కింగ్ కోబ్రాలు రైళ్లలో ప్రయాణిస్తున్నాయా? కొత్త పరిశోధనలో ఏం తేలిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జై శుక్లా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవులు కింగ్ కోబ్రాల సహజ ఆవాసాలు. అక్కడ వీటికి ఆహారం, నీరు, సురక్షితమైన ఆవాసం దొరుకుతుంది.
అయితే, అడవులలో నివసించే కింగ్ కోబ్రాలపై ఒక ఆసక్తికర అధ్యయనం జరిగింది.
సూరత్‌కు చెందిన శాస్త్రవేత్త, రీసర్చర్ హెర్పెటాలజిస్ట్ దికాన్ష్ పర్మార్ ఈ పరిశోధన చేశారు. దేశంలో కింగ్ కోబ్రాలు 'బహుశా రైళ్లలో ప్రయాణిస్తున్నాయి' అని ఈ అధ్యయనం వెల్లడించింది.
అయితే, అడవులలో నివసించే కింగ్ కోబ్రాలు రైల్వే ట్రాక్‌లు లేదా రైళ్లలోకి ఎలా చేరుతున్నాయి? ఎందుకు వెళుతున్నాయి?
గోవాకు వెళ్లే అనేక రైల్వే లైన్లు దట్టమైన అడవుల గుండా వెళతాయి. కింగ్ కోబ్రాలు కొన్నిసార్లు ఆహారం లేదా ఆశ్రయం కోసం రైలు పట్టాలు లేదా రైళ్ల వద్దకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలా, ప్రకృతికి దూరంగా ఇతర ప్రాంతాలకు పాములు చేరుకునే అవకాశం ఉందని, అక్కడ వాటికి ఆహారం లేదా సురక్షితమైన ఆవాసం కష్టతరమవుతుందని అంటున్నారు.
అమెరికా జీవావరణం, దాని పరిరక్షణ, నిర్వహణ అంశాలపై పరిశోధనలను కవర్ చేసే ప్రఖ్యాత జర్నల్ 'బయోట్రోపికా'లో దికాన్ష్ అధ్యయనం ప్రచురితమైంది.
ఈ జర్నల్‌లో పరిశోధన ప్రచురితమవడం శాస్త్రవేత్తలకు కీలకం, ఎందుకంటే ఈ జర్నల్‌లో పరిశోధనలు పబ్లిష్ అయ్యేందుకు లభించే అవకాశం 36 శాతం మాత్రమే.

ఈ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన.. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము అయిన కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ కాలింగా) తెలియకుండానే సుదూర రైళ్లలో ప్రయాణిస్తోందని సూచిస్తోంది. కింగ్ కోబ్రా సంచరించే పరిధి మారుతున్న విధానం దాని జాతి భద్రత, పరిరక్షణకు సవాల్‌గా మారుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కలిసి గోవాలో, ముఖ్యంగా పశ్చిమ కనుమల మారుమూల అడవులలో ఉండే కింగ్ కోబ్రాలు కనిపించిన గోవాలోని 47 ప్రదేశాలను అధ్యయనం చేశారు దికాన్ష్ పర్మార్. దీని కోసం, బృందం గోవాలోని యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ సహాయం తీసుకుంది. ఈ స్క్వాడ్ ఏళ్లుగా పాములు సహా అడవి జంతువుల సంరక్షణ కోసం పనిచేస్తోంది.

ఫొటో సోర్స్, Sourabh Yadav
రైల్వేస్టేషన్ల సమీపంలో కింగ్ కోబ్రాలు
గోవాలోని యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ కోబ్రాలను రక్షించిన 47 ప్రదేశాలను దికాన్ష్ పర్మార్ అధ్యయనం చేశారు. వాటిలో 18 ఉత్తర గోవాలో, మరో 29 దక్షిణ గోవాలో ఉన్నాయి.
దికాన్ష్ పర్మార్ బీబీసీతో మాట్లాడుతూ, "కింగ్ కోబ్రాను జాతీయ సరీసృపంగా పిలుస్తారు. చారలు భిన్నంగా ఉన్నప్పటికీ, భారత్‌లో దానిని ఒకే జాతిగా భావిస్తారు. అయితే, శాస్త్రవేత్తలు ఇతర జాతులు కూడా ఉండవచ్చని సందేహించారు. అందుకే, పశ్చిమ కనుమలలో కనిపించే కోబ్రాను వారు ఓఫియోఫాగస్ కాలింగాగా గుర్తించారు. ఈ పాము రక్షిత జంతువుల జాబితాలోకి వస్తుంది" అని అన్నారు.
ఈ కింగ్ కోబ్రా ఎవరినైనా కాటేస్తే, ఆ వ్యక్తి నీళ్లు కూడా తాగలేరని, 'దాదాపుగా వెంటనే చనిపోవచ్చు' అని కూడా అన్నారు.
పరిశోధకులు తిరిగిన ప్రదేశాలన్నీ.. రైల్వే స్టేషన్ల సమీపంలో లేదా రైల్వే ట్రాక్‌లకు దగ్గరగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.
"గోవాలోని యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ 2002 నుంచి 2024 వరకు మొత్తం 120 కింగ్ కోబ్రాలను రక్షించింది. మేం అన్ని ప్రదేశాలను అధ్యయనం చేయగా, వాటిలో 47 పాములు రైల్వేల చుట్టూ ఉన్నాయని కనుగొన్నాం. గోవాలోని ఒక రైల్వే స్టేషన్ పట్టాల దగ్గర ఒకదాన్ని కనుగొన్నాం" అని దికాన్ష్ చెప్పారు.
గోవాలోని యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ హెడ్ అమృత్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, "దక్షిణ గోవాలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. దాని పేరు చందోర్. కింగ్ కోబ్రా ఉన్నట్లు అక్కడి నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం దానిని రక్షించి అటవీ శాఖకు అప్పగించాం. ఆ సమయంలో అది గాయపడి ఉంది. ఆ ప్రాంతంలో సాధారణంగా పాములు కనిపించవు" అని అన్నారు.
చందోర్ రైల్వే స్టేషన్‌లో కనుగొన్న కింగ్ కోబ్రా కేసే ఈ అధ్యయనానికి మూలమని పరిశోధకులు అంటున్నారు.
జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, "చందోర్ కేసు పర్యావరణపరంగా అనుకూలం కాని అలాంటి ప్రదేశానికి ఆ పాము ఎలా వచ్చిందో లోతుగా పరిశోధన జరిపేలా మమ్మల్ని ప్రేరేపించింది".
ఈ రకమైన కింగ్ కోబ్రాలు కర్ణాటకలోని క్యాజిల్ రాక్, దాండేలి టైగర్ రిజర్వ్ అడవుల్లో కనిపిస్తుంటాయి. రైళ్లు గోవాలోకి ప్రవేశించాక, ఈ పాములు దిగుతాయి. గోవా యానిమల్ రెస్క్యూ స్క్వాడ్ 2021 సెప్టెంబర్‌లో వాస్కోడగామా సమీపంలో ఒక కోబ్రాను రక్షించింది. దీన్ని రైల్వే స్టేషన్ నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో గుర్తించారు. లోలిమ్, పలోలెం, పెడ్నే రైల్వే స్టేషన్ల చుట్టూ మరో మూడు కోబ్రాలు కనిపించాయి.
దికాన్ష్ ప్రకారం, ఈ ఐదు ప్రదేశాలూ కింగ్ కోబ్రా సహజ ఆవాసాలు కావు. దీని ద్వారా సైంటిస్టులు పాములకు, రైల్వేలకూ మధ్య ఉన్న ఈ 'అద్భుతమైన లింక్'ను గమనించారు.

ఫొటో సోర్స్, AMRUT SINGH
'రైళ్లలో ప్రయాణించి ఉండొచ్చు'
"పాము రైల్వే స్టేషన్‌కు ఎలా వచ్చిందో మేం పరిశోధించాం. ప్రస్తుతం, కర్ణాటక నుంచి గోవాకు వెళ్లే రైళ్లు ఎక్కువగా కర్ణాటకలోని క్యాజిల్ రాక్ మీదుగా వస్తాయి. ఈ ప్రాంతాలలో దట్టమైన అడవులు ఉన్నాయి, కింగ్ కోబ్రా ఇక్కడ విస్తృతంగా కనిపిస్తుంది" అని దికాన్ష్ పర్మార్ అన్నారు.
"మా బృందం కొత్త 'రైల్వే డిస్పర్సల్ హైపోథిసిస్'ను ప్రతిపాదించింది. అడవులు, కొండ ప్రాంతాల్లోని రైల్వే యార్డుల వద్ద ఎలుకలు లేదా ఇతర కీటకాలను వేటాడే క్రమంలో కింగ్ కోబ్రాలు కొన్నిసార్లు గూడ్సు రైళ్లు లేదా సాధారణ రైళ్లు ఎక్కి ఉండొచ్చని, తెలియకుండానే అవి చాలా కిలోమీటర్ల దూరంలో, ఎక్కడోచోట దిగి ఉండొచ్చని ఇది సూచిస్తోంది" అని అన్నారాయన.
ఈ పరిశోధనకు సోషల్ మీడియా పోస్టులు, ఇతర వార్తా కథనాలు సాయపడ్డాయని దికాన్ష్ పేర్కొన్నారు.
"మేం పరిశోధన చేసిన ప్రదేశం పాములకు నివాసయోగ్యమైన ప్రదేశం కాదు. ఈ పాము జాతులు సాధారణంగా కర్ణాటక సమీపంలోని అడవులలో నివసిస్తాయి. అయితే, కింగ్ కోబ్రాలు ఎక్కువగా రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాల్లోనే దొరికాయి. కాబట్టి, అవి ఏదో ఒక కారణం వల్ల రైలులో గోవాకు చేరుకుని ఉంటాయని చెప్పవచ్చు" అని దికాన్ష్ పర్మార్ చెప్పారు.
అంతకుముందు, 2017లో సూరత్ రైల్వే స్టేషన్ వద్ద దికాన్ష్ పర్మార్ ఒక పామును రక్షించారు.

ఫొటో సోర్స్, DIKANSH PARMAR
ప్రమాదమా, ఆహారం కోసం అన్వేషణా?
రైల్వేల చుట్టూ కింగ్ కోబ్రాలు కనిపించడం వెనుక కారణం కూడా ఆచరణాత్మకంగా నమ్మదగినదేనని పరిశోధకుల బృందం అంటోంది. వారు చెబుతున్నదాని ప్రకారం, వృథాగా పడేసే ధాన్యాలు లేదా పండ్లు లేదా ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కారణంగా రైల్వేల చుట్టూ ఎలుకల గుంపు ఉంటుంది. ఎలుకలు అక్కడ నివాసం ఏర్పరుచుకుంటాయి. పాములకు అవే ఆహారం.
వర్షాకాలంలో, వరదల సమయంలో సురక్షితమైన ప్రదేశం కోసం అవి రైళ్లలో కూడా ఆశ్రయం పొందవచ్చు.
కాలిఫోర్నియాలోని విక్టర్ వ్యాలీ కాలేజీలో జీవశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ హెన్రిచ్ కైజర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డెన్నిస్ రోడర్ (లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది అనాలిసిస్ ఆఫ్ బయోడైవర్సిటీ చేంజ్, బాన్, జర్మనీ)లు కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
"మేం సాధారణంగా రోడ్లు, రైల్వేలను వన్యప్రాణులకు ఇబ్బందికరంగా, లేదా వాటి ప్రాణాలకు ప్రమాదకరమైన ప్రాంతాలుగా భావిస్తాం. కానీ, వేగంగా రాకపోకలు సాగించే ఈ కారిడార్లు అనుకోకుండా వాటి వాహకాలుగానూ పనిచేస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది" అని హెన్రిక్ బీబీసీతో అన్నారు.
"ఈ కింగ్ కోబ్రా అనుకోకుండా రైలెక్కి ప్రయాణించి ఉండవచ్చు లేదా ఆహారం కోసం రైల్వే లైన్ దగ్గరకు వచ్చి ఉండవచ్చు లేదా మరేదైనా కారణంగా రావొచ్చు" అన్నారాయన.
"మనుషులు రవాణా సాధనాలు అనుకోకుండా ఈ జీవి కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ పరిశోధన చూపుతోంది" అని డాక్టర్ డెన్నిస్ రోడర్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, DIKANSH PARMAR
ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం?
ఈ ప్రశ్నకు డాక్టర్ డెన్నిస్ రోడర్ సమాధానమిస్తూ "కింగ్ కోబ్రాను సంరక్షించాల్సిన అవసరముంది. అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గూడ్స్ రైళ్లు లేదా ప్యాసింజర్ రైళ్ల ద్వారా ప్రయాణిస్తే వాటికి, మనుషులకూ రెండింటికీ ప్రమాదం. అందువల్ల, ప్రజలకు అవగాహన కల్పించాలి, కింగ్ కోబ్రాను కూడా సంరక్షించాలి" అన్నారు.
"కింగ్ కోబ్రా చాలా విషపూరితమైన పాము. అందుకే ప్రజలు దాన్ని చూసిన వెంటనే చంపేస్తారు. ఒకవేళ అది మనుషుల మధ్యకొస్తే, అది మనుషులకు ప్రమాదం. అందువల్ల, అడవిలో సమతుల్యతకు, జీవవైవిధ్యానికి దానిని సంరక్షించాల్సిన అవసరముంది. ఈ పరిశోధన దానిపై దృష్టి పెట్టింది" అన్నారు.
"రైళ్ల ద్వారా, లేదా మరే ఇతర మార్గాల్లోనైనా కింగ్ కోబ్రాలు మనుషులు నివాస ప్రాంతాల సమీపంలోకి వస్తే వాటి మనుగడకే ముప్పు. అందువల్ల వాటిని సంరక్షించాలి" అని దికాన్ష్ అంటున్నారు.
అటవీ ప్రాంతాల్లో రైళ్లను అనవసరంగా ఆపకూడదని, ఎలుకలు వచ్చేలా మిగిలిపోయిన ఆహారాన్ని రైళ్ల కంపార్ట్‌మెంట్లలో ఉంచకూడదని, పాముల వంటి అడవిలో ఉండే జంతువులు రైల్వే ట్రాక్‌లపైకి రాకుండా నిరోధించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
"ఈ పరిశోధన పర్యావరణానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ మాత్రమే కాదు, వన్యప్రాణుల సంరక్షణ, ప్రజల భద్రతకు కూడా ఒక హెచ్చరిక. అనుకోని విధంగా రైల్వేల ద్వారా విషపూరిత పాముల రవాణా జరగడంపై అవగాహన, స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం" అని ప్రొఫెసర్ డెన్నిస్ రోడర్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












