పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23, 29.. తమిళనాడులో ఏప్రిల్ 23, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ - కౌంటింగ్ మే 4న

Gyanesh kumar

ఫొటో సోర్స్, ECI/Youtube

చదివే సమయం: 3 నిమిషాలు

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు వెల్లడయ్యాయి.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ప్రకటించింది.

ఎన్నికలు జరగనున్న ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తంగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లున్నారు.

ఎన్నికల తేదీలను ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు.

ఇదీ షెడ్యూల్

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుంది.

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు ఒకే ఫేజ్‌లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు.

పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు రెండు ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహిస్తారు.

మొదటి ఫేజ్‌లో 152 సీట్లకు ఏప్రిల్ 23న రెండో ఫేజ్‌లో 142 సీట్లకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది.

ఎన్నికలు జరుగుతున్న మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కౌంటింగ్ మే 4న నిర్వహిస్తారు.

కాగా పశ్చిమబెంగాల్ మినహా మిగతా అన్ని చోట్లా ఒకే ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, దశలవారీ పోలింగ్ ప్రణాళికను ఖరారు చేసేందుకు ఈ వారం మొదట్లో మార్చి 11వ తేదీన ఈసీఐ సమావేశమైంది.

ఆ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆయా అసెంబ్లీల పదవీకాలం ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వివిధ తేదీల్లో ముగియనున్నాయి.

ఎన్నికల చట్టాల ప్రకారం, ఆ గడువులోగా ఆయా చోట్ల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎలక్షన్ కమిషన్, భారత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు రాష్ట్రాల్లో 2021లో ఎవరు గెలిచారు?

పశ్చిమ బెంగాల్: 294 సీట్లున్న ఈ అసెంబ్లీకి ఇంతకుముందు 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

అస్సాం: 126 సీట్లున్న ఈ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికలలో బీజేపీ కూటమి అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ 60 సీట్లు గెలిచింది.

తమిళనాడు: 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అత్యధికంగా 133 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ నేత స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికలలో డీఎంకే, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కలిపి పోటీ చేశాయి. ఆ కూటమికి మొత్తంగా 159 సీట్లు వచ్చాయి. అన్నాడీఎంకే, బీజేపీల కూటమికి 75 సీట్లు వచ్చాయి.

కేరళ: 140 సీట్లున్న ఈ అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) 99 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)