‘నాన్నంటే ప్రాణం.. కానీ, సర్పంచ్‌గా పోటీ చేయడానికి ముగ్గురు పిల్లల నిబంధన అడ్డొస్తోందని తండ్రే చంపేశాడు’

మహారాష్ట్ర, నిజామాబాద్, మున్సిపల్ ఎన్నికలు, హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, TG Police

ఫొటో క్యాప్షన్, పోలీసులు విడుదల చేసిన పాప ఫొటో
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

నోట్: కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

ముగ్గురు పిల్లల నిబంధన వల్ల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతానన్న భయంతో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడని నిజామాబాద్ పోలీసులు చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన పాండురంగ కొండమంగలే అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు చెబుతున్నారు.

ఆరేళ్ల కూతురు ప్రాచీ కొండమంగలేను తెలంగాణ ప్రాంతానికి తీసుకువచ్చి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య ఫిబ్రవరి 2వ తేదీన మీడియాకు వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నిజాంసాగర్ కాలువలో పాప మృతదేహం

తెలంగాణలోని ఎడపల్లి దగ్గరున్న ఏఆర్పీ క్యాంపు శివార్లలోని నిజాంసాగర్ కాలువలో ఒక పాప మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.

నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పడి కేసు దర్యాప్తు ప్రారంభించాయి.

పాప మృతదేహం ఫోటోను మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసి సంబంధీకులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు.

మహారాష్ట్ర, నిజామాబాద్, మున్సిపల్ ఎన్నికలు, హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Nizambad police

ఫొటో క్యాప్షన్, పొరుగురాష్ట్రంలో అయితే ప్రమాదంగా చిత్రీకరించవచ్చని నిందితుడు భావించాడని పోలీసులు తెలిపారు.

కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ చూసి..

సుధీర్ అనే కానిస్టేబుల్ పోలీసుల ప్రకటననను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు.

ఆయన వాట్సాప్ స్టేటస్‌ను మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకాలో ఉండే బంధువులు చూశారు. ఆ పాప వివరాలు తమకు తెలుసని చెప్పారు.

పాపను మహారాష్ట్ర ముఖేడ్ తాలూకా కెరుర్ గ్రామానికి చెందిన ఆరేళ్ల ప్రాచీ కొండమంగలేగా గుర్తించారు.

మహారాష్ట్ర, నిజామాబాద్, మున్సిపల్ ఎన్నికలు, హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Nizambad police

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర నుంచి పాపను తెచ్చిన బైక్ ఇదే

ఎవరీ ప్రాచీ కొండమంగలే..

ప్రాచీ తండ్రి పాండురంగ కొండమంగలే అని పోలీసులు గుర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో ప్రాచి, మరొక పాప కవలలు.

గ్రామంలో విరాట్ సెలూన్ పేరుతో పాండురంగ సెలూన్ షాపు నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

మహారాష్ట్రలో ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కెరుర్ గ్రామానికి గణేశ్ శిందే ప్రస్తుతం సర్పంచ్‌గా ఉన్నారు.

రానున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామ రిజర్వేషన్ మారడంతో తన బదులుగా తనకు బాగా పరిచయం ఉన్న పాండురంగను నిలబెట్టాలని గణేశ్ శిందే నిర్ణయించారు.

''తాను అధికారంలో లేకపోయినా, తర్వాత తన చెప్పినట్టుగా వినే వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించుకోవాలన్నారు. అందులో భాగంగా పాండురంగతో మాట్లాడి సర్పంచ్‌గా పోటీచేసేందుకు ఒప్పించారు'' అని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు బీబీసీతో చెప్పారు.

ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి అనర్హులనే నిబంధన ఉంది.

దీంతో పోటీకి అనర్హుడనవుతానని భావించి, తన ముగ్గురు పిల్లల్లో ఒకరిని ఏదో విధంగా అడ్డు తొలగించుకోవాలని గణేశ్ శిందేతో కలిసి పాండురంగ ప్రణాళిక వేసుకున్నారని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య చెప్పారు.

మహారాష్ట్ర, నిజామాబాద్, మున్సిపల్ ఎన్నికలు, హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రాచీ తల్లితో కన్నా తండ్రితో ఎక్కువ ప్రేమగా ఉండేదని పోలీసులు చెప్పారు.

''దత్తత ప్రయత్నం కుదరకపోవడంతో..''

ముందుగా ముగ్గురు పిల్లల్లో ఒకర్ని దత్తత ఇవ్వాలని అనుకున్నారు.కానీ దత్తత విషయంలో నిబంధనలు కఠినంగా ఉండటంతో వెనక్కితగ్గారని పోలీసు కమిషనర్ చెప్పారు.

''కుమారుడిని దత్తత ఇవ్వాలని పాండురంగ అనుకున్నారు. అప్పటికే అతని పేరుతో బర్త్ సర్టిఫికెట్ ఉండటం, దత్తత నిబంధనల కారణంగా ఆ ప్రయత్నం విరమించుకున్నారు. పుణెలోని కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్‌లో మార్పులు చేయాలనుకున్నా సాధ్య పడలేదు'' అని చెప్పారు.

చివరిగా ప్రాచీని చంపితే ఇద్దరు పిల్లలు ఉంటారని, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పాండురంగ భావించారని పోలీసు కమిషనర్ చెప్పారు.

''పాపను తీసుకుని పాండురంగ బైక్ (ఎంహెచ్ 26 బీవై 7495) మీద బయల్దేరారు. నిజామాబాద్‌కు వచ్చే దారిలో ఎడపల్లి మండలం అంబం గ్రామానికి వెళ్లే దారిలో నిజాంసాగర్ కాలువలోకి తోసివేయడంతో పాప చనిపోయింది'' అని కమిషనర్ వివరించారు.

కెరుర్ గ్రామానికి, హత్య జరిగిన ప్రాంతానికి దాదాపు 65 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంటి దగ్గర నుంచి బాలికను ఎక్కించుకుని వచ్చిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర, నిజామాబాద్, మున్సిపల్ ఎన్నికలు, హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది.

'నాన్నంటే ఇష్టం’

ముగ్గురు పిల్లలు ఉండగా ప్రాచీనే చంపడానికి బలమైన కారణం ఉందని సీఐ విజయ్ బాబు బీబీసీతో చెప్పారు.

''నాన్న పాండురంగ అంటే ప్రాచీకి చాలా ఇష్టం. ఆయన వెంటనే తిరుగుతుంది. ఆయన ఏం చెప్పినా చేస్తుంది. మరో పాప తల్లితో ఎక్కువగా ఉంటుంది. కుమారుడు వారసుడుగా భావించి అతన్ని చంపకూడదని అనుకున్నారు'' అని విజయ్ బాబు చెప్పారు.

తనను బాగా ఇష్టపడే ప్రాచీ అయితే కాదనకుండా తనతో వస్తుందని భావించిన పాండురంగ, ఇంటి నుంచి పాపను దూరంగా తీసుకువచ్చారని వివరించారు.

మహారాష్ర్టలో చంపితే బాలికను గుర్తించే అవకాశం ఉందని, పొరుగు రాష్ట్రంలో అయితే దాన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి అవకాశం ఉంటుందని భావించానని విచారణలో పాండురంగ చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

పాపను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి, చనిపోయినట్లుగా చెప్పి, ఎన్నికల్లో పోటీ చేయాలని పాండురంగ భావించారని పోలీసులు చెబుతున్నారు.

పాండురంగకు గణేశ్ శిందే సహకరించినట్టుగా గుర్తించి అరెస్టు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు.

నిందితులు పాండురంగ, గణేశ్ శిందే కుటుంబీకుల వివరణ కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండేది. రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవల ఆ నిబంధనలను సవరించారు. తెలంగాణలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమల్లో ఉండగా, కొన్నింటికి తొలగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)