పీరియడ్స్ రక్తం చెప్పే ఆరోగ్య రహస్యాలు

మహిళలు, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC

    • రచయిత, శాండీ ఓంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 10 నిమిషాలు

నెలనెలా పీరియడ్స్ వచ్చే చాలామంది మహిళల్లాగే ఎమ్మా బ్యాక్‌లూండ్ కూడా తన శరీరం నుంచి విడుదలయ్యే ఆ రక్తం గురించి పెద్దగా ఆలోచించడానికి ఇష్టపడేవారు కాదు.

కానీ 2023లో 'నెక్స్ట్‌జెన్ జేన్' అనే బయోటెక్ స్టార్టప్ సంస్థ ఆమె పీరియడ్ రక్తాన్ని కోరినప్పుడు, ఎమ్మా వెంటనే స్పందించారు. తన ఒక మెన్‌స్ట్రువల్ సైకిల్‌కు సంబంధించిన ఎనిమిది టాంపన్‌లను భద్రపరిచి, కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో ఉన్న ఆ సంస్థ ప్రయోగశాలకు పోస్ట్‌లో పంపించారు.

అదొక విచిత్రమైన విషయమే, కానీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా సులువుగా చేయగలిగిన పని. అందుకే ఆమె సంతోషంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా, తాను చిన్నతనం నుంచి అనుభవించిన ఆ భయంకరమైన నొప్పి బారిన తనలాగే భవిష్యత్తులో అమ్మాయిలెవరూ పడకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

''నాకు 11 ఏళ్ల వయసులో మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు, చనిపోతున్నానని అనుకున్నాను'' అని అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన 27 ఏళ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఎమ్మా చెప్పారు.

"వెంటనే హాస్పిటల్‌కు వెళ్దామని మా అమ్మతో చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి నాకు వచ్చిన ప్రతి పీరియడ్ అలాగే ఉండేది. ప్రతి నెల నాకు వాంతులు అయ్యేవి. స్నేహితులతో గడపలేకపోయేదాన్ని, స్కూల్‌కు వెళ్లలేకపోయేదాన్ని. అది భరించలేనంత మంటగా, పొడుస్తున్నట్లుగా, కడుపును పిండేసేంత భయంకరమైన నొప్పిగా ఉండేది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.

తనకు 'ఎండోమెట్రియోసిస్' ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎమ్మాకు 13 ఏళ్లు పట్టింది.

ఇదొక దీర్ఘకాలికమైన, శరీరాన్ని తీవ్రంగా కుంగదీసే సమస్య. గర్భాశయం లోపల ఉండాల్సిన కణజాలం గర్భాశయం బయట పెరగడం ప్రారంభమవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 కోట్ల మంది మహిళలు బాధపడుతున్నారు. అంటే ప్రత్యుత్పత్తి వయస్సులో ఉన్న ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారు.

దీనివల్ల విపరీతమైన రక్తస్రావం, నరకం చూపించే పెల్విక్ నొప్పి (నడుము, పొత్తికడుపు నొప్పి), మూత్రాశయం లేదా పేగు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చివరకు సంతానలేమికి కూడా దారితీస్తుంది.

అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధిని నిర్ధరించడానికి సాధారణంగా ఐదు నుంచి పన్నెండేళ్ల సమయం పడుతుంది. ఎమ్మా విషయంలో అలాగే జరిగింది.

ఈ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధరించాలంటే 'లాపరోస్కోపీ' అనే వైద్య ప్రక్రియ తప్పనిసరి. ఒక చిన్న కెమెరాను పొత్తికడుపు లోపలి భాగంలోకి పంపి పరీక్షిస్తారని నెక్స్ట్‌జెన్ జేన్ సహవ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిధి తరియల్ చెప్పారు.

అందుకే, రిధి తరియల్‌తో పాటు మరికొంతమంది వినూత్న స్టార్టప్ లీడర్లు కలిసి ఒక మెరుగైన వ్యాధి నిర్ధరణ పరీక్షను రూపొందించే పనిలో ఉన్నారు. ఇది ప్రస్తుతమున్న శస్త్రచికిత్సల కంటే వేగవంతమైనది, చౌక అయినది, ఇబ్బంది తక్కువగా ఉండేదీ అవుతుందని వారు హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా, ఇది కేవలం ఎండోమెట్రియోసిస్ గురించి మాత్రమే కాకుండా, ఒక మహిళ ఆరోగ్యానికి సంబంధించిన మరెన్నో విషయాలను బయటపెట్టగలదు.

అసలు ఆరోగ్య రహస్యం అంతా పీరియడ్స్ రక్తంలోనే దాగి ఉందని వారు బలంగా నమ్ముతున్నారు.

మహిళలు, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

వైద్యశాస్త్రంలో ఒక బంగారు గని

సుమారు 6 వేల ఏళ్ల క్రితం నాటి బాబిలోనియన్, సుమేరియన్ కాలం నుంచే వైద్యులు మూత్రం నమూనాలను పరీక్షిస్తున్నారు. గత ఒకటీ రెండు శతాబ్దాల నుంచి మల పరీక్షలు, సిరల రక్తం పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

కానీ, పీరియడ్స్ రక్తానికి వైద్యపరంగా ఎప్పుడూ అంత ప్రాధాన్యం లభించలేదు.

నిజానికి, ఇది చాలా సంక్లిష్టమైన ద్రవం. ఇందులో సగం సాధారణ రక్తం ఉంటే, మిగిలిన సగంలో ప్రోటీన్లు, హార్మోన్లు, బ్యాక్టీరియా, ఎండోమెట్రియల్ కణజాలంతో పాటు యోని కుహరం, గర్భాశయ ద్వారం, ఫెలోపియన్ నాళాలు, అండాశయాల నుంచి విడివడిన కణాలు ఉంటాయి.

సాధారణ రక్తం, లాలాజలం లేదా ఇతర నమూనాల ద్వారా లభించని ప్రత్యేకమైన కణ రకాలు, మాలిక్యులర్ గుర్తులు పీరియడ్ రక్తం ద్వారా మనకు అందుతాయని తరియల్ చెప్పారు.

''ఇది నిజానికి ఒక సహజమైన బయాప్సీలాంటిది. ప్రత్యుత్పత్తి అవయవాల అంతర్గత పరిస్థితిని తెలియజేస్తుంది'' అని ఆమె వెల్లడించారు.

ప్రత్యేకంగా రూపొందించిన కాటన్ టాంపాన్‌లను ఎమ్మా వంటి స్వచ్ఛంద సేవకులకు 'నెక్స్ట్‌జెన్ జేన్' సంస్థ పంపిస్తుంది. 2014లో ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి 330 మందికి పైగా మహిళల నుంచి సేకరించిన 2వేలకు పైగా మెన్‌స్ట్రువల్ నమూనాలను విశ్లేషించారు.

ఒక మహిళ నెక్స్ట్‌జెన్ సంస్థకు చెందిన 'అట్-హోమ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్' (ఇంట్లోనే పరీక్షించుకునే పరికరం) పట్టుకుని ఉన్నారు. ఆ బాక్స్ తెరిచి ఉంది, దాని లోపల ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో సూచనలు, నమూనాలను సేకరించడానికి అవసరమైన సాధనాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, NextGen Jane

ఫొటో క్యాప్షన్, నెక్స్ట్‌జెన్ జేన్ నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలో గర్భాశయ ఆరోగ్యానికి, వయస్సు పెరగడానికి మధ్య ఉన్న సంబంధాలను కనుగొన్నారు.

'మరెన్నో సమస్యలను గుర్తించవచ్చు...'

''గర్భాశయాన్ని ప్రభావితం చేసే అనేక రకాల అనారోగ్య సమస్యలను గుర్తించడానికి మీరు పీరియడ్స్ రక్తాన్ని ఉపయోగించవచ్చు'' అని అమెరికా నార్త్‌వెల్ హెల్త్‌లోని ఫెయిన్‌స్టెయిన్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన రీప్రొడక్టివ్ బయాలజిస్ట్ క్రిస్టిన్ మెట్జ్ చెప్పారు.

మెట్జ్ పదేళ్ల క్రితమే ఎండోమెట్రియోసిస్ తాలూకా బయోమార్కర్లను గుర్తించడానికి పీరియడ్స్ రక్తంపై పరిశోధనలు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఆమె ఈ ద్రవం ద్వారా ఇతర సమస్యలను కూడా గుర్తించవచ్చా అని పరిశీలిస్తున్నారు. అవి ఏమిటంటే, ఎండోమెట్రియల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్), అడెనోమయోసిస్ (గర్భాశయ పొర గర్భాశయ గోడలోకి పెరగడం), ఎండోమెట్రిటిస్ (గర్భాశయ పొరలో నిరంతరం ఉండే వాపు లేదా ఇన్‌ఫ్లామేషన్).

''గర్భాశయ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి పీరియడ్స్ రక్తం ఎంతో విలువైనది. ఇతర మార్గాల ద్వారా మనం తెలుసుకోలేని ఎన్నో విషయాలను ఇది వెల్లడిస్తుంది'' అని మెట్జ్ చెప్పారు.

''ఇదొక అత్యంత విలక్షణమైన జీవ నమూనా'' అని ఆమె అభివర్ణించారు.

ఉదాహరణకు, కేవలం పీరియడ్స్ రక్తంలో మాత్రమే కనిపించే 385 రకాల ప్రోటీన్లను ఒక అధ్యయనంలో గుర్తించారు.

పీరియడ్స్ రక్తం ప్రతి నెలా సహజంగానే అందుబాటులో ఉండటమే గాకుండా, దీనికి ఉన్న మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది గర్భాశయ ఆరోగ్యం గురించి మరింత సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది. సాధారణంగా చేసే 'ఎండోమెట్రియల్ బయాప్సీ'లో గర్భాశయం నుంచి చాలా తక్కువ పరిమాణంలో కణజాలం సేకరిస్తారు. కానీ, పీరియడ్స్ రక్తం మొత్తం గర్భాశయం నుంచే వస్తుంది కాబట్టి, అది మరింత స్పష్టమైన సమాచారాన్ని ఇస్తుంది.

''గర్భాశయం సుమారు ఒక పెద్ద ద్రాక్ష పండు పరిమాణంలో ఉంటుంది. కాబట్టి, ఎండోమెట్రియల్ బయాప్సీతో మీరు మొత్తం గర్భాశయ పరిస్థితిని అంచనా వేయలేరు'' అని మెట్జ్ వివరించారు.

ఆమె తన అధ్యయనంలో పాల్గొనే స్వచ్ఛంద సేవకులను 'మెన్‌స్ట్రువల్ కప్' ద్వారా నమూనాలను సేకరించాలని సూచిస్తారు.

మహిళలు, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యేకమైన బయోమార్కర్ల కోసం పరిశోధన

పీరియడ్స్ రక్తంపై శాస్త్రీయ పరిశోధనలు చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాబట్టి, ఎండోమెట్రియోసిస్‌ను ఖచ్చితంగా గుర్తించగలిగే విశ్వసనీయమైన 'బయోమార్కర్లు' ఇందులో ఉన్నాయా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

అయితే మెట్జ్, ఆమె పరిశోధనా భాగస్వామి జెనెటిసిస్ట్ పీటర్ గ్రెగర్‌సన్ కలిసి 3,700 మందికి పైగా మహిళలపై అధ్యయనం చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి.

''చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా, గర్భాశయంలో ఉండే 'నేచురల్ కిల్లర్' (NK) కణాలు ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోగనిరోధక కణాలు గర్భధారణ ప్రారంభ దశలో పిండం అతుక్కోవడానికి, ప్లసెంటా (మాయ) అభివృద్ధికి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి'' అని మెట్జ్ చెప్పారు.

ఇవి సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయని, కాబట్టి వీటి సంఖ్య తక్కువగా ఉండటం మంచిది కాదని ఆమె అన్నారు.

'స్ట్రోమల్ ఫైబ్రోబ్లాస్ట్ కణాల'లో ఒక ముఖ్యమైన తేడాను మెట్జ్ బృందం గమనించింది.

సాధారణంగా ప్రతి పీరియడ్ తర్వాత గర్భాశయ పొరను పునరుద్ధరించడానికి, మరమ్మతు చేయడానికి ఈ కణాలు సహాయపడతాయి. అయితే, ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఈ కణాలు ఎక్కువ ఇన్‌ఫ్లామేటరీ మార్కర్లను ప్రదర్శించాయి. అంతేకాకుండా, గర్భధారణకు సిద్ధంగా గర్భాశయాన్ని మార్చడంలో ఇవి తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

చివరగా పేర్కొన్న ఈ సమస్య (స్ట్రోమల్ ఫైబ్రోబ్లాస్ట్ కణాల అసాధారణత), పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS), తరచుగా గర్భస్రావం వంటి ఇతర అనారోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంది.

గ్రాఫిక్ ఇలస్ట్రేషన్ మూడు రక్తపు చుక్కలను చూపిస్తోంది. లేత గులాబీ రంగు నేపథ్యంలో, ఒక్కో రక్తపు చుక్క ఒక్కో పెట్రీ డిష్‌లో ఉంచారు.

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ రక్తాన్ని అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యల ముప్పును కూడా ముందే అంచనా వేయవచ్చు.

ప్రత్యామ్నాయ పరీక్షా విధానం...

ఎండోమెట్రియోసిస్ ఉన్న రోగులలో కొన్ని జన్యువుల వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని కూడా మెట్జ్ ప్రయోగశాల కనుగొంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడు, పీరియడ్స్ రక్త విశ్లేషణ ఆధారంగా ఎండోమెట్రియోసిస్‌ను వైద్యులు గుర్తించడానికి శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

తమ 'అట్-హోమ్ డయాగ్నస్టిక్ కిట్' (ఇంట్లోనే పరీక్షించుకునే పరికరం) కోసం అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతులను 2027 నాటికి పొందాలని మెట్జ్ ఆశిస్తున్నారు.

మరోవైపు, పీరియడ్స్ రక్తం నుంచి మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ (mRNA)ను సేకరించి, దాన్ని సీక్వెన్సింగ్ చేయడం ద్వారా ఎండోమెట్రియోసిస్‌కు సంబంధించిన ప్రత్యేకమైన బయోమార్కర్లను నెక్స్ట్‌జెన్ జేన్‌లోని పరిశోధకులు శోధిస్తున్నారు.

ఇప్పటివరకు, సంతానలేమితో బాధపడుతున్న మహిళల్లో ఎండోమెట్రియోసిస్ ఉన్నవారిని, ఆరోగ్యంగా ఉన్నవారి నుంచి వేరుగా గుర్తించగల కొన్ని ముఖ్యమైన మార్కర్లను వారు కనుగొన్నారు.

తరియల్ చెప్పినట్లుగా, ఎండోమెట్రియోసిస్ ఉన్న వందలాది మంది మహిళలతో అమెరికాలో ఒక అధ్యయనం ప్రస్తుతం జరుగుతోంది. ఈ పరిశోధన ఫలితాలను ధ్రువీకరించడమే దీని లక్ష్యం.

2025 మే నెలలో, సంతానలేమి రోగులలో ఎండోమెట్రియోసిస్ కోసం చేసే ఈ మెన్‌స్ట్రువల్ టెస్ట్ తాలూకా క్లినికల్ వాలిడేషన్ కోసం నెక్స్ట్‌జెన్ జేన్ 2.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.18.50 కోట్ల) గ్రాంట్‌ను పొందింది.

మహిళలు, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికే పరిమితం కాదు...

పీరియడ్స్ రక్తం ఎండోమెట్రియోసిస్‌ను గుర్తించడానికే కాకుండా, ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు గర్భాశయ ఆరోగ్యానికి, వృద్ధాప్యానికి మధ్య ఉన్న సంబంధాలను'నెక్స్ట్‌జెన్ జేన్' పరిశోధనలు వెల్లడించాయి.

''ఇది ఇంకా ప్రాథమిక స్థాయి సమాచారమే'' అని రిధి తరియల్ చెప్పారు.

అయితే, శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం (దీనినే మనం వృద్ధాప్యంగా పరిగణిస్తాం), బహిష్టు ప్రక్రియకు మధ్య ఒక స్పష్టమైన పోకడ కనిపిస్తోంది.

వారి పరిశీలనల ప్రకారం, భవిష్యత్తులో ఒకరోజు పీరియడ్స్ రక్తం ద్వారా హైపో లేదా హైపర్ థైరాయిడిజం వంటి రోగనిరోధక వ్యాధులను గుర్తించవచ్చని సూచిస్తున్నాయి.

ఈ పరిస్థితులలో శరీరంలోని థైరాయిడ్ గ్రంథి జీవక్రియను నియంత్రించే హార్మోన్లైన థైరాక్సిన్, ట్రైఅయోడోథైరోనైన్‌లను చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా విడుదల చేస్తుంది.

ఎండోమెట్రియోసిస్ ఉన్న వ్యక్తులు తరచుగా ఏదో ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధిని కలిగి ఉంటారు" అని తరియల్ చెప్పారు.

పీరియడ్స్ రక్తాన్ని అధ్యయనం చేయడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి మంట, రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులకు ఒక కొత్త పరిశోధనా నమూనాను అందించవచ్చని ఆమె చెబుతున్నారు.

ఒక మహిళ నీలిరంగు బెడ్ షీట్లు ఉన్న మంచం మీద పడుకుని, తన పొత్తికడుపును పట్టుకున్నారు. తన మోకాళ్లను ఛాతీ వరకు ముడుచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్‌నూ గుర్తించడానికి...

పీరియడ్స్ రక్తం డయాబెటిస్‌ను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుందని నిరూపితమైంది. 2021, 2024 సంవత్సరాల్లో జరిగిన అధ్యయనాలలో, కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ 'క్యూవిన్' పరిశోధకులు ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు.

పీరియడ్స్ రక్తంలో కొలిచిన సగటు రక్త చక్కెర స్థాయిలు, శరీరంలోని మొత్తం రక్త చక్కెర స్థాయిలను ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయని వారు గుర్తించారు.

వారి పరిశోధనలు 2024లో అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన మొట్టమొదటి, ఏకైక 'పీరియడ్స్ రక్త షుగర్ పరీక్ష'కు మార్గం సుగమం చేశాయి. దీని కోసం వారు 'క్యూ-ప్యాడ్' (Q-Pad) అనే శానిటరీ నాప్కిన్‌ను రూపొందించారు. ఇందులో రక్తాన్ని సేకరించడానికి తొలగించదగిన ఒక స్ట్రిప్ ఉంటుంది. వినియోగదారులు ఆ స్ట్రిప్‌ను సేకరించి, విశ్లేషణ కోసం క్యూవిన్ ప్రయోగశాలలకు మెయిల్ ద్వారా పంపవచ్చు.

థాయ్‌లాండ్‌లో 2022లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, క్యూవిన్ సంస్థ రూపొందించిన ప్రత్యేకమైన ప్యాడ్ ద్వారా సేకరించిన నమూనాలు, సాంప్రదాయ 'పాప్ స్మియర్' పరీక్షల కంటే మెరుగ్గా ఉన్నాయని తేలింది.

ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) తాలూకా హై-రిస్క్ రకాలను గుర్తించడంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఈ ఫలితాలను మరింత నిర్ధరించడానికి ప్రస్తుతం అమెరికాలో విస్తృత స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది నుంచి క్లామిడియా, గనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులను స్క్రీనింగ్ చేయడానికి 'క్యూ-ప్యాడ్' ఉపయోగపడుతుందో లేదో కూడా ఈ ట్రయల్ పరిశీలిస్తుందని క్యూవిన్ సహ-సీఈవో మ్యాడ్స్ లిల్లెలుండ్ చెప్పారు.

ఆ తర్వాత థైరాయిడ్, పునరుత్పత్తి హార్మోన్లు, ఇన్‌ఫ్లామేటరీ మార్కర్లు, SARS-CoV-2 (కోవిడ్-19) పట్ల రోగనిరోధక శక్తి స్పందనను సూచించే యాంటీబాడీస్ వంటి ఇతర ఆరోగ్య సూచికల పరీక్షల వైపు దృష్టి మళ్లించాలని లిల్లెలుండ్ ఆశిస్తున్నారు.

ఇదే తరహాలో, బెర్లిన్‌కు చెందిన 'ది బ్లడ్' అనే స్టార్టప్ ఎండోమెట్రియోసిస్, అకాల మెనోపాజ్, PCOS, సంతానోత్పత్తి సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఒక టెస్ట్ కిట్‌ తేవడానికి కృషి చేస్తోంది.

మహిళలు, ఆరోగ్యం, వైద్య పరిశోధనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇదొక 'రుతు' విప్లవం

రుతుస్రావ రక్తానికి సంబంధించి ఇంత పురోగతి సాధించినప్పటికీ ఇంకా అనేక విషయాలు మిస్టరీగానే ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే పెద్ద మిస్టరీ ఏమిటంటే, ఆ రక్తంలో ఉండే అన్ని కాంపోనెంట్లను మనం ఇంకా పూర్తిగా గుర్తించలేదు. రుతుక్రమ సమయంలో అవి ఎంత వేగంగా మారుతాయో కూడా ఇంకా పూర్తిగా తెలియదని చాలామంది పరిశోధకులు అంగీకరిస్తున్నారు.

ఈ విషయంలో పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ అంశం చుట్టూ ఉన్న సామాజిక కళంకాలు.

''దీని (పీడియడ్స్) గురించి మాట్లాడటమే ఒక నిషిద్ధమైన విషయమని మనందరి మెదళ్లలో చిన్నప్పటి నుంచే బలంగా నాటుకుపోయింది" అని మెట్జ్ చెబుతున్నారు.

వైద్య పరిశోధనలలో పూర్వం నుంచి పురుషులకే ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అధ్యయనాలకు నిధుల కొరత ఉండటం ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

2020లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)నిధులలో మహిళల ఆరోగ్య పరిశోధనలకు కేటాయించినవి కేవలం 5 శాతం మాత్రమే.

''ఔషధ పరిశోధనలు చాలావరకూ కేవలం పురుషులపై, అందులోనూ ప్రధానంగా శ్వేతజాతీయులపైనే జరిగాయి. జాతి లేదా లింగపరమైన వైవిధ్యం ఇందులో చాలా స్వల్పం" అని లిల్లెలుండ్ అన్నారు.

''ఎండోమెట్రియోసిస్ కంటే పురుషుల బట్టతల సమస్యపైనే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు'' అని చెప్పారు.

ఎండోమెట్రియోసిస్, ఇతర గర్భాశయ సంబంధిత సమస్యల వల్ల ప్రతిరోజూ నరకాన్ని అనుభవిస్తున్న ఎమ్మా వంటి ఎంతోమంది మహిళలు ఇలాంటి పరిశోధనలు ఎప్పుడో జరగాల్సిందని అంటున్నారు.

నొప్పి కలిగే పీరియడ్స్ రోజులతో పెరుగుతూ, అసలు తనకేం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందడం 'చాలా ఒంటరితనంగా, సమాజం నుండి వేరైనట్లుగా అనిపించేది' అని ఎమ్మా ఆవేదన వ్యక్తంచేశారు.

అయితే, ఒకవేళ పీరియడ్స్ రక్త పరిశోధకులు శస్త్రచికిత్స అవసరం లేని రోగనిర్ధరణ సాధనాన్ని రూపొందించే తమ లక్ష్యంలో విజయం సాధిస్తే, కనీసం వచ్చే తరం అమ్మాయిలకైనా త్వరగా చికిత్స అందుతుందని, తాను అనుభవించిన శారీరక, మానసిక క్షోభ వారికి తప్పుతుందని ఆమె ఆశిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)