‘అతిగా ఆలోచించడం మానేశాను’.. ఇషాన్ కిషన్ రెండేళ్లు జట్టుకు దూరమవడంపై ఎందుకలా అన్నాడు?

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. బాగా ఆడనప్పుడు జట్టు నుంచి ఉద్వాసనకు గురవడం.. లేదంటే మెరుగైన ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావడం జరుగుతుంటుంది.
అయితే, ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం పరిస్థితి ఇలా లేదు. వ్యక్తిగత కారణాలు, మానసిక ఒత్తిడి వల్ల విరామం కోరగా, ఆ తర్వాత ఆయన్ను సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించినట్లు వివిధ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దీంతో రెండేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. దీనికి ముగింపు పలుకుతూ.. ఇటీవల జరిగిన టీ-20 వరల్డ్ కప్‌లో కొత్త అధ్యాయం లిఖించాడతను. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు టీ-20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.


ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు
రెండేళ్ల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌కు, నిరుడు డిసెంబర్‌లోనే తాను మళ్లీ జట్టులోకి వస్తున్నట్లు తెలిసింది. అంతకుముందు ఆయన దేశవాళీ టోర్నమెంట్లలో రాణించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ 197 స్ట్రైక్ రేట్‌తో అత్యధికంగా 517 పరుగులు చేశాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేయడమే కాకుండా, ఝార్ఖండ్ మొదటిసారి విజేతగా నిలవడంలో కీలకమయ్యాడు. దాదాపు ఇదే ఫామ్‌ను టీ-20 వరల్డ్ కప్‌లోనూ కొనసాగించాడు ఇషాన్. ఫైనల్ మ్యాచ్‌లో 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ టీ-20 వరల్డ్ కప్‌లో ఇషాన్ కిషన్ మొత్తం నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో దక్షిణాఫ్రికాపై 53 పరుగులు, నమీబియాపై 61 పరుగులు, పాకిస్తాన్‌పై 77 పరుగులు, న్యూజీలాండ్‌పై చేసిన 54 పరుగులు ఉన్నాయి.
ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ 317 పరుగులు చేశాడు. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజూ శామ్సన్ (321) కంటే అతను కేవలం నాలుగు పరుగులు మాత్రమే తక్కువ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్ మ్యాచ్‌కి ముందు విషాదం
ఫైనల్ మ్యాచ్‌కి ఒకరోజు ముందు ఇషాన్ కిషన్‌కు ఒక విషాద వార్త అందింది. రోడ్డు ప్రమాదంలో అతని సోదరి(కజిన్), బావ మరణించారు.
ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఇషాన్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. అతని తండ్రి 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో మాట్లాడుతూ.. "మేమంతా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఇషాన్ ఇంటికి రావాలనుకున్నాడు. కానీ, ఫైనల్ మ్యాచ్ కారణంగా రాలేకపోయాడు. తను మానసికంగా చాలా కుంగిపోయాడు" అని తెలిపారు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇషాన్ కిషన్ స్పందిస్తూ.. "నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మా కజిన్‌ను కోల్పోయాను. నేను ఎప్పుడూ భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆమె కోరుకునేది. ఈ ఇన్నింగ్స్ ఆమెకే అంకితం. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది, అప్పటి నుంచి చాలా ఆవేదన చెందాను" అని భావోద్వేగానికి గురయ్యాడు.
ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌తోనూ మెప్పించాడు. 52 పరుగులు చేసిన న్యూజీలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతేకాకుండా రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ క్యాచ్‌లను కూడా పట్టాడు. దీంతో, క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఇషాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
భారత ఇన్నింగ్స్ గురించి మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. "ఇన్నింగ్స్‌కు ఇషాన్ కిషన్ అసలైన వేగాన్ని తీసుకొచ్చాడు" అని తెలిపారు.
ఈ టీ-20 వరల్డ్ కప్ సమయంలో ఇషాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పులు జరిగాయి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సంజూ శామ్సన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రావడంతో ఇషాన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ అతను అదే దూకుడును కొనసాగించాడు.
దీనిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్‌లో స్పందిస్తూ.. "ఓపెనర్ నుంచి నంబర్ 3కి మారినప్పటికీ ఇషాన్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు" అని కొనియాడారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండేళ్ల బాధపై..
రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉండటంపై తన మనసులోని మాటను ఇషాన్ కిషన్ బయటపెట్టాడు.
మ్యాచ్ తరువాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అభిషేక్ శర్మ తన గత నెల రోజుల ఫామ్ గురించి ప్రస్తావిస్తూ, అది తనకు ఒకటిన్నర ఏళ్ల కాలంతో సమానమని అభిప్రాయపడ్డాడు. దీంతో పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ చమత్కరిస్తూ, తాను ఏకంగా "రెండేళ్ల పాటు (జట్టుకు) దూరంగా" ఉన్నానని గుర్తుచేశాడు.
అయితే, ఇషాన్ కిషన్ భారత జట్టులోకి పునరాగమనం చేసే మార్గం అంత సులభంగా సాగలేదు. ఐపీఎల్‌లో వరుసగా రాణిస్తున్నప్పటికీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ జట్టులో ఉండటంతో ఎంపిక కష్టమైంది. 2022 చివరలో బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసినప్పటికీ తర్వాతి మ్యాచ్‌లోనే అతను జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అలాగే 2023లో వెస్టిండీస్‌తో జరిగిన అరంగేట్రం సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, అదే ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో అతనికి చోటు దక్కలేదు.
దీంతో ఇషాన్ కిషన్‌కు గడ్డు కాలం మొదలైంది. ఆ సమయంలోనే అతను దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలోనే వదిలి వచ్చేశాడు.
అప్పుడు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. "మానసిక ఒత్తిడి కారణంగా విరామం కావాలని ఇషాన్ కిషన్ కోరాడు" అని ఆ నిర్ణయానికి గల కారణాన్ని వివరించారు.
అయితే ఆ తర్వాత భారత జట్టులోకి ఇషాన్ పునరాగమనానికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లు అనిపించింది. ఫిబ్రవరి 2024లో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బీసీసీఐ. అదే ఏడాది చివరలో ముంబయి ఇండియన్స్ కూడా అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. అయినప్పటికీ ఇషాన్ కుంగిపోకుండా దేశవాళీ క్రికెట్ వైపు మళ్లాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎక్కువగా ఆలోచించడం మానేశాను'
గత రెండేళ్ల కాలంలో తన జీవితంలో జరిగిన పరిణామాలపై ఇషాన్ కిషన్ ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఇప్పుడు జట్టులో స్థానం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మానేశానని అన్నాడు.
"నిజం చెప్పాలంటే, గత రెండేళ్లలో నేను అతిగా ఆలోచించడం మానేశాను. నేను ఎక్కడ బ్యాటింగ్ చేస్తాను? రేపు జట్టులో ఉంటానా లేదా? అనే విషయాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఎందుకంటే అవి నా చేతుల్లో లేవు. నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏమిటంటే.. ఫలితం గురించి చింతించకుండా, కేవలం కష్టపడుతూ పని చేసుకుంటూ పోవడమే" అన్నాడు ఇషాన్.
విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందుతూ తన ఎనర్జీని ఎలా కాపాడుకోవాలో నేర్చుకున్నానని చెప్పాడు.
"విరాట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలుగా అతను తన ఎనర్జీని వినియోగించుకున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. నాలో నేను ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది అర్థం చేసుకోవడానికి అది సాయపడింది" అని ఇషాన్ వివరించాడు.
చివరగా.. "నైపుణ్యాలు పెద్దగా మారిపోవు, అందుకే ఇప్పుడు నేను నా పని చేసుకుంటూ వెళుతున్నా. ఎక్కువగా ఆలోచించడం మానేశా" అన్నాడు ఇషాన్ కిషన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













