హార్మూజ్‌ బ్లాక్ : చైనా ఎంతగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడినా, ఇంధన సంక్షోభం ఎఫెక్ట్ తప్పదా?

    • రచయిత, ఓస్మాండ్ చియా
    • హోదా, బిజినెస్ కరెస్పాండెంట్
  • చదివే సమయం: 5 నిమిషాలు

చైనా చాలా కాలంగా ఇంధన సంక్షోభం తట్టుకునేలా సన్నద్ధమవుతూ వచ్చింది.

కానీ, ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గానికి అంతరాయం నెలకొనడంతో ప్రస్తుతం ఈ సంక్షోభాన్ని చైనా ఏ విధంగా తట్టుకుంటుందో అన్న సందేహం వినిపిస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించడంతో, మధ్యప్రాచ్యం నుంచి వచ్చే ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇంధనాన్ని ఆదా చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలు చేస్తుండగా.. ఇండోనేషియా కూడా తమ వద్దనున్న పరిమిత వనరులు త్వరగా అయిపోకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కొనుగోలుదారైన చైనా కూడా ప్రస్తుతం ఈ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

చైనాకు పరీక్ష కాలం

ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరతను ఎదుర్కొంటోంది.

అప్పట్నుంచి సరుకు రవాణా, ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం హార్ముజ్ జలసంధిని మూసివేయడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పలుసార్లు పెరిగి బ్యారల్‌కు సుమారు 120 డాలర్ల (సుమారు రూ.11,226)కు చేరుకున్నాయి.

అమెరికా ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఈఐఏ) ప్రకారం.. ప్రపంచ చమురులో 20 శాతం ఈ మార్గం గుండానే వెళ్తుంది. అంటే ప్రతిరోజూ దాదాపు 20 మిలియన్ బ్యారెళ్లు( సుమారు 3,179,740,000 లీటర్లు) ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది.

ఈ కొరతతో.. గల్ఫ్ వెలుపల నుంచి ముడి చమురును తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం అనేక దేశాల చూస్తున్నాయి. కొన్నిదేశాలు తమ సొంత నిల్వలను వాడుకుంటున్నాయి.

అమెరికా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు వినియోగదారు చైనాయేనని, ఇది రోజుకు 15 నుంచి 16 మిలియన్ బ్యారళ్ల చమురును వాడుతున్నట్లు కొందరు మార్కెట్ విశ్లేషకులు బీబీసీకి చెప్పారు.

ఈ చమురును ప్రధానంగా చైనా తన విస్తారమైన రవాణా నెట్‌వర్క్ అయిన కార్లు, ట్రక్కులు, విమానాలకు వాడుతోంది. దీనిలో ఎక్కువగా విదేశాల నుంచే వస్తోంది.

ఈఐఏ ప్రకారం.. చైనాకు ప్రధాన చమురు వనరు గల్ఫ్ దేశాలు. తన మొత్తం దిగుమతుల్లో 10 శాతానికి పైగా సౌదీ అరేబియా, ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటోంది చైనా.

చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో ఎక్కువ భాగం.. దక్షిణ చైనా సముద్రం ద్వారా ఇరాన్, మధ్య ప్రాచ్యం నుంచి వస్తోంది. ఈ ముడి చమురును ముఖ్యంగా చైనా దక్షిణాది భాగంలోని ఫ్యాక్టరీలకు, రవాణాకు ఇంధనంగా ఉపయోగిస్తుంది.

అయితే, దేశంలోని ఉత్తర భాగం ఎక్కువగా దేశీయ ఉత్పత్తి, పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులపైనే ఆధారపడింది. అందుకే, మధ్య ప్రాచ్యం యుద్ధంతో ఇది అంతగా ప్రభావితం కాలేదు.

అనేక ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడినప్పటికీ, చైనా తన మొత్తం ఇంధన దిగుమతుల్లో ఐదోవంతు రష్యా చమురునే వాడుతోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, చైనాకు అతిపెద్ద చమురు సరఫరాదారు రష్యాయే.

చైనాలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు. దేశంలో పెద్ద మొత్తంలో బొగ్గు అందుబాటులో ఉంది.

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు. ప్రపంచ ఉత్పత్తిలో సగానికి పైగా దీనిదే వాటా.

ఆ దేశ ప్రభుత్వ మీడియా అంచనాల ప్రకారం, చైనా మొత్తం ఇంధన మిశ్రమంలో చమురు, గ్యాస్ వాటా పావు వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది.

యూరప్, అమెరికాలతో పోలిస్తే ఈ వనరులపై చైనా ఆధారపడటం తక్కువ.

క్లిష్ట సమయాలకు సన్నద్ధం కావడం

చైనా కొన్నేళ్లుగా తక్కువగా ఉన్న ముడి చమురు ధరలను, గల్ఫ్ దేశాల నుంచి సమృద్ధంగా లభించే సరఫరాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచంలో అతిపెద్ద చమురు నిల్వల్లో ఒకదాన్ని అభివృద్ధి చేసుకుందని సాక్సో బ్యాంకు కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలె హాన్సెన్ చెప్పారు.

చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం గతేడాది జనవరి, ఫిబ్రవరిలో దిగుమతికి, ఈ ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం ఎక్కువ క్రూడాయిల్‌ను బీజింగ్ కొనుగోలు చేసింది.

చైనాకు సరసమైన ధరల్లో ముడి చమురును సరఫరా చేసే కీలక దేశం ఇరాన్. ఆ దేశ చమురు ఎగుమతుల్లో 80 శాతానికి పైగా చైనాయే కొనుగోలు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత సేకరించిన నౌకా ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఈ చమురు కొంత ఇంకా చైనాకు చేరుకునే దశలోనే ఉంది. అయితే, చైనా మొత్తం నిల్వల పరిమాణంపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ట్రేడ్ అనలిటిక్స్ గ్రూప్ కెప్లర్ డేటా ప్రకారం.. దక్షిణ చైనా సముద్రంలోని ట్యాంకర్లలో 46 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఇరాన్ ముడి చమురు నిల్వలు ఉన్నాయి.

హాన్సెన్ ప్రకారం.. మూడు నెలల దిగుమతులకు సమానమైన దాదాపు 900 బిలియన్ బ్యారళ్ల నిల్వలను చైనా సేకరించుకుందని అంచనా.

కొలంబియా యూనివర్సిటీకి చెందిన డేటాను ఉటంకిస్తూ.. తమ వద్ద 1.4 బిలియన్ బ్యారళ్ల నిల్వలు ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

చైనా దిగుమతి చేసుకునే ఇంధనంలో అప్పటికప్పుడు ఎంత వినియోగిస్తుంది, ఎంత నిల్వ చేస్తుందన్నది అస్పష్టంగా ఉందని హాన్సెన్ చెప్పారు.

కానీ, ఈ అతిపెద్ద పరిమాణంలో నిల్వ ఉంచిన ఇంధనం ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు ''బలమైన భద్రతా కవచం''లాగా పనిచేస్తుంది.

రిజర్వులు ఉన్నప్పటికీ, బీజింగ్ రాబోయే కాలంలోని సరఫరా నిర్వహణలో అప్రమత్తతో వ్యవహరించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

రిపోర్టుల ప్రకారం.. దేశీయంగా ధరలను అదుపులో ఉంచేందుకు, ప్రస్తుతానికి ఇంధన ఎగుమతులను నిలిపివేయాలని చమురు శుద్ధి కర్మాగారాలను చైనా అధికారులు ఆదేశించారు.

ఈ విషయంపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు చైనా ప్రభుత్వం స్పందించలేదు.

స్వావలంబన దిశగా చైనా ప్రయత్నాలు

క్లీన్ ఎనర్జీలో చైనా ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. దేశవ్యాప్తంగా విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తోంది.

2024లో చైనా విద్యుత్ ఉత్పత్తిలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువగా విండ్, సోలార్, హైడ్రోపవర్ ద్వారా ఉత్పత్తి చేసింది.

అప్పట్నుంచి చైనా తన పునరుత్పాదకత ఇంధన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం తన మొత్తం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో సగానికి పైగా క్లీన్ ఎనర్జీ నుంచే వస్తుందని అంచనా.

ఈ మార్పుతో చైనా మొత్తం ఇంధన వినియోగంలో ముడి చమురు వాటా 2024లో 20 శాతం తగ్గింది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం.. భవిష్యత్‌లో మళ్లీ చమురు డిమాండ్‌ ఆ దేశంలో ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.

చైనా పునరుత్పాదకత ఇంధనం వైపు మారడం కేవలం పర్యావరణం కోసమే కాదు, ఇరాన్ సంక్షోభం వంటి ప్రపంచ ముప్పులు ఎదురైనప్పుడు తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఇది సాయపడిందని ఎనర్జీ ఎకనామిక్స్ రీసెర్చర్ రోజర్ ఫూక్ తెలిపారు.

‘‘ కొంతవరకు చైనా అదృష్టవంతమైన దేశమే. ఎందుకంటే, పునరుత్పాదకత ఇంధనంలో పెట్టుబడులు పెట్టడం చైనా 25 ఏళ్ల కిందటే ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని పొందుతోంది'' అని చెప్పారు.

''చైనాలో అమ్ముడుపోయే కొత్త కార్లలో కనీసం మూడింట ఒక వంతు ఎలక్ట్రిక్ వాహనాలే. ఇవే చమురుపై ఆధారపడటాన్ని తగ్గించాయి’’ అని సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రోక్ షి తెలిపారు.

''మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరిగినప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే చైనాలో ఎలక్ట్రిక్ వాహనం నడిపేవారు ప్రభావితం కారు. వారి రవాణా ఖర్చులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌తో సంబంధం లేకుండా ఉంటాయి" అని అన్నారు.

అయితే, ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న ఒడిదుడుకుల నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సురక్షితంగా ఉందని అర్థం కాదు.

ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన ధరలు పెరిగితే, ఎలక్ట్రిక్ కార్ల ధరలకు చెందిన ఛార్జింగ్ ఖర్చులు పెరుగుతుండొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)