వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు.. ట్రంప్, మెలానియాను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్.. అనుమానితుడి ఫొటో షేర్ చేసిన అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Getty Images
తుపాకీ కాల్పులుగా అనుమానిస్తున్న శబ్దాలు వినిపించడంతో వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ (విలేఖరుల విందు) నుంచి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను భద్రతా సిబ్బంది హుటాహుటిన తరలించారు.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా కాల్పుల అలజడి రేగడంతో ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.
బిగ్గరగా శబ్దాలు వినిపించగానే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
'అందరూ కిందకు వంగండి, కిందకు వంగండి' అని అరుస్తూ రక్షణ కవచంలా మారి ట్రంప్‌ను ఆ వేదిక నుంచి దూరంగా తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, Reuters
కాల్పుల శబ్దం వినగానే..
ట్రంప్ ప్రధాన సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌ను కూడా అక్కడి నుంచి క్షేమంగా బయటకు తీసుకురావడం కనిపించింది.
విందులో ఉన్న మిగిలిన వారంతా మొదట భయంతో కూర్చుండిపోయారు.
కానీ, అధ్యక్షుడు వెళ్లిపోయిన తర్వాత కూడా వారు వేదిక లోపలే ఉండిపోయారు.
షూటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో వెల్లడించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
'అదుపులో అనుమానితుడు'
ఒక షూటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏజెంట్లు మాట్లాడుకోవడం తాము విన్నామని వైట్ హౌస్ పూల్ సమాచారం ఇచ్చింది.
వైట్ హౌస్ పూల్ అంటే ప్రతిరోజూ అధ్యక్షుడికి సంబంధించిన వార్తలను కవర్ చేయడానికి కేటాయించిన రచయితలు, ఫోటోగ్రాఫర్లు, సాంకేతిక నిపుణులతో కూడిన ఒక బృందం.
రాబర్ట్ కెనడీ జూనియర్ కుంటుతూ నడవడం కనిపించిందని ఈ బృందం వెల్లడించింది.
తాను పలుమార్లు భారీ శబ్దాలు విన్నానని, సీక్రెట్ సర్వీస్ సిబ్బంది భద్రంగా తమను విందు వేదిక అయిన బాల్రూమ్ నుంచి బయటకు పంపిచారని పూల్‌కు చెందిన విలేఖరి ఒకరు తెలిపారు.
'కాల్పులు జరుగుతున్నాయి' అని అరుస్తూ తమను భద్రతా సిబ్బంది వెనక్కి నెట్టేశారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఏడు నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు'
డిన్నర్ సమయంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆ విందులో పాల్గొన్న వైట్‌హౌస్ పూల్ రిపోర్టర్లు అందిస్తున్నారు.
ఏడు నుంచి ఎనిమిది రౌండ్ల తుపాకీ కాల్పులు జరిగాయని అక్కడి తాజా పరిస్థితిపై అవగాహన ఉన్న ఒక భద్రతా అధికారి వెల్లడించారు.
అనుమానితుడు పట్టుబడ్డాడా? చనిపోయాడా? అనే విషయంలో వేర్వేరు వార్తలు వస్తున్నాయి.
అయితే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్.. 'షూటర్ పట్టుబడ్డాడు' అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























