జనరల్ నరవణే ఎవరు? ఇంకా పబ్లిష్ కాని ఆయన పుస్తకంలో ఏం ఉంది? ఎందుకింత చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
సోమ, మంగళవారాల్లో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగం వివాదానికి దారితీసింది.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ అనే పుస్తకం రాశారు. కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. అయితే కారవాన్ మ్యాగజైన్‌లో ఈ పుస్తకం పై వచ్చిన ఆర్టికల్‌లోని కొన్ని భాగాలను రాహుల్ చదివే ప్రయత్నం చేశారు.
లోక్‌సభలో సోమవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘దీన్ని ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు అని ఈ పత్రికలో నరవణే పేర్కొన్నారు. నేను దాని నుంచి ఐదు లైన్లు మాత్రమే చదవాలనుకుంటున్నాను" అని అన్నారు.
అయితే ఇంకా ముద్రించని పుస్తకంలోని అంశాలను ఎలా చదవుతారంటూ బీజేపీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పుడు రాహుల్ గాంధీ అధికార పార్టీ వైపు చూపిస్తూ.. ‘వారు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతారు, కానీ ఒక కోట్‌కు భయపడుతున్నారు. అందులో ఏం రాశారో అది వారిని భయపెడుతోంది. నేను చదవలేకపోతున్నా. వారు భయపడకపోతే నన్ను చదవనివ్వండి’ అని అన్నారు.

మీడియా నివేదికల ప్రకారం, రాహుల్ గాంధీ చదివిన అంశాలున్న, ఇంకా ముద్రణకాని పుస్తకం జనవరి 2024లో మార్కెట్లో విడుదల కావాల్సింది. అయితే భారత సైన్యం ఈ పుస్తకాన్ని పరిశీలిస్తోంది.
2024 జనవరిలో 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. పరిశీలన పూర్తయ్యే వరకు పుస్తకంలోని ఏ భాగాన్నీ లేదా సాఫ్ట్ కాపీలను ఎవరికీ ఇవ్వవద్దని ప్రచురణకర్త పెంగ్విన్ రాండమ్ హౌస్‌కు చెప్పినట్టు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మనోజ్ ముకుంద్ నరవణే ఎవరు?
జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే 2019 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో, గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగిన సమయంలో ఆయన భారత సైన్యాన్ని నడిపించారు.
మనోజ్ నరవణే తన ప్రాథమిక విద్యను పుణెలోని జ్ఞాన్ ప్రబోధిని పాఠశాలలో పూర్తి చేశారు. తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌వాస్లా(పుణె), ఇండియన్ మిలిటరీ అకాడమీల్లో చేరారు.. అనంతరం భారత సైన్యంలో ఆఫీసర్‌గా చేరారు.
నరవణే ఇందోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్ పూర్తి చేశారు. మనోజ్ నరవణే తండ్రి ముకుంద్ నరవణే వైమానిక దళ అధికారి. మనోజ్ నరవణే భార్య బోధన రంగంలో ఉన్నారు. నరవణే దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
జనరల్ నరవణే సైనిక జీవితంలో అతి ముఖ్యమైన మలుపు 2020 లద్దాఖ్ ప్రతిష్టంభన.
"అధికారిక సైనిక రికార్డులు, నరవణే ఇంతకుముందు చేసిన ప్రకటనల ప్రకారం, జూన్ 2020లో పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. చైనా బఫర్ జోన్ నుంచి తన గుడారాలను తొలగించడానికి నిరాకరించింది. కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత దళాలు వారిని ఆపడానికి వెళ్ళినప్పుడు, హింసాత్మక ఘర్షణ జరిగింది. జనరల్ నరవణే భారత వ్యూహంలో పెద్ద మార్పు చేశారు. అంతకుముందు, రక్షణాత్మక విధానం మాత్రమే ఉండేది, కానీ ఆయన 'ఆఫెన్సివ్ డిఫెన్స్' విధానాన్ని అనుసరించారు" అని ఎకనామిక్ టైమ్స్ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది.
"నరవణే కైలాశ్ రేంజ్‌లో భారత ట్యాంకులను మోహరించారు. ఈ చర్య చైనా సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేసింది. జూన్ 16, 2020ని తన కెరీర్‌లో 'అత్యంత విషాదకరమైన రోజు'గా ఆయన అభివర్ణించారు. ఆ రోజున 20 మంది సైనికులు అమరులయ్యారు" అని ఆ రిపోర్ట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
పుస్తకంలోని ఈ భాగాలు 2023లో మాత్రమే విడుదలయ్యాయి.
"2020లో తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఇది గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళికను కూడా ప్రస్తావిస్తుంది. ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణ కూడా ఈ పుస్తకంలో ఉంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో పేర్కొంది.
జనరల్ నరవణే రాసిన పుస్తకం నుంచి కొన్ని పేజీలను డిసెంబర్ 2023లో, వార్తా సంస్థ పీటీఐ ప్రచురించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది .
ఆగస్టు 31 సాయంత్రం జరిగిన సంఘటనలను కూడా ఇది వివరంగా పేర్కొంది. ఈ సంఘటన గురించి ఇప్పుడు కారవాన్ మ్యాగజైన్‌లో ఒక కథనం వచ్చింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ వ్యాసంలో ప్రచురించిన అంశాన్నే పార్లమెంటులో చదివే ప్రయత్నం చేశారు.
తరువాత, కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 31 సాయంత్రం గురించి ప్రస్తావించిన, కారవాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం పేజీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
నరవణే విజయాలు
లండన్ స్పీకర్స్ బ్యూరో ప్రకారం.. నరవణే పదవీకాలంలో "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో అనేక ప్రధాన ఆయుధ సమీకరణ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వాటి విలువ ₹11,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇది భారత సైన్యానికి సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే అధికారం కల్పించింది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో మహిళా క్యాడెట్లను అనుమతించే చారిత్రాత్మక నిర్ణయం కూడా నరవణే హయాంలోనే తీసుకున్నారు.
ఆర్మీ చీఫ్ కావడానికి ముందు.. నరవణే కోల్‌కతాలోని తూర్పు కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆయన దిల్లీలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా కూడా పనిచేశారు. ఆపరేషన్ పవన్ సమయంలో శ్రీలంకలో మోహరించిన భారత శాంతి పరిరక్షక దళంలో జనరల్ నరవణే సభ్యులు. ఆయన మూడేళ్లు మియన్మార్ రాయబార కార్యాలయంలో కూడా పనిచేశారు.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే.. జమ్మూకశ్మీర్‌లో బెటాలియన్‌కు నాయకత్వం వహించినందుకు ఆర్మీ మెడల్, నాగాలాండ్‌లో అస్సాం రైఫిల్స్ (నార్త్) ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేసినందుకు విశిష్ట సేవా పతకం, స్ట్రైక్ కార్ప్స్‌కు నాయకత్వం వహించినందుకు అతి విశిష్ట సేవా పతకం, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేసినందుకు పరమ విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














