ట్రంప్ పదేపదే దాడి చేస్తున్నా భారత్ ఆచితూచి స్పందించడానికి కారణమేంటి?

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారత్, చైనాలను 'భూతల నరకకూపాలు'గా అభివర్ణిస్తున్న ఒక పోస్ట్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో షేర్ చేశారు.

అమెరికాలో అక్రమ వలసల గురించి చేసిన ఈ పోస్టుపై భారత్ స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, రెండు దేశాల బలమైన సంబంధాలకు విరుద్ధమని పేర్కొంది.

నిజానికి, అమెరికాలోని రైట్ వింగ్ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ తన రేడియో షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి ఎలాంటి కామెంట్ కూడా జత చేయకుండా ట్రంప్ గురువారం ఆ పోస్ట్‌ను షేర్ చేశారు.

"ఇక్కడ పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత వారు చైనా లేదా భారత్ వంటి నరకకూపాల నుంచి తమ కుటుంబాలను ఇక్కడికి తీసుకొస్తారు. ఈరోజుల్లో అమెరికాకు వస్తున్న వలసదారులకు ఈ దేశం పట్ల విధేయత ఉండడం లేదు. అప్పటి యూరోపియన్ అమెరికన్లు లేదా వారి పూర్వీకుల మాదిరిగా లేరు" అని సావేజ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అమెరికా రాజ్యాంగాన్ని సవరించి, పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే సావేజ్ వ్యాఖ్యలను డోనల్డ్ ట్రంప్ షేర్ చేశారు.

భారత్, చైనాలు 'భూతల నరకకూపాలు'గా పేర్కొన్న పోస్టును ట్రంప్ షేర్ చేయడంపై ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తొలుత మీడియాతో "మేం ఆ పోస్టును చూశాం" అని మాత్రమే చెప్పారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం తన వైఖరిని కఠినతరం చేసింది.

రణధీర్ జైస్వాల్ గురువారం రాత్రి మాట్లాడుతూ "ఈ వ్యాఖ్యలు అజ్ఞానంతో కూడినవి, అనుచితమైనవి, దిగజారుడు స్వభావం కలవి. అవి భారత్ - అమెరికా సంబంధాల వాస్తవికతలను ప్రతిబింబించవు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి" అన్నారు.

మరోవైపు, "భారత్ ఒక గొప్ప దేశమని, అక్కడ తనకు మంచి స్నేహితుడు (ప్రధాని) ఉన్నారని అధ్యక్షుడు చెప్పారు" అని న్యూదిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

భారత్ బలహీనమైన స్పందనకు కారణమేంటి?

భారత్ ఈ విషయంపై దూకుడుగా కాకుండా సంయమనం పాటించి, అసంతృప్తిని మాత్రమే వ్యక్తం చేసింది.

అయితే, అమెరికాతో నేరుగా వివాదానికి దిగడం భారత్‌కు ఇష్టం లేదని విశ్లేషకుల భావిస్తున్నారు. ముఖ్యంగా, అమెరికాతో కుదుర్చుకోవాల్సిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇందుకు ప్రధాన కారణమని వారు అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం భారత దేశానికి అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం అవసరం. ఇది చాలా పెద్ద సమస్య, ఇప్పటికీ నిలిచిపోయింది. ట్రంప్ ఎప్పుడైనా, ఎలాంటి ప్రకటన అయినా చేస్తారు. ఆ విషయాలపై ప్రతిస్పందించి భారత్ తన ప్రాధాన్యతల నుంచి పక్కకు తప్పుకోవాలని అనుకోవడం లేదు" అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ హర్ష్ పంత్ అన్నారు.

డోనల్డ్ ట్రంప్ ప్రకటనలను అమెరికా దేశీయ రాజకీయాలకు ముడిపెడుతున్నారు విశ్లేషకులు.

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని అమెరికన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉమా పురుషోత్తమన్ మాట్లాడుతూ, "అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ట్రంప్ మద్దతుదారులకు వలసదారులు ఒక పెద్ద సమస్య. ఆయన వ్యాఖ్యలు భారతదేశాన్ని ఉద్దేశించినవి కాకుండా, దేశీయ ఓటర్లను ఉద్దేశించినవేనని భావిస్తున్నా. ఆయన రేటింగ్‌లు పడిపోతున్నాయి, ఇలాంటి ప్రకటనలు, శీర్షికలతో ఆయన తన మద్దతుదారుల దృష్టిని తిరిగి ఆకర్షించాలనుకుంటున్నారు" అన్నారు.

కాగా, ట్రంప్ పోస్ట్‌పై ఇప్పటివరకు చైనా కూడా స్పందించలేదు.

"చైనా కూడా దీనిపై మౌనంగా ఉంది. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ట్రంప్ ప్రకటనలపై పెద్దగా స్పందించడం లేదు, ఎందుకంటే ఆయన మాటలు మారుతూ ఉంటాయి" అని హర్ష్ పంత్ అన్నారు.

ట్రంప్ కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా, గత కొన్నినెలలుగా పాశ్చాత్య మిత్రదేశాలపై కూడా అనేక వ్యాఖ్యలు చేశారు.

ఉమా పురుషోత్తమన్ మాట్లాడుతూ, "భారత్, ప్రపంచంలోని ఇతర దేశాలు ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాయి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే లాభదాయకం. అగ్నికి ఆజ్యం పోయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని పేర్కొన్నారు.

అమెరికాతో మెరుగైన సంబంధాలను కొనసాగించడం భారత్‌కు చాలా కీలకమని ఉమా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఇది భారత వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.

"భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే, ట్రంప్ పాలనలో అమెరికా ఒక అత్యంత అస్థిరమైన, అనూహ్య శక్తిగా మారింది. ట్రంప్ వ్యక్తిగతంగా అంతకంటే ఎక్కువ అనిశ్చితంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండాలి" అన్నారామె.

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు

'భూతల నరకకూపాలు' అనే వ్యాఖ్య అత్యంత అవమానకరమని, భారత్‌కు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీ 'ఎక్స్' పోస్టులో "ఈ వ్యాఖ్య ప్రతి భారతీయుడిని బాధిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడి వద్ద ప్రస్తావించాలి, నిరసన తెలియజేయాలి" అని రాసింది.

మరో ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ.. "నరేంద్ర మోదీ స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్‌ను నరకం అని పిలిచారు. అక్కడ పని చేస్తున్న భారతీయులను 'గ్యాంగ్‌స్టర్స్ విత్ లాప్‌టాప్స్' అన్నారు. కానీ, మా దేశాన్ని అవమానించే ధైర్యం మీకెలా వచ్చిందని అమెరికా అధ్యక్షుడిని నిలదీసే ధైర్యం నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి లేదు" అని విమర్శించారు.

బీజేపీ నాయకుడు, వ్యూహకర్త రామ్ మాధవ్ గురువారం అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన 'ది న్యూ ఇండియా కాన్ఫరెన్స్'లో ట్రంప్ పోస్టుపై స్పందించారు. ఈ వ్యాఖ్యలు భారతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

"నేడు ప్రవాస భారతీయులలో తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. వీటిని సీరియస్‌గా పరిగణించాలి. మన సమాజం గురించి 'హెల్ హోల్' (నరకకూపాలు) వంటి మాటలు లేదా 'లాప్‌టాప్‌లు వాడే మోసగాళ్లు' వంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు, కమ్యూనిటీ ఆందోళన చెందుతుంది" అని రామ్ మాధవ్ పేర్కొన్నారు.

భారత్ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత కీలకమని, ముఖ్యమైన భాగస్వామ్యమని ఆయన చెప్పారు.

అదే సమావేశంలో పాల్గొన్న శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా 'హెల్ హోల్' వ్యాఖ్యలపై స్పందించారు.

"నేను ఇక్కడకు వస్తున్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్ పోస్టు గురించి తెలిసింది. నేను దాన్ని ట్రూత్ సోషల్‌లో చదివాను. అయితే, ప్రస్తుతానికి ఆ వ్యాఖ్యలను పక్కన పెడదాం, ముఖ్యంగా భారత్‌ ఓ 'నరకం కూపం వంటి వ్యాఖ్యలను" అని ఆమె అన్నారు.

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అమెరికాలో దాదాపు 55 లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. అమెరికాలో ఆసియా మూలాలున్న అతిపెద్ద సమూహాల్లో భారతీయ అమెరికన్లు, చైనా అమెరికన్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ షేర్ చేసిన పోస్ట్‌లో చైనా ప్రస్తావన కూడా ఉంది.

భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. తన మొదటి పదవీకాలంలో జులై 2019లో, కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు. అయితే, కశ్మీర్ విషయంలో మూడవ దేశం జోక్యాన్ని భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది.

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో భారత పర్యటకులపై దాడి జరిగినప్పుడు భారత్ - పాకిస్తాన్ మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ సమయంలో తానే ఇరుదేశాలపై ఒత్తిడి తెచ్చి ఆ ఘర్షణను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్ ఈ వాదనలపై బహిరంగంగా స్పందించలేదు కానీ, రెండు దేశాల సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగిందని పదేపదే స్పష్టం చేసింది.

జులై 2025లో భారత ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. ఆ తర్వాత ఒక ప్రకటనలో, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ విమర్శించారు. ఫిబ్రవరి 2025లో ఆయన భారత్‌ను మళ్లీ 'టారిఫ్ కింగ్' అని పిలిచారు.

అయితే, ట్రంప్ పలుమార్లు భారత్‌ను ఒక అందమైన దేశమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తనకు మంచి మిత్రుడని కూడా చెప్పారు. ప్రధాని మోదీ కూడా ట్రంప్‌ను తనకు మంచి మిత్రుడిగా పేర్కొంటూ వచ్చారు.

సెప్టెంబర్ 2019లో అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' సభలో ట్రంప్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. అప్పుడు దాదాపు 50 వేల మంది భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ "అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్" అని మోదీ నినదించారు.

ట్రంప్ మొదటి పదవీకాలంలో ఇద్దరు నేతల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని నిపుణులు భావిస్తున్నారు. అయితే, గత ఏడాది అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయితే, గత ఏడాది విధించిన చాలా టారిఫ్‌లను ట్రంప్ ఈ ఏడాది ఉపసంహరించుకున్నారు.

భారత్, అమెరికా ఇప్పుడు ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్)పై పని చేస్తున్నాయి. టారిఫ్‌ల పెరుగుదలను అడ్డుకోవడం, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ ట్రేడ్ డీల్ గురించి హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ సమావేశంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ, "మేం ట్రేడ్ డీల్ వైపు చూస్తున్నాం. ఇది వచ్చే నెలలో పూర్తవుతుందని ఆశిస్తున్నాం. ఈ ఒప్పందం మాకు చాలా ముఖ్యం" అని చెప్పారు.

అయినప్పటికీ, అమెరికా అధ్యక్షుడి నుంచి అప్పుడప్పుడు వచ్చే ప్రకటనలు భారత్‌లో పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

అందుకే, "ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కేవలం మాకే కాదు.. నేటో, ఈయూ, క్వాడ్ దేశాలకు కూడా అర్థం కావడం లేదు" అన్నారు రామ్ మాధవ్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)