‘పాకిస్తాన్‌తో ప్రమాదం’ గురించి ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏమని హెచ్చరించారు?

ఫొటో సోర్స్, Getty Images
జెరూసలేంలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆమెరికన్ జ్యూయిష్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రసంగించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్, పాకిస్తాన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాంతంలో తుర్కియే, ఖతార్, ముస్లిం బ్రదర్‌హుడ్, అణ్వాయుధాలున్న పాకిస్తాన్‌లతో కలిసి ఒక కొత్త కూటమి ఏర్పడుతోందని, ఈ కూటమి ఇజ్రాయెల్‌పైకి శత్రువులను ఎగదోస్తోందని ఆరోపించారు. సౌదీ అరేబియాను తమ కూటమిలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని నఫ్తాలి అన్నారు.
ఇజ్రాయెల్‌కు తుర్కియే కొత్త ముప్పుగా మారుతోందని, ప్రభుత్వానికి దాని గురించి తెలియదని బెన్నెట్ ఆ సమావేశంలో హెచ్చరించారు.
"ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ప్రత్యర్థి తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోవాన్. మనం మళ్ళీ కళ్లు మూసుకుని ఉండకూడదు" అని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని అన్నారు.
"ప్రస్తుత ప్రభుత్వం నిద్రపోతోంది. మన సరిహద్దుల్లో అతివాద మూకల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధాలను అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్న ముస్లిం బ్రదర్ హుడ్ పక్షానికి తుర్కియే నాయకత్వం వహిస్తోంది.తుర్కియే కొత్త ఇరాన్‌గా మారింది" అని బెన్నెట్ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా, తుర్కియేలతో పాకిస్తాన్ సాన్నిహిత్యం
సౌదీ అరేబియా, పాకిస్తాన్ గతేడాది సెప్టెంబర్‌లో రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి.
సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్‌పై ఏదైనా దాడి జరిగితే అది రెండింటిపై దాడిగా పరిగణిస్తామని ఆ రక్షణ ఒప్పందంలో ఉంది.
ఇది నేటో ఆర్టికల్ 5 ను పోలి ఉంటుంది. తుర్కియే కూడా సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో చేరుతుందని ఊహాగానాలున్నాయి. పాకిస్తాన్ అణుశక్తి కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం. ఇది ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రాభవాన్ని కూడా పెంచుతుందని చెబుతారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ తనకు ముప్పుగా భావిస్తోంది. గతేడాది ఇరాన్ యురేనియం శుద్ధి కర్మాగారాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కూడా తమకు ముప్పేనన్న భావన ఇజ్రాయెల్‌లో ఉంది.
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి అది బలమైన కూటమిగా ప్రపంచం భావిస్తోంది.
"సౌదీ అరేబియాకు ఆర్థిక శక్తి ఉంది. పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులు, మానవ వనరులను కలిగి ఉంది. తుర్కియేకి సైనిక అనుభవం, అభివృద్ధి చెందిన రక్షణ పరిశ్రమ ఉంది" అని అంకారాకు చెందిన థింక్ ట్యాంక్ టీఈపీఏవీలో వ్యూహకర్త నిహత్ అలీ ఓజ్కాన్.. అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు.
"ఈ ప్రాంతంలో అమెరికా తన, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నందున, మారుతున్న పరిస్థితులు, ప్రాంతీయ సంఘర్షణల పరిణామాలు.. దేశాలను మిత్రుడు ఎవరో, శత్రువు ఎవరో గుర్తించడానికి కొత్త యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి ప్రేరేపిస్తున్నాయి" అని ఓజ్కాన్ అన్నారు.
2016 జూన్‌లో, జర్నలిస్ట్ అహ్మర్ ముస్తిఖాన్ ఇజ్రాయెల్ వార్తాపత్రిక జెరూసలేం పోస్ట్‌లో పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇరాన్ తయారు చేస్తోందంటున్న ఆయుధాల మాదిరిగానే ప్రమాదకరమైనవని ఇజ్రాయెల్, ప్రపంచ యూదులు అర్థం చేసుకోవడం ముఖ్యమని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్-సౌదీ కూటమి ఎవరికి వ్యతిరేకంగా ఉంది?
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కాదని జెరూసలేం పోస్ట్‌లో వచ్చిన ఒక వ్యాసంలో గల్ఫ్ ప్రోగ్రామ్ అధిపతి, థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌లో సీనియర్ పరిశోధకుడు యోయెల్ గుజాన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
"సౌదీ-పాకిస్తాన్ రక్షణ ఒప్పందం అణ్వాయుధాల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉండవచ్చు. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ "అణు గొడుగు" పడుతోందనే ఊహాగానాలు కొన్నేళ్లుగా ఉన్నాయి. ఇస్లామాబాద్‌కు రియాద్ ఇచ్చిన ఆర్థిక మద్దతు, ముఖ్యంగా యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కార్యక్రమానికి చేసిన సాయం వల్ల ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి" అని గతేడాది సెప్టెంబర్ 22న జోయెల్ గుజాన్‌స్కీ రాశారు.
"ఈ ఊహాగానాలు ఉన్నప్పటికీ, ప్రచురిత ఒప్పందంలో అణ్వాయుధాల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. తన అణ్వాయుధాలు భారతదేశానికి ఉద్దేశించినవని, ప్రాంతీయ భద్రతా గొడుగుగా కాదు అనే అధికారిక వైఖరిని పాకిస్తాన్ కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను ఒక అణు ఎంపికగా చూడవచ్చు, కానీ పాకిస్తాన్ కూడా అదే విధంగా చూస్తుందా? చిత్రం ఏంటంటే.. కూటమి గురించి బయటకు చెప్పి రియాద్, ఇస్లామాబాద్‌లే ఈ ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. గతంలో తలుపుల వెనుక గుసగుసగా వేసుకున్న ప్రశ్నలను ఇప్పుడు బహిరంగంగా చర్చిస్తున్నారు" అని జోయెల్ గుజాన్‌స్కీ రాశారు.
"ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని తనపై సాగుతున్న కుట్రగా భావించకూడదు. దానికన్నా, అమెరికా మీద అనుమానాలు, ఇరాన్ దూకుడు, ప్రాంతీయ అస్థిరత మీద సౌదీ అరేబియాకు ఉన్న ఆందోళనే అది పాకిస్తాన్‌తో చేయి కలపడానికి కారణమని అర్ధం చేసుకోవాలి.'' అని జోయల్ గుజాన్‌స్కీ అన్నారు.
కానీ ఇజ్రాయెల్ మీడియా పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదం గురించి చర్చిస్తూనే ఉంది. ‘‘ఇజ్రాయెల్, భారత్‌లు సైనిక, సాంకేతిక, దౌత్య రంగాలలో తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నందున సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియేల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది’’ అని గత ఏడాది నవంబర్ 29న ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ నిపుణుడు సెర్గియో రెస్టెల్లి రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ , ఇజ్రాయెల్ సంబంధాలు
ఇజ్రాయెల్‌ను పాకిస్తాన్ ఇంకా ఒక దేశంగా గుర్తించలేదు. ఫలితంగా, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేవు.
పాకిస్తాన్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తరచుగా జరుగుతాయి. ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్‌కు ఎలాంటి వివాదాలు లేదా ఘర్షణలు లేవు. అయినా అది ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించలేదు.
కానీ, అరబ్ దేశాలు స్వయంగా ఇజ్రాయెల్‌కు దగ్గరవుతుండగా, ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడంలో పాకిస్తాన్‌కు ఇబ్బంది ఏంటి?
దీనికి సమాధానం 2020లో అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చారు.
"ఇతర దేశాలు ఏం చేసినా, మా వైఖరి స్పష్టంగా ఉంది. 1948లో మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నారంటే - పాలస్తీనియన్లు తమ హక్కులను పొందే వరకు, మేం ఇజ్రాయెల్‌ను దేశంగా అంగీకరించలేం’ అన్నారు" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తే, అమెరికాతో దాని సంబంధాలు మెరుగుపడతాయని చాలామంది వాదిస్తున్నారు. అయితే, సాధారణ పాకిస్తానీలలో ఇజ్రాయెల్ వ్యతిరేకత తరచుగా వీధి నిరసనల రూపంలో కనిపిస్తుంది.
ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతి ఒప్పందానికి వస్తే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో ఎటువంటి సమస్య లేదని గతంలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు.
2005లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి, అప్పటి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సిల్వాన్ షాలోమ్‌లు ఇస్తాంబుల్‌లో సమావేశమయ్యారు.
ఈ సమావేశాన్ని ఎర్దోవాన్ ఏర్పాటు చేశారని చెబుతారు. ఈ సమావేశం పాకిస్తాన్‌లో తీవ్ర కలకలం రేపింది.
ఖుర్షీద్ కసూరితో సమావేశమైన తర్వాత, సిల్వాన్ షాలోమ్ మాట్లాడుతూ, "మా చర్చలు చాలా ముఖ్యమైనవి. ఈ సంభాషణ పాకిస్తాన్‌తో మా సంబంధాలకే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికి ముఖ్యమైనది. అన్ని అరబ్ ముస్లిం దేశాల మాదిరిగానే పాకిస్తాన్‌తో కూడా మేం దౌత్య సంబంధాలను కోరుకుంటున్నాం" అని అన్నారు.
పాకిస్తాన్‌లో ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌పై వీధి స్థాయి కోపం ఇజ్రాయెల్‌లో కనిపించదు.
2018లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా నెతన్యాహు "పాకిస్తాన్‌కు ఇజ్రాయెల్ శత్రువు కాదు, ఇజ్రాయెల్‌కు కూడా పాకిస్తాన్ శత్రువు కాకూడదు" అని అన్నారు.
దీని తరువాత, ఇజ్రాయెల్ సమస్యను పున:పరిశీలించడం గురించి పాకిస్తాన్‌లో నిశ్శబ్ద చర్చ జరిగింది. కానీ అప్పటి పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ రజా రబ్బానీ ముస్లిం ప్రపంచాన్ని హెచ్చరిస్తూ, 'భారత్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్భవిస్తున్న కూటమి ముస్లిం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు' అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












