దూరంగా చూస్తే భూమి, ఆకాశం కలిసినట్లుగా ఎందుకు కనిపిస్తాయి?

దూరంగా చూసినప్పుడు భూమి, ఆకాశం కలిసినట్లుగా అనిపిస్తుంది కదా? అసలు ఆకాశం, భూమి కలుస్తాయా? ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా?

సముద్ర తీరంలో నిలబడినప్పుడో.. మైదాన ప్రాంతంలో దూరంగా చూసినప్పుడో.. ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఎదురుగా దూరంగా చూసినప్పుడో.. ఇలాంటి అనుభూతే కలుగుతుంది.

అలాగని ఆ ప్రాంతంలో భూమి, ఆకాశం కలుస్తాయా.. అంటే అక్కడ కూడా కలిసే అవకాశం లేదు. అక్కడికి వెళ్లి చూస్తే.. మళ్లీ కంటికి కనిపించేంత దూరంలో భూమి, ఆకాశం కలిసినట్లుగానే అనిపిస్తుంది.

నిజానికి భూమి, ఆకాశం ఎక్కడా, ఎప్పుడూ కలవవు అని మనకు తెలుసు.

కానీ అలా కలిసినట్లుగా కనిపించే ప్రాంతాన్ని సైన్స్ పరిభాషలో 'హొరైజన్' (క్షితిజం) అంటారు.

హొరైజన్...

ఇది భూమి, ఆకాశాన్ని వేరు చేస్తున్నట్లుగా లేదా ఆ రెండూ కలిసినట్లుగా ఉండే ప్రాంతంలో కనిపించే రేఖ అని శాస్త్రవేత్తలు చెబుతారు.

ఈ హొరైజన్ అనేది కనిపించే స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని బిట్స్ దుబయి క్యాంపస్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ సయ్యద్ మఖ్బూల్ బీబీసీతో చెప్పారు.

ఏమిటీ హొరైజన్?

హొరైజన్ రెండు విధాలుగా ఉంటుంది.

మొదటిది జియోడల్ సెలెస్టియల్ హొరైజన్. మనిషి కంటితో ఎంత దూరం చూడగలడో, ఆ మేరకు భూమి, ఆకాశం కలిసినట్లు కనిపించే ప్రదేశం ఇది.

జియోడల్ సెలెస్టియల్ హొరైజన్‌ను లోకల్ హొరైజన్ అని కూడా అంటారు. ఎందుకంటే దీన్ని నిత్యం మనం చూస్తుంటాం. ఇంటిపై నుంచి చూసినప్పుడు దూరంగా భవనాలు దాటుకుని ఆకాశం, భూమి కలిసినట్లు కనిపించడమే లోకల్ హొరైజన్.

రెండోది నాటికల్ హొరైజన్. ఇది సముద్రాల వద్ద కనిపిస్తుంది. సముద్ర ఉపరితలం పైనుంచి చూసినప్పుడు ఆకాశం కలిసే చోటుగా దీన్ని చెప్పవచ్చు.

"భూమి, ఆకాశం కలిసినట్లు కనిపించే చోటును వాతావరణం కలిసే చోటు అని చెప్పవచ్చు" అని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ బీబీసీతో చెప్పారు.

"భూమి, ఆకాశం అనేవి రెండు భిన్న ధ్రువాలు వంటివి. అవి కలిసే వీలుండదు. కానీ, భూ ఉపరితలంపై ఉన్న వాతావరణం ఆకాశంతో కలుస్తుందని చెప్పవచ్చు" అని ఆయన వివరించారు.

భూమి ఉపరితలంపై ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్ అనే వాతావరణ పొరలు ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి.

పొరలతో కూడిన ఈ వాతావరణం భూమితో కలుస్తుందని చెబుతున్నారు రఘునందన్ కుమార్.

దూరాన్ని లెక్కించవచ్చా?

హొరైజన్ ఎంత దూరంలో ఉందో కూడా చెప్పవచ్చని బ్రిటానికా వెబ్ సైట్ చెబుతోంది.

నాసా లెక్కల ప్రకారం, సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం 150.19 మిలియన్ కిలోమీటర్లు.

హొరైజన్ దూరాన్ని లెక్కించేందుకు వీలుంటుంది కానీ ఇది సైన్స్ పరిభాషలో కొంత క్లిష్టమైనది. ఈ దూరం అనేది మనిషి నిల్చున్న ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే, హొరైజన్ అనేది కనుచూపుమేరలో ఉండే పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటుంది.

సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిల్చుని చూస్తున్నామనే దానిపై హొరైజన్ దూరం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనల వివరాలు 2025 జూన్‌లో 'సైన్స్ డైరెక్ట్' ఆధ్వర్యంలో నడిచే ఎల్స్‌వేర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అలాగే 'యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్'కు చెందిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథ్స్' లెక్కల ప్రకారం, మనిషి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిలబడి చూస్తే, దానికి తగ్గట్టుగా భూమి, ఆకాశం కలిసే చోటు మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఉదాహరణకు సముద్ర మట్టానికి ఐదు అడుగుల ఎత్తులో నిలబడి చూస్తుంటే, భూమి, ఆకాశం కలిసే చోటు 2.73 మైళ్ల దూరంలో ఉంటుందనేది వారి లెక్క.

అలాగే 2024లో 'సైంటిఫిక్ అమెరికన్' కథనంలో హొరైజన్‌ను కొలిచే విధానాన్ని ప్రస్తావించారు. ఎంత ఎక్కువ ఎత్తు నుంచి చూస్తే, అంత ఎక్కువ దూరంలో భూమి, ఆకాశం కలిచే చోటు కనిపిస్తుందని చెప్పారు.

సముద్ర మట్టం కంటే ఎత్తుకు వెళ్లి చూసినప్పుడల్లా హొరైజన్ దూరం కూడా పెరుగుతుంటుంది. అంటే, భూమి, ఆకాశం కలిసే చోటు కూడా మారుతుందన్నమాట.

మనిషి ఎత్తు, నిల్చున్న ప్రదేశం ఆధారంగా దీన్ని కొలిచేందుకు వీలుంటుందని సయ్యద్ మఖ్బూల్ చెప్పారు.

అయితే ఇది కంటి చూపు, కనిపించే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కంటిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

భూమి, ఆకాశం కలవకపోయినా కలిసినట్లుగా అనిపించడానికి మరో కారణం.. 'ఆప్టికల్ ఇల్యూజన్'.

వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిసార్లు లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఆప్టికల్ ఇల్యూజన్ అనేది మనిషి కంటికి సంబంధించిన సహజ ప్రక్రియ అని హైదరాబాద్‌కు చెందిన కంటి వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ చెప్పారు.

"ఆప్టికల్ ఇల్యూజన్ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం. ఉదాహరణకు ఎండమావులు వంటివి ఏర్పడినప్పుడు అక్కడ నిజంగా నీరు ఉండదు. వాతావరణ పరిస్థితి కారణంగా అలా కనిపిస్తుంది. భూమి, ఆకాశం కలిసినట్లు కనిపించడాన్ని కూడా అలానే చూడవచ్చు" అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)