'అప్లై చేసిన 2 నిమిషాల్లోనే రిజెక్ట్ చేశారు': ఏఐ ఇంటర్వ్యూల ద్వారా జాబ్ సంపాదించడం కష్టమా?

- రచయిత, సిమన్ జాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
"ఇది యాంత్రికంగా, చాలా కష్టంగా ఉంటుంది" అని భువన సిలుగురి చెబుతున్నారు. ఆమె మూడో సంవత్సరం ఎంబీఏ విద్యార్థిని. 100కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని, ప్రతీదానిలోనూ తిరస్కరణకు గురయ్యారు.
భువన అనే 20 ఏళ్ల యువతిది కూడా దాదాపు అదే పరిస్థితి. "నేను దరఖాస్తు చేసిన కొన్ని ఉద్యోగాలకు కొన్ని సందర్భాల్లో రెండు నిమిషాలకే రిజెక్ట్ అయినట్టు రిప్లై వచ్చింది. చాలా బాధ కలిగించింది" అని అన్నారామె.
కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున, తన దరఖాస్తులలో చాలా తక్కువ మాత్రమే మనుషులు చూస్తారని, లేదంటే అసలు చూడరేమోనని ఆమె అంటున్నారు.
"మొదటి దశలో ఏఐ మీ సీవీని పరిశీలిస్తుంది. ఆ దశలోనే చాలా తొందరగా రిజెక్ట్ అవుతారు. తర్వాత దశలో ఏఐతో వీడియో ఇంటర్వ్యూ ఉండొచ్చు" అని భువన అన్నారు.
అనేక ఇంటర్న్‌షిప్‌లు, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ, ఈ వేసవిలో లండన్‌లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్న వెంటనే చేరేందుకు ఆమె ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేకపోయారు.

కోవిడ్ తర్వాత తర్వాత ఉన్న గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఉద్యోగ ఖాళీలు సగానికి తగ్గిపోయాయి.
భారీ సంఖ్యలో వస్తున్న అప్లికేషన్లను వడపోసేందుకు కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. యూకేలో సుమారు 89% మంది కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగ నియామక ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని మరింత పెంచాలని యోచిస్తున్నట్టు లింక్డ్ ఇన్ తాజా డేటా ద్వారా తెలుస్తోంది.
భువన విషయానికొస్తే, ఆమె జాబ్ వెబ్‌సైట్‌లలోకి లాగిన్ అయి, స్క్రీన్‌పై తన ప్రతిబింబాన్ని చూస్తున్నట్లుగా భావించి, అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానాలను రికార్డ్ చేయాల్సి ఉంటుంది.
"స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటూ దాదాపు 20 నిమిషాలపాటు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో నేనొక రోబోలా అనిపించడం మొదలైంది. ఒకే రకంగా వినిపించే వాయిస్‌తో మాట్లాడాలి. ఇంకెవరితోనూ మాట్లాడలేం. అది మన వ్యక్తిత్వాన్ని తగ్గించినట్టు అనిపిస్తుంది. చాలా బాధాకరం" అని ఆమె చెప్పారు.
భువన వయసున్న చాలామంది ఇలాంటి నిరాశలోనే ఉన్నారు. వారికి ఉద్యోగం అనే మెట్టుపై మొదటి అడుగు వేయడమే అసాధ్యమైన ఎత్తులో ఉందని అనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
"ఏఐతో ఇంటర్వ్యూ చేస్తే ఏఐతోనే అప్లై చేస్తాం"
"ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియలు అభ్యర్థుల్లో నిరాశను పెంచవచ్చు. ఒక ఉద్యోగం పొందడానికి సగటున 200 అప్లికేషన్లు పంపాల్సి వస్తోంది" అని అడెక్కో గ్రూప్ సీఈఓ డెనిస్ మ్యూచువల్ అన్నారు.
"ఏఐ వల్ల వచ్చే ప్రధాన మార్పు విస్తరణ సామర్థ్యం పెరగడం. గతంలో 50 మంది సంప్రదిస్తే, వారిలో ఒకరిని ఎంచుకుంటే, మిగిలిన 49 మంది నిరాశ చెందేవారు. ఇప్పుడు 500 మంది సంప్రదిస్తే, 499 మందిని నిరాశకు గురిచేస్తున్నారు" అని ఆయన అన్నారు.
నియామక ప్రక్రియలో కంపెనీలు ఏఐని ఎందుకు ఉపయోగిస్తున్నాయో, అలాగే కొంతమంది ఉద్యోగార్థులు కూడా అదే విధంగా ఏఐని ఉపయోగించి రిప్లై ఇస్తున్నారో తనకు అర్థమైందని భువన చెబుతున్నారు.
"కంపెనీలకి దరఖాస్తులు వెల్లువెత్తుతాయి. అందుకే నేను వాటిని తప్పుపట్టను. కానీ ఒకానొక దశలో విద్యార్థులు సోమరులుగా మారిపోతారు. 'మీరు ఏఐతో రివ్యూ చేస్తే, నేను కూడా ఏఐతోనే అప్లై చేస్తాను' అని వారు అనుకుంటారు. తమ సీవీలను రాయడానికి వారు ఏఐని ఉపయోగిస్తారు. నేను వారిని కూడా తప్పుపట్టను. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఆమె అన్నారు.
ఏఐ సాయంతో 35 ఉద్యోగాలకు వచ్చిన 5,000 దరఖాస్తులను ఫిల్టర్ చేయడానికి ప్రయత్నిస్తోంది మిష్కాన్ సంస్థ.
"మా దగ్గర లా గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే చాలా మంది దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను రాయడానికి ఏఐని ఉపయోగిస్తున్నారు" అని ఆ సంస్థ ఎర్లీ కెరీర్ మేనేజర్ టామ్ విక్‌స్టెడ్ అన్నారు.
"మా కంపెనీకి చాలా అప్లికేషన్లు వస్తాయి, వాటి మధ్య తేడాను గుర్తించడం కష్టం" అని ఆయన అన్నారు.
గ్రాడ్యుయేట్ కెరీర్ కన్సల్టెంట్స్ అయిన బ్రైట్ నెట్‌వర్క్ అభివృద్ధి చేసిన ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌ను వారు పరీక్షిస్తున్నారు. ఇది దరఖాస్తుదారులను ప్రారంభ దశలోనే పరిశీలించి, రియల్ టైమ్‌లో అదనపు ప్రశ్నలు అడుగుతుంది. అలాగే ఏఐతో రాయించినట్లు అనిపించే అప్లికేషన్ భాగాలను కూడా గుర్తించగలదు.
దరఖాస్తుదారుల నుంచి ఇప్పటివరకు తమకు అందిన స్పందన సానుకూలంగా ఉందని, ఏఐ నియామక సాధనాలు మొత్తం ప్రక్రియను మరింత న్యాయబద్ధంగా మార్చగలవని విక్‌స్టెడ్ అన్నారు.
"ఏ నియామక ప్రక్రియ కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుందని నేను అనుకోను, పాత విధానాలకంటే మరింత స్థిరంగా, మరింత న్యాయంగా ప్రక్రియను మార్చడానికి ఏఐ సహాయపడుతుంది" అని ఆయన అంటున్నారు.
తర్వాతి దశలో వ్యక్తులే.. దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేస్తారని, తుది నియామక నిర్ణయం వారే తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
"ఏఐ మనుషుల మాదిరిగానే నిర్ణయాలు తీసుకోగలదా, లేదా అంతకంటే మెరుగైన, మరింత స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలదా అనే విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం" అని ఆయన అన్నారు.
యంత్రాలు మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేవని భువన నమ్ముతున్నారు.
"నేను ఏఐని నమ్మను, ఎప్పుడూ మనిషినే నమ్ముతాను. కానీ ఆ మనిషిని కలిసే అవకాశం పొందడమే కష్టం" అని ఆమె అన్నారు.
కాబోయే ఉద్యోగులకు, నియామక సంస్థలకు ఉత్తమ ఫలితాలు అందించాలంటే ఏఐ, మనుషులు కలిసి పనిచేయాలని అడెక్కోకు చెందిన డెనిస్ మ్యూచువల్ అంటున్నారు.
"సరైన సమయంలో ఏఐ మేధస్సును ఆచరణలో పెట్టాలి. దానికి తోడు ఏఐ పనితీరుకు మనుషుల నిర్ణయాత్మకత, మానవత్వం తోడవ్వాలి. ఆ కలయికే ఈ పోటీలో విజయాన్ని అందిస్తుంది" అని ఆయన అంటారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































