'ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇరాన్ బందీని చేసింది', హార్ముజ్ జలసంధి సమస్య పరిష్కారం కోసం 40 దేశాల నేతల సమావేశం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హఫ్సా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 4 నిమిషాలు
అంతర్జాతీయ నౌకాయాన మార్గాన్ని ఇరాన్ హైజాక్ చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా మార్చిందని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ విమర్శించారు.
హార్ముజ్ జలసంధిలో జరుగుతున్న దాడులపై చర్చించేందుకు నిర్వహించిన వర్చువల్ సమ్మిట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
గల్ఫ్ షిప్పింగ్ ఛానల్‌లో భద్రత కోసం అవసరమైన కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా గురువారం జరిగిన ఈ వర్చువల్ చర్చల్లో 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ తమపై చేస్తున్న యుద్ధానికి ప్రతిస్పందనగా ఇరాన్ ఈ జలసంధిలో పలు నౌకలపై దాడులు చేసింది. దీనివల్ల ఇంధన ఎగుమతులకు ఆటంకం కలగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి.


ఫొటో సోర్స్, Reuters
'130 దేశాలు ఖండించాయి'
ప్రస్తుత చర్చలు సైనిక చర్యల కంటే దౌత్యపరమైన చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తాయని సమావేశం ప్రారంభంలో కూపర్ తెలిపారు.
"అంతర్జాతీయ నౌకాయాన మార్గాన్ని ఇరాన్ హైజాక్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బందీగా మార్చడం చూస్తున్నాం. ఇది కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ, ఒమన్, ఇరాక్ వాణిజ్య మార్గాలను దెబ్బతీస్తోంది. అంటే ఆసియాకు అందాల్సిన ఎల్‌ఎన్‌జీ, ఆఫ్రికాకు ఎరువులు, ప్రపంచానికి విమాన ఇంధనం నిలిచిపోతున్నాయి" అని కూపర్ అన్నారు.
"ఈ సంఘర్షణతో ఏమాత్రం సంబంధం లేని దేశాల పట్ల ఇరాన్ చూపిస్తున్న బాధ్యతారాహిత్యాన్ని మేమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు ఐక్యరాజ్యసమితిలో తీవ్రంగా ఖండించాయి. ఇది బ్రిటన్ లేదా ఇతర దేశాలలోని మార్ట్‌గేజ్(తనఖా) రేట్స్, పెట్రోల్ ధరలు, జీవన వ్యయాన్ని మాత్రమే కాకుండా.. మొత్తం ప్రపంచ ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోంది" అని ఆమె పేర్కొన్నారు.
కాగా, బుధవారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇతర దేశాలు కొంత "ధైర్యాన్ని కూడగట్టుకుని" ఈ మార్గాన్ని పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మిత్రదేశాలు ఈ పనిని ముందే చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
"జలసంధి వద్దకు వెళ్లి దానిని మీ ఆధీనంలోకి తీసుకోండి. రక్షించుకోండి. మీ అవసరాల కోసం వినియోగించుకోండి" అని ట్రంప్ చెప్పారు.
నౌకాయాన మార్గాన్ని సురక్షితం చేయడంలో లేదా తన యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో మిత్రదేశాలు తగినంతగా కృషి చేయడం లేదని వాషింగ్టన్ పదేపదే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇతర యుద్ధాల్లో చిక్కుకోకుండా జలసంధి రక్షణకు ఎలా సహకరించాలనే అంశంపై బ్రిటన్ సహా ఇతర దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
సైనిక బలంతో అసాధ్యం: ఫ్రెంచ్ ప్రెసిడెంట్
సైనిక బలంతో జలసంధిని తిరిగి తెరవడం "అసాధ్యం" అని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు. "మేం ఎప్పుడూ ఆ మార్గాన్ని ఎంచుకోలేదు" అని అన్నారు.
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మేక్రాన్ మాట్లాడుతూ.. "ఇది ఇరాన్‌తో చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి, అన్నింటికంటే ముందు కాల్పుల విరమణ జరగాలి, చర్చలు పునఃప్రారంభం కావాలి" అని చెప్పారు.
గురువారం జరిగే చర్చలకు హాజరయ్యే వారి పూర్తి జాబితాను డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేయలేదు, అమెరికా నుంచి ఎవరైనా హాజరవుతారని భావించడం లేదు.
వాణిజ్య నౌకలపై దాడులను నిలిపివేయాలని ఇరాన్ దళాలను కోరుతూ మార్చి మధ్యలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసిన దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఇందులో కొన్ని గల్ఫ్ దేశాలతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు ఉన్నాయి.
"జలసంధి గుండా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధరించడానికి అవసరమైన ప్రయత్నాలకు సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆ ప్రకటన పేర్కొంది.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అందుబాటులో ఉన్న "ప్రతి దౌత్యపరమైన అవకాశాన్ని బ్రిటన్ పరిశీలిస్తోందని" ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ ప్రకటించిన మరుసటి రోజే ఈ చర్చలు జరగడం విశేషం.
యుద్ధం ముగిసిన తర్వాత "జలసంధిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, సురక్షితంగా మార్చడానికి" భవిష్యత్తులో ఏం చేయవచ్చనే అంశంపై బ్రిటన్ సైనిక వ్యూహకర్తలు ఆలోచిస్తారని కూడా ఆయన చెప్పారు.
అదే సమయంలో, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఏర్పడిన జీవన వ్యయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి.
ప్రపంచంలోని చమురు, గ్యాస్‌లో సుమారు ఐదవ వంతు (20 శాతం) హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. చమురు ధరలకు అంతర్జాతీయ ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవలి వారాల్లో బ్యారెల్‌కు 73 డాలర్ల నుంచి ఏకంగా 100 డాలర్లు దాటేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























