తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనకరమా?

బంగ్లాదేశ్, బీఎన్‌పీ, తారిక్ రెహమాన్, ఖలీదాజియా, షేక్ హసీనా, దిల్లీ

ఫొటో సోర్స్, @bdbnp78

    • రచయిత, శుభ్‌జ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

బంగ్లాదేశ్‌లో జరిగిన గత నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఫలితాలు ప్రకటించిన వెంటనే గెలిచిన పార్టీని ఇతర విదేశీ నేతల కంటే ముందుగా భారత ప్రధానమంత్రి అభినందించారు.

దిల్లీలో మన్మోహన్ సింగ్ లేదా నరేంద్ర మోదీ ఎవరు అధికారంలో ఉన్నా ఈ విధానం ఎలాంటి మినహాయింపు లేకుండా కొనసాగింది.

ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం కూడా ఈ సంప్రదాయమే పునరావృతమైంది.

కానీ ఈసారి బంగ్లాదేశ్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

బంగ్లాదేశ్ భవిష్యత్ ప్రధాని పేరు మారిపోయింది.

వరుసగా నాలుగు ఎన్నికల్లో విజయాల తర్వాత, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఫిబ్రవరి 13వతేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎన్నికల ఫలితాల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీని అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు.

"బంగ్లాదేశ్ ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తుంది" అని ఆయన 'ఎక్స్'లో రాశారు.

దాదాపు అరగంట తర్వాత ఈ మెసేజ్ బెంగాలీలో కూడా పోస్ట్ అయింది.

బంగ్లాదేశ్ అంతటా అది చర్చనీయాంశమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గతంతో పోలిస్తే భిన్నమైన పరిస్థితులు

భారత్ చాలా కాలంగా పట్టించుకోని ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ సందేశం వెళ్లింది. ఈ అభినందనలను ఆయన అంగీకరించినప్పటికీ, దీనిని దౌత్యపరమైన యూ-టర్న్‌గా చూడవచ్చు.

భారత్‌లోని పరిశీలకులు ఈ అంచనాతో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బలమైన బీఎన్‌పీ ప్రభుత్వం ప్రస్తుతానికి భారత్‌కు అత్యంత ఆచరణీయమైన వ్యూహాత్మక ఎంపిక. దిల్లీ వైఖరిలో మార్పుకు ఈ ఆలోచనే ప్రాతిపదిక అని వారు భావిస్తున్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయే తారిక్ రెహమాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇచ్చిన ప్రత్యేక హామీల కారణంగా ఇటీవలి పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు.

బీఎన్‌పీ గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఒడిదుడుకులున్నప్పటికీ గత విభేదాలను తవ్వితీయకుండా, ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధాని మోదీ సందేశం కూడా దీనినే సూచిస్తోంది.

బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో చర్చలు నిర్దుష్ట అంశాలపై దృష్టి సారిస్తాయని కూడా భారత్ సంకేతాలిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక రోజు ముందు చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకుండా బంగ్లాదేశ్‌లోని ఏ ప్రభుత్వంతోనూ సంబంధాలు కొనసాగలేవని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పునరుద్ఘాటించింది.

బంగ్లాదేశ్, బీఎన్‌పీ, తారిక్ రెహమాన్, ఖలీదాజియా, షేక్ హసీనా, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ విజయం సాధించింది.

‘గతంలో అవామీలీగ్‌కు దగ్గరగా భారత్’

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలన ముగిసి, ఎన్నికలు జరిగి ప్రభుత్వం తిరిగి ఏర్పడడాన్ని భారత్ స్వాగతిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మోదీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి 2014లో పూర్తి మెజారిటీ సాధించిన సమయంలో బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ లండన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు.

బీజేపీ, బీఎన్‌పీ రెండింటివీ ఒకే విధమైన మధ్యేవాద జాతీయవాద భావజాలం కావడంతో వాటి మధ్య సహజ రాజకీయ సంబంధం ఉంటుందని భావిస్తారు.

భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రకంగా అవామీ లీగ్‌కు దగ్గరగా ఉంది. అది అధికారానికి దూరమైన తర్వాత, ఈ అంచనా సహజంగానే కనిపించింది.

కొత్త ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీకి రెహమాన్ ఒక బహుమతిని పంపారు. దానిని దిల్లీలో బీజేపీ నాయకుడు విజయ్ జాలీ అందజేశారు. ఆ తర్వాత అనేక అనధికారిక పరిచయాలు ఏర్పడ్డాయి.

కానీ ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. బహిరంగంగా అయితే అలాంటి పరిస్థితే కనిపించింది. భారత నిఘా సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దిల్లీలోని కొంతమంది విశ్లేషకులు సూచించారని భావిస్తున్నారు.

"మనకు, బీఎన్‌పీకి మధ్య ఏ సంబంధం గురించైనా ప్రధానమంత్రి హసీనా చాలా సున్నితంగా ఉండేవారు. ఈ సున్నితత్వం సంబంధాల్లో ఒక ముఖ్యమైన కారణం" అని ఢాకాలో భారత మాజీ హైకమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి ఈ భిన్నమైన దృక్పథానికి కారణాన్ని వివరించారు.

ఆ సమయంలో బీఎన్‌పీ చైర్‌పర్సన్ ఖలీదా జియా ఆరోగ్యం క్షీణిస్తోంది. పార్టీ నాయకత్వం క్రమంగా రెహమాన్ వైపు మళ్లుతోంది. అధికారిక సంబంధాలు పరిమితంగా ఉండడంతో, భారత్ థింక్ ట్యాంక్‌లు, రిటైర్డ్ దౌత్యవేత్తలు, భద్రతా అధికారుల ద్వారా "ట్రాక్ టూ" మార్గాలను అనుసరించింది. అలాంటి సమావేశాలకు దిల్లీ, బ్యాంకాక్‌లో హాజరైనట్టు రంజన్ చక్రవర్తి గుర్తుచేసుకున్నారు.

బంగ్లాదేశ్, బీఎన్‌పీ, తారిక్ రెహమాన్, ఖలీదాజియా, షేక్ హసీనా, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 ఆగస్టు నుంచి బంగ్లాదేశ్‌లో తాత్కాలికప్రభుత్వం అధికారంలో ఉంది.

ఆగస్టు 5, 2024 తర్వాత మారిన రాజకీయం

బంగ్లాదేశ్‌లో ఆగస్టు 5, 2024న జరిగిన నాటకీయ రాజకీయ మార్పు దిల్లీలోని రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. అవామీ లీగ్ లేని పరిస్థితుల్లో బీఎన్‌పీ భారత్ స్పష్టమైన ఎంపికగా మారింది.

రంజన్ చక్రవర్తి 2008లో ఢాకాలో భారత హైకమిషనర్‌గా ఉన్నారు. అప్పుడు సైనిక మద్దతుతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం రెహమాన్‌ను లండన్‌కు వెళ్లిపోయేలా చేసింది. 2001-2006 వరకు బీఎన్‌పీ పదవీకాలంలో రెహమాన్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన గుర్తు చేసుకున్నారు.

"బ్రిటన్‌లో 17 సంవత్సరాలకు పైగా గడిపిన తర్వాత ఆయన ఎంత మారిపోయాడో అంచనా వేయడం కష్టం. కానీ ఇప్పుడు భారత్ ప్రధానమంత్రి లేఖలు, అభినందలు బహిరంగంగా తెలియజేస్తున్నారు. దీనిని బట్టి కొన్ని సహేతుకమైన హామీలు వచ్చాయని భావించవచ్చు" అని రంజన్ చక్రవర్తి తెలిపారు.

ఆ హామీల అర్థం ఊహాగానాలకు తెరతీస్తోంది. కానీ దీల్లీలోని చాలా మంది బీఎన్‌పీ తిరిగి బహిరంగంగా భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించే అవకాశం లేదని నమ్ముతున్నారు.

బీఎన్‌పీ తన విదేశాంగ విధానాన్ని "బంగ్లాదేశ్ ఫస్ట్" గా చూపుతోంది. అయితే ఇటీవలి ప్రసంగాలలో రెహమాన్ భారత్‌పై ప్రత్యక్ష, పదునైన మాటలదాడులకు దూరంగా ఉన్నారు. ఈ వైఖరిని భారత్ సానుకూలంగా భావిస్తోంది.

దిల్లీలోని మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌ ఫెలో స్మృతి పట్నాయక్ మరో విషయాన్ని కూడా చెబుతున్నారు.

షేక్ హసీనాను అప్పగించాలంటూ బీఎన్‌పీ దూకుడుగా భారత్‌ను కోరడాన్ని కొనసాగించకపోవచ్చని ఆమె అంటున్నారు.

"మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం దీనిని పెద్ద సమస్యగా మార్చడానికి ప్రయత్నించింది. బీఎన్‌పీ ఈ డిమాండ్‌ను అలంకారప్రాయంగా లేవనెత్తుతూనే ఉండచ్చు. కానీ దిల్లీతో సమగ్ర చర్చలకు ఇది అడ్డంకిగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది'' అని విశ్లేషించారు.

బంగ్లాదేశ్, బీఎన్‌పీ, తారిక్ రెహమాన్, ఖలీదాజియా, షేక్ హసీనా, దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రత గురించి భారత్ ఇటీవల ఆందోళన వ్యక్తంచేసింది.

మైనారిటీల సంగతేంటి?

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీలపై హింసకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై 18నెలలుగా భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ సమస్య తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను దెబ్బతీసింది. బంగ్లాదేశ్ ఈ వాదనలను అతిశయోక్తి లేదా రాజకీయంగా ప్రేరేపితమైనవిగా తోసిపుచ్చింది. అయితే భారత్ తన వైఖరిపై దృఢంగా ఉంది.

మైనారిటీల భద్రత అంశంపై బీఎన్‌పీ ప్రభుత్వం ఎలాంటి వైఖరితో ఉంటుందనేది ముఖ్యం.

బంగ్లాదేశ్‌లో అధికారపార్టీ ఎవరనేదానికంటే క్షేత్రస్థాయి వాస్తవాల మెరుగుదల ముఖ్యమని పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రతినిధి దేవజీత్ సర్కార్ అన్నారు.

"అవామీ లీగ్ లేదా బీఎన్‌పీ ఎవరు అధికారంలో ఉన్నా హిందువులపై దాడులు ఆగడం లేదని ఇటీవలి ఘటనలు చూపిస్తున్నాయి'' అని అన్నారు.

కొత్త ప్రభుత్వం మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నిర్దుష్ట మార్పు ఏమైనా వస్తుందా అనేదానిపై ఆయన సందేహంగానే ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కొంతమంది విశ్లేషకులు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకైనా రాష్ట్రంలో ఇది రాజకీయంగా ముఖ్యమైన సమస్యగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా దిల్లీ చాలా సానుకూల భావనలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిని హృదయపూర్వకంగా స్వాగతించింది.

దీనికి కారణం చెప్పడం చాలా తేలిక: బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తారిక్ రెహమాన్ భారత్‌కు ఉత్తమ ఎంపిక - బహుశా ఏకైక ఎంపిక.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)