‘‘పని కల్పిస్తాం.. రండి’’ అంటూ జర్మనీ భారతీయులను ఎందుకు పిలుస్తోంది?

    • రచయిత, టిమ్ మాన్సెల్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్
  • చదివే సమయం: 5 నిమిషాలు

జర్మనీ, నిపుణులైన కార్మికుల కొరతతో ఇబ్బందిపడుతోంది. వయస్సు పైబడిన వారు రిటైర్ అవుతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తగినంత యువ జనాభా లేదు. ఈ సమస్యను తీర్చడానికి జర్మనీ ఇప్పుడు భారత్ నుంచి వచ్చే కార్మికులపై ఎక్కువగా దృష్టి పెడుతోంది.

హండ్రిక్ వోన్ ఉంగెర్న్-స్టెర్న్‌బర్గ్ అనే వ్యక్తి, 2021 ఫిబ్రవరిలో భారత్ నుంచి ఒక ఈమెయిల్‌ను అందుకున్నారు.

''మా దగ్గర పని నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న యువకులు చాలా మంది ఉన్నారు. మీకు అలాంటి వారు కావాలా?'' అనేది ఆ మెయిల్ సారాంశం.

అప్పుడు ఆయన జర్మనీలోని 'ఫ్రీబర్గ్ చాంబర్ ఆఫ్ స్కిల్డ్ క్రాఫ్ట్' అనే వాణిజ్య సంస్థలో పనిచేసేవారు. ఇటుక పని, వడ్రంగులు, మాంసం కొట్టులో పనిచేసేవారు, బేకర్ల తరఫున.. ఈ పనులు చేసేవారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల తరఫున ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఆ ఈమెయిల్ సరైన సమయంలో ఆయనకు వచ్చింది.

''చాలా మంది యజమానులు, పనివారి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మేం ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం'' అని ఆయన చెప్పారు.

మాంసం దుకాణాల్లో...

మొదట ఆయన స్థానిక బుచర్స్ గిల్డ్ (మాంసం విక్రయదారుల సంఘం) హెడ్‌కు ఫోన్ చేశారు. అప్పట్లో జర్మనీ అంతటా ఈ రంగం కష్టాల్లో ఉంది. గణనీయంగా క్షీణించింది. 2002లో 19,000గా ఉన్న ఇలాంటి చిన్న వ్యాపారాలు, 2021 నాటికి 11,000 కు తగ్గిపోయాయి. యువకులు ఎవరూ ఈ పని చేయడానికి ముందుకు రాలేదు.

''ఇది చాలా కష్టమైన పని. అందుకే గత 25 ఏళ్లుగా యువకులు ఈ వృత్తి వైపు రావట్లేదు. వేరే పనుల వైపు వెళ్తున్నారు'' అని బుచర్స్ గిల్డ్ హెడ్ జోచిమ్ లెడెరర్ అన్నారు.

హండ్రిక్‌కు ఈమెయిల్ పంపించిన భారత్‌లోని 'మ్యాజిక్ బిలియన్' అనే సంస్థ, ఆ సమయంలో 13 మందిని ఎంపిక చేసి 2022లో జర్మనీకి పంపింది. వాళ్లంతా స్విట్జర్లాండ్ సరిహద్దులోని చిన్న పట్టణాల్లో బుచరీ అప్రెంటిస్‌షిప్‌ కోసం వచ్చారు.

అలా జర్మనీకి చేరిన వారిలో 21 ఏళ్ల అనఖ మరియం షాజీ ఒకరు. తన సహచరుల్లో చాలామందిలాగే ఆమె కూడా మొదటిసారి భారత్‌ను వదిలి వెళ్లారు.

'ప్రపంచాన్ని చూడాలనుకున్నా. నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నా. మంచి స్థితిలో ఉండాలనుకున్నా' అని ఆమె చెప్పారు. వైల్ అమ్ హైన్ పట్టణంలో లెడెరర్‌ వద్ద పనిచేయడానికి అనఖ వచ్చారు.

మూడేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఇప్పుడు 'మ్యాజిక్ బిలియన్'కు చెందిన అదితి బెనర్జీ భాగస్వామ్యంతో వోన్ ఉంగెర్న్-స్టెర్న్‌బర్గ్ 'ఇండియా వర్క్స్' అనే తన సొంత సంస్థను స్థాపించారు. మరింత మంది భారతీయులను జర్మనీకి తీసుకువస్తున్నారు.

జర్మనీలోని బుచర్స్ దుకాణాల్లో పనిచేసే భారతీయుల సంఖ్య 13 నుంచి ఇప్పుడు 200 మందికి చేరింది.

జనాభా సంక్షోభం

జర్మనీ, జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

జర్మనీ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఏటా 2.88 లక్షల మంది విదేశీ కార్మికులు అవసరమని 2024లో బెర్టెల్స్‌మన్ ఫౌండేషన్ థింక్ టాంక్ చేసిన ఒక అధ్యయనం చెబుతోంది. లేకపోతే 2040 నాటికి కార్మిక శక్తి 10 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది.

ఓవైపు బేబీ బూమర్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్‌కు సమీపిస్తున్నారు. మరోవైపు జననాల రేటు తక్కువగా ఉండటంతో జర్మనీలో యువకుల కొరత ఉండగా, భారత్‌లో యువ జనాభా పుష్కలంగా ఉంది.

ఇండియాలో 25 ఏళ్ల లోపున్న వారు 60 కోట్ల మంది ఉన్నారని అదితి బెనర్జీ అన్నారు.

'ఏటా కేవలం 1.20 కోట్ల మంది మాత్రమే ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అందుకే పనిచేసేవారు చాలా ఎక్కువ మంది అందుబాటులో ఉన్నారు' అని బెనర్జీ వివరించారు.

ఈ ఏడాది అప్రెంటిస్‌షిప్ కింద 775 మందిని జర్మనీకి తీసుకొచ్చేందుకు ఇండియా వర్క్స్ సిద్ధమవుతోంది.

ఇప్పుడు కేవలం మాంసం షాపుల్లోనే కాకుండా రోడ్లు వేయడం, మెకానిక్, తాపీ మేస్త్రీలు, బేకర్లుగా కూడా భారతీయులు వెళ్తున్నారు.

భారత్, జర్మనీ దేశాల మధ్య 2022లో కుదిరిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ ప్రకారం భారతీయ వర్కర్లు పని కోసం జర్మనీ వెళ్లడం సులభమైంది.

భారతీయుల కోసం వర్క్ వీసా కోటాను ఏటా 20,000 నుంచి 90,000 కు పెంచినట్లు 2024లో జర్మనీ ప్రకటించింది.

జర్మనీలో 2015 నాటికి 23,000 మంది ఉన్న భారతీయ కార్మికులు, 2024 నాటికి 1.36 లక్షలకు పెరిగారు.

‘తక్కువ జీతానికి పని చేయలేను’

ఇండియా వర్క్స్ ద్వారా జర్మనీకి వెళ్లిన భారతీయులంతా అక్కడ లభించే అధిక జీతాలు, మెరుగైన జీవితం గురించి సంతోషంగా ఉన్నారు.

ఉదాహరణకు, దిల్లీకి చెందిన 20 ఏళ్ల ఇషు గారియా ఇప్పుడు జర్మనీలో బేకర్ అప్రెంటిస్‌గా పనిచేస్తూ తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు.

'ముందు డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్స్‌కు సంబంధించిన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా. కానీ, అంత డబ్బు పెట్టి చదివి, తక్కువ జీతానికి పనిచేయడం నాకు ఇష్టలేదు. అందుకే జర్మనీ వచ్చాను. ఇక్కడ మాకు జీతం ఎక్కువగా ఉంటుంది. దీంతో నా కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండగలుగుతున్నా' అని ఇషు చెప్పారు.

అలాగే హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అజయ్ కుమార్ చందపాక, స్పెడిషన్ డోల్డ్ అనే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేయడానికి జర్మనీకి వెళ్లారు. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.

'నాకు ఇండియాలో ఉద్యోగం దొరకలేదు. చాలా కష్టమైంది. అందుకే జర్మనీలో అప్రెంటిస్‌షిప్ మంచి మార్గమని భావించా' అని అజయ్ కుమార్ చెప్పారు.

‘భారతీయులు లేకుంటే నా వ్యాపారం మూతపడేది’

లెడెరర్ వద్ద ఇప్పుడు ఏడుగురు భారతీయులు పనిచేస్తున్నారు. ఈ భారతీయుల వల్లే తన వ్యాపారం నిలబడిందని ఆయన అంటున్నారు.

''35 ఏళ్ల క్రితం నేనీ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు, ఇక్కడికి 10కి.మీ పరిధిలో ఇలాంటి దుకాణాలు 8 ఉండేవి. ఇప్పుడు నేను ఒక్కడినే మిగిలాను. భారతీయులు లేకపోతే ఈ రోజు నా వ్యాపారం మూతపడి ఉండేది' అని లెడెరర్ అన్నారు.

వైల్ అమ్ హైన్ పట్టణ మేయర్ డయానా స్టాకర్ కూడా ఇప్పుడు ఇండియా నుంచి కిండర్‌గార్టెన్ స్కూల్ టీచర్లను నియమించుకుంటున్నారు.

'మేం జర్మనీ అంతటా టీచర్ల కోసం వెతికాం. కానీ, ఇక్కడ టీచర్లు దొరకడం చాలా కష్టంగా ఉంది' అని కన్జర్వేటివ్ క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ పార్టీకి చెందిన డయానా చెప్పారు.

జర్మనీ అభివృద్ధి చెందాలంటే విదేశీయులను తీసుకోవడమే తమకున్న ఏకైక మార్గమని ఆమె స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)