బంగ్లాదేశ్ ఎన్నికలు - జమాత్ ఎ ఇస్లామీ: ఒక్క మహిళకూ టికెట్ ఇవ్వని ఈ పార్టీ భారత్ వ్యతిరేక వైఖరిని విడిచిపెట్టిందా?

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Debalin Roy/BBC

చదివే సమయం: 11 నిమిషాలు

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ఆ దేశంలోని ఒక పార్టీ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది.

ఆ పార్టీ పేరు జమాత్-ఎ- ఇస్లామీ. ఇది ఒక ఇస్లామిక్ రాజకీయ పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయకుండా దశాబ్ద కాలంగా ఈ పార్టీపై నిషేధం ఉంది .

చాలా కాలంగా బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం విధించారు.

దీంతో ఈసారి జమాత్ -ఎ- ఇస్లామీ బీఎన్‌పీకి ప్రధాన పోటీదారుగా మారింది.

జమాత్-ఎ-ఇస్లామీ ఒకప్పుడు బీఎన్‌పీ మిత్రపక్షం. జమాత్‌కు నిర్ధిష్ట సామాజిక-రాజకీయ-మతపరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశం, మహిళలు మైనారిటీలపై స్పష్టమైన వైఖరి ఉంది. అందుకే జమాత్ ఎదుగుదలను బంగ్లాదేశ్‌లోనే కాకుండా భారత్‌లోని రాజకీయ, దౌత్య వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Debalin Roy/BBC

ఫొటో క్యాప్షన్, నజ్రుల్ ఇస్లామ్

‘ఇస్లామిక్ విలువలను దేశం అనుసరించాలి’

మేం ఇటీవల బంగ్లాదేశ్‌ వెళ్లాం. మేం చాలా ప్రదేశాలు తిరిగాం. చాలా మందితో మాట్లాడాం. జమాత్-ఎ-ఇస్లామీ ఎలా పనిచేస్తుందో, బంగ్లాదేశ్ సమాజంపై దాని వైఖరి ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం.

మేం నైరుతి బంగ్లాదేశ్‌లోని శాత్ఖీరా జిల్లాకు వెళ్లాం. ఈ ప్రాంతం రాజధాని ఢాకా నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉంది. శాత్ఖీరా -4 పార్లమెంటరీ నియోజకవర్గం జమాత్-ఎ-ఇస్లామీకి బలమైన కోటగా భావిస్తారు.

ఢాకాకు దూరంగా జమాత్ నాయకులు, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో చూడటానికి మేం అక్కడికి వెళ్ళాం.

ఇక్కడ జమాత్ అభ్యర్థి ఘాజీ నజ్రుల్ ఇస్లామ్. 2013లో షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో జమాత్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అంతకుముందు నజ్రుల్ ఇస్లామ్ ఈ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఉన్నారు.

మేం ఆయన ఇంటికి వెళ్లేటప్పటికి ఆయన ఎన్నికల సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలున్నారు. వీటన్నింటిమధ్య మేం ఆయనతో మాట్లాడాం.

"దేశం ఇస్లామిక్ విలువలను అనుసరించాలని మేం కోరుకుంటున్నాం. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు. వారు ఇస్లాంను అనుసరిస్తారు. ఇది మనకు శాంతిని కలిగిస్తుంది. ప్రజలు కూడా శాంతిని పొందుతారు" అని భవిష్యత్ బంగ్లాదేశ్‌ ఎలా ఉండాలనేదానిపై తన అభిప్రాయాన్ని నజ్రుల్ ఇస్లామ్ బీబీసీతో చెప్పారు.

"విదేశీ శక్తులు ఇక్కడ జోక్యం చేసుకోకూడదు. బంగ్లాదేశ్ స్వతంత్ర, స్వేచ్ఛాయుత దేశంగా మారాలి" అని ఆయనన్నారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Debalin Roy/BBC

ఫొటో క్యాప్షన్, జమాత్-ఎ-ఇస్లామీ రాజకీయ వ్యూహం మార్చుకుంటోందని నిపుణులు అంటున్నారు.

‘మా దేశంలో మైనార్టీలు లేరు’

2024 జులైలో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటినుంచి మైనారిటీలపై హింసకు సంబంధించిన రిపోర్ట్స్ వెలువడుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్ రాజకీయాలపై జమాత్-ఎ- ఇస్లామీ ప్రభావం పెరుగుతుండడంతో అక్కడి రాజకీయాల మిశ్రమ సంస్కృతిపై ఆ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై భారత్‌లో కొన్ని వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మైనారిటీల హక్కులకు ముప్పు వాటిల్లవచ్చని కొందరు భయపడుతున్నారు.

"మా దేశంలో మైనారిటీలు లేరని మేం ప్రకటించాం" అని నజ్రుల్ చెప్పారు.

"భారతదేశమే మైనారిటీ భావనను సృష్టించింది. వారు ముస్లింలను మైనారిటీ అని పిలిచినట్టే, మన ముస్లిం నాయకులు హిందువులను మైనారిటీ అని పిలుస్తారు. వారిని మైనారిటీ అని పిలవడం అంటే వారు అణచివేతకు గురవుతున్నారని అర్థం" అని ఆయన చెప్పారు.

మరి జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ ఎలా ఉంటుందనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులతోపాటు కొందరు సాధారణ ప్రజల్లో వస్తోంది

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Debalin Roy/BBC

ఫొటో క్యాప్షన్, జమాత్ ఒక్క మహిళకు కూడా టికెట్ కేటాయించలేదు.

‘మహిళలు ఎలా ఉండాలంటే’

మహిళల విషయంలో జమాత్ వైఖరిపై విస్తృతంగా చర్చజరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేరు.

మహిళలు పనిచేయడానికి జమాత్ వ్యతిరేకం కాదని, కానీ వారు ప్రజా జీవితంలోకి రావడంపై ఆలోచన భిన్నంగా ఉందని నజ్రుల్ చెప్పారు.

‘‘స్త్రీలు గౌరవంగా ఉండే మంచి దుస్తులు ధరించాలి. వారు ఎల్లప్పుడూ ముసుగు వేసుకోవాలి. వారి శరీరంలోని ఏ భాగం బయటకు కనపడకూడదు. ఖురాన్ చెప్పేది ఇదే. మనం దానిని పాటించాలి" అన్నారు నజ్రుల్.

"మాకు ఒక భావన ఉంది - మహిళలు అన్ని రకాల పనులు చేయగలరు... కానీ వారు ఇంటి నుంచి బయటకు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు 'మహ్రమ్' పద్ధతి అనుసరించాలి" అని ఆయన అంటున్నారు.

'అంటే.. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వారితో పాటు రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువు ఉండాలి. ఇది ముస్లింలు మాత్రమే కాకుండా ఇతర మతాల మహిళలు కూడా పాటించాలి. ఇప్పటి కాలంలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడం మంచిది కాదు" అని నజ్రుల్ చెప్పారు.

దగ్గరి బంధువు మగవారై ఉండాలా అని అడిగినప్పుడు ఆయన నవ్వి, " మగవారైతే బాగుంటుంది" అని బదులిచ్చారు.

" మహిళలను ఇళ్లలోనే ఉంచుతామని జమాత్ ఎప్పుడూ చెప్పలేదు. నా కూతురు జమాత్ కార్యకర్త. ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. నేను లేనప్పుడు నా భార్య మార్కెట్‌కి వెళ్లి కావాల్సిన వస్తువులు కొంటారు. ఆమె రోడ్డుపై నడుచుకుంటూవెళ్తారు" అని నజ్రుల్ తెలిపారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలు పనిచేయడానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని జమాత్ నేతలు అంటున్నారు.

‘జమాత్ మహిళా కార్యకర్తలదీ అదే అభిప్రాయమా?’

ఆ ప్రాంతంలోని కొంతమంది మహిళా జమాత్ కార్యకర్తలను పరిచయం చేయమని మేం నజ్రుల్ ఇస్లామ్‌ని అడిగాం. వారు కాసేపటికే వచ్చి మగవాళ్లనుంచి వేరుగా ప్లాస్టిక్ కర్టెన్ వెనుక కూర్చున్నారు. వారిలో ఎక్కువ మంది కెమెరా ముందు మాట్లాడటానికి ఇష్టపడలేదు. మాట్లాడిన వారు నజ్రుల్ ఇస్లామ్‌కు, ఆయన పార్టీకి మహిళలపై ఉన్న అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు అనిపించింది.

హలీమా ఖాతూన్ డాలీ జమాత్-ఎ- ఇస్లామీ కార్యకర్త. "మేం ముస్లింలం, మేం ముసుగు ధరించడం మంచిది. మేం జుట్టును చూపించకూడదు. అహంకారం ఉండకూడదు" అని ఆమె అన్నారు.

"జమాత్ అధికారంలోకి వచ్చినప్పుడు మేం బురఖాలు లేకుండా బయటకు వెళ్తే ప్రజలు మమ్మల్ని గమనిస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు మహిళలు, పురుషులు ఎలాంటి దుస్తులు ధరిస్తారో వాళ్లు చూస్తారు. ప్రస్తుతం, మహిళలు, పురుషులు కలిసి తిరుగుతున్నారు. వారి మధ్య ఎలాంటి తేడా లేదు" అని మరో జమాత్ కార్యకర్త పారుల్ అన్నారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఢాకాలో జమాత్ నేత ఎన్నికల ప్రచారం

జమాత్-ఎ- ఇస్లామీ తన వ్యూహాన్ని మారుస్తుందా?

శాత్ఖీరా-4 స్థానంలో నజ్రుల్ ఇస్లామ్‌పై బీఎన్‌పీకి చెందిన డాక్టర్ మోనిరుజ్జమాన్ పోటీ చేస్తున్నారు. ఓట్ల కోసం జమాత్-ఎ-ఇస్లామీ మతాన్ని ఉపయోగించిందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ భాష, వ్యూహం మార్చుకోవాల్సి వచ్చిందని ఆయన మాకు చెప్పారు.

"జమాత్ ఆవిర్భావం నుంచి ఇస్లామిక్ పార్టీగా పనిచేస్తోంది. ప్రజలను మతపరంగా ప్రభావితం చేయడానికి ఇది ప్రయత్నిస్తోంది. జమాత్‌కు ఓటు వేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందనే భ్రమను వారు వ్యాప్తి చేశారు" అని డాక్టర్ మోనిరుజ్జమాన్ అన్నారు.

కానీ బంగ్లాదేశ్ ఓటర్లలో దాదాపు సగం మంది యువకులేనని ఆయన అంటున్నారు. ''"జెన్ జెడ్" నుంచి ఇస్లామిక్ పాలనపై పెద్దగా మద్దతు లేదని జమాత్ గమనించింది. దీంతో అంతర్జాతీయంగా మితవాద ఇమేజ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో "సంప్రదాయవాద" ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది'' అని తెలిపారు.

''వాళ్లు అంతర్జాతీయ రాయబారులతో మాట్లాడినప్పుడు, అంతర్జాతీయ రాజకీయాలను చర్చించినప్పుడు షరియాను అమలు చేయబోమని చెబుతారు... కానీ గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో అభ్యర్థులు తమది ఇస్లామిక్ పార్టీ అని చెబుతున్నారు. వారు ఇస్లామిక్ విలువల ఆధారంగా రాజకీయాలు చేస్తారు. ఇస్లామిక్ పాలనను కోరుకుంటున్నారు" అని డాక్టర్ మోనిరుజ్జమాన్ తెలిపారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యాసంస్థల్లోని రాజకీయాల్లో జమాత్ చురుగ్గా ఉందని బంగ్లాదేశ్ రాజకీయ నిపుణులు చెప్పారు.

జమాత్-ఎ- ఇస్లామీపై నిపుణుల అభిప్రాయమేంటి?

బంగ్లాదేశ్ జమాత్-ఎ- ఇస్లామీ చరిత్ర, పనితీరును అర్థం చేసుకోవడానికి రచయిత, పరిశోధకుడు మోయీఉద్దీన్ అహ్మద్‌ను మేం ఢాకాలో కలిశాం. ఆయన బంగ్లాదేశ్ రాజకీయాలపై 35 పుస్తకాలు రాశారు.

"బంగ్లాదేశ్‌లో జమాత్ రెండో పురాతన పార్టీ. ఏదైనా పార్టీ కార్యకలాపాలపై నిషేధం ఉంటే వారు అజ్ఞాతంలోకి వెళతారు. కానీ జమాత్ విద్యా సంస్థలలో చాలా చురుగ్గా ఉంది" అని మోయీఉద్దీన్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

"విద్యాసంస్థలు, మదర్సాలు, విశ్వవిద్యాలయాల్లో జమాత్ నిరంతరం పనిచేస్తోంది. వారు కార్యకర్తలను పెంచుకునే విధానమిది. వారు క్రమంగా ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు"

''జమాత్ బలం దాని క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణంలో ఉంది. సైద్ధాంతిక శిక్షణ ఇచ్చి యువకులతో సంబంధాలు పెంచుకుంటుంది. వారిని సామాజిక సేవలో నిమగ్నం చేస్తుంది'' అని ఆయన విశ్లేషించారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ రాజకీయాల్లో జమాత్-ఎ-ఇస్లామీ ప్రభావం పెరిగింది.

జమాత్ గురించి విద్యార్థులు, యువత ఏమనుకుంటున్నారు?

జమాత్ భావజాలం ప్రభావం కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో కూడా పెరుగుతోంది.

జూలై 2024 తిరుగుబాటు తర్వాత ఇస్లామీ ఛాత్ర శిబిర్ ఢాకా విశ్వవిద్యాలయంతో సహా నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఎన్నికల్లో విజయం సాధించింది. ఛాత్ర శిబిర్‌ను జమాత్ విద్యార్థి విభాగంగా భావిస్తారు.

జమాత్ విద్యార్థి విభాగమని ఇస్లామీ ఛాత్ర శిబిర్ అధికారికంగా చెప్పకపోయినప్పటికీ రెండింటి భావజాలం ఒకలానే ఇస్లామిక్ విలువలపై ఆధారపడి ఉంటుంది. క్యాంపస్‌లోని ఇతర విద్యార్థి సంస్థలకు ఇది భిన్నమైనది.

సాజిద్ హుస్సేన్ ఖాన్ ఢాకా విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ స్టూడెంట్ క్యాంప్ ఆర్గనైజేషన్ సెక్రటరీ. "మమ్మల్ని మేం ఇస్లామిక్ సంస్థకు చెందిన వాళ్లగా భావిస్తాం. మా పనులన్నీ అల్లాను సంతోషపెట్టడం చుట్టూ తిరుగుతాయి. అల్లాను సంతోషపెట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది: ప్రజల కోసం పనిచేయడం" అని సాజిద్ అన్నారు.

"ఆగస్టు 5, 2024 తర్వాత శిబిర్ బహిరంగంగా పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి విద్యార్థులు తమ ముందు కూర్చున్న విద్యార్థిని శిబిర్‌కు చెందినవాడిగా చూస్తున్నారు. తరగతిలో అత్యంత క్రమశిక్షణ కలిగిన విద్యార్థి శిబిర్‌కు చెందినవాడు. ఇతర విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో అత్యంత చురుకైన విద్యార్థి కూడా శిబిర్‌కు చెందినవాడు. ప్రతి అవసరంలో విద్యార్థులతో నిలబడే విద్యార్థి శిబిర్‌కు చెందినవాడు'' అని సాజిద్ అన్నారు.

"మహిళలు ఏం ధరించాలో మేము చెప్పం. నేను ఒక ఎదురు ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేం ఇస్లామిక్ విలువల గురించి మాట్లాడతామని చెప్పి, మహిళ వస్త్రధారణకు సంబంధించిన ప్రశ్నలను మమ్మల్నెందుకు అడుగుతున్నారు?" అని అన్నారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Debalin Roy/BBC

ఫొటో క్యాప్షన్, భారత్‌కు వ్యతిరేకంగా జమాత్ ఇప్పుడు మాట్లాడడం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

‘‘ఇండియా కార్డ్’ను జమాత్ వాడడం లేదు’

బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని జమాత్ వ్యతిరేకించిందన్నది దానిపై గతంలో ఉన్న ఆరోపణ.

"సమస్య ఏంటంటే చాలా మంది ఓటర్లకు 1971 గురించి తెలియదు. వారు ఆ కాలాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. వారికి 1971తో ఆ భావోద్వేగ సంబంధం లేదు" అని మోయీఉద్దీన్ అహ్మద్ అన్నారు.

"వారు అవామీ లీగ్ చూశారు, వారు బీఎన్‌పీని చూశారు. వాటిపై వారు సంతోషంగా లేరు. కాబట్టి వారు 'మరొక పార్టీని ప్రయత్నిద్దాం' అని అంటున్నారు. అది జమాత్" అని ఆయన విశ్లేషించారు.

జమాత్ "ఉదారవాద" ఇమేజ్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోందని మోయీఉద్దీన్ అహ్మద్ కూడా భావిస్తున్నారు. ''వారు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. పార్టీ అగ్ర నాయకులు షరియా చట్టాన్ని అమలు చేయబోమని చెబుతున్నారు. వారు తమను తాము ఉదారవాద ముస్లింలుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు"

"జమాత్ ఇకపై 'ఇండియా కార్డు' వాడటం లేదు. ఎందుకంటే భారతదేశంతో సంబంధాలు బాగా లేకపోతే ఇక్కడ మనుగడ సాగించడం కష్టమని వారు అర్థం చేసుకున్నారు" అని మోయీఉద్దీన్ విశ్లేషించారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1971 ఉద్యమాన్ని వ్యతిరేకించిందన్నది జమాత్‌పై ఉన్న ఆరోపణ.

జమాత్‌ను ఢాకా ప్రజలు ఎలా చూస్తున్నారు?

ఢాకా ప్రజల్లో జమాత్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి.

"జమాత్ ఒక్క మహిళా అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం సిగ్గుచేటు" అని ఢాకా నివాసి నజీఫా జన్నత్ అన్నారు.

"జమాత్ అధికారంలోకి రావడం బంగ్లాదేశ్‌ను మతతత్వ దేశంగా మారుస్తుందని నేను అనుకోను"అని ఢాకాకు చెందిన రియాదుల్ సలాహుద్దీన్ అన్నారు.

"జమాత్ అధికారంలోకి వచ్చినా, ఈ దేశ మూలాల్లో ఉన్న ఉదారవాద శక్తులకు వ్యతిరేకంగా అది పెద్దగా ఏమీ చేయలేదు" అని రియాదుల్ అంటున్నారు.

కానీ ఢాకాకు చెందిన జైబా తజీన్ అంత ఆశాజనకంగా లేరు.

"2024లో అమాయక ప్రజలను చంపిన వారికి వ్యతిరేకంగా నేను కూడా మాట్లాడతాను. 1971 స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిన జమాత్‌లాగా ఉన్న వారికి వ్యతిరేకంగా కూడా నేను మాట్లాడతాను. ఆ పార్టీ ఇప్పటివరకు దీనికి క్షమాపణ చెప్పలేదు" అని ఆమె అన్నారు.

"జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్‌లో ఉదారవాద రాజకీయాల మనుగడకు ప్రమాదమేర్పడుతుంది" అని అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్, షేక్ హసీనా, జమాత్-ఎ-ఇస్లామీ, ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోయింది.

భారత్ ఆందోళన ఏంటి?

మైనారిటీ వర్గాల విషయం భారత్ ఆందోళనకు ప్రధాన కారణం .

'' మైనారిటీ వర్గాలను షేక్ హసీనా మద్దతుదారులుగా పరిగణిస్తారు. దీనివల్ల వారు తీవ్రవాద గ్రూపులకు లక్ష్యంగా మారవచ్చని భారత్ భయపడుతోంది'' అని దిల్లీలో విదేశాంగ విధాన నిపుణులు జాకీర్ హుస్సేన్ బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

"బంగ్లాదేశ్‌లో ఏదైనా జరిగితే అది భారత రాజకీయాలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది" అని ఆయన విశ్లేషించారు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో కఠినమైన అభిప్రాయాలు, అసహనం పెరిగాయి. ఈ భయం కొంతమందిలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వాతావరణం మైనారిటీలను మాత్రమే కాకుండా మెజారిటీ ముస్లింలను కూడా ప్రభావితం చేస్తోంది. శాత్ఖీరాలోని స్థానిక వార్తాపత్రిక దైనిక్ పత్రదూత్ కార్యాలయంలో మాకిది అర్ధమయింది.

"ప్రధానమంత్రి (హసీనా) వెళ్లిపోయిన తర్వాత, దేశంలోని ఇతర ప్రాంతాలలో మాదిరిగానే ఇక్కడ కూడా హింస చెలరేగింది. ఆ సాయంత్రం ఒక పెద్ద గుంపు కార్యాలయంలోకి ప్రవేశించి మా వస్తువులన్నింటినీ దోచుకుంది. వారు ఈ గదుల్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు" అని ఆ వార్తాపత్రిక సంపాదకుడు అబుల్ కలాం ఆజాద్ బిబిసికి చెప్పారు.

ఈ ఆరోపణలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

"ఒక వార్తాపత్రికగా, మా వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉంది - 1971 స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న పార్టీలకు మేము మద్దతు ఇస్తున్నాం" అని అబుల్ కలాం ఆజాద్ అన్నారు.

"మా భావజాలం కారణంగా మాపై దాడి జరిగింది" అని ఆయన తెలిపారు.

''ఈ పరిస్థితుల మధ్యే ఈ న్యూస్ రూమ్‌లో పని జరుగుతోంది. కానీ బయట ఉన్న ఆఫీసు గేటు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది'' అని అక్కడి పరిస్థితిని వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)