కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలైతే భారత్‌కు వచ్చే ప్రయోజనమేంటి?

కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 6 నిమిషాలు

భారత మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనపుడు భారతీయులు చాలా సంతోషించారు. రిషి సునక్ బ్రిటన్ మొదటి హిందూ ప్రధాన మంత్రి కూడా. సునక్ ప్రధాని కావడం వల్ల భారత్‌తో సంబంధాలు బలపడతాయని చాలామంది భావించారు. కానీ సునక్ పదవీకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై అడుగులు ముందుకు పడలేదు.

ఇది కాకుండా, గ్రాడ్యుయేట్ వీసా స్కీమ్, బ్రిటన్‌కు వెళ్లడానికి అర్హత కోసం వేతన పరిమితిని పెంచడం వంటి సునక్ తీసుకున్న అనేక నిర్ణయాలు భారతీయులకు పెద్దగా ఉపయోగపడలేదు.

అదేవిధంగా భారత మూలాలున్న కమలా హారిస్ అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనపుడు భారతదేశంలో పెద్ద చర్చ జరిగింది.

ఆలయాల్లో పూజలు చేసి, రంగోలీలతో కమలా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వాట్సాప్
అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగం

ప్రధాని మోదీ ప్రశంసలు

2021 జూన్‌లో వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కమలా హారిస్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2023 జూన్‌లో మోదీ అమెరికా వెళ్లినపుడు అక్కడ కమలా హారిస్‌ను ప్రశంసించారు.

అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ "అమెరికాలో ఉన్న లక్షలాది మంది మూలాలు భారతదేశంలో ఉన్నాయి. చాలామంది ఈ సభలో గర్వంగా కూర్చున్నారు. ఒకరు నా వెనుక కూర్చున్నారు" అని అన్నారు.

యుఎస్ కాంగ్రెస్ సభ్యులు పీఎం మోదీ ప్రసంగాన్ని అభినందిస్తూ, చప్పట్లు కొట్టారు.

కమలా హారిస్‌తో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్‌తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

కమలా హారిస్ టార్గెట్ అయ్యారా?

జో బైడెన్ 2024 అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొని కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. బైడెన్ మద్దతుతో ఆమె డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అదే సమయంలో ఆమె టార్గెట్ కూడా అవుతున్నారు.

కమలా హారిస్ అమెరికా మొదటి నల్లజాతి, మహిళా ఉపాధ్యక్షులు.

‘’కమలా హారిస్ నేపథ్యం కారణంగా ఆమెను ఎన్నుకోవాలని చాలామంది డెమొక్రాట్లు భావిస్తున్నారు’’ అని రిపబ్లికన్ పార్టీకి చెందిన గ్లెన్ గ్రోత్‌మన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అదే పార్టీకి చెందిన టిమ్ బుర్చెట్ సీఎన్ఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కమలా హారిస్‌ది 'డీఈఐ' (డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇన్‌క్లూజన్) ప్రాతిపదికన జరిగిన అపాయింట్‌మెంట్‌ అంటూ అభివర్ణించారు.

అయితే, 2020లో బైడెన్ ఒక చర్చ/ఇంటర్వ్యూలో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రత్యేకంగా ‘నల్లజాతి మహిళ’ అని కాకుండా మహిళను ఎన్నుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు.

మరి, కమలా హారిస్ తన భారతీయ గుర్తింపు గురించి ఏమంటున్నారు?

కమలా హారిస్ కుటుంబం

ఫొటో సోర్స్, KAMALA

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్ తన తల్లి శ్యామల దగ్గరే పెరిగారు.

భారతీయ గుర్తింపు గురించి కమలా హారిస్ ఏమన్నారు?

రిషి సునక్ కుటుంబానికి భారత మూలాలున్నాయి. కానీ ఆయన భారతీయ గుర్తింపు కాకుండా, తన హిందూ గుర్తింపు గురించి ఎక్కువగా మాట్లాడారు.

మరోవైపు, కమలా హారిస్ తన తల్లి గురించి మాట్లాడుతూ ఆమె భారతీయ గుర్తింపును ఎక్కువగా ప్రస్తావించారు.

"నా తల్లి శ్యామల 19 సంవత్సరాల వయసులో ఒంటరిగా అమెరికాకు వచ్చారు. ఆమె ఒక శక్తి, శాస్త్రవేత్త, పౌరహక్కుల కార్యకర్త. ఆమె తన కుమార్తెలిద్దరిలో గర్వాన్ని నింపారు" అని 2023లో కమలా హారిస్ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

కమల తల్లి శ్యామలా గోపాలన్ భారత్‌లో, తండ్రి డోనల్డ్ హారిస్ జమైకాలో జన్మించారు. వారిద్దరూ అమెరికాకు వలస వచ్చారు. పెళ్లి చేసుకున్నారు.

కమలా హారిస్ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమల తల్లి దిల్లీ యూనివర్సిటీలో చదివారు.

కమలకు ఐదేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు.

కమల తన తల్లి శ్యామల దగ్గరే పెరిగారు. శ్యామల ఇండియాకు వచ్చినప్పుడల్లా కమల ఆమె వెంట వచ్చేవారు. కమల తన ఆత్మకథ 'ది ట్రూత్ వుయ్ టోల్డ్'లో తన పేరుకు అర్థాన్ని వివరించారు.

"కమల అంటే తామర పువ్వు. భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. తామర మొక్క నీటిలో పెరుగుతుంది. పువ్వు నీటి ఉపరితలం పైన వికసిస్తుంది. వేర్లు నదీ గర్భంలో ఉంటాయి" అని తెలిపారు.

జమైకా, భారత్, అమెరికా.. ఈ మూడు దేశాల సంబంధాలు, గుర్తింపుపై కమల స్పందిస్తూ తనను తాను అమెరికన్ అని పిలవడానికి ఇష్టపడతానని అన్నారు.

అయితే, 2020 ఎన్నికల ప్రచారంలో కమల ఒక వీడియోలో భారతీయ ఆహారాన్ని వండటం, దక్షిణ భారతదేశం గురించి మాట్లాడటం కనిపించింది. అన్నం, పెరుగు, బంగాళదుంప కూర, పప్పు, ఇడ్లీ వంటివి తింటూ పెరిగానని కమలా హారిస్ చెప్పారు.

2014లో కమలా హారిస్ లాయర్ డగ్లస్ ఎమ్‌హాఫ్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం భారతీయ, యూదు సంప్రదాయాల ప్రకారం జరిగింది.

కమలా హారిస్ తల్లి దక్షిణ భారతదేశంలో పుట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని తెలియడంతో, ఆమె తల్లి పుట్టిన ప్రాంతంలో పలువురు సంబరాలు చేసుకున్నారు.

భారత సమస్యలపై కమలా హారిస్ వైఖరి ఏంటి?

కమలా హారిస్ అప్పుడప్పుడు భారతీయ గుర్తింపు గురించి మాట్లాడుతుంటారు. భారత్‌కు సంబంధించిన సమస్యలపై కూడా సందర్భానుసారం అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

కమలా హారిస్ కెరీర్ అలమెడ కౌంటీలోని జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. కమల 2003లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పనిచేశారు. తరువాత కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎంపికయ్యారు. ఆ రాష్ట్రానికి మొదటి నల్లజాతి అటార్నీ జనరల్‌ ఆమె. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో కమలా హారిస్ స్థాయి క్రమంగా పెరిగింది. 2017లో ఆమె కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు, హారిస్ ఆ చర్యను వ్యతిరేకించారు. "కశ్మీరీలు ఒంటరిగా లేరని మేం గుర్తు చేయాలనుకుంటున్నాం, మేం పరిస్థితిని గమనిస్తున్నాం" అని హారిస్ చెప్పారు.

అయితే, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలయ్యాక ఆమె వైఖరి భిన్నంగా ఉంది. కోవిడ్‌ను ధీటుగా ఎదుర్కొన్నందుకు, ఆ సమయంలో భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించినందుకు ప్రధాని మోదీని కమల ప్రశంసించారు.

భారతీయ అమెరికన్ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి కమలా హారిస్ చాలా తక్కువ ప్రయత్నం చేశారని నిపుణులు అభిప్రాయపడ్డారని ఆసియా నిక్కీ రిపోర్టు తెలిపింది.

2021లో ప్రధాని మోదీ పర్యటన తర్వాత ‘లాస్ ఏంజెల్స్ టైమ్స్‌’ వార్తాసంస్థ ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

“ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పెరిగిందని నరేంద్ర మోదీతో కమలా హారిస్ అన్నారు. మన దేశాల్లోని సూత్రాలు, సంస్థలను రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజలు ఎంత నిబద్ధతతో ఉన్నారో నా స్వంత అనుభవం, నా కుటుంబం ద్వారా నాకు తెలుసు" అని ఆమె అన్నారు.

హారిస్ ప్రకటన ప్రధాని మోదీకి ఒక సంకేతంగా, భారతదేశంతో కలిసి మానవ హక్కుల సమస్యను ప్రశాంతంగా లేవనెత్తడానికి ఒక మార్గంగా భావించారు.

ప్రధాని మోదీ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

కమల విజయం సాధిస్తే భారత్‌కు ప్రయోజనమా?

కమలా హారిస్ అధ్యక్ష పదవి రేసులోకి ప్రవేశించినప్పటి నుంచి భారతదేశంలో ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. అయితే, కమలా హారిస్ గెలిస్తే భారత్-అమెరికా సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదని కొందరు నిపుణులు చెప్పారు. ఆమె గెలిస్తే అది భారత్-అమెరికా సంబంధాలపై కంటే అమెరికా రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

"కమలా హారిస్ తన భారతీయ గుర్తింపును ముందుకు తీసుకురాలేదు. ఆమె తన జమైకన్ గుర్తింపునే నొక్కి చెబుతున్నారు" అని సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్మాన్ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తాసంస్థతో తెలిపారు.

"భారతీయులు కమలా హారిస్‌ను భారత సంతతికి చెందిన వ్యక్తి కంటే అమెరికన్ మాదిరే ఎక్కువగా చూస్తున్నారు. ఆమె ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో భారత్-అమెరికా సంబంధాలు ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేదు" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ హ్యాపీమాన్ జాకబ్ అన్నారు.

ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం ప్రకారం.. "కమలా అమెరికా అధ్యక్షురాలైతే సంబంధాలు మునుపటిలానే ఉంటాయి. బైడెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. కమలా హారిస్ కూడా అందులో భాగమయ్యారు" అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు హర్ష్ పంత్ తెలిపారు.

ట్రంప్ కోసం పూజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌పై దాడి జరిగినప్పుడు దిల్లీలో కొంతమంది ఆయన కోసం ప్రార్థనలు చేశారు.

ట్రంప్ గెలిస్తే?

డోనల్డ్ ట్రంప్ కోసం భారత్‌లో కొన్నిచోట్ల పూజలు చేయడం కనిపించింది. 2020 ఎన్నికల సమయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఇటీవల ట్రంప్‌పై దాడి సమయంలో భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. అయితే డోనల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే భారత్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ల విక్రయాలపై భారత్‌ భారీగా పన్నులు విధిస్తోందని, ఇందుకు భారత్‌ను కాదని అమెరికాను బాధ్యులను చేస్తున్నానని ట్రంప్‌ ఇటీవల అన్నారు.

ట్రంప్ గెలిస్తే భారత్‌కు అనేక సవాళ్లు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, కాలుష్యం విషయంలో భారత్‌కు సహాయం చేయకపోవడం వంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకోగలరని జర్నలిస్ట్ శశాంక్ మట్టూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.

ట్రంప్ తొలి టర్మ్‌లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలు ఉన్నవారు కీలకంగా ఉన్నారు. ఒకవైపు ట్రంప్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్ (ఆయన భార్య ఉష భారత సంతతికి చెందినవారు), మరోవైపు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలి పదవి రేసులో కమలా హారిస్ ఉన్నారు.

రిపబ్లికన్, డెమొక్రటిక్ రెండు వైపులా భారత మూలాలు ఉన్నాయి. అందుకే కొందరు భారతీయులు తమ సౌలభ్యం మేరకు తమ పక్షాన్ని ఎంచుకున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)