You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాలుగు రోజుల్లో నాలుగు రకాల ప్రకటనలు, ఇది దౌత్యమా లేక ట్రంప్ ఎత్తుగడా?
- రచయిత, ఆంథోనీ జుర్చర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికా యుద్ధంలో ఉండొచ్చు కానీ, గత కొన్ని రోజులుగా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చర్యలు వింతైన మలుపులు తిరుగుతున్నాయి.
శుక్రవారం నాడు ఇరాన్‌తో అమెరికా యుద్ధం 'ముగింపు దశ’ కు చేరుకుందని ప్రకటించిన ట్రంప్, శనివారం రాత్రికి హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్‌కు 48 గంటల గడువు విధించారు. లేకపోతే గగనతల దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక మరుసటి రోజు, ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో గోల్ఫ్ ఆడుతూ మధ్యాహ్నం గడిపారు.
సోమవారం ఉదయానికి ప్రపంచ మార్కెట్లు పడిపోతున్న తరుణంలో, అమెరికాతో ఇరాన్ 'నిర్మాణాత్మక' చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు.
ఆ తర్వాత విమానంలో మెంఫిస్ వెళ్లి, అక్కడ ప్రసంగించిన అనంతరం, సంగీత దిగ్గజం ఎల్విస్ ప్రెస్లీ చారిత్రక నివాసమైన 'గ్రేస్‌ల్యాండ్'ను సందర్శించారు.
ఇరువైపులా హెచ్చరికలు
మరోవైపు, ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ కూడా అమెరికా దళాలు, దాని మధ్యప్రాచ్య మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. హార్ముజ్ గుండా రాకపోకలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి.
ఆ సమయంలో ట్రంప్ శనివారం రాత్రి ఇచ్చిన హెచ్చరిక స్పష్టంగా కనిపించింది: అంతర్జాతీయ నౌకాయానానికి ఇరాన్ పూర్తిగా అనుమతి ఇవ్వకపోతే, అమెరికా వారి ఇంధన ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, ఆ దేశాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది.
అదొక కఠినమైన హెచ్చరిక. దీనికి ప్రతిగా తాము కూడా గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన, నీటి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ బదులిచ్చింది. మూడు వారాల యుద్ధంలో ఈ కొత్త ఉద్రిక్తత, పౌరులపై తీవ్రమైన పరిణామాలను చూపేలా కనిపిస్తోంది.
దాడులకు తాత్కాలిక విరామం
సోమవారం ఉదయానికి ట్రంప్ ఆ దాడులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక ఇరాన్ నాయకుడితో అమెరికా జరిపిన సంప్రదింపులు (దీనిని ఇరాన్ ధృవీకరించలేదు), తాను హెచ్చరించిన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయడానికి తగిన కారణమని ట్రంప్ ప్రకటించారు.
వారాల ముందే నిర్ణయించుకున్న పర్యటనలో భాగంగా టెన్నెసీ వెళ్తూ.. ట్రంప్ చాలా ఆశాజనకంగా కనిపించారు. విమానం ఎక్కే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ మధ్య "అనేక ప్రధానాంశాలపై ఏకాభిప్రాయం" ఉందని చెప్పారు.
"వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. మేం కూడా ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం " అన్నారు.
కొన్ని గంటల తర్వాత మెంఫిస్‌లో యూఎస్ నేషనల్ గార్డ్ సిబ్బందితో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇరాన్ మధ్య "చాలా చాలా మంచి చర్చలు" జరుగుతున్నాయని చెప్పారు.
"అమెరికాకు, మా మిత్రదేశాలకు చేస్తున్న హెచ్చరికలను ముగించడానికి ఇరాన్‌కు మరో అవకాశం ఉంది. వారు దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం" అన్నారు.
ఆ తర్వాత మెంఫిస్‌లోని పర్యాటక ప్రాంతమైన 'గ్రేస్‌ల్యాండ్'కు ట్రంప్ వెళ్లారు. అక్కడి నగర వీధుల్లో నేషనల్ గార్డ్ సైనికులను మోహరించడం వల్లే నేరాల రేటు తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.
దౌత్యమా.. కాలయాపనా?
ట్రంప్ ఓవైపు 'కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్' ఎల్విస్ నివాసంలో ఫ్యాషన్, డిజైన్ అభిరుచులను గమనిస్తూ కలియతిరుగుతుండగానే.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడారని, అలాగే ఈ వారం చివర్లో ఇరాన్ అధికారులతో ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
దౌత్య రథచక్రాలు కదులుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, వివరాల స్పష్టత లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక సందిగ్ధత నెలకొంది.
ట్రంప్ చేసిన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌ను ఉటంకిస్తూ, తమ హెచ్చరికలకు భయపడి అధ్యక్షుడు వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఎటువంటి కీలక చర్చలు జరగలేదని ఇరాన్ అధికారులు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు '15 అంశాలపై ఏకాభిప్రాయం' గురించి మాట్లాడినప్పటికీ, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
కొత్త కౌంట్‌డౌన్
అయితే, చర్చలకు అవకాశం ఉందన్న వార్తలే అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనుకున్న తరుణంలో, ఈ వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్న పెట్టుబడిదారులకు ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది.
ప్రస్తుతం ట్రంప్ తిరిగి వాషింగ్టన్ చేరుకున్నారు. ఇరాన్ ఇంధన కేంద్రాలపై అమెరికా దాడులకు సంబంధించి కొత్త ఐదు రోజుల గడువు (కౌంట్‌డౌన్) ప్రారంభమైంది.
ఈ నాలుగు రోజుల్లో ట్రంప్ ఒక నిజమైన ముందడుగు దిశగా సంకేతాలిచ్చారా? లేక తను విధించిన గడువు తనకే ఇబ్బందిగా మారిందని గుర్తించి, సమయం గడపడానికి ఆడుతున్న ఎత్తుగడ వేశారా? అనేది తేలాల్సి ఉంది.
తాను ఎల్విస్‌కి పెద్ద అభిమానినని, 'హర్ట్' తనకిష్టమైన పాట అని గ్రేస్‌ల్యాండ్ పర్యటనలో ట్రంప్ చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, 'ఇట్స్ నౌ ఆర్ నెవర్' (ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కాదు) అనే పాట ఆయనకు బాగా సూటవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)