‘‘రాత్రి పడుకున్నప్పుడు పాములు మా పక్కనే తిరుగుతుంటాయి, కానీ ఏమీ చేయలేం’’

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 7 నిమిషాలు
కూటి కోసం, కూలి కోసం సొంతూరు వదిలిపెట్టి పట్టణాలకు వలస పోవడం అనేది చాలా సాధారణమే. వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా, తీరా అక్కడా కేవలం రెండు మూడు నెలలే పని దొరకడం, రోజుకు 12 గంటల పాటు ఏకబిగిన పనిచేసినా చేతికొచ్చేది రూ.300 నుంచి రూ.500 మాత్రమే.
ఇదీ కర్నూలు జిల్లా నుంచి గుంటూరుకు వస్తున్న వలస కూలీల పరిస్థితి.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రధానంగా మిర్చి ఏరే పనులకు కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వ్యవసాయ కార్మికులు వేల సంఖ్యలో వస్తుంటారు.
ఇలా దాదాపు పదేళ్లుగా రాయలసీమ జిల్లాల నుంచి కార్మికులు వస్తున్నారు. ఏటేటా వారి సంఖ్య పెరుగుతోందని, ఇక్కడ వారికి పనులు అప్పగిస్తున్న గుంటూరు జిల్లా రైతులు చెబుతున్నారు.
అసలు ఇలా వ్యవసాయ పనుల కోసం వస్తున్న ఈ కూలీల జీవన విధానం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొనే సమస్యలేమిటి, వాటిపై ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? అనే విషయాలపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

అక్కడ పనులు లేకనే వలసలు...
వర్షాకాలం సీజన్ తర్వాత తమ ప్రాంతంలో వ్యవసాయపనులు పెద్దగా ఉండవనీ, ఏరోజుకారోజు కూలి పనులు చేసుకునే తాము పొట్టకూటి కోసం అక్కడ ఉండలేక ఏడాది మొదట్లో గుంటూరుకు వస్తామని కర్నూలు జిల్లా సీ బెళగళ్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన గుండన్న బీబీసీకి చెప్పారు.
సంక్రాంతి పండుగ తర్వాత నుంచి గుంటూరు జిల్లాలో మార్చి నెలాఖరు, ఏప్రిల్ వరకు మిర్చి కోత పనులు ఉంటాయి.
తమ గ్రామం నుంచి 60 కుటుంబాలవాళ్లం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడులో మిర్చి కోత పనులకు వచ్చామని గుండన్న చెప్పారు.

కేజీకి రూ.15 చొప్పున కూలి...
''మిరపకాయలు ఏరే పనిలో కేజీకి 15 రూపాయల చొప్పున కూలి ఇస్తారు. ఎన్ని కేజీలు కోస్తే అంత కూలి వస్తుంది. ఉదయం ఆరున్నర ఏడు గంటలకు పని మొదలు పెడతాం. సాయంత్రం ఆరున్నరకి ఆపేస్తాం. అప్పటికి దాదాపు పాతిక నుంచి 30 కిలోల వరకూ కాయలు ఏరతాం'' అని కర్నూలు జిల్లా పోలకల్ గ్రామానికే చెందిన సుధ చెప్పారు.
కోత మొదట్లో కాయలో కాస్త నీరుండి బరువుగా ఉంటుందనీ, దాంతో ముప్పై కిలోల వరకు కాయలు సేకరించగలుగుతామని సుధ చెప్పారు.
‘‘సీజన్ చివర్లో ఎన్ని కాయలు కోసినా 20 కేజీల కంటే తూగవు. దాంతో ఎంత కష్టపడినా రూ.300 కంటే ఎక్కువ రావు. ఈ డబ్బులొచ్చే పనులు కూడా మా ఊరిలో ఉండవు. అందుకే అంత దూరం నుంచి ఇక్కడ ఈ మిర్చి కోత పనికి వస్తుంటాం'' అని సుధ అన్నారు.

కూలీల్లో చదువుకున్న యువకులు...
పొద్దంతా పనిచేస్తే రూ.300కు మించని సంపాదన ఉండే ఈ కూలీల్లో నిరక్షరాస్యులే కాదు డిగ్రీ చదివిన విద్యార్థులూ ఉన్నారు. తాము డిగ్రీ చదువుకున్నప్పటికీ కుటుంబ పరిస్థితులు బాగలేక, ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు లేక రోజువారీ కూలి కోసం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి వచ్చామని కర్నూలు జిల్లా కైరుప్పల గ్రామానికి చెందిన యువకులు బీబీసీకి చెప్పారు.
''కర్నూలులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. మా ప్రాంతంలో పనులు లేవు. వర్షాకాలంలో కాస్త పని దొరికినా, ఆ తర్వాత ఉండదు. అందుకే ఇక్కడికి వలస వచ్చాం. మిర్చి కోత పనికి వెళ్తుంటే రోజుకి రూ.300 వరకూ వస్తున్నాయి'' అని కైరుప్పలకు చెందిన నర్సప్ప, విజయ్ అన్నారు.

పొలాల్లో గుడారాలేసుకొని నివాసం...
ఇలా మిర్చి కోత పనికి వలస వస్తున్న కూలీలందరూ రైతుల పొలాల్లోనే గుడారాలు వేసుకుని నివసిస్తుంటారు. పరిసరాల్లో కట్టెలు వేరి తెచ్చుకుంటారు. గుడారాల వద్దనే వంట చేసుకుంటారు.
''పొలాల్లో పురుగూ, పుట్రా ఉంటాయి, ఏం చేస్తాం? వాటితో జాగ్రత్తగా ఉండటమే'' అని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం చిన్నమారేడు గ్రామానికి చెందిన తిమ్మన్న బీబీసీతో అన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎం.మారన్ మాట్లాడుతూ, ''నేను, నా భార్య ఇద్దరమూ వచ్చాం. రోజూ చెరో 30 కేజీలు కోస్తాం. రాత్రిళ్లు నిద్రపోయే చోట కప్పలు, వాటి కోసంవచ్చే పాములు కనిపిస్తాయి. భయమేస్తుంది. అలాగని తిరిగెళ్లిపోలేం. అక్కడ మా పరిస్థితి బాగలేకనే ఇక్కడికి వచ్చాం'' అని చెప్పారు.
తాము గత పదేళ్ల నుంచి ఏటా వస్తున్నామని తిమ్మన్న, మారన్ అన్నారు.
మిర్చి పనుల కోసం రప్పించుకున్న కూలీలకు ఇక్కడ గుడారాలు వేసుకునేందుకు స్థలం ఇస్తామని, కరెంటు, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తామని గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రైతు వెంగళరెడ్డి బీబీసీకి చెప్పారు.

‘పిల్లలు, పెద్దలను సొంతూళ్లలో వదిలేసి...’
''వాళ్లు అక్కడ ఎలా ఉంటున్నారనే బాధ ఉంటుంది. కానీ తప్పదు. అక్కడ పనుల్లేవు. అందుకే ఈ మూడు నాలుగు నెలలు ఇక్కడ పనిచేసి కొంత సంపాదించుకుని మళ్లీ మా ఇళ్లకు వెళ్లిపోతాం'' అని ఎమ్మిగనూరుకి చెందిన కూలీ మారుతమ్మ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వపరంగానూ వారికి సాయం చేయాలి...
వలస కూలీలకు రైతులు కూడా తమ వంతు సాయం చేస్తుంటారు. వారిని తీసుకురావడానికి వాహనాలు కూడా ఏర్పాటుచేస్తారు. పనులు పూర్తయ్యాక కూడా వాహనాల్లోనే వారి గ్రామాలకు పంపిస్తారు.
స్వగ్రామాల నుంచి రాకపోకలకే కాదు, వారి తాత్కాలిక నివాసాల నుంచి దూరంగా ఉన్న పొలాలకు వెళ్లివచ్చేందుకు కూడా కొంతమంది రైతులు ట్రాక్టర్లు వంటివాటిని ఏర్పాటుచేస్తారని తక్కెళ్లపాడుకి చెందిన వెంగళరెడ్డి చెప్పారు.
''ఆరుగాలం కష్టపడి పనిచేసినా రైతులకు చివరికి ఏమీ మిగలట్లేదు. అయినప్పటికీ కూలి పనుల కోసం వచ్చేవారికి రైతులుగా వారికి ఎంత చేయాలో అంత చేస్తాం. కానీ, ప్రభుత్వపరంగా కూడా వారికి ఎంతో కొంత చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘వలస కూలీల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి...’
వలస కూలీలలకు అనేక సమస్యలున్నాయని బీబీసీతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు.
''వీరు తప్పని పరిస్థితుల్లో అక్కడి నుంచి జీవనోపాధికి వలస వస్తున్నారు. కనీస వేతనం అమలు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రైతు సంఘం తరఫున వలస కూలీలకు రక్షణ చట్టం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని ఆయన చెప్పారు.

‘కూలీలు ఎంతమందో అధికారిక లెక్క లేదు…’
వలస కూలీలు ఎంతమంది వస్తున్నారు, ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారనే వివరాలు తమ వద్ద లేవని రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు బీబీసీకి చెప్పారు.
''వలస కూలీల సమాచారం మాకు తెలియదు. పనుల కోసం ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఒకవేళ వారికి వేతనాలు, కూలి విషయంలో ఇబ్బందులొస్తే మా దృష్టికి తీసుకువస్తే మేము వెంటనే చర్యలు చేపడతాం. అయితే ఇప్పటివరకు వారి సమస్యలేమీ మా దృష్టికి రాలేదు'' అని కార్మిక శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి బీబీసీకి తెలిపారు.
మరోవైపు జిల్లా నుంచి వ్యవసాయ కూలీలు ఇతర జిల్లాలకు వలస వెళ్లడం పై దృష్టి సారించామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కూడా తెలిపారు.
‘‘కేవలం రెండు మూడు నెలల పాటు పనుల కోసమే ఇలా వలసలు వెళ్తుంటారు. ఈ సీజనల్ మైగ్రేషన్‌ను అడ్డుకునేందుకు కర్నూలు జిల్లాలో కూడా ఉపాధి పనులను అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయి’’ అని బీబీసీతో అన్నారు కలెక్టర్ సిరి.

ఫొటో సోర్స్, కర్నూలు డీఈవో
వలస కూలీల పిల్లల కోసం ప్రత్యేక హాస్టళ్లు...
కర్నూలు జిల్లా నుంచి గుంటూరు సహా వివిధ జిల్లాలకు వలస వెళ్తున్న కూలీల పిల్లల కోసం ప్రత్యేకంగా సీజనల్ హాస్టళ్లు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఇలా వేరే జిల్లాలకు వలస వెళ్లిన వలస కూలీల పిల్లలను 4 వేల మంది వరకు గుర్తించి, వారి కోసం ఒక్క కర్నూలు జిల్లాలోనే 77 సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్టు కర్నూలు డీఈవో సుధాకర్ బీబీసీకి చెప్పారు.
ఆయా హాస్టళ్లలో ఉచిత వసతితో పాటు విద్యను అందిస్తున్నామని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























