ధురంధర్ 2: ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఎందుకింత చర్చ ? మూడో భాగం కూడా ఉందా..?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది 'ధురంధర్.. ది రివెంజ్'.

ధురంధర్ మొదటి భాగానికి కొనసాగింపుగా మార్చి 19న ఈ సినిమా వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రణ్ వీర్ సింగ్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్‌దత్ వంటి నటులు ఉండటం, గత డిసెంబరులో విడుదలైన ధురంధర్ మొదటి భాగం సక్సెస్ కావడంతో రెండో భాగంపై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పొచ్చు.

అయితే, మొదటి భాగంలో మితిమీరిన హింస ఉందంటూ కొంత విమర్శలు వచ్చినా స్పై, యాక్షన్ అంశాల మేళవింపు, టేకింగ్ కారణంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.

ఇప్పుడు ధురంధర్ ది రివెంజ్ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటన్నది చూద్దాం..

'ఎక్స్' టాప్ ట్రెండింగ్..

ధురంధర్ పార్ట్ 2 హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది.

రెండు రోజులుగా ఎక్స్ హ్యాండిల్ లో 'ధురంధర్ 2' హ్యాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

సినీ ప్రముఖులు ఏమన్నారంటే…

సినిమా తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఎక్స్ హ్యాండిల్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

ధురంధర్ 2 చూశానని, చాలాచోట్ల చప్పట్లు కొట్టేలా సినిమా ఉందని ట్వీట్ చేశారు నటుడు అల్లు అర్జున్.

‘‘ప్రతి దేశభక్తుడు గర్వపడే సినిమా ఇది’’ అని ఆయన పేర్కొన్నారు.

మాధవన్, రణ్‌ వీర్ సింగ్ సహా నటులందరూ బాగా నటించారని అల్లు అర్జున్ తెలిపారు.

దీనిపై మాధవన్ స్పందిస్తూ, ‘‘మీరు ఇచ్చిన రివ్యూ ప్రత్యేకమైనది'' అని కామెంట్ చేశారు.

సినిమా గురించి చెప్పాల్సింది నాలుగు మాటలేనంటూ, 'భారత్ మాతా కీ జై'' అని ట్వీట్ చేశారు నటుడు విజయ్ దేవరకొండ.

ధురంధర్ సినిమా ''న్యూ సినిమాటిక్ ఆర్డర్'' పట్టుకొచ్చిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ధురంధర్ 2 ఒక్కమాటలో చెప్పాలంటే బాక్సాఫీసు సునామీ స్పష్టిస్తుందని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ అన్నారు.

సినిమా చూసినప్పట్నుంచి తన తల తిరుగుతోందని ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్ ట్వీట్ చేశారు.

''సినిమాను ప్రేమించారు.. సినిమాతో జీవించారు''

సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ఆదిత్య ధర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

2025 డిసెంబరు 5న ధురంధర్ మొదటి భాగం విడుదలైనప్పట్నుంచి ఎంతో ఆదరించారని ధన్యవాదాలు చెప్పారు.

''మీరు సినిమాను ప్రేమించారు.. సినిమాతో జీవించారు. ప్రతి చిన్న విషయాన్ని అభినందించారు. ప్రతి పరిణామంపై చర్చించారు. కొన్ని అంశాలు నేనే కాకుండా ఎవరూ గుర్తించలేనివి కూడా గుర్తించి చెప్పారు'' అని ఆదిత్య ధర్ అన్నారు.

ఎక్కువ నిడివి ఉన్న సినిమాల్లో ఇదొకటి

ధురంధర్2 రన్ టైం కూడా చాలా ఎక్కువ. 229 నిమిషాల నిడివి (అంటే 3 గంటల 49 నిమిషాలు)తో విడుదలైంది.

ధురంధర్ కాకుండా గతంలో మరికొన్ని సినిమాలు కూడా ఎక్కువ రన్ టైంతో విడుదలయ్యాయి. వాటిల్లో ఎల్వోసీ: కార్గిల్ (255 నిమిషాలు), మేరా నామ్ జోకర్ (248 నిమిషాలు), సంగం (238 నిమిషాలు) ఉన్నాయి.

తెలుగులో 1977లో వచ్చిన దాన వీర శూర కర్ణ 226 నిమిషాల రన్ టైంతో ఉంది.

టికెట్ల అమ్మకాల్లో రికార్డు

ధురంధర్ – 2 సినిమా విడుదలకు 24 గంటల ముందు వరకు విక్రయించిన బుక్ మై షో ప్లాట్ ఫాంలో టికెట్ సేల్స్ పరంగా దేశంలో కొత్త రికార్డు సృష్టించిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

గతంలో జవాన్ సినిమా విడుదలకు ముందు 11.02 లక్షల టికెట్లు బుక్ మై షోలో అమ్ముడవ్వగా, ధురంధర్ పార్ట్ 2కు 14.81లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా కథనాల్లో ఉంది.

తరణ్ ఆదర్శ్ మార్చి 19వ తేదీన చేసి ట్వీట్‌లో సినిమా టికెట్ల విక్రయాలపరంగా ఉన్న క్రేజ్ బాగా ఉందంటూ పేర్కొన్నారు.

ప్రీమియర్స్ రద్దుపై అసంతృప్తి

అయితే, దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వేయాలనుకున్న పెయిడ్ ప్రీమియర్స్ కొన్నిచోట్ల సాంకేతిక కారణాలతో రద్దు అయినట్లుగా దర్శకుడు ఆదిత్య ధర్ ప్రకటించారు.

''మాకు హిందీ అర్థంకాదు, కన్నడలోనే ప్రీమియర్స్ కావాలి'' అని కొందరు నెటిజన్లు, ''తెలుగులో కావాలి'' అని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

చెన్నైలో కూడా తమిళంలో విడుదల కావాల్సిన ప్రీమియర్స్ రద్దు అయ్యాయని, థియేటర్ కు వెళ్లాకే సమాచారం వచ్చిందని ఒక నెటిజన్ పోస్టు చేశారు. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌లో వేచి ఉన్నట్లుగా ఆ పోస్టులోని వీడియోలో కనిపిస్తోంది.

'హింస' ఎక్కువగా ఉందన్న విమర్శలు

ధురంధర్ మొదటి భాగంపై కొన్ని విమర్శలున్నాయి. హింస విపరీతంగా ఉందని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు.

''చాలా తెలివితో తీసిన సినిమా. ప్రస్తుత సమయంలో ఉన్న భావోద్వేగాలను సినిమా పట్టుకోగలిగింది. ఆదిత్య ధర్ నైపుణ్యం గల దర్శకుడు'' అంటూ పోస్ట్ చేశారు.

మొదటి భాగంలో ముస్లింలపట్ల ద్వేషం కలిగించేలా సినిమా తీశారంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

'ధురంధర్ 3' ఉందా..?

సోషల్ మీడియాలో ధురంధర్ మూడో భాగం ఉందంటూ ఒక పోస్టు వైరల్ అవుతోంది.

ధురంధర్.. ది ఫైనల్ చాప్టర్ పేరుతో జూన్ 14, 2026న విడుదల కాబోతోందన్న ఇమేజ్ వైరల్‌గా మారింది.

అయితే, మూడో భాగంపై సినిమా యూనిట్ కానీ, దర్శకుడు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ధురంధర్ మూడో భాగం ఉందంటూ వైరల్ అవుతున్న పోస్ట్ పూర్తిగా అవాస్తవమని టైమ్స్ నౌ రాసింది.

మరోవైపు, ధురంధర్ రెండో భాగం చివర్లో క్రాస్‌రోడ్స్‌లో నిలబెడుతుందని, ఒకవేళ మూడో భాగం ఉంటే ప్రధాన పాత్రదారి అంతర్గత సంఘర్షణపై ఉండొచ్చని మనీకంట్రోల్ ప్రకటించింది.

మరోవైపు, ధురంధర్ రెండో భాగం త్వరగా విడుదల కావడం కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు.

నిరుడు డిసెంబరు 5వ తేదీన ధురంధర్ మొదటి భాగం విడుదల కాగా, కేవలం మూడున్నర నెలల్లోనే ధురంధర్ పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కల్కి 2898 ఏడీ, సలార్ వంటి సినిమాలకు రెండో భాగం ఇంకా రావాల్సి ఉండగా బాహుబలి, పుష్ప వంటి సినిమాలకు రెండో భాగం విడుదలకు చాలా సమయమే పట్టింది.

బాహుబలి.. ది బిగినింగ్ 2015లో విడుదల కాగా, బాహుబలి ది కంక్లూజన్ 2017లో విడుదలైంది.

పుష్ప ది రైజ్ 2021 డిసెంబరులో విడుదల కాగా, పుష్ప ది రూల్ 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)