You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సాయితేజ: అమెరికా క్రికెట్ జట్టుకు ఆడుతున్న ఈ తెలుగు కుర్రాడు ఎవరు?
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
టీ-20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో భాగంగా ఫిబ్రవరి 7న ముంబయిలో ఇండియా తన తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టును ఎదుర్కొంది.
ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. కానీ అందరూ అమెరికా జట్టు గురించే మాట్లాడుకుంటున్నారు.
బౌలింగ్‌లో రాణించి దూకుడుమీదున్న ఇండియాను కట్టడి చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరికలాంటి ప్రదర్శనచేసింది .
అమెరికా జట్టులో సింహభాగం ఆటగాళ్లు భారతీయ మూలాలున్నవారే.
వీరిలో తెలుగు కుర్రాడు సాయితేజ ముక్కమల్ల కూడా ఉన్నాడు.
చిన్నతనం నుంచే...
సాయితేజా రెడ్డి ముక్కమల్ల రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్. 2004 ఏప్రిల్ 09న న్యూజెర్సీలోని ఫ్లెయిన్స్‌బోరోలో జన్మించాడు.
ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న సాయితేజ, చిన్నతనం నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 2011లో ఇండియా ప్రపంచకప్ విజయం సాధించింది. అప్పుడతని వయసు ఏడేళ్లు.
దాదాపు 15 ఏళ్లు తిరిగేసరికి ముంబయిలో వాంఖడే స్టేడియంలో కిక్కిరిసిన ప్రేక్షకుల ముందు అతను ఇండియా జట్టుపై బరిలోకి దిగాడు.
ఆంధ్రా మూలాలు
సాయితేజ తండ్రిపేరు నాగేశ్వరరెడ్డి. ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి అని పలు పలు తెలుగు పత్రికలు కథనాలు రాశాయిఈ కుటుంబం 1997లోనే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది.
సాయితేజకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన తండ్రి నాగేశ్వరరెడ్డి 2018లో కొడుకును తీసుకుని హైదరాబాద్ వచ్చారు. వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు.
ఏడాది శిక్షణ అనంతరం ఈ కుటుంబం తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. సాయితేజ అమెరికాలోనే తన క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాడని ఈఎస్‌పీఎన్ తెలిపింది.
టాప్ ఆర్డర్‌లో ప్రతిభ
సాయితేజ హార్డ్‌హిట్టింగ్ టీ20 బ్యాటర్ కాదు. కానీ టాపార్డర్‌లో నమ్ముకోదగినవాడు.
2024 ఆగస్టులో అతను కెనడా, నెదర్లాండ్స్, అమెరికా తలపడిన టీ 20 త్రైపాక్షిక సిరీస్ ద్వారా టీ20లలోకి అరంగ్రేటం చేశాడు.
ఈ మ్యాచ్‌లో అతను 27 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అలాగే వన్డేలలో 2022లో స్కాట్లాండ్‌పై బరిలోకి దిగాడు.
ఇప్పటిదాకా19 టీ20 మ్యాచ్‌లు ఆడిన సాయితేజ స్ట్రైక్‌రేటు150.82 , సగటు 40.06తోమొత్తం 641 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
ఈ గణాంకాల పరిమాణం చిన్నదే అయినప్పటికీ కనీసం 15 టీ20 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్ ఆడిన ఆటగాళ్లలో 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో పాటు 40కి పైగా సగటు ఉన్న ఐదుగురు ఆటగాళ్లలో సాయితేజ ఒకడు. ఆ జాబితాలో రింకు సింగ్ కూడా ఉన్నాడు.
అయితే ఈ గణాంకాలన్నీ ప్రధానంగా అసోసియేట్ జట్లపై సాధించినవే. ప్రధానజట్లపై ఆడి తన బలం నిరూపించుకోవాలనుకున్నంటున్నాడు సాయితేజ.
అయితే ఇండియాతో ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో సాయితేజ కేవలం 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
చెన్నైలోని సూపర్ కింగ్స్ అకాడమీలోనూ శిక్షణ పొందిన సాయితేజకు న్యూజీలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఆదర్శం.
టీ20 వరల్డ్ కప్‌కోసం అమెరికా ప్రకటించిన జట్టులో ముందు సాయితేజకు చోటు దక్కలేదు.
అయితే జస్‌కరణ్ మల్హోత్రా గాయపడటంతో అతని స్థానంలో అవకాశం దక్కింది. ఈ విషయాన్ని యూఎస్ఏ క్రికెట్ ఎక్స్‌లో ప్రకటించింది.
"అమెరికా క్రికెట్‌ను గత టీ20 వరల్డ్ కప్ ప్రపంచ పటంలో నిలిపింది. అమెరికా క్రికెట్‌లో ఉన్న సామర్థ్యాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. సరైన అవకాశాలు లభిస్తే, మెరుగైన జట్లతో ఆడుతూ పోతే, భవిష్యత్తులో మేము బలమైన ప్రత్యర్థులుగా మారగలమని నమ్ముతున్నాను’’ అని సాయితేజ ఈఎస్‌పీఎన్‌కు తెలిపాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)