ఉస్మాన్ తారిక్: ఈ పాకిస్తానీ బౌలర్ యాక్షన్‌పై చర్చ ఏంటి, టీమిండియాపై మ్యాచ్‌కు ట్రంప్ కార్డ్ అవుతాడని ఎందుకు అంటున్నారు?

పాకిస్తాన్, క్రికెట్, భారత్, ఐసీసీ, బౌలింగ్ యాక్షన్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 6 నిమిషాలు

'అతను ఏం చేస్తున్నాడో భారత్‌‌కు కూడా అర్థం కావడం లేదు, పాకిస్తాన్‌కు అతను కచ్చితంగా ట్రంప్ కార్డ్ అవుతాడు'

పాకిస్తాన్, అమెరికా జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచ్ కప్ మ్యాచ్ సందర్భంగా ఓ భారతీయ చానల్‌లో జరిగిన సంభాషణ ఇది. పాకిస్తానీ బౌలర్ ఉస్మాన్ తారిక్‌ను ఉద్దేశించి ఈ చర్చ జరిగింది. అతని విలక్షణమైన బౌలింగ్‌ యాక్షన్‌ గతంలోనూ చర్చనీయాంశమైంది.

గత మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికా జట్టుపై పాకిస్తాన్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఉస్మాన్ తారిక్ కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

ఆ మ్యాచ్‌లో, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ వీడియోలు భారత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌ యాక్షన్‌ను ప్రశ్నిస్తే.. మరికొందరు బాల్ వేసేముందు ఇస్తున్న 'బ్రేక్' ఐసీసీ నిబంధనల ప్రకారం సమ్మతమేనా? అనే సందేహాలు లేవనెత్తారు.

అయితే, సోషల్ మీడియాలో ఇంత చర్చ జరుగుతున్న సమయంలో.. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఉస్మాన్ తారిక్‌ను సమర్థించాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత మాజీ క్రికెటర్లు ఏమన్నారు?

ఉస్మాన్ బంతికి అమెరికన్ బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన వీడియోను శ్రీవత్స్ గోస్వామి అనే నెటిజన్ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఆ బాల్ వేసేముందు ఉస్మాన్ ఒక క్షణం ఆగినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

"ఫుట్‌బాల్‌లో కూడా, పెనాల్టీ రన్‌అప్ సమయంలో ఆటగాళ్లు ఒకక్షణం పాజ్‌కు(ఆగేందుకు) అనుమతి లేదు. మరి ఇదెలా ఆమోదయోగ్యం? బౌలింగ్ యాక్షన్ ఫర్వాలేదు, కానీ ఈ పాజ్ ఇవ్వడం ఏంటి? అది కూడా బాల్ వేసేముందు. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు" అని శ్రీవత్స్ గోస్వామి ఆ పోస్టులో రాశారు.

గోస్వామి పోస్టును కోట్ చేస్తూ భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ "అవును, ఫుట్‌బాల్‌లో ఇలాంటివి అనుమతించరు, అది నిజమే. కానీ, ఒక బ్యాట్స్‌మెన్ అంపైర్‌కు చెప్పకుండానే ఒకవైపు బంతిని మరోవైపు, రివర్స్ ఆడుతున్నప్పుడు.. రూల్స్ మాత్రం బౌలర్లకే ఎందుకు? అంపైర్‌కు చెప్పకుండా బౌలర్లు మరో చేత్తో బౌలింగ్ చేయడానికి కూడా అనుమతి లేదు. ముందు ఈ రూల్ మార్చాలి".. అని రాశాడు.

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఒక వీడియోలో, ఉస్మాన్ తారిక్ యాక్షన్‌ను ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్‌‌కు అదొక బలంగా అభివర్ణించాడు.

"ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ ఆసక్తికరంగా ఉంది. టీవీ చూస్తున్నప్పుడు, ఒక్క క్షణం ఫ్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. అతను ఒక క్షణం అలా ఆగి, బౌలింగ్ చేస్తాడు. నెమ్మదిగా బౌలింగ్ చేస్తాడు. దానివల్ల ఎలాంటి సమస్యా ఉండదని అనుకుంటున్నా. ఫర్వాలేదు, ఒక క్షణం ఆగి బౌలింగ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఎలాంటి రూల్ లేదు. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, మోచేతిని వంచడం లేదు" అని అన్నాడు.

అయితే, చేతిని వంచకుండా బంతి వేగాన్ని 20 నుంచి 25 కిలోమీటర్లు వేగంగా వేయడం సాధ్యమేనా? అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.

పాకిస్తాన్, క్రికెట్, భారత్, ఐసీసీ, బౌలింగ్ యాక్షన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉస్మాన్ తారిక్‌ను సమర్థించిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

ఈ చర్చ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్‌లో మరో సుదీర్ఘమైన పోస్ట్ రాసేందుకు కారణమైంది. "మొదట, ఐసీసీ బౌలింగ్ టెస్టింగ్ సెంటర్‌లో బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారమే ఉందా లేదా అని మాత్రమే పరీక్షిస్తారు" అని ఆయన రాశాడు.

"రెండోది, 15 డిగ్రీల నిబంధన. దీని ప్రకారం, బౌలర్ మోచేతి యాక్షన్ సరిగ్గా ఉందా లేదా అని చూస్తారు. మైదానంలో బౌలింగ్ చేసేప్పుడు బౌలర్ 15 డిగ్రీల లోపే బౌలింగ్ చేస్తున్నాడా లేదా అని పరిశీలించడం అంపైర్‌కు అసాధ్యం."

"రియల్ టైం కాంపిటీషన్ టెస్టింగ్ టూల్‌ను తీసుకురావడమే దీనికి ఏకైక పరిష్కారం. అసలు ఎలాంటి స్పష్టతా లేని ఈ విషయాన్ని ఎవరో తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించడం సరికాదు. క్రీజు లోపల బంతి పాజ్ చేయడం చట్టబద్ధమా? కాదా? అంటే.. అది అతని సహజసిద్ధమైన బౌలింగ్ యాక్షన్ కాబట్టి చట్టబద్ధమేనని నేను భావిస్తున్నా" అని అశ్విన్ రాశాడు.

పాకిస్తాన్, క్రికెట్, భారత్, ఐసీసీ, బౌలింగ్ యాక్షన్

తన బౌలింగ్ యాక్షన్ గురించి ఉస్మాన్ తారిక్ ఏమన్నాడు?

సుమారు ఏడాది కిందట, ఉస్మార్ తారిక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రెండు మోచిప్పలు (2 ఎల్బోస్) ఉన్నాయని, అందువల్లే తన బౌలింగ్ యాక్షన్ కొంత భిన్నంగా కనిపిస్తుందని చెప్పాడు.

తన బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరాలు రావడంతో, డాక్టర్ వద్దకెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు ఉస్మాన్ చెప్పాడు. ఉస్మాన్ తారిక్ చెప్పిన వివరాల ప్రకారం, ఇతరులతో పోలిస్తే అతని శరీర నిర్మాణం భిన్నంగా ఉంది.

అలాగే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత ఏడాది మే 7న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. క్వెట్టా గ్లాడియేటర్స్ స్పిన్నర్ తారిక్ లాహోర్‌లోని బయోమెకానిక్స్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నాడని, అతని బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని తెలిపింది.

పీసీబీ ప్రకారం, ఏప్రిల్ 13న లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు.

పాకిస్తాన్, క్రికెట్, భారత్, ఐసీసీ, బౌలింగ్ యాక్షన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాక్‌కు ఉస్మాన్ తారిక్ కీలకమని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ అన్నారు.

బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరమా?

అమెరికాపై పాకిస్తాన్ విజయం తర్వాత ఈఎస్‌పీఎన్‌లో చర్చ సందర్భంగా.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడాడు.

"అతను డిఫరెంట్ యాంగిల్స్‌లో బౌలింగ్ చేస్తాడు. రౌండ్ ఆర్మ్, ఓవర్ ది టాప్ బాల్స్ వేస్తాడు. దానివల్ల బంతి పలువిధాలుగా బౌన్స్ అవుతుంది. దానికంటే ముందు, ఒక క్షణం ఆగి.. బ్యాట్స్‌మెన్ పాదాలను బట్టి అతను ఎటువైపు తిరిగే అవకాశముంది, ఏ షాట్ ఆడొచ్చు వంటివి గమనించి.. ఆ తర్వాత బాల్ వేస్తాడు, బ్యాట్స్‌మెన్‌ను నిలువరించే ప్రయత్నమది" అన్నారు.

"బంతి బ్యాట్‌కు మధ్యలో తగలకుండా, బ్యాట్‌ అంచులకు తగిలేలా ప్రయత్నం చేస్తాడు. ఒక్కో బంతి, ఒక్కో రకమైన బౌన్స్‌తో రావడం బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందే. అతను ఇదే తరహాలో బౌలింగ్ చేస్తూ పాకిస్తాన్ జట్టులో ఉన్నంత కాలం.. అతను ఆ జట్టుకు విలువైన ఆస్తేనని నేను భావిస్తున్నా" అంటూ వ్యాఖ్యానించారు.

అదే చర్చలో, భారత మాజీ క్రికెటర్ సబా కరీం మాట్లాడుతూ.. ఆ చిన్న పాజ్ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించేందుకు ఉపయోగపడుతుందని అన్నాడు.

"దానివల్ల అతను వైవిధ్యంగా బంతులు వేయగలడు. కొన్ని మ్యాచ్‌లలో అతను టాప్ ఆర్డర్‌తో పాటు మేటి బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం మనం చూశాం. అతని ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఈ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌‌కు చాలా కీలకం అవుతుంది" అని అభిప్రాయపడ్డాడు.

పాకిస్తాన్, క్రికెట్, భారత్, ఐసీసీ, బౌలింగ్ యాక్షన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీఎస్‌ఎల్ టోర్నమెంట్ సందర్భంగా ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌ తీరుపై ఫిర్యాదులు వచ్చాయి.

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఇందులోని సాంకేతిక అంశాలను అర్థం చేసుకునేందుకు లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లోని బయోమెకానిక్స్ నిపుణులు, ప్రొఫెసర్ మొహమ్మద్ ఒవైస్‌తో బీబీసీ ఉర్దూ మాట్లాడింది. గతంలో ఈయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించేవారు.

"బౌలింగ్ సమయంలో 'పాజ్'కు సంబంధించి ఎలాంటి సమస్యా లేదు, అయితే మోచేయి 15 డిగ్రీలకు మించి వంగకూడదు. మోచేతి యాంగిల్ 15 డిగ్రీలు, లేదా అంతకంటే తక్కువ ఉంటే అది సమస్యే కాదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

"కొన్నిసార్లు బౌలర్ చేతి నిర్మాణమే స్వతహాగా అలా ఉండొచ్చు. దానివల్ల బౌలర్ చకింగ్ చేస్తున్నట్లు మన కంటికి కనిపించొచ్చు. అంటే, తప్పుగా వేస్తున్నట్లు. కానీ, ఐసీసీ కెమెరాలతో పరీక్షిస్తే.. అది చకింగ్‌లోకి రాదు. బౌలర్ చకింగ్ చేస్తున్నట్లు పరీక్షల్లో తేలకపోవచ్చు" అని అన్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం, ఎవరైనా బౌలర్ చేతి యాక్షన్‌ను పరీక్షించేందుకు 12 ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు, రెండు హైస్పీడ్ కెమెరాలను వేర్వేరు కోణాల్లో అమర్చి పరిశీలిస్తారని.. ఆ ఫలితాలను ఐసీసీ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసి ప్రాసెస్ చేస్తే, ఆ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అనేది తేలిపోతుందని ఆయన అన్నారు.

ఎవరీ ఉస్మాన్ తారిక్?

ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం, ఉస్మాన్ తారిక్ 2023 నవంబర్‌లో పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌ టోర్నమెంట్‌తో అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌-2024లో కూడా పాల్గొన్నాడు. అయితే, ఆ టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

కానీ, 2024-25 మధ్య దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లలోకి పునరాగమనం చేసిన ఉస్మాన్.. 15 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టాడు.

అదే సమయంలో, అతని బౌలింగ్ యాక్షన్‌పై రెండుసార్లు ఫిర్యాదులు వచ్చాయి. 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో మొదటిసారి అతనిపై ఫిర్యాదు చేశారు.

అయితే, లాహోర్ నేషనల్ క్రికెట్ అకాడమీ పరీక్షల్లో పాస్ కావడంతో అతన్ని కొనసాగించారు.

ఆ తర్వాత పీఎస్‌ఎల్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన పరీక్షల్లోనూ అతను పాస్ అయ్యాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)