రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం బీజేపీకి ఎదురుదెబ్బా?

చదివే సమయం: 5 నిమిషాలు

మహిళా రిజర్వేషన్ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభలో వీగిపోయింది.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ రాజ్యాంగ సవరణ బిల్లు, సభలో వీగిపోవడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి.

ఈ బిల్లుపై పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత శుక్రవారం సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు.

పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ బిల్లులకు మద్దతుగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు సభలో వీగిపోవడం దురదృష్టకరమని, ఓ మంచి అవకాశాన్ని కోల్పోయామని సభా కార్యక్రమాల అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

సభలో ప్రవేశపెట్టిన మరో రెండు బిల్లులు కూడా రాజ్యాంగ సవరణ బిల్లుతోనే ముడిపడి ఉన్నందున ఆ బిల్లులపై ఇక ఓటింగ్ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

బిల్లు వీగిపోయిన తర్వాత ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేశారు. విపక్షాలు, మహిళా వ్యతిరేకులంటూ ఆరోపించారు.

పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు తీవ్ర చర్చ జరిగింది.

రాజకీయ అజెండాపై విపక్షాల సవాళ్లు

ఈ బిల్లులను ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వానికి ఏదో అజెండా ఉందంటూ విపక్షాలు వ్యాఖ్యానించాయి.

''తాను ఎన్నికల్లో ఓడిపోతానని భావించినప్పుడు ప్రధాని నిబంధనలనే మార్చేస్తారు. ఈ బిల్లులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకువచ్చారు'' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు.

2023లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చిన విషయాన్ని అందరూ గుర్తించాలని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు.

'డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను కాలరాసే కుట్ర ఈరోజు సభలో వీగిపోయింది' అని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, విలేకరులతో మాట్లాడుతూ, ''ఇది దేశంలోని ప్రజాస్వామ్యం, సమగ్రతకు సంబంధించిన విషయం. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. ఈ బిల్లు ఆమోదం పొందడం అసలు సాధ్యం కాదు' అన్నారు.

మహిళలకు హక్కులు కల్పించే దిశలో ఒక మహత్తర, చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సభలో ప్రవేశపెట్టింది.

''మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఒక బిల్లు మాత్రమే కాదు. దేశం దశదిశలను మార్చే పెద్ద మార్పు. దీన్ని వ్యతిరేకించే వారు దీర్ఘకాలం పాటు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది'' అని సభలో ప్రధాని మోదీ అన్నారు.

దేశంలోని నారీ శక్తిని బలోపేతం చేసే చారిత్రాత్మక అడుగు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అని హోం మంత్రి అమిత్ షా సభలో వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్ బిల్లుపై వ్యతిరేకత

లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించే లక్ష్యంతో ప్రభుత్వం డీమిలిటేషన్ బిల్లును కూడా తీసుకొచ్చింది.

దక్షిణ భారత రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపట్టారు.

డీలిమిటేషన్ వల్ల కేంద్రంలో తమ వాటా తగ్గుతుందని దక్షిణ భారత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

డీలిమిటేషన్ బిల్లు వల్ల పార్లమెంట్‌లో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గదని విపక్షాలకు అమిత్ షా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

''నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయ ప్రక్రియలో ఎవరిపైనా వివక్ష ఉండదు. ఎవరికీ అన్యాయం జరుగదు. దీనికి నాది బాధ్యత. గతంలో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు పాటిస్తారు. అందులో ఎలాంటి మార్పూ ఉండదు. దాని ప్రకారమే విభజన జరుగుతుంది. ఒకవేళ మీకు గ్యారెంటీ కావాలంటే నేను ఆ గ్యారెంటీ కూడా ఇస్తాను' అని మోదీ వివరించారు.

విపక్షాల ఆందోళనలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ వారిలో సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

నిపుణులు ఏమంటున్నారు?

డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజకీయ అజెండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

డీలిమిటేషన్ ద్వారా బీజేపీ తన రాజకీయ భవిష్యత్తును మరింత భద్రంగా మార్చుకోవాలని అనుకుంటోందని సీనియర్ జర్నలిస్ట్ సుమన్ గుప్తా అభిప్రాయపడ్డారు.

''దిల్లీ దారి ఉత్తరప్రదేశ్ మీదుగానే వెళ్తుందనేది ఒక రాజకీయ సామెత. డీలిమిటేషన్ తర్వాత పార్లమెంట్‌లో ఉత్తర భారత శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ బీజేపీ బలంగా ఉంది. కాబట్టి దీనివల్ల ఆ పార్టీకి లాభం చేకూరుతుంది" అని ఆయన అన్నారు.

''మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా తీసుకురావడం రాజకీయ దుస్సాహసంగా చెప్పొచ్చు'' అని మరో సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ అత్రీ అన్నారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ''ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఎలక్టోరల్ మ్యాప్‌ను మార్చే కుట్ర'' అని ఆరోపించారు.

పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ఈ బిల్లు విఫలమైందని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఫైజాన్ ముస్తఫా అన్నారు.

''ఎన్డీఏకు చెందిన సుమారు 12 మంది సభ్యులు గైర్హాజరు కావడం చాలా ఆశ్చర్యకరం. సభా నిర్వహణను సీరియస్‌గా తీసుకోలేదని దీనిద్వారా అర్థమవుతోంది. ఎన్నికల మధ్యలో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిచ్చింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, 2023 మహిళా రిజర్వేషన్ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఒక సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని బీబీసీకి విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ ప్రతినిధి డాక్టర్ స్వప్నిల్ త్రిపాఠి తెలిపారు.

బిల్లు వీగిపోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బా?

పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రభుత్వానికి సభలో అంత సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లును ఆమోదించడం సాధ్యం కాదు. బిల్లు వీగిపోవడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

''ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. తమకు సరిపడా సంఖ్యాబలం లేదని తెలిసినా ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. దీని ద్వారా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మహిళా ఓట్లను ఆకర్షించాలని అనుకుంది. విపక్షాలే మహిళల హక్కులను అడ్డుకున్నాయని ఇకపై బీజేపీ ప్రచారం చేస్తుంది'' అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అన్నారు.

అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడంపై కూడా విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్ళించడానికే ప్రభుత్వం ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఉండొచ్చని హేమంత్ అత్రి అభిప్రాయపడ్డారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందినప్పుడు, దాన్ని మళ్లీ ఇప్పుడు డీలిమిటేషన్‌తో కలిసి తీసుకురావాల్సిన అవసరం ఏముందని శరద్ గుప్తా ప్రశ్నించారు.

'ప్రభుత్వం కావాలనే డీలిమిటేషన్‌తో మహిళా బిల్లును ముడిపెట్టింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలనే ఇలా చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ బిల్లు వీగిపోవడం ప్రభుత్వ రాజకీయ అజెండాకు పెద్ద దెబ్బ' అని ఆయన విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)