You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పెళ్లి కొడుకు కూడా హైదరాబాద్‌లోనే ఉంటాడా?’.. ప్రధాని నరేంద్ర మోదీ ఆరా
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘పొంగల్, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి జరుగుతాయి. ముఖ్యంగా.. గ్రామీణ సంస్కృతి, రైతుల జీవనంతో చక్కగా మిళితమైపోయాయి. సంప్రదాయక పండుగలన్నీ తర్వాతి కాలంలో వచ్చే వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేందుకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి’’ అని అన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులతో నరేంద్ర మోదీ చాలా కలివిడిగా మాట్లాడారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.
రాజేశ్వరి సాయినాథ్ బృందానికి చెందిన ఒక నృత్య కళాకారిణి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతోందని పక్కనే ఉన్న మరో కళాకారిణి చెప్పగా.. ‘‘అవునా. శుభాకాంక్షలు. పెళ్లి కొడుకు కూడా హైదరాబాద్‌లోనే ఉంటాడా? ఇద్దరూ పెళ్లయ్యాక అక్కడే జీవిస్తారా?’’ అంటూ ఆరా తీశారు.
అనంతరం ఆమె పెళ్లి శుభలేఖపై సంతకం చేసిచ్చారు.
మా ఇతర కథనాలు: