తీవ్రవాద భావజాలం ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో విజయవాడలో మహిళ సహా నలుగురు అరెస్ట్

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

తీవ్ర చట్టవిరుద్ధ, దేశద్రోహ కార్యకలాపాల కేసులో విజయవాడకు చెందిన ముగ్గురు యువకులతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ టూ టౌన్ సీఐ ఏడుకొండలు బీబీసీకి వెల్లడించారు.

అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ), ఐజీ త్రిపాఠి మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో గ్రూపులను నిర్వహిస్తూ తీవ్రవాద భావజాలానికి సంబంధించిన కంటెంట్‌ను వ్యవస్థీకృతంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణపై విజయవాడ నగరంలోని వించిపేటకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మిర్జా సోహైల్‌ను మంగళవారం అరెస్టు చేసినట్టు సీపీ వెల్లడించారు.

ఈ మేరకు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 98/2026 గా కేసు నమోదు చేశామని తెలిపారు.

‘వారికి సహకరిస్తున్న’ హైదరాబాద్‌కి చెందిన మహిళ సయ్యద్ బేగంను బుధవారం అరెస్టు చేసి విజయవాడ తీసుకొస్తున్నట్టు టూ టౌన్ సీఐ ఏడుకొండలు బీబీసీతో చెప్పారు.

‘మొత్తం 12 మంది’

నిందితులపై భారత న్యాయ సంహిత (బిఎన్ఎస్), అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఈ నలుగురు నిందితులకు దేశం వెలుపల ఉన్న కొంతమందితో సంబంధాలున్నాయని, దేశ సార్వభౌమత్యం, ఐక్యత, భద్రతకు భంగం కలిగించే చర్యలకు వారు ప్రోత్సాహం అందిస్తున్నట్టు గుర్తించామని చెప్పారు.

ఈ కేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని త్రిపాఠి వెల్లడించారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఐక్యూఐఎస్, ఐఎస్ఐఎస్ పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశారని చెప్పారు.

ఒక గ్రూపులో అయిదుగురు మరో గ్రూపులో ఏడుగురు సభ్యులు ఉన్నట్టు గుర్తించామన్నారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఒక గ్రూప్‌గా ఏర్పడి పోస్టింగ్స్ పెడుతున్నట్టు గుర్తించామని చెప్పారు.

వారంతా తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని, అరెస్టైన వారి నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అరెస్ట్ అయిన ముగ్గురు విజయవాడకు చెందినవారని త్రిపాఠి స్పష్టం చేశారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించిందని తెలిపారు.

ఆ గ్రూపుల్లో మిగిలిన సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు

నిందితుల ఆడియో సందేశాలు, సోషల్ మీడియాలో పోస్టులతో డిజిటల్ కంటెంట్‌ను విస్తృతంగా షేర్ చేస్తూ తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడం, భారత జాతీయ చిహ్నాలతో అవమానకరంగా వ్యవహరించడం, దేశ గౌరవానికి భంగం కలిగించేలా అవమానకర వ్యాఖ్యలు చేయడం, విభేదాలు, విద్వేషాలు సృష్టించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని త్రిపాఠి వివరించారు.

వారంతా డబ్బుల కోసం పని చేస్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని త్రిపాఠి వివరించారు. పోలీసు బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని త్వరలోనే మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామని త్రిపాఠి మీడియాకు వివరించారు.

పోలీసుల అదుపులో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి వివరణ అందగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)