అశోక చక్రవర్తి: ఎన్నో యుద్ధాలను గెలిచిన అశోకుడు.. చివరికి శాంతిమార్గాన్ని ఎలా ఎంచుకున్నారు?

ఫొటో సోర్స్, MAPLE PRESS
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 9 నిమిషాలు
అశోక చక్రవర్తి తన 40 ఏళ్ల పాలనలో.. దాదాపు భారత ఉపఖండం మొత్తాన్ని ఒకే పాలన కిందకి తీసుకొచ్చి, ఏకం చేశారని చెబుతుంటారు.
తమిళనాడు, కేరళ మినహా ప్రస్తుత భారత్ మొత్తం, ప్రస్తుత పాకిస్తాన్ మొత్తం, అఫ్గానిస్తాన్‌లో తూర్పు ప్రాంతం వరకు అశోక చక్రవర్తి అధికార పరిధిలో ఉండేవి.
అంతేకాక, ఆ కాలంలో అతి కొద్దిమంది అనుచరులు ఉన్న ఒక మతాన్ని ప్రపంచవ్యాప్త మతం స్థాయికి తీసుకు రావడంలో కూడా అశోకుడు విజయం సాధించారు.
ఆయన ప్రవేశపెట్టిన నైతిక భావనల ప్రభావం నేటికీ కనిపిస్తోంది.
అశోకుడిని భారత వ్యవస్థాపక పితామహుడిగా చెప్పొచ్చని 'అశోక ది సెర్చ్ ఫర్ ఇండియాస్ లాస్ట్ ఎంపెరర్' అనే పుస్తకంలో చార్లెస్ అలెన్ రాశారు.
భారత్‌ను ఒక దేశంగా ఏకం చేసిన తొలి పాలకుడు ఈయనే. అంతేకాక, మహాత్మా గాంధీకి చాలాకాలం ముందే అహింసా సిద్ధాంతాన్ని అశోక చక్రవర్తి ప్రవేశపెట్టారు.
ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాజు బహుశా అశోకుడే కావొచ్చు.
అశోకుడు ఎంతోమందికి ఎన్నో రూపాల్లో కనిపిస్తారు.
యుద్ధ భయానకతను ఎదుర్కొని, విజయాన్ని త్యజించిన ఒక విజేత. ఒక రుషి, లేదా రుషి చక్రవర్తుల అద్భుతమైన కలయిక.
మానవ విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజకీయ మేధావి అని 'అశోకా అండ్ డిక్లైన్ ఆఫ్ ది మౌర్యాస్'' అనే పుస్తకంలో చరిత్రకారిణి రోమిలా థాపర్ రాశారు.
"అశోకుడు సాధించిన అత్యంత గొప్ప విజయం ఏమిటంటే.. ఆయన కాలాన్ని అర్థం చేసుకుని, భారత సమాజ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చారు."

మౌర్యవంశ మూడవ పాలకుడు
అశోక చక్రవర్తి కథ తన తాత చంద్రగుప్త మౌర్యుడి నుంచి, మగధ సింహాసనంపై ఆయన్ను కూర్చోబెట్టిన చాణక్యుడి దగ్గరి నుంచి మొదలవుతుంది.
చంద్రగుప్త మౌర్యుని మనవడే అశోకుడు. క్రీస్తు పూర్వం 323లో అలెగ్జాండర్ మరణించిన ఏడాది లేదా రెండేళ్లలోనే సింధు నదికి తూర్పు వైపున గ్రీకు ఆధిపత్యం క్షీణించడం మొదలైంది.
చాణక్యుని మార్గదర్శకత్వంలో... చంద్రగుప్త మౌర్యుడు తొలుత ధననందుని చేతిలో ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత ఆయనను ఓడించి, ఉత్తర భారతదేశానికి తిరుగులేని పాలకుడయ్యారు.
చంద్రగుప్త మౌర్యుని 24 ఏళ్ల పాలనలో ఆయన సైన్యం అజేయంగా నిలిచింది. క్రీ.పూ 305లో, అలెగ్జాండర్ కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బాబిలోన్ - పర్షియా కొత్త పాలకుడైన సెల్యూకస్ ప్రయత్నించారు, ఆయన చంద్రగుప్త మౌర్యుని చేతిలో ఓడిపోయారు.
చంద్రగుప్త మౌర్యుని తర్వాత, బిందుసారుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యారు. చాణక్యుడు బిందుసారునికి కూడా గురువుగా ఉన్నారు. ఆయన మనవడు, శిష్యుడైన రాధాగుప్తుడు.. అశోకుడు మగధ సింహాసనాన్ని అధిష్టించడంలో కీలక పాత్ర పోషించారు.
''బిందుసారుడు తన కొడుకు సుసీమాను సింహాసనం అధిష్టించబోయే తన వారసుడిగా భావించేవారు. తన తర్వాత మగధకు రాజు అయ్యేది సుసీమా అని భావించేవారు'' అని 'ది వండర్ దట్ వాజ్ ఇండియా' అనే పుస్తకంలో ఏ.ఎల్ బషమ్ రాశారు.
''బిందుసారుడి తర్వాత సింహాసనం అధిష్టించే అవకాశమున్న వారసుల్లో అశోకుడు చివరి స్థానంలో ఉండేవారు. ఆయన చూడ్డానికి పొట్టిగా, ఊబకాయంతో ఉండేవారు. చర్మ వ్యాధి కారణంగా అందవిహీనంగా కనిపించేవారు.''
''బహుశా ఈ కారణంగానే ఆయన తండ్రి ఆయన్ను ఇష్టపడకపోయి ఉండవచ్చు. ఆయనను వారసుల జాబితా నుంచి తొలగించి ఉండవచ్చు'' అని రాశారు.

ఫొటో సోర్స్, Oxford University Press
విదిశాలో వ్యాపారవేత్త కుమార్తెతో ప్రేమ
ఈ కారణంగానే.. రాజధాని పాటలీపుత్రకు చాలా దూరాన ఉన్న తక్షశిలలో తిరుగుబాటు చెలరేగినప్పుడు.. ఈ తిరుగుబాటును అణచివేయాలని అశోకుడిని తన తండ్రి బిందుసారుడు పంపించారు.
ఆ తర్వాత ఆయనను మధ్య భారత్‌లోని ఉజ్జయినికి చక్రవర్తి ప్రతినిధిగా పంపారు. అక్కడ విదిశాలో ఒక స్థానిక వర్తకుని అందమైన కుమార్తె అయిన 'మహాదేవి శాక్య కుమారి'తో ఆయన ప్రేమలో పడ్డారు.
''దీపవంశంలో ఈ పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. కానీ, అశోకుడికి మహింద, సంఘమిత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు రాసుంది. ఆ తర్వాత వీరిని బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంకకు పంపారు'' అని రోమిలా థాపర్ తన పుస్తకంలో రాశారు.
''అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత.. మహాదేవి పాటలీపుత్ర వెళ్లడానికి బదులు విదిశాలో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. మహాదేవి బౌద్ధురాలు అని, ఆ కాలంలో విదిశా బౌద్ధమతానికి కేంద్రంగా ఉండేదని చెబుతారు.''
''మరో విషయం, ఒక వర్తకుని కుమార్తె కావడంతో ఆమె సామాజిక హోదా రాజ కుటుంబానికి సమాన స్థాయిలో లేదు'' అని రాశారు.

ఫొటో సోర్స్, Sitgwick & Jackson
సోదరులను చంపి, సింహాసనాన్ని అధిష్టించిన అశోకుడు
అశోకుడి పెద్దన్న సుసీమాను తన వారసుడిగా బిందుసారుడు ఎంచుకున్నారు.
కానీ, క్రీస్తు పూర్వం 274లో మరో తిరుగుబాటు వెలుగులోకి చెలరేగింది. అప్పుడు యువరాజు సుసీమాను ఆ తిరుగుబాటు అణచివేతకు పంపించారు.
ఈ తిరుగుబాటు అంతకుముందు కంటే చాలా తీవ్రంగా ఉంది. దీంతో, ప్రిన్స్ సుసీమా ఎక్కువ కాలం పాటు తక్షశిలలో ఉండాల్సి వచ్చింది.
అదే సమయంలో, బిందుసారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సుసీమాను తిరిగి వచ్చేయాలని కబురు పంపారు. ఆయన స్థానంలో తక్షశిలకు అశోకుడు వెళ్లాలని ఆదేశించారు.
ఆ సమయంలో అశోకుడి మంత్రి, ఆయన మద్దతుదారుడు అయిన రాధాగుప్తుడు జోక్యం చేసుకుని, రాజ ఉత్తర్వులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
''అశోకుడు అనారోగ్యంతో ఉన్నట్లు నటించి, తనను తాత్కాలిక రాజుగా ప్రకటించాలని తండ్రిని డిమాండ్ చేశారు'' అని చార్లెస్ అలెన్ రాశారు.
అది విన్న తర్వాత బిందుసారుడికి మూర్ఛవ్యాధి వచ్చి మరణించారు.
సుసీమా తిరిగి పాటలీపుత్రకు వచ్చిన తర్వాత.. పాటలీపుత్ర మొత్తాన్ని తన తమ్ముడు అశోకుడు నియంత్రణలోకి తీసుకున్నారని, పాటలీపుత్ర ప్రధాన ద్వారం వద్ద గ్రీస్ నుంచి తీసుకొచ్చిన కిరాయి సైనికులను కాపాలాగా ఉంచారని తెలుసుకున్నారు.
పాటలీపుత్ర తూర్పు ద్వారం వద్ద సుసీమా హత్యకు గురవడం అధికారం కోసం నాలుగేళ్ల పాటు సాగిన పోరాటంలో మొదటి ఘట్టం.
ఈ సమయంలో.. మగధ రాజ్యానికి తనను తాను రాజుగా ప్రకటించుకోవడానికి ముందు.. తన 99 మంది సవతి సోదరులను కూడా మట్టుబెట్టారు.
అయితే, సునీల్ ఖిల్నాని తన పుస్తకం 'ఇన్‌కార్నేషన్స్ ఇండియా ఇన్ ఫిఫ్టీ లైవ్స్'లో ఇలా రాశారు. "వాస్తవానికి హత్యకు గురైన సోదరుల సంఖ్య ఆరు మాత్రమే."
"సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన పోరాటం ఏళ్లపాటు సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికి అశోకుడికి 34 ఏళ్లు."

ఫొటో సోర్స్, Getty Images
అశోకుని ఆరుగురు భార్యలు
మరో రాకుమారిని పెళ్లి చేసుకుని అశోకుడు తన పట్టాభిషేకాన్ని ఉత్సవంగా చేసుకున్నారు.
అశోకుడి అంత:పురంలో చాలామంది స్త్రీలు ఉండేవారు. కానీ వారిలో చాలామందికి ఆయన ఆకర్షణీయంగా కనిపించలేదని, అందుకే వారిని సజీవదహనం చేయించారని చెబుతారు.
అందుకే, ఆయన్ను 'కండశోక' అని కూడా పిలిచేవారు. పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత.. విదిశాలో వదిలిపెట్టిన తన భార్య, పిల్లల్ని అశోకుడు పిలిపించారు.
అశోకునికి కనీసం ఆరుగురు భార్యలు. అలహాబాద్ శాసనం కారువకీని అశోకుడి రెండవ భార్యగా పేర్కొంటుంది.
అశోకుడి ప్రధాన భార్య అసంధిమిత్ర. అశోకుని పాలనలో, 13వ సంవత్సరంలో ఆమె మరణించారు.
క్రీ.పూ 265లోనే అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఏడాదిన్నర పాటు ఈ మతాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోలేదని ఆయనే అంగీకరించారు.
బౌద్ధమతంలోకి మారిన రెండేళ్లలోనే.. తన పిల్లలు మహింద, సంఘమిత్రలు బౌద్ధ మత సన్యాసినులుగా మారారు.

ఫొటో సోర్స్, Harper Collins
కళింగలో రక్తపాత యుద్ధం
బ్రిటిషర్ల కంటే చాలా ముందు భారత్‌లో అత్యధిక భాగాన్ని అశోకుడని పాలించాడని చెబుతారు.
అశోకుడు సింహాసనాన్ని అధిష్టించిన సమయంలో రోమ్, కార్తేజ్ మధ్య తొలి ప్యూనిక్ యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. పర్షియా రక్తపాత సంఘర్షణలో చిక్కుకుంది. చైనా చక్రవర్తి తన గ్రేట్ వాల్‌ను నిర్మిస్తున్నారు.
క్రీస్తు పూర్వం 362లో అశోక చక్రవర్తి కళింగపై యుద్ధం చేశారు.
ఈ యుద్ధంలో లక్ష మంది మరణించగా, యుద్ధానంతరం తలెత్తిన పరిస్థితుల కారణంగా అంతే సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదిలారు.
దాదాపు 1,50,000 మందికి పైగా ప్రజలు జైలు పాలయ్యారు లేదా దేశ బహిష్కరణకు గురయ్యారు. చనిపోయిన వారిలో చాలామంది సాధారణ పౌరులే.
ఇటీవల ప్రచురితమైన తన పుస్తకం 'అశోకా పొర్ట్రెయిట్ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్'లో ప్యాట్రిక్ ఒలివెల్లే ఇలా రాశారు. "ఆ సమయంలో కళింగ జనాభా 9,75,000 ఉంటుందని సుమిత్ గుహ అంచనా. ఒకవేళ జనాభా 10 లక్షలుగా(1 మిలియన్) భావించినా, మరణించిన వారి సంఖ్య మొత్తం జనాభాలో 20 శాతం. ఇక బందీలను కూడా కలిపితే మొత్తం జనాభాలో 35 శాతం మంది ఈ యుద్ధం వల్ల ప్రభావితమయ్యారు. అలా చూస్తే, ఈ యుద్ధాన్ని 'మారణకాండ'గా అభివర్ణించడం ఎంతమాత్రం తప్పు కాదు."

ఫొటో సోర్స్, Harper Collins
గౌతమ బుద్ధుడి అనుచరుడిగా ఎలా మారారు?
ఈ యుద్ధంలో విజయం అశోకుడి రాజ్యాన్ని బంగాళాఖాతం వరకు విస్తరించింది. తర్వాత 37 ఏళ్ల పాటు దానిపై ఆయన ఆధిపత్యం కొనసాగింది. కానీ, ఈ యుద్ధం ఎంత రక్తపాతంగా ఉందంటే, అది అశోకుడిని తీవ్రంగా కలచివేసింది.
ఆయన బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు, ఆయన జీవితంలో పెద్ద మార్పు వచ్చింది.
అప్పుడప్పుడే భారత్‌లో కొత్తగా అనుసరిస్తోన్న గౌతమ బుద్ధుడి బోధనలను ఆయన అనుసరించడం మొదలుపెట్టారు.
అశోకుని పాలనలో భారత సమాజం అంతకుముందెన్నడూ లేనంత వైవిధ్యభరితంగా ఉండేది.
''కళింగ యుద్ధం అశోకుడిని ఒక సాధారణ బౌద్ధుడి నుంచి పూర్తి స్థాయిలో బౌద్ధమతం ఆచరించే వ్యక్తిగా మార్చింది. అప్పట్నుంచి, బౌద్ధ బోధనలకు అనుగుణంగా నైతిక విలువలు ఉండేలా తన పాలనను మలుచుకున్నారు'' అని చార్లెస్ అలెన్ రాశారు.
''మంచి పరిపాలకుడిలా, అశోకుడు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. కానీ, కొంతమంది మాత్రమే ఆయన మాటలను వినగలిగారు'' అని పేర్కొన్నారు.
''ప్రపంచమంతా తన సందేశాలను వినాలని అశోకుడు కోరుకున్నారు. అందుకే, వాటిని శాశ్వతంగా సజీవంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో లిఖిత రూపంలోకి తీసుకురావడానికి చొరవ తీసుకున్నారు'' అని రాశారు చార్లెస్ అలెన్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజల భాషలోనే సందేశం
తన రాజ్యమంతా మాట్లాడుకునే ప్రాకృత భాషలోనే తన సందేశాలను రాయించారు అశోకుడు. ''అశోకుడు సమాచారం చేరవేసే విధానం మౌర్య చక్రవర్తులందరిలో కల్లా ప్రత్యేకంగా, భిన్నంగా ఉండేది'' అని సునీల్ ఖిల్నానీ రాశారు.
'' ఏడవ శిలాశాసనంలో.. రాతి స్తంభాలు లేదా రాతి దిమ్మెలు ఉన్న ప్రతిచోటా తన సందేశాలను చెక్కించాలని అశోకుడు ఆదేశించారు. అలా అయితేనే అవి చాలాకాలం పాటు ఉంటాయని భావించారు'' అని పేర్కొన్నారు.
"నా కుమారులు లేదా మనవళ్లు పాలన సాగించినంత కాలం లేదా సూర్యచంద్రుళ్లు ప్రకాశించినంత వరకూ.. తన సందేశాలను ప్రజలు చదవాలని కోరుకున్నారు."
అశోకుని శాసనాలలో చాలా వరకు ప్రాకృత భాష అయిన బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. మరికొన్ని శాసనాలు గ్రీకు, అరామిక్ లిపులలో కూడా దొరికాయి.

ఫొటో సోర్స్, Getty Images
సహనం, అహింసకు ప్రాధాన్యం
అశోకుడు 'ధమ్మ' అనే భావనను ఆకళింపు చేసుకున్నారు.
'ధమ్మ' భావన ఆధ్యాత్మిక పవిత్రత లేదా పవిత్రమైన ఆచారాలపై కాకుండా, లౌకిక ప్రవర్తనపై ఆధారపడి ఉంది.
ఈ సిద్ధాంతం సహనాన్ని సమర్థించింది. హింసను వ్యతిరేకించింది.
రోమిలా థాపర్ దీని గురించి వివరిస్తూ.. ''అశోకుడు అత్యంత విలువ ఇచ్చిన సూత్రాల్లో ఒకటి భిన్న మతాల సహజీవనం. ప్రతి ఒక్కరూ సహజీవన స్ఫూర్తితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన భావించారు'' అని రాశారు.
''ఇతర వ్యక్తులకు చెందిన సమాజాలను మనం గౌరవించాలి. ఎందుకంటే, ఇతర సమాజాలను గౌరవించినప్పుడు మాత్రమే.. సొంత సమాజాన్ని నువ్వు గౌరవించగలుగుతారు.''
ధమ్మ విధానంలో.. ప్రజల సంక్షేమం, వారి ఆరోగ్యం, సంతోషం గురించి ఆలోచించడం పాలకుడి బాధ్యత. ఆ దిశగా పనిచేయాలి.
రోడ్డుపక్కన మర్రి లేదా మామిడి చెట్లను నాటడం, ప్రయాణికులకు భోజనం, విశ్రాంతి ఏర్పాట్లు చేయడం రాజు విధి.
అశోకుడికి చెందిన చాలా వరకు అత్యంత ప్రభావవంతమైన ఆలోచనలు 12వ శాసనంలో ఉన్నాయి. ఇది మత సహనాన్ని చెబుతుంది. అశోకుడు దీన్ని వాక్కు సంయమనం అని పిలిచారు.

ఫొటో సోర్స్, Allen Lane
అశోకుడి మరణం
అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం క్షీణించడం మొదలైంది. ముఖ్యంగా ఆయన చివరి దశలో, మతపరమైన విశ్వాసాలు ఉచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు ఈ పతనం ప్రారంభమైంది.
ఆయన మతపరమైన విశ్వాసం ఎంత స్థాయికి చేరిందంటే.. ఆయన మొత్తం ఖనాజా ఖాళీ అయింది.
బౌద్ధ మతానికి చెందిన పురాణాల్లోని వివరాల ప్రకారం.. అశోకుడు తనకున్నదంతా దానధర్మాలకు ఇచ్చేశారు.
లి రోంగ్జీ రాసిన తన పుస్తకం ' ది గ్రేట్ థాంగ్ డైనస్టీ రికార్డ్స్ ఆఫ్ ది వెస్ట్రన్ రీజియన్స్'లో.. ''అశోకుడు అనారోగ్యం పాలై, మంచానికే పరిమితమైనప్పుడు... తనకి బతకనని అర్థమైంది. తన దగ్గరున్న రత్నాలు, ఆభరణాలన్నింటినీ ఏదైనా మంచి పని కోసం విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ, అప్పటికే ఆయన అధికారాన్ని మంత్రులు లాగేసుకున్నారు. తను కోరుకున్నది చేయనివ్వలేదు'' అని రాశారు.
అశోకుడు క్రీస్తు పూర్వం 232లో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
అశోకుడి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న స్వతంత్ర భారత్
అశోకుడి మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనం కావడం మొదలైంది.
కాలక్రమేణా అశోకుడిని భారతీయులు దాదాపుగా మర్చిపోయారు. క్రమంగా ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపులు కూడా వాడటం తగ్గిపోయింది. ఈ శాసనాలను ప్రజలు చదవడం మర్చిపోయారు.
బ్రిటిష్ చరిత్రకారులు విల్లియం జోన్స్, జేమ్స్ ప్రిన్సెప్‌లు 19వ శతాబ్దంలో అశోకుడి చరిత్రను తిరిగి కనుగొన్నారు.
బ్రాహ్మీ లిపి అర్థాన్ని ప్రజలకు వివరించారు.
భారత స్వాతంత్య్రానికి సరిగ్గా నెల ముందు జవహర్‌లాల్ నెహ్రూ 1947 జులైలో రాజ్యాంగ సభలో మాట్లాడుతూ, భారత త్రివర్ణ పతకం మధ్యలో అశోక చక్రాన్ని ఉంచాలని చెబుతూ భారత జాతీయ జెండా డిజైన్ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు.
అశోకుడు భారత ప్రజలకు ఎంతటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటే.. అశోకుడిని దాదాపుగా నూతన భారతదేశానికి మార్గదర్శక దైవం స్థాయికి చేర్చారు జవహర్‌లాల్ నెహ్రూ.
అశోకుని నాలుగు సింహాలు భారత తపాలా బిళ్లలపై మాత్రమే కాకుండా, ఈ జాతీయ చిహ్నం సమస్త భారతీయ జీవన విధానంలో ఒక అంతర్భాగమైన చిహ్నంగా మారింది.
ఇది శాంతియుత సహజీవనానికి కూడా ప్రతీక. ప్రజా జీవితంలో కూడా సంయమనం, ఆత్మనిగ్రహం పాటించాలన్న అశోక చక్రవర్తి సందేశం నేటి భారతీయులకు ఒక హెచ్చరికగానూ, స్ఫూర్తిగానూ నిలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































