగంలోని ఫిప్త్ అమెండ్‌మెంట్‌లో, నేరస్థులు తమను తాము నేరస్థులుగా నిరూపించుకోవడానికి అవకాశమిచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండొచ్చు. ఈ హక్కుకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.

ఒక నేరంలో చిక్కుకున్న వ్యక్తిని రెండుసార్లు విచారించడం లేదా శిక్షించడం నుంచి ఈ నిబంధన కాపాడుతుంది. ఈ సవరణ కింద విచారణలో అధికారులు లేదా కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండవచ్చు. ది హిందూ పత్రిక కథనం ప్రకారం ఇందులో కీలక అంశాలు ఇలా ఉంటాయి.

1. గ్రాండ్ జ్యూరీ నేరారోపణ

న్యాయస్థానం అనుమతి లేదా నేరారోపణ లేకుండా వ్యక్తులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపకుండా ఈ సవరణ అడ్డుకుంటుంది.

2. సైనిక సేవలకు మినహాయింపులు

యుద్ధం లేదా ప్రమాద సమయాల్లో భూమి లేదా సముద్ర దళం, లేదా సైన్యంపై కేసులు పెట్టకుండా ఐదో సవరణ మినహాయింపు ఇచ్చింది.

3. రెండుసార్లు శిక్షించడం లేదా విచారించడం

ఒక వ్యక్తి ఒక కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత లేదా దోషిగా తేలిన తర్వాత అదే కేసులో మరోసారి అతనిని విచారించడం లేదా శిక్షించకుండా ఈ సవరణ ఆపుతుంది. ఒక నేరానికి సంబంధించి పదే పదే విచారణ వల్ల ఎదురయ్యే ఆర్థిక, మానసిక సమస్యల నుంచి ఇది ప్రజలకు రక్షణ కల్పిస్తుంది.

4. స్వీయ నేర నిర్ధరణ

క్రిమినల్ కేసుల్లో నిందితులు లేదా దోషులు తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు ఈ సవరణ అనుమతిస్తుంది. ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌ను స్వీయ నేరారోపణకు వ్యతిరేక హక్కుగా భావిస్తారు.

5. చట్టపరమైన ప్రక్రియ

చట్టంలో పేర్కొన్న విధానాన్ని పాటించకుండా ఓ వ్యక్తి జీవితం, స్వేచ్ఛ లేదా ఆస్తులు కోల్పోకుండా ఈ సవరణ హామీ ఇస్తుంది. దీనర్ధం ఏంటంటే చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం న్యాయప్రక్రియ పారదర్శకంగా ఉండాలి.

6. ప్రైవేటు ఆస్తులకు రక్షణ

ప్రజా అవసరాల కోసం ప్రైవేటు ఆస్తిని సేకరించేటప్పుడు ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించినప్పటికీ, మార్కెట్ విలువ ప్రకారం సరైన పరిహారం చెల్లించిన తర్వాతే వాటిని సేకరించాలని ఐదో సవరణ చెబుతోంది. పార్కులు, పాఠశాలలు, రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రైవేటు ఆస్తుల్ని సేకరించేటప్పుడు ఆస్తి యజమానికి న్యాయబద్దమైన పరిహారం చెల్లించాలని ఈ సవరణ చెబుతోంది.

ఘిస్లెయిన్ మ్యాక్స్‌వెల్, యూఎస్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ, ఎప్‌స్టీన్, ఫిఫ్త్ అమెండ్‌మెంట్

ఫొటో సోర్స్, us department of justice

ఫొటో క్యాప్షన్, జైలులో వ్యాయామం చేస్తున్న మ్యాక్స్‌వెల్ వీడియోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది.

మ్యాక్స్‌వెల్ ఎందుకు ఐదో సవరణ లేవనెత్తారు?

ప్రస్తుతం ఈ కేసులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌ను ఉపయోగించుకోవాలని తాను మ్యాక్స్‌వెల్‌కు సూచించినట్లు ఆమె న్యాయవాది డేవిడ్ మార్కస్ తెలిపారు.

ఎప్‌స్టీన్‌కు మైనర్ బాలికలను సరఫరా చేసిన కేసులో 2021లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఎప్‌స్టీన్ 2019లో జైలులో మరణించారు.

తనకు క్షమాభిక్ష పెట్టాలని మ్యాక్స్‌వెల్ అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు.

ఈ కేసులో నలుగురు ప్రముఖులు తమకు సహకరించారని, ఎప్‌స్టీన్ కేసులో వెలుగులోకి రాని మరో 25 మంది ఉన్నారని మ్యాక్స్‌వెల్ గతేడాది కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. కమిటీ విచారణ సందర్భంగా ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలని భావించినట్లు డెమొక్రటిక్ ప్రతినిధి ఆర్వో ఖన్నా చెప్పారు.

చనిపోయిన ఫైనాన్షియర్‌కు డోనల్డ్ ట్రంప్‌తో ఉన్న "సామాజిక సంబంధం" గురించి, ఆమెకు క్షమాభిక్ష పెట్టే విషయమై ట్రంప్ ఎప్పుడైనా ఆమె న్యాయవాదులతో చర్చించారా అనే దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నట్లు ఖన్నా చెప్పారు.

ఓవర్‌సైట్ కమిటీ ముందు మ్యాక్స్‌వెల్ నోరు విప్పకపోవడం గురించి ప్రస్తావిస్తూ "గతంలో ఆమె వ్యవహారశైలితో పోలిస్తే, ఆమె వ్యక్తిత్వంలో పరస్పరం విరుద్దమైన ప్రవర్తన కనిపిస్తోంది. గతంలో ఇదే కేసు గురించి మాట్లాడేందుకు అటార్నీ జనరల్ టోడ్‌ బ్లాంచే ఆమెను కలిసినప్పుడు ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌ ఉపయోగించుకోలేదు" అని ఖన్నా తెలిపారు.

గతేడాది జులైలో ఆమె బ్లాంచేతో మాట్లాడినప్పుడు ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అసహజంగా ప్రవర్తించడం తానెన్నడూ చూడలేదని, ఎప్‌స్టీన్ 'క్లైంట్ లిస్ట్' అనేది ఏదీ లేదని చెప్పినట్లు జస్టిస్ డిపార్ట్‌మెంట్ డాక్యుమెంట్ చెబుతోంది. టోడ్ బ్లాంచే గతంలో ట్రంప్ న్యాయవాదిగా పని చేశారు.

పార్లమెంట్ కమిటీ సోమవారం నిర్వహించిన విచారణ వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే జరగాల్సి ఉంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఆగాలని మ్యాక్స్‌వెల్ లాయర్లు కోరడంతో కమర్ విచారణ వాయిదా వేశారు.

ఇంకా విడుదల చేయని ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో పారదర్శకత పాటించాలని ఎప్‌స్టీన్ బాధితుల బృందం ఆదివారం ఒక వీడియో విడుదల చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)