అమ్మను చంపిన వ్యక్తితోనే 32 ఏళ్లు.. 'అది నాకు పడిన జీవిత ఖైదు'

 జెమ్మా అహెర్న్, బ్రిటన్, జేడ్స్ లా

ఫొటో సోర్స్, Gemma Ahern

ఫొటో క్యాప్షన్, తల్లి హత్యకు గురైనపుడు జెమ్మా వయసు మూడేళ్లు.
    • రచయిత, ఆంటోనియా మాథ్యూస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

తన తల్లిని తండ్రి 36 సార్లు పొడిచి చంపడాన్ని జెమ్మా అహెర్న్ చిన్నతనంలో ప్రత్యక్షంగా చూశారు. అయితే, ఆ తండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత జెమ్మా తిరిగి ఆయనతోనే ఉండాల్సి వచ్చింది.

1992లో ఈ ఘటన జరిగినప్పుడు జెమ్మా వయసు మూడేళ్లు. ఆ సమయంలో తండ్రి కత్తెరతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. విచారణలో ఆమె తండ్రిపై హత్యానేరం నిరూపణ కాలేదు, కానీ 'మాన్‌స్లాటర్' కింద దోషిగా తేలారు. నాలుగేళ్ల శిక్షలో సగం పూర్తి చేసుకున్న తర్వాత, జెమ్మాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తిరిగి సంరక్షణ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న జెమ్మా, 'జేడ్స్ లా'ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం, ఒక తల్లి లేదా తండ్రి తన భాగస్వామిని చంపి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు, వారి 'తల్లిదండ్రుల బాధ్యత' ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతుంది.

పిల్లలను, బాధిత కుటుంబాలను రక్షించడానికి దీనిని తక్షణమే అమలు చేయాలని ఉద్యమకారులు కోరుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఈ ఏడాది చివరి నాటికి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.

"ఈ మొత్తం వ్యవహారంలో నా క్షేమం కంటే నా తండ్రి క్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది" అని జెమ్మా అభిప్రాయపడ్డారు.

26 ఏళ్ల కరోల్ క్వింటన్ తన భర్త, కూతురితో కలిసి ఉంటున్న ఇంట్లోనే కత్తెరతో దాడికి గురయ్యారు. ఆమె గుండెపై 11 గాయాలతో సహా మొత్తం 36 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.

"ఆమె విడిపోవాలని (మరొకరితో వెళ్లాలని) అనుకుంది" అని జెమ్మా చెప్పారు.

తల్లిని చంపిన తర్వాత, జెమ్మాను కూడా వెంటబెట్టుకుని తండ్రి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

తమ బంధం ముగిసిపోతుందనే విషయంలో వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో జరిగిన దాడి గురించి తనకు ఏమీ గుర్తులేదని ఆయన కోర్టులో చెప్పారు.

నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ.. ఈ చర్య ఆయన వ్యక్తిత్వానికి విరుద్ధంగా జరిగిందని, ఆయన ఒక మంచి యువకుడిలా కనిపిస్తున్నారని జడ్జి జస్టిస్ స్మిత్ పేర్కొన్నట్లు 'బరీ టైమ్స్' రిపోర్ట్ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 జెమ్మా అహెర్న్, బ్రిటన్, జేడ్స్ లా

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, కరోల్ క్వింటన్ తన ఇంట్లోని బెడ్‌రూమ్‌లోనే 36 సార్లు కత్తిపోట్లకు గురయ్యారు.

మానసికంగా దెబ్బతిని..

తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, జెమ్మా కొన్నాళ్ల పాటు తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉన్నారు. ఆ తర్వాత, తండ్రి ఆదేశాల మేరకు నానమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. జైలు నుంచి తండ్రి విడుదలైన తర్వాత తిరిగి ఆయన వద్దకు జెమ్మా వెళ్లారు.

సంరక్షణ బాధ్యతలు పూర్తిగా తండ్రి చేతుల్లోనే ఉండటంతో జెమ్మా తండ్రి, సవతి తల్లి వద్దే పెరిగారు.

బాల్యం నుంచి యవ్వనం వరకు దేనినీ ప్రశ్నించకుండా ఒక 'ఆటో పైలట్' మోడ్‌లో గడిపారు జెమ్మా.

"నా బాల్యమంతా నా భావాలను దాచడానికే సరిపోయింది" అని ఆమె అన్నారు.

సంఘటనలు అర్థం కావడం మొదలైనప్పుడు ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింది.

పాత గాయాలు ఆమెను తీవ్రంగా వేధించాయి. దీనివల్ల ఆమె కాంప్లెక్స్ పీటీఎస్‌డీ, ఏడీహెచ్‌డీ బారిన పడ్డారు.

తన 30వ ఏట మాత్రమే అసలేం జరిగిందనేది లోతుగా తెలుసుకోవడం ప్రారంభించారు.

 జెమ్మా అహెర్న్, బ్రిటన్, జేడ్స్ లా

ఫొటో సోర్స్, Gemma Ahern

ఫొటో క్యాప్షన్, చిన్నతనంలో ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితుల కారణంగా జెమ్మా అహెర్న్ మానసిక సమస్యలతో పోరాడారు.

ఏమిటీ జేడ్స్ లా?

'జేడ్ వార్డ్' అనే మహిళ పేరు మీద ఈ చట్టాన్ని రూపొందించారు.

2021లో తన నలుగురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మాజీ భాగస్వామి రస్సెల్ మార్ష్ చేతిలో జేడ్ వార్డ్ హత్యకు గురయ్యారు. 2022లో మార్ష్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

అయితే, జైలు నుంచి ఆయన తన పిల్లల ఫోటోలు, స్కూల్ రిపోర్టులు పంపాలని కోరడం జేడ్ కుటుంబాన్ని కలవరపరిచింది.

ప్రస్తుత చట్టాల ప్రకారం.. భాగస్వామిని చంపినప్పటికీ, పిల్లల ఆరోగ్యం, విద్య వంటి కీలక నిర్ణయాల్లో పేరెంట్ ప్రమేయం తప్పనిసరి. దీన్ని వ్యతిరేకిస్తూ జేడ్ కుటుంబం చేసిన పోరాటం ఫలితంగా యూకేలో 2024 మేలో 'విక్టిమ్స్ అండ్ ప్రిజనర్స్ యాక్ట్ 2024' (సెక్షన్ 18) - 'జేడ్స్ లా' ఆమోదం పొందింది.

ఇది భాగస్వామిని చంపిన వారికి పిల్లలపై ఉండే హక్కులను రద్దు చేస్తుంది.

 జెమ్మా అహెర్న్, బ్రిటన్, జేడ్స్ లా

ఫొటో సోర్స్, Family photo

ఫొటో క్యాప్షన్, జేడ్ వార్డ్‌ను భర్త హత్య చేసినప్పటికీ, ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయనకు పిల్లల విషయంలో నిర్ణయాధికారం ఉంది.

'అది జీవిత ఖైదు'

తండ్రి వద్ద పెరగడం తనకు 'జీవిత ఖైదు' లాంటిదని, అది తనపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపిందని జెమ్మా అంటున్నారు.

ఇలాంటి సందర్భాల్లో పిల్లలను తల్లి తరఫు కుటుంబం వద్దకు పంపాలని, వారికి సామాజిక సంస్థల నుంచి పూర్తి మద్దతు ఉండాలని ఆమె కోరుతున్నారు.

చిన్నతనంలోనే నిజాలను వయసుకు తగ్గట్టుగా వివరిస్తే, వారు మానసిక సమస్యల బారిన పడే అవకాశం తక్కువని జెమ్మా అభిప్రాయపడ్డారు.

 జెమ్మా అహెర్న్, బ్రిటన్, జేడ్స్ లా

ఫొటో సోర్స్, Gemma Ahern

ఫొటో క్యాప్షన్, తన తల్లి ఏ పరిస్థితుల్లో మరణించారనే కచ్చితమైన వివరాలు ఇటీవల వరకు తనకు తెలియవని జెమ్మా చెప్పారు.

జెమ్మా తన 31వ ఏట తండ్రి వ్యాపారం నుంచి బయటకు వచ్చి, నార్త్ వేల్స్‌కు వెళ్లారు.

"దూరంగా ఉండటం వల్ల నాకు సురక్షితంగా అనిపించింది" అని ఆమె చెప్పారు.

ఏడాదిన్నర పాటు నిజానిజాలు తెలుసుకున్న జెమ్మా, తండ్రి కుటుంబంతో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారు.

బ్రిటన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 2026 చివరి నాటికి అమలులోకి తెస్తామని ప్రకటించింది.

ఇలాంటి ఘటనల్లో పిల్లలు, వారి సంరక్షకులు "విస్మరణకు గురైన బాధితులు"గా మిగిలిపోతున్నారని, జేడ్స్ లాను తక్షణమే అమలు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)