సుయోధన మూవీ రివ్యూ: ప్రియదర్శి సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Aditya Music/YT
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 4 నిమిషాలు
జాతిరత్నాలుతో మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి, కోర్ట్ సినిమా తరువాత హిట్ పడలేదు. ఇప్పుడు సుయోధనతో థియేటర్‌లోకి వచ్చాడు.
కథ ఏమంటే హీరో (ప్రియదర్శి) సౌండ్ ఆర్టిస్ట్ (పోల్), సినిమాల్లో మనం వినే సౌండ్ ఎఫెక్ట్ ఎలా సృష్టిస్తారో తెలిపే వర్క్ చేస్తుంటాడు.
అతనికి చిన్నప్పటి నుంచి ఒక సమస్య.
చెడ్డవాళ్లు ఎదురైనప్పుడు, వాళ్లు తనకి హాని కలిగిస్తున్నప్పుడు చెవిలో సుయోధన అని వినిపిస్తూ ఉంటుంది.
అతని తండ్రి సాయికుమార్ నాటకాల్లో దుర్యోధనుడి పాత్ర వేస్తుంటాడు. ఆ పాత్ర ప్రభావం కొడుకుపై పడిందని, నాటకాలు మానేయమని డాక్టర్ చెబుతాడు.


ఫొటో సోర్స్, Aditya Music/YT
పెరిగి పెద్దవాడైన హీరోకి సంహిత (ద్రిషికా చందర్) పరిచయమవుతుంది. ఆమె స్నేహితురాలి దగ్గర వున్న డైరీలోని సంఘటనలతో షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటుంది.
ఆ ఫిల్మ్‌లోని ఒక క్యారెక్టర్‌ని చూసినప్పుడు హీరోకి సుయోధన అని వినిపిస్తుంది. హీరో తండ్రి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించే క్రమంలో హత్యా ప్రయత్నం జరుగుతుంది. తరువాత హీరో మీద దాడి జరుగుతుంది.
వరుసగా జరుగుతున్న సంఘటనలకి, డైరీకి ఏంటి సంబంధం? హీరో ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఇది మిగతా కథ.

ఫొటో సోర్స్, Aditya Music/YT
సుయోధన...
సైకలాజికల్ థ్రిల్లర్స్ ఎపుడూ ఒక చిన్న పాయింట్ మీదే ఆధారపడతాయి. అయితే, ఆ పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ గ్రిప్పింగ్, ఎంగేజింగ్‌గా ఉంటే ప్రేక్షకులు లాజిక్ కూడా అడగరు.
ఇక్కడ చెడు ఎదురైనప్పుడు సుయోధన అని వినిపించడం కీ పాయింట్. అయితే, హీరో సౌండ్ ఆర్టిస్ట్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరోయిన్ పరిచయం, పాట ఇలా ఫస్టాఫ్ అంతా లాగించేసి, ఇంటర్వెల్ పాయింట్‌లో ఒక ట్విస్ట్ వదిలారు.
కథ మనకి అర్ధమైపోతుంది కాబట్టి, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లపై ఆసక్తి పోతే ప్రేక్షకుడి తప్పుకాదు. హీరో ఫ్లాష్‌బ్యాక్ సహనానికి పరీక్షగా అనిపించవచ్చు.
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో రెండు ట్విస్ట్‌ల కథలకి కాలం చెల్లింది. అనేక లేయర్స్‌తో కథలో వేగం లేకపోతే థ్రిల్లర్స్ వర్కవుట్ కావు.
కానీ, సుయోధన అనే పాయింట్‌ని నమ్ముకుని దర్శకుడు మాధవరెడ్డి 130 నిమిషాల సినిమా తీశారు.

ఫొటో సోర్స్, adityamusicindia/insta
పాత్రల్లో డెప్త్ లేకపోవడంతో ఎమోషనల్ ఫీలింగ్ అసలు రాదు. దుర్యోధనుడి డైలాగులతో సాయికుమార్ కూడా విసిగిస్తాడు.
ప్రియదర్శి కామెడీ టైమింగ్ వేరే లెవల్. అతని బలమే అది. ఈ సినిమాలో ఒక డిటెక్టివ్‌గా పరిశోధనలు చేస్తూ ఫైటింగ్‌లు చేయడం కాస్త జోనర్ మారినట్లుగా అనిపిస్తుంది.
హీరోయిన్ విషయానికొస్తే, చాలాకాలం తరువాత పాత హీరోయిన్ ప్రేమ కనిపించింది.
థ్రిల్లర్స్‌కి బీజీఎం ప్రాణం. పాటలు, బీజీఎం ఇంకా బెటర్‌గా ఆశించడంలో తప్పులేదు. ఎడిటరే తన పనిని శ్రద్ధగా చేసి ప్రేక్షకుల్ని కొంత కాపాడాడేమో అనిపిస్తుంది.
చివరగా, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. థియేటర్‌లో, బయటకొచ్చిన తరువాత కూడా ప్రేక్షకులను అలా అనిపిస్తే అది వారి తప్పుకాదు.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























