ఆ విషయంలో సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌ల కంటే కపిల్‌దేవ్ రికార్డే బెస్ట్

ఫొటో సోర్స్, GETTY ALLSPORT
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కపిల్ దేవ్, భారత క్రికెట్ చరిత్రలో తొలి సూపర్ స్టార్. కపిల్ గుర్తొస్తే చాలు అతడి ఎన్నో ఘనతలు గుర్తొస్తాయి. జనవరి 6న కపిల్ దేవ్ పుట్టినరోజు. ఈ ఏడాది కపిల్ దేవ్ 60వ ఏట అడుగుపెట్టాడు.
లార్డ్స్ బాల్కనీలో వరల్డ్ కప్ పట్టుకున్న కపిల్ దేవ్ లేదా తన ఔట్ స్వింగ్ బంతులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించే కపిల్, లేదా జింబాబ్వేపై 175 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడిన కపిల్.
అతడి జ్ఞాపకాలెన్నో ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతాయి.
అదే సమయంలో, కపిల్ టెస్ట్, వన్డే క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా ఒక్కో శిఖరం అధిరోహిస్తూ వెళ్లాడు. టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు, 400కు పైగా వికెట్లు తీశాడు. వన్డేలో 3 వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లు పడగొట్టాడు.
వీటితోపాటు కపిల్ దేవ్ టెస్ట్ మ్యాచుల్లో ఒక్కో వికెట్ కోసం ఎంత కష్టపడ్డాడో ఆ కాలం కూడా గుర్తుకొస్తుంది.
కానీ, వాటన్నిటికీ భిన్నంగా కపిల్ దేవ్ గురించి ప్రపంచానికి పెద్దగా తెలీని కొన్ని విషయాలను మేం ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
అత్యంత మెరుగైన స్ట్రయిక్ రేట్
కపిల్ దేవ్ భారత్ కోసం మొత్తం 225 వన్డేలు ఆడాడు. ఈ మ్యాచుల్లో మొత్తం 3783 పరుగులు చేశాడు. ఆ సమయంలో అతడి స్ట్రయిక్ రేట్ 95.07. అంటే ప్రతి వంద బంతులకు కపిల్ 95.07 పరుగులు చేశాడు.
ఈ గణాంకాలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే కపిల్ తన ఆఖరి వన్డే మ్యాచ్ 1994 అక్టోబర్‌లో ఆడాడు. ఆ సమయానికి క్రికెట్ ప్రపంచంలో బ్యాట్స్‌మెన్ల మెరుపుదాడి మొదలవలేదు.
అయినా, ఒక విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. వన్డే పోటీల్లో కపిల్ సాధించిన ఈ స్ట్రయిక్ రేట్, సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, వివియన్ రిచర్డ్స్, యువరాజ్ సింగ్ లాంటి బ్యాట్స్‌మెన్ల కంటే ఎక్కువే.
ఈ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్ లాంటి వారు కపిల్ కంటే ముందున్నారు.
కపిల్‌తోపాటు క్రికెట్ ఆడిన సయ్యద్ కిర్మాణీ, "కపిల్ తక్కువ మాట్లాడతాడు, బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా.. మైదానంలో ఆయన ఆట మాత్రమే మాట్లాడుతుంది. కపిల్ స్పెషాలిటీ అదే" అంటాడు.

ఫొటో సోర్స్, Getty Images
స్ట్రయిక్ రొటేట్‌లో టాప్
స్ట్రయిక్ రేట్ మాత్రమే కాదు.. స్ట్రయిక్ రొటేట్ చేయడంలో కూడా కపిల్‌కు తిరుగులేదు. వన్డేల్లో 3979 బంతుల్లో 3783 పరుగులు చేసిన కపిల్ 291 ఫోర్లు, 67 సిక్సర్లు కొట్టాడు. ఆ 358 బంతులను అతడి ఇన్నింగ్స్ నుంచి మైనస్ చేస్తే 3621 బంతుల్లో 2217 పరుగులు చేశాడు.
కపిల్ ఫోర్లు, సిక్సర్లు కొట్టలేకపోయినవి, సింగిల్స్, డబుల్స్ తీసిన బంతుల స్ట్రయిక్ రేట్ చూస్తే 61.2 ఉంది. క్రీజ్ మారే వేగంలో సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్‌ను కూడా మించిపోయాడు. అందులో కపిల్ నంబర్ వన్ అయ్యాడు.
కపిల్‌తో క్రికెట్ ఆడిన వికెట్ కీపర్ కిరణ్ మోరే "కపిల్ లాంటి క్రికెటర్‌ను నేను చూడలేదు. ఆయన క్రీజ్‌లోకి రావడమే ఆలస్యం, పరుగుల వేట మొదలవుతుంది. ఆయన చాలా ఓపిగ్గా స్ట్రయిక్ రొటేట్ చేస్తుంటారు" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
రన్నింగ్ బిట్వీన్ ద వికెట్
కపిల్ భారత్ కోసం ఆడిన సమయంలో ఆటగాళ్లకు ఫిట్‌నెస్ చాలా కీలకంగా భావించేవారు. కానీ కపిల్‌పై ఆ ప్రభావం పడలేదు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో కపిల్ తిరుగులేని ఆటగాడు.
184 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ కపిల్ ఎప్పుడూ రనౌట్ కాలేదంటే, దాన్ని బట్టి మనం కపిల్ ఎంత ఫిట్‌గా ఉండేవాడో అంచనా వేయచ్చు. అంతేకాదు, 221 వన్డే మ్యాచులు ఆడిన కపిల్ కేవలం 10 సార్లే రనౌట్ అయ్యాడు.
"80, 90 దశకాల్లో టీమిండియాను గమనిస్తే, కపిల్ దేవ్ సాధించిన ఆ రికార్డు ఎప్పటికీ తిరుగులేనిదిగానే అనిపిస్తుంది" అంటాడు కిరణ్ మోరే.
సుదీర్ఘ కెరీర్లో కేవలం 20 నోబాల్స్
కపిల్‌లా సుదీర్ఘ కాలం ఆడే అవకాశం చాలా తక్కువ మంది ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే లభిస్తుంది.
అంతేకాదు, తన బౌలింగ్ సత్తాతో చాలా కాలం పాటు కపిల్ టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ పగ్గాలు చేపట్టాడు.
తన కెరీర్ అంతా చాలా క్రమశిక్షణతో ఉన్న ఒక బౌలర్ అనిపించుకున్నాడు.
టెస్ట్ కెరీర్లో కపిల్ కేవలం 20 సార్లు నో బాల్స్ వేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నంబర్ వన్ బౌలర్
ఫాస్ట్ బౌలర్ల ప్రపంచంలో భారత్ పేరుకు స్థానం కల్పించింది కపిల్ దేవే. ఫాస్ట్ బౌలర్లు భారత్‌లో కూడా జన్మిస్తారని అతడు ప్రపంచానికి చాటాడు.
కపిల్‌కు ముందు కర్సన్ ఘావ్రీ మీడియం ఫేస్ బౌలర్‌గా 39 టెస్టుల్లో 109 వికెట్లు తీశాడు. కానీ అతడిలో కపిల్ అంత వేగం ఉండేది కాదు.
మహమ్మద్ నిసార్, అమర్ సింగ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చారు. కానీ 25, 28 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.
కపిల్ 434 టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అది ఎన్నో ఏళ్ల పాటు వరల్డ్ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా లాంటి బౌలర్లు ఎవరూ ఆ దరిదాపులకు చేరలేకపోయారు.

అద్భుతమైన ఫీల్డర్
కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్ ఫైనల్లో వెనక్కి పరిగెత్తుతూ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ పట్టకపోయుంటే, బహుశా ఆ వరల్డ్ కప్ భారత్ పేరున ఉండేది కాదు.
అప్పుడు 184 పరుగుల విజయ లక్ష్యంతో విండీస్ బ్యాటింగ్ చేస్తోంది. వివియన్ రిచర్డ్స్ 27 బంతుల్లో 33 పరుగులు చేసి క్రీజులో కుదురుకుని ఉన్నాడు.
మదన్ లాల్ బౌలింగ్‌లో రిచర్డ్స్ మిడ్ వికెట్ వైపు గాల్లోకి షాట్ కొట్టాడు. షార్ట్ మిడ్ వికెట్‌లో ఉన్న కపిల్ దేవ్ వెనక్కు పరిగెత్తుతూ ఆ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
2011 వరల్డ్ కప్ ముందు ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో వివియన్ రిచర్డ్స్ "కపిల్ వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టగానే, నా టైం ముగిసిందనే విషయం నాకు అర్థమైంది" అని చెప్పాడు.
కపిల్ ఫీల్డింగ్ గురించి చెప్పిన కిరణ్ మోరే "అవుట్ ఫీల్డ్‌లో ఆయన లాంటి అద్భుతమైన ఫీల్డర్‌ను నేను చూళ్లేదు" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
అలాంటి ఫిట్‌నెస్ ఇప్పుడెక్కడ?
"ఒక క్రికెటర్ తన ఫిట్‌నెస్‌పై ఎలా దృష్టి పెట్టాలో చెప్పాలంటే కపిల్ దేవ్ దానికి ఒక పెద్ద ఉదాహరణ" అంటాడు కిరణ్ మోరే.
16 ఏళ్ల సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో కపిల్ ఎప్పుడూ ఫిట్‌నెస్ వల్ల డ్రాప్ అవడం జరగలేదు.
1984లో ఇంగ్లండ్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో ఆయన్ను టీమ్ మేనేజ్‌మెంట్ డ్రాప్ చేయకుండా ఉంటే వరసగా 131 టెస్టులు ఆడిన ఘనత కపిల్ దేవ్ సొంతం అయ్యుండేది
"కపిల్ దేవ్‌లో అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఒకటుంది. ప్రతి కష్టమైన సవాలును ఎదుర్కోడానికి ఆయన స్వయంగా సిద్ధం అవుతాడు" అంటాడు సయ్యద్ కిర్మాణీ.
ఇవి కూడా చదవండి:
- సిడ్నీ టెస్ట్: కోహ్లీ సేన మరో విజయానికి వరుణ గండం
- శబరిమల: అయ్యప్ప గుడిలోకి మహిళలు అడుగుపెట్టడం చరిత్రలో ఇప్పుడే జరిగిందా?
- మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ తెరలకు అతుక్కుపోతుంటే ఏం చేయాలి...
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- దక్షిణ కొరియా మహిళలకు అడుగడుగునా ‘పోర్న్ కెమెరా’ గండం
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- సంక్రాంతి పండుగ కోసం వెయిటింగ్.. కోడి పందేలకు కత్తులు రెఢీ.. కోళ్లు రెఢీ
- రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








