ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధవిమానం, ఇది ఇరాన్ మద్దతున్న సంస్థ పనేనా?

అమెరికా KC-135 ఇరాక్‌ రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికాకు చెందిన KC-135 రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పశ్చిమ ఇరాక్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు అమెరికన్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.

'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించిందని వార్తా సంస్థ రాయ్‌టర్స్ పేర్కొన్నట్లు బీబీసీ పర్షియన్ సర్వీస్ పేర్కొంది. అయితే, అమెరికా దీన్ని శత్రుదాడిగా పరిగణించలేదు. 'మిత్రదేశ గగనతలం'లో తమ విమానం కూలిపోయినట్లు పేర్కొంది.

ఈ ఘటనలో రెండు విమానాలు ప్రయాణిస్తుండగా వాటిలో ఒక విమానం కూలిపోయింది. మరో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ తరహా రీఫ్యూయలింగ్ విమానాలు యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కలిగి ఉంటాయి.

ఈ కేసీ 135 విమానం ఎలా కూలిపోయిందనేది బీబీసీ ఇప్పటికీ నిర్ధరించలేకపోతోంది, అయితే, విమానాలు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొని ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ ఘటన శత్రువుల కాల్పుల వల్ల గానీ, అమెరికా సైన్యం కాల్పుల వల్ల గానీ జరగలేదు.

"మార్చి 12వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో, పశ్చిమ ఇరాక్‌లో అమెరికన్ KC-135 రీఫ్యూయలింగ్ విమానం కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించినట్లు నిర్ధరణ అయింది" అని అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

"ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు జరుగుతుంది. అయితే, విమానం కూలిపోవడానికి శత్రువుల కాల్పులు లేదా సొంత బలగాల కాల్పులు కారణం కాదు."

అమెరికన్ సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ ఘటన ఇరాక్ గగనతలంలో జరిగింది. అయితే, అది ఇరాన్ సరిహద్దుకు ఎంత దూరంలో జరిగిందన్నది ఇంకా స్పష్టత లేదు.

ఈ రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానాలు యుద్ధరంగంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ఫైటర్ జెట్లు, బాంబర్ విమానాలకు గాల్లోనే ఇంధనం అందించడం ద్వారా యుద్ధరంగంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, పోరాడేందుకు దోహదపడతాయి.

అమెరికా KC-135 ఇరాక్‌ రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానాలు

ఫొటో సోర్స్, HUM Images/Universal Images Group via Getty Images

మాదే బాధ్యతన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్

రాయిటర్స్ కథనం ప్రకారం, "ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్" అనే సంస్థ ఈ అమెరికన్ విమానంపై దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.

ఇరాన్ మద్దతున్న ఈ సంస్థ చేసిన అదే ప్రకటనను ఇరాన్‌ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ కూడా విడుదల చేసింది.

"సార్వభౌమ ఇరాక్ గగనతల రక్షణ కోసం KC-135 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అయితే, విమానం కూలినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించిన కొన్ని నిమిషాల అనంతరం, KC-135 విమానాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగినట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి.

అయితే, సెంట్రల్ కమాండ్ మాత్రం దీనిని ప్రమాదంగా పేర్కొంటూ శత్రువులు దాడి చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చింది.

(బీబీసీ పర్షియన్ అనేది బీబీసీ న్యూస్‌కు చెందిన ఒక లాంగ్వేజ్ సర్వీస్. బీబీసీ పర్షియన్ సర్వీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అడ్డుకుంటున్నప్పటికీ, ప్రసారాలను నిలిపివేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల మంది ఈ సర్వీస్‌ను అనుసరిస్తున్నారు, వారిలో ఎక్కువ భాగం ఇరాన్‌ నుంచే.)

అమెరికా KC-135 ఇరాక్‌ రీఫ్యూయలింగ్ ట్యాంకర్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

యుద్ధ విమానాల్లో ఇంధనం ఎలా నింపుతారు?

గాల్లోనే విమానాలకు ఇంధనం నింపడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఒకేసారి అనేక విమానాలు గాల్లో ఉండాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియలో యుద్ధవిమానం ట్యాంకర్ విమానానికి చాలా దగ్గరగా ఎగరాలి. ట్యాంకర్ విమానం నుంచి ఒక ఇంధన పైప్‌ను (ప్రోబ్) బయటకు తీసి కిందివైపుకి వదులుతారు.

ఇంధనం నింపుకోవాల్సిన విమానం ఆ పైప్‌కు దగ్గరగా వచ్చి, లైటింగ్ వ్యవస్థ ద్వారా తన స్థానాన్ని సరిచూసుకోవడం ద్వారా పైపును కిందనున్న విమానానికి అనుసంధానం చేయవచ్చు.

పైప్ అనుసంధానమైన తర్వాత ఇంధనం బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ కొన్ని నిమిషాలు జరుగుతుంది. ఆ సమయంలో ట్యాంకర్ విమానానికి కొద్ది అడుగుల దూరంలోనే రెండో విమానం ఉంటుంది.

చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియ రాత్రివేళల్లో జరుగుతుంది.

ఆ సమయంలో పైలట్ అత్యంత నైపుణ్యంతో విమానాన్ని నియంత్రించాలి. ముఖ్యంగా చుట్టుపక్కల మరిన్ని విమానాలు ఎగురుతున్నప్పుడు ఇది మరింత కష్టతరంగా మారుతుంది.

కొన్నిసార్లు శత్రువుల దృష్టి పడకుండా ఉండేందుకు విమానాల లైట్లను కూడా పూర్తిగా ఆఫ్ చేస్తారు.

సాధారణంగా, KC-135 విమానంలో ముగ్గురు సిబ్బంది ఉంటారు ఒక పైలట్, కో- పైలట్, బూమ్ ఆపరేటర్. ఈ బూమ్ ఆపరేటర్ గాల్లో ఇంధనం నింపే ప్రక్రియను నిర్వహిస్తారు.

అమెరికా వైమానిక దళం సమాచారం ప్రకారం, ఎయిర్ మొబిలిటీ కమాండ్ వద్ద సుమారు 400 ట్యాంకర్ విమానాలు ఉన్నాయి.

అమెరికా KC-135 ఇరాక్‌ రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానాలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇతర శక్తులను కూడా మోహరిస్తాం : ఇరాన్

2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి.

ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీతో పాటు పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించారు.

ఆ తరువాత ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమెనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు.

తాజాగా విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ, 'హోర్ముజ్ జలసంధి నిర్భంధాన్ని కొనసాగించాలి, మినాబ్ పాఠశాల విద్యార్థులతో సహా ఈ యుద్ధంలో అమరులైన వారి తరఫున ప్రతీకారం తీర్చుకోవాలి" అని పేర్కొన్నారు.

అదే సమయంలో "శత్రువుకు అనుభవం తక్కువగా ఉన్న ఇతర శక్తుల మోహరింపు దిశగా కూడా ఆలోచనలున్నాయి" అని ఆయన ప్రకటించారు.

అమెరికా - ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, దాడులను కొనసాగించాలని ఖమేనీ పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది.

ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ముడి చమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత చమురు ధరలు కొంత తగ్గినా, ప్రస్తుతం బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)