‘నా వైవాహిక జీవితంలో అత్యంత బాధాకరమైన కాలం’.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు ఉండడంపై ఆయన మాజీ భార్య మెలిండా ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, క్రిస్టల్ హేస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన తాజా పత్రాల్లో తన మాజీ భర్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు కనిపించడం తన వివాహ జీవితంలోని "చాలా బాధాకరమైన సమయాలను" గుర్తుచేసిందని మెలిండా ఫ్రెంచ్ గేట్స్ చెప్పారు.
ఎప్‌స్టీన్ ఆరోపణలపై తాను "నమ్మశక్యంకానంత బాధ" అనుభవించానని ఆమె ఎన్‌పీఆర్ పాడ్‌కాస్ట్‌కు తెలిపారు.
అలాగే తన మాజీ భర్త సహా ఆ పత్రాల్లో పేర్లు ఉన్నవారందరూ వాటికి సమాధానం చెప్పాల్సిందేనన్నారు.
"ఆ బురద నుంచి దూరంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది" అని మెలిండా చెప్పారు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ దంపతులు 27 ఏళ్ల వివాహ జీవితం అనంతరం 2021లో విడాకులు తీసుకున్నారు.
అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో, బిల్ గేట్స్‌కు ‘లైంగికంగా సంక్రమించే వ్యాధి’ సోకిందని ఎప్‌స్టీన్ ఆరోపించినట్టు ఉంది.
అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ "పూర్తి అసంబద్ధమైనవి" అంటూ ఖండించారు.
"ఒక అబద్ధాలకోరు చేసిన ఈ ప్రకటనలు పూర్తిగా అర్థరహితం, అసత్యాలు," అని ఆ ఆరోపణలపై బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మెలిండా వ్యాఖ్యలపై బిల్ గేట్స్ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది.
ఎప్‌స్టీన్ బాధితుల్లో ఎవరూ బిల్ గేట్స్‌పై తప్పు చేశారని ఆరోపణలు చేయలేదు. ఫైల్స్‌లో ఆయన పేరు కనిపించడం అంటే, ఆయన ఏదో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని కాదు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆ నొప్పి మళ్లీ గుర్తుకొస్తోంది’’
ఎన్‌పీఆర్ 'వైల్డ్ కార్డ్' పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మాట్లాడుతూ, "అలాంటి వివరాలు బయటకు వచ్చినప్పుడల్లా అది వ్యక్తిగతంగా నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి నా వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన క్షణాలను మళ్లీ గుర్తు చేస్తాయి" అని అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, "అక్కడ ఎలాంటి ప్రశ్నలు మిగిలున్నాయో నాకు పూర్తిగా తెలియదు. ఆ ప్రశ్నలు ఆ వ్యక్తులకు సంబంధించినవి. నా మాజీ భర్తకు కూడా. వాటికి సమాధానం చెప్పాల్సింది వాళ్లే, నేను కాదు" అని స్పష్టం చేశారు.
విడాకులకు ముందు, ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధంపై మెలిండా అసంతృప్తిగా ఉన్నారని అమెరికా మీడియా పేర్కొంది.
ఈ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత, 2019లో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఓ ఉద్యోగితో తనకు వివాహేతర సంబంధం ఉందని బిల్ గేట్స్ అంగీకరించారు.
గత వారం అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 30 లక్షలకుపైగా పత్రాల్లో బిల్ గేట్స్‌పై ఆరోపణలకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
వీటిల్లో రెండు ఈమెయిల్స్ 2013, జులై 18వ తేదీతో ఉన్నాయి. ఈ రెండింటిని ఎప్‌స్టీన్ రాసినట్టుగా కనిపిస్తున్నప్పటికీ, అవి నిజంగా గేట్స్‌కు పంపించారా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు.
ఈ రెండు ఈమెయిల్స్ కూడా ఎప్‌స్టీన్ ఈమెయిల్ ఖాతా నుంచే పంపి, తిరిగి అదే ఖాతాకే వచ్చినట్టు ఉన్నాయి. గేట్స్‌కు సంబంధించిన ఎలాంటి ఈమెయిల్ ఖాతా ఇందులో కనిపించలేదు. పైగా, ఈ రెండు మెయిల్స్‌కూ సంతకం లేదు.
ఒక ఈమెయిల్‌లో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ, "రష్యన్ యువతులతో లైంగిక సంబంధాల వల్ల కలిగిన పరిణామాలను ఎదుర్కొనేందుకు" బిల్ కోసం మందులు సమకూర్చాల్సి వచ్చిందనే ఫిర్యాదు ఉంది.
మరో ఈమెయిల్ "డియర్ బిల్" అంటూ ప్రారంభమై, బిల్ గేట్స్ స్నేహాన్ని ముగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అలాగే, లైంగిక సంక్రమిత వ్యాధి విషయాన్ని అప్పటి భార్య మెలిండా నుంచి దాచిపెట్టేందుకు బిల్ గేట్స్ ప్రయత్నించారనే ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి.
‘‘కొన్నిసార్లు డిన్నర్ చేశామంతే’’
ఎన్నో ఏళ్లుగా, ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలను బిల్ గేట్స్, ఆయన ప్రతినిధులు తక్కువగా చూపే ప్రయత్నం చేశారు. కార్యరూపం దాల్చని ఓ దాతృత్వ ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు మాత్రమే ఎప్‌స్టీన్‌తో "కొన్ని సార్లు డిన్నర్" చేసినట్టు బిల్ గేట్స్ గతంలో చెప్పారు.
తాజా ఆరోపణల అనంతరం బిల్ గేట్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, "ఈ పత్రాలు చూపిస్తున్నదల్లా గేట్స్‌తో సంబంధాలు లేకపోవడం వల్ల ఎప్‌స్టీన్‌కు కలిగిన నిరాశ మాత్రమే. గేట్స్‌ను ఇరికించేందుకు, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయేందుకు ఎప్‌స్టీన్ ఎంత దూరం వెళ్లగలడో ఇవి సూచిస్తున్నాయి" అన్నారు.
అమెరికా న్యాయశాఖ గత వారం విడుదల చేసిన లక్షలాది పత్రాలు, ఈమెయిల్స్, ఫోటోలు ఎప్‌స్టీన్‌కు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ప్రపంచ నేతలతో ఉన్న విస్తృత సంబంధాలను వెలుగులోకి తెచ్చాయి. 2008లో 14 ఏళ్ల బాలికతో లైంగిక నేరానికి శిక్ష పడిన తర్వాత కూడా ఈ సంబంధాల్లో కొన్ని కొనసాగినట్టు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
సెక్స్ ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో న్యూయార్క్ జైలులో మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














