You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘యుద్ధంపై చర్చలకు అమెరికా నుంచి సంకేతాలు అందాయి’’: వెల్లడించిన ఇరాన్
అమెరికా నుంచి మధ్యవర్తుల ద్వారా కొన్ని అంశాలు అందాయని, ప్రస్తుతం వాటిని సమీక్షిస్తున్నామని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు బీబీసీ అమెరికన్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
అమెరికా, ఇరాన్ మధ్య జరగడానికి అవకాశం ఉన్నట్లుగా చెబుతున్న ఈ చర్చలకు సంబంధించి పరస్పర విరుద్ధమైన రిపోర్టులు వస్తున్న తరుణంలో ఈ కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఇది కేవలం చర్చల ప్రారంభానికి వేసిన ముందడుగు మాత్రమేనని, చర్చలు ఇంకా ఖరారు కాలేదని, ప్రస్తుతం జరగట్లేదని సీబీఎస్ న్యూస్ తెలిపింది.
ట్రంప్ నియమించిన మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఈ వారం పాకిస్తాన్‌లో ఇరాన్ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయని బీబీసీ ప్రతినిధి గాబ్రియేలా పోమెరాయ్ తెలిపారు. చర్చల అవసరం ఏర్పడితే ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ పేర్కొన్నట్లు తెలిపారు.
సోమవారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య 'నిర్మాణాత్మక' చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, ఇరాన్ అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య ఎటువంటి కీలక చర్చలు జరగలేదని తోసిపుచ్చారు. వైట్‌హౌస్ సైతం చర్చల విషయంలో ప్రస్తుత పరిస్థితి 'అస్థిరంగా' ఉందని తెలిపింది.
చర్చలపై డోనల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత, ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ఆ తర్వాత తిరిగి పుంజుకుని బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటింది.
కాగా, ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులను వాయిదా వేసిన తర్వాత, డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఘర్షణను ఆపేందుకు అమెరికా ఒక ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
ఓవైపు చర్చల ప్రకటనలు వస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
రాత్రిపూట ఇజ్రాయెల్‌పై ఇరాన్ వరుస క్షిపణి దాడులు చేయడంతో టెల్ అవీవ్, సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని భవనాలు దెబ్బతిన్నాయి.
లెబనాన్‌లో రాత్రిపూట బేరూత్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అలాగే, హిజ్బొల్లాకు చెందిన భవనాలే లక్ష్యంగా మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో, దక్షిణ ప్రాంత నివాసితులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఈ ఉదయం హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)